వీక్షణం

వీక్షణం- 79

-వరూధిని వీక్షణం


79 వ సమావేశం మిల్పిటాస్ లోని తాటిపామల మృత్యుంజయుడు గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ సుభాష్ పెద్దు అధ్యక్షత వహించారు. ముందుగా చలం గారి కథ “యముడితో చలం” కథను డా||కె.గీత, శ్రీమతి కె. శారద గార్లు చలం, యముని పాత్రలుగా కథను చదివి వినిపించి అందరినీ అలరించారు.కథా పథనం తర్వాత సభలో రసవత్తరమైన చర్చ జరిగింది.
ఈ కథ 1958 లో చలం గారు పూర్వ జీవితానికీ, ఆశ్రమ జీవితానికీ మధ్య కాలంలో రాసినదని, కథలో తత్త్వ విచారం సరిగా జరలేదని, కొన్ని ప్రశ్నలకు అర్థం లేనిదని, తప్పు చేస్తేనే శిక్షా?, స్వరం, నరకం అంటే ఏవిటి? పాప పుణ్యాలకు అర్థాలు ఏవిటి? చదువరుల విశ్లేషణ ఎలా ఉంది? అసలు ప్రశ్నలు కథ ముగిసేక మొదలవుతాయి, యముణ్ణి విమర్శిస్తే ఎక్కడా ఎందుకు ప్రతి చర్చ ఉండదు? యముడు, చలం ఇద్దరూ చలమే.
చలం గారి ఆత్మాన్వేషణే ఈ కథ…” అంటూ విభిన్న అభిప్రాయల్ని వెలిబుచ్చారు.ఆ తర్వాత కిరణ్ ప్రభ గారు “చలం జీవితం లో పిల్లల పాత్ర” అనే అంశం మీద ప్రసంగించి అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసారు.చలం గారి గురించి సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన సాహిత్యం అంతా చదవాలి, మొత్తం జీవితం తెలుసుకోవాలి అంటూ మొదలు పెట్టి ఆయన జీవితంలో పిల్లలు ఎంత విశిష్ట పాత్ర వహించారో వివరించారు. అదే వరుసలో శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు “రచయిత చలం రమణ భక్తుడెలా అయ్యేడు?” అన్న అంశమ్మీద ఉపన్యసించారు.ఆ తరువాత మృత్యుంజయుడు గారు “వెళ్లిపో” అనే స్వీయ కథను సభకు చదివి వినిపించి ప్రశంసలందుకున్నారు.
విరామం తర్వాత కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ సభలోని అందరినీ ఆనందోత్సాహలలో ముంచెత్తింది. చివరగా కవిసమ్మేళనంలో శ్రీమతి రాధిక, డా|| కె.గీత, శ్రీ చెన్న కేశవ రెడ్డి, శ్రీ నాగ సాయిబాబా, శ్రీ కృష్ణకుమార్ గార్లు పాల్గొన్నారు.ఈ సభలో ఇంకా శ్రీమతి అపర్ణ, శ్రీమతి షర్మిల, శ్రీమతి ఉమ, శ్రీమతి జయ, శ్రీమతి శాంత, శ్రీమతి క్రాంతి, శ్రీ సుబ్బారావు, శ్రీ ఫణీంద్ర, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ వేమూరి, శ్రీ కృష్ణకుమార్ పిల్లల మర్రి, శ్రీ లెనిన్ మొ.న స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked