సుజననీయం

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ భూమిపూజ

ఇరవై ఏళ్ళుగా వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో ప్రగతిపథంలో ముందుకెడుతున్న సిలికానాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయానికి ఆగష్టు 14వ తేదీన నాంది జరిగింది. సిలికాన్ వ్యాలీకి అతి చేరువలో నున్న ట్రేసీ పట్టణంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి భూమిపూజ జరిగింది.  సువిశాల 65 ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో త్వరలో ప్రారంభం కానున్న విశ్వవిద్యాలయ భవన సముదాయ నిర్మాణానికి శుభాన్ని కోరుతూ సాంప్రదాపూర్వకంగా నిర్వహించే భూమిపూజను చేయడం జరిగింది.

ముందుగా విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ఆయన సతీమణి శాంతి గారి సారథ్యంలో సిలికానాంధ్ర సభ్యులు కుటుంబ సమేతంగా సాముహిక సత్యనారాయణ వ్రతం ఆచరించారు. పురోహితుడు మారేపల్లి వెంకటశాస్త్రి గారు ఈ వ్రతాన్ని ముందు తరాల శ్రేయస్సును కోరుతూ జరిపే వ్రతంగా అభివర్ణించారు. భవిష్య విశ్వవిద్యాలయ ప్రాంగణానికి నిర్ణయించిన మూలస్థంభ ప్రాంతాన్ని సిలికానాంధ్ర ఆడపడుచులు రంగవల్లులతో అలంకరించారు. ఈ భూస్థలాన్ని వేదోచ్ఛారణతో శుద్ధిచేసి పూజచేసారు.

అత్యంత అరుదుగా జరిగే ఈ ముహూర్తాన్ని చూడటానికి స్థానిక మరియు ఇతర రాష్ట్రాల నుండి పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు విచ్చేశారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ రాజపోషకుడు, లకిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ తాను ఇచ్చిన ప్రతి పైసాకు సిలికానాంధ్ర న్యాయం చేస్తుందన్నాడు. ట్రస్టీ బోర్డ్ సభ్యుడు సిధ్ లకిరెడ్డి ప్రసంగిస్తూ సిలికానాంధ్ర నాయకత్వం అసాధ్యమనుకునే కలలను కంటుందని, అకుంఠిత దీక్షతో ఎవరూ ఊహించని విధంగా సుసాధ్యం చేసే నేర్పరితనం ఉందని, ఈ విశాల విశ్వవిద్యాలయ మైదానమే అందుకు ఉదాహరణ అని ప్రశంశించారు.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించబోయే ఇంజనీరింగ్, మెడికల్, భాషాశాస్త్రాలు, లలిత, సంగీత నృత్య కళలలో ప్రపంచంలోని నలుమూలల నుండి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసిస్తారని అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ అభిలాషను వ్యక్తం చేసారు.

700 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమానికి దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, నరేంద్ర ఉద్ధవ నాయకత్వంలో ఎంతో మంది స్వచ్ఛంద సైనికులు మూడు వారాలుగా ఎండలని సైతం లెక్క చేయక శ్రమించారు.

అన్నం అనిల్ బృందం వచ్చిన అతిథులకు రుచికరమైన విందు, శీతల పానీయాలు అందజేశారు.

విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలు https://www.universityofsiliconandhra.org/ వెబ్ సైటులో లభ్యమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked