సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఈ శృంగార కీర్తనలో ఒక స్త్రీ తన ప్రియుడిని ఇంటికి రమ్మంటున్నది. నేను నీకు కొత్త కాదు, నువ్వు అరువు తెచ్చుకునే వస్తువువి కావు అని చెప్పడంలో ఆమె అతన్ని నిందించి ఉంటుంది . ప్రియుడు ఇల్లు వదిలి పోయాడు. ఆమె కోరుకునేది ఒక్కటే. ప్రియుడు తిరిగి ఇంటికి రావడం. నేను నిన్ను ఏమీ అనను అని వాగ్దానం చేస్తున్నది. ఏ అరమరికలు లేకుండా బేలగా, నేరుగా అడుగుతున్నది “ఇంటికి రావయ్యా” అని. ఆ ముచ్చటేమిటో మనమూ విందాం రండి.
కీర్తన:
పల్లవి: నే నీకు వేరు గాను నీవు నా కెరవు గావు
యే నెపమూ వేయ నీపై నింటికి రావయ్యా ॥పల్లవి॥
చ.1 చెక్కునఁ బెట్టిన చేయి సేసవెట్టే నీ మీఁ ద
ముక్కుపైఁ బెట్టిన వేలు ముందే మెచ్చెను
వక్కణ లడుగనేల వలచితి నాఁ డే నీకు
యిక్కువలు చెప్పేగాని ఇంటికి రావయ్యా ॥నే నీకు॥
చ.2 సిగ్గువడ్డ మొగమున సెలవి నవ్వులు రేఁగె
వెగ్గళించిన కన్నులే వేడుకఁ జూచె
కగ్గి నీతో నలుగను కడు ముద్దరాలను
యెగ్గు లేమీ నెంచను యింటికి రావయ్యా ॥నే నీకు॥
చ.3 వాడిన కేమ్మోవిని వడిఁ దేనెలూరఁ జొచ్చె
వీడిన నెరులలోన విరులు నిండె
యీడనే శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
యీడుగాఁ గూడితి విఁక నింటికి రావయ్యా ॥నే నీకు॥
(రాగము: దేసాళం, శృం.సం.కీర్తన; రేకు: 443-1; సం. 12-253)

విశ్లేషణ:
పల్లవి: నే నీకు వేరు గాను నీవు నా కెరవు గావు
యే నెపమూ వేయ నీపై నింటికి రావయ్యా
నేను నీకు కొత్త కాదు, నువ్వు అరువు తెచ్చుకునే వస్తువువి కావు. నేను నిన్ను ఏమీ అనను. నీమీద ఏ నెపమూ వేయను. ఒట్టు. “ఇంటికి రావయ్యా” బాబూ అని ఒక నాయిక ప్రియుడిని బ్రతిమాలుతోంది.
చ.1 చెక్కునఁ బెట్టిన చేయి సేసవెట్టే నీ మీఁ ద
ముక్కుపైఁ బెట్టిన వేలు ముందే మెచ్చెను
వక్కణ లడుగనేల వలచితి నాఁ డే నీకు
యిక్కువలు చెప్పేగాని ఇంటికి రావయ్యా
చెంపకు చేయి ఆనించి ఆమె అలిగి కూర్చుంది. ముక్కు మీద వేలు పెట్టిన సమయం అది. ప్రియుడి శృంగార విచేష్టను మందలిస్తూ అలా అంటోంది. ముందుగా ఆమె ప్రియుడికి ఈ ప్రణయ సంబంధిత సన్నివేశాలను గుర్తు చేస్తున్నది. అవి కొంత బాధను కలిగించేవి కూడా అయిఉన్నాయి. అతను ఈమెతో మళ్ళీ బేరసారాలు ఆడుతున్నాడు. నన్నేమీ అనవు గదా, నిజమేనా? నాలో మళ్ళీ తప్పులెన్నవు గదా? అని. ఆమె అతనికి మళ్ళీ తను ఇచ్చిన వాగ్దానం గుర్తు చేస్తూ, ఏమీ అననని భరోసా ఇస్తున్నది. ప్రేమ నిండిపోయిన ఆమె తన రహస్యాలన్నీ అతని కోసం విప్పుతానంటున్నది. అంటే అతనికి తన నగ్నత్వాన్ని బహుమతిగా ఇస్తానని చెబుతున్నది.ఇంటికి రావయ్యా స్వామీ త్వరగా అంటున్నది.
చ.2 సిగ్గువడ్డ మొగమున సెలవి నవ్వులు రేఁగె
వెగ్గళించిన కన్నులే వేడుకఁ జూచె
కగ్గి నీతో నలుగను కడు ముద్దరాలను
యెగ్గు లేమీ నెంచను యింటికి రావయ్యా
ఆమె సిగ్గుపడ్డ మొహం క్రమేణా పెదవి మూలల నవ్వులు చిలకరిస్తున్నాయి. అధిక కోపంతో చూసిన కన్నులే వేడుకగా చూస్తునాయి. నిన్ను చూసి నేను వివర్ణమయిపోయాను దేవా! మిక్కిలి ముగ్ధ స్తీని. నీపై ఇక నేరాలు కొండాలు ఏమీ తీసుకురాను నిజం ఇంటికిరావయ్యా! అంటున్నది అంబుజాక్షి.
చ.3 వాడిన కేమ్మోవిని వడిఁ దేనెలూరఁ జొచ్చె
వీడిన నెరులలోన విరులు నిండె
యీడనే శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
యీడుగాఁ గూడితి విఁక నింటికి రావయ్యా
వాడిన నా అధరాలు వేగంగా తేనెలూరుతున్నాయి. విడివడిన కేశాలలో పుష్పగుచ్ఛాలు నిండుకున్నాయి. ఇక్కడనే ఉన్నాను నేనే అలమేలు మంగమ్మను. నీతో ఏమీ గొడవ పడకుండా ఈడుజోడుగా ఉంటాను. ఇంటికి రావయ్యా తిరుమలేశా అంటున్నది నాయిక.
ఈ కీర్తనలో అన్నమయ్య తన మనస్సులో చెలరేగే భావాలను మళ్ళీ, మళ్ళీ మనకు వినిపించడం కనిపిస్తుంది. ఈ సంకీర్తనలలో కవి చాలావరకూ తన వేదనను ఉత్తమ పురుషలోనే వివరిస్తాడు: కవిలో జరిగే అంతస్సంఘర్షణ, అశాంతి; కవి చేసుకునే ఆత్మవంచన, స్వయం-సమర్థన; నిరర్థకమైన జీవితం పట్ల నిరాసక్తత; కవి మనస్సులోని అపరాధ భావం, ఆత్మనింద మనకు వివరంగా చిత్రీకరిస్తాడు.అన్నమయ్య వివిధ గొంతుకలతో వినిపించే ఈ అంతర్ముఖ పద సంకీర్తనలలో ఈ రెండు పురుష రూపాలను విడదీయలేము. పాటలోని కవి-వ్యక్తికి కలిగిన జ్ఞానోదయమే ఈ గీతాలను మనకు వినిపింపజేస్తుంది. ఉత్తమపురుషలో సాగే ఇటువంటి సంకీర్తనలను సాంప్రదాయికంగా ‘ఆధ్యాత్మిక’ సంకీర్తనలు అంటారు. ఇవి పూర్తిగా ఆధ్యాత్మికం కావు. అలాగని శృంగారం కూడా కావు. వీటిలో ఆధ్యాత్మిక భావాల కంటే అంతర్ముఖమైన భావాల మోహరింపే ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మూడు పాళ్ళ సాహిత్యాన్ని ‘శృంగార సంకీర్తనలు’ అంటారు. ఇందులో దేవదేవుని శృంగార కలాపాల వర్ణన ఉంటుంది. ఈ శృంగార సంఘటనలు పూర్తిగా కవి కల్పితం. ఈ గీతాలలో కవి నాయికగా మనకు కనిపించడం కద్దు. ఆ నాయిక ఒక్కోసారి అలమేలుమంగ అని స్ఫుటంగా తెలుస్తుంది. కొన్ని గీతాలలో ఆ నాయిక అతని ప్రేయసి గానే తప్ప ఆమెవరో మనకు తెలియదు.
ముఖ్యమైన అర్ధాలు
ఎరవు = అరువు, అద్దెకు; నెపము = నింద; చెక్కున = చెంపకు; సేస వెట్టు = అక్షింతలు చల్లడం; ఇక్కువలు = ఉనికి, జాడ, రహస్యాలు; సెలవి = పెదవిమూల; వెగ్గళించు = మిక్కుటముగా, అధికముగా; కగ్గి = వివర్ణము,కలహించు అనే అర్ధంలో; ఎగ్గులు = తప్పులు; కెమ్మోవి = అధరము; తెనెలూరు = అధరామృతము వర్షించు; నెరులు = కేశములు; విరులు = పుష్పములు; యీడనే = ఇక్కడనే; ఈడుగూడి = జతగూడు.

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked