చంద్రశేఖర్ చరిత్ర

అమెరికా ప్రయాణం

చంద్రశేఖర్ పరపతి అమెరికాలో క్రమేణా పెరగడం మొదలయింది. శుక్రవారం, 11 జనవరి, 1935 నాడు – బర్లింగ్టన్ హవుస్ లో, బహిరంగ సభలో, పరాభవం జరగక ముందే – అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన హార్లో షేప్లి (Harlow Shapley) నుండి ఒక వేసవి హార్వర్డు లో గడపమంటూ ఆహ్వానం వచ్చింది. చంద్ర ఆహ్వానాన్ని అంగీకరించేడు కానీ కేంబ్రిడ్జిలో ఫెలోషిప్ డిసెంబరు 1936 వరకు ఉంది. ఇంతలో అక్టోబరు 1935 లో హార్లో షేప్లి దగ్గర నుండి మరొక ఉత్తరం వచ్చింది; హార్వర్డు లో కాస్మిక్ భౌతిక శాస్త్రంలో మూడు నెలలపాటు ఉపన్యాసకుడిగా నియామకం అని నిర్ధారిస్తూ జీతం వగైరాలు ఉన్నాయి ఆ ఉత్తరంలో. కేంబ్రిడ్జిలో నవంబరు 29, 1935 న బయలుదేరి లివర్పూల్ వెళ్లి, మరునాడు White Star Brittannica అనే పడవ ఎక్కి డిసెంబరు 8, 1935 ఆదివారం, మధ్యాహ్నం అయేసరికి బోస్టన్ చేరుకున్నాడు. హార్లో షేప్లి స్వయంగా రేవుకి వచ్చి చంద్రని అమెరికా ఆహ్వానించేడు. ఆ సాయంత్రం డైరక్టర్ గారి ఇంట్లో జరిగిన తేనీటి విందులో చంద్ర చాలామంది ముఖ్యులని కలుసుకున్నాడు. వారిలో జెరార్డ్ కుయిపర్ (Gerard P. Kuiper) ఒకడు. చంద్ర సైద్దాంతిక ఖగోళభౌతిక శాస్త్రజ్ఞుడు అయితే కుయిపర్ పరిశీలక ఖగోళభౌతిక శాస్త్రజ్ఞుడు. ఆ రోజుల్లో కుయిపర్ శ్వేత కుబ్జతారలని దుర్భిణి ద్వారా పరిశీలించి చూస్తున్నాడు. చంద్ర ఆ ముందు సంవత్సరమే నక్షత్రాలలో అత్యధిక సాంద్రీకృత విన్యాసాలు (highly condensed configurations) అనే అంశం మీద ప్రచురించిన సైద్దాంతిక వ్యాసానికి సంబంధించిన ప్రయోగికమైన ఋజువు దొరికిందని కుయిపర్ చెప్పగానే చంద్ర చాల సంతోషించేడు. ముప్పయ్ మూడు ఏళ్ల వయస్సుకే కుయిపర్ పరిశీలక ఖగోళభౌతిక శాస్త్రజ్ఞుడు గా మంచి పేరు గణించేడు. జంటలో ఒకటి శ్వేత కుబ్జతార అయిన జంట తారలని అధ్యయనం చెయ్యడం అతని ప్రత్యేకత. తరువాత కాలంలో ఇతను చాల విశేషాలు ఆవిష్కరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఉదాహరణకి సూర్య కుటుంబంలో ప్లూటో కక్ష్య కి అవతల వేలకొద్ది గ్రహశకలాలతో నిండిన ప్రదేశాన్ని ఇతని గౌరవార్థం “కుయిపర్ పటకా” (Kuiper Belt) అని పిలుస్తారు.

కేంబ్రిడ్జిలో జరిగిన పరాభవం మరుగున పడిపోకుండా తన మనో వీధిలో మెదులుతూ ఉన్నా కొత్త దేశంలో కొత్త పరిచయాలతో జీవితం మెరుగవుతోంది. ఫిబ్రవరి 1936 లో, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన యర్కిస్ వేధశాల (Yerkes Observatory) అధిపతి, ఆటో స్టరూవ్ (Otto Struve) చంద్రని ఒక ఉపన్యాసం ఇమ్మని ఆహ్వానించేడు. ఆటో స్టరూవ్ ప్రవరకి మూలం జెర్మనీ అయితే, పుట్టుక రష్యాలో, ప్రస్తుతం వలస అమెరికాలో. ఉక్రెయిన్ లోని ఖర్ఖోవ్ లో రెండేళ్లు చదివి, 1916 లో రష్యా సైనిక దళంలో చేరి టర్కితో యుద్ధం చేసేడు. శాంతి నెలకొన్న తరువాత బోల్షివిక్ విప్లవంలో చిక్కుకున్నాడు. క్షతగాత్రుడై, నానా ఇడుములు పడి, ఎట్టకేలకు, బంధువుల పరపతి, సిఫార్సు ఉపయోగించుకుని, యర్కిస్ వేధశాలలో చిన్న ఉద్యోగం సంపాదించేడు. మెల్లిగా అక్కడే పి. ఎచ్. డి. పట్టా సంపాదించి, నక్షత్రాల వర్ణమాలలని అధ్యయనం చెయ్యడంలో ప్రావీణ్యుడు అనిపించుకున్నాడు. ఇతను శాస్త్రవేత్తగానే కాకుండా యాజమాన్యం చెయ్యడంలో కూడ ప్రతిభ చూపించడంతో యర్కిస్ వేధశాలకి అధిపతి అయ్యాడు. చుక్కాని లేని నావలా కనుమరుగవుతున్న వేధశాలకి దిశానిర్దేశం చేసి యర్కిస్ ని దేశంలోనే అత్యుత్తమ వేధశాలగా తీర్చి దిద్దేడని పేరు తెచ్చుకున్నాడు.

అతిధి ఉపన్యాసకుడిగా వచ్చిన చంద్రశేఖర్ ప్రతిభని గమనించి, ఉపన్యాసం అయిన వెంటనే, అక్కడికక్కడే, యర్కిస్ వేధశాలలో పరిశోధకుడిగా నియమిస్తూ ఉత్తర్వు రాసి ఇచ్చేడు. ఉద్యోగం ఫిబ్రవరి 1937 లో మొదలు పెట్టాలి. ఆ ఉత్తర్వులో ఉద్యోగం, జీతం కంటే ముఖ్యమైనది మరొకటి ఉంది: అది భవిషత్తుకి బాట: “నువ్వు చూపెడుతున్న అత్యద్భుతమైన సైద్దాంతిక ప్రతిభకి మా వేధశాలలో ఉన్న ప్రయోగిక ప్రతిభని జోడిస్తే నీ సిద్దాంతాలకి ఎంత గుర్తింపు వస్తుందో ఆలోచించుకో! ఇక్కడ ఉండి నువ్వు అమెరికాలోఉన్న ఇతర వేధశాలలలో ఉన్న సదుపాయాలని కూడా వాడుకుని కొత్త పుంతలు తొక్కే సావకాశం ఉంటుంది” అని యర్కిస్ అధినేత ఊరించడం మొదలు పెట్టేడు.

అప్పటికే కుయిపర్, స్టమ్^గ్రెన్ యర్కిస్ వేధశాలలో పని చెయ్యడానికి ఒప్పుకున్నారు. వారు కూడా ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టేరు. ఇంగ్లండుకీ అమెరికాకి మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనబడ్డాది చంద్రశేఖర్ కి!

చంద్ర తండ్రికి ఈ పరిణామం నచ్చలేదు. కాకాపేయమైన అమెరికా సంస్కృతి సారహీనం, లోకాయతం, భోగలాలసం అని చెప్పి చూసేడు. అమెరికా వెళ్ళిపోతే రోయల్ సోసైటీలో సభ్యత్వం పొందే అవకాశం పోతుందనిన్నీ, ఆ సభ్యత్వం లేకపోతే ఇండియాలో మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు పోతాయనిన్నీ గుర్తు చేసేడు. “నువ్వు తిరిగి ఇండియా వచ్చే ఉద్దేశంతోనే ఉన్నావని అనుకుంటున్నాను” అని ఆశాభావం వ్యక్తపరచేడు.

రాబోయే జనవరిలో వచ్చి చేరతానని యర్కిస్ వారితో చెప్పి, ఏప్రిల్ లో తిరిగి కేంబ్రిడ్జికి వచ్చేసేడు. “అన్నీ సమగ్రంగా ఆలోచించే యర్కిస్ వేధశాలలో ఉద్యోగానికి అంగీకారం తెలిపేను. ఎడింగ్టన్ తో సంప్రదిస్తే అయన వెళ్ళమనే ప్రోత్సహించేరు” అని తండ్రికి సంజాయిషీ రాసేడు. చంద్రశేఖర్ ని ఇంగ్లండు నుండి బయటకి పంపేయడమే తనకి మంచిదనుకుని ఉంటాడు ఎడింగ్టన్! ఇంగ్లండు వదలి అమెరికా వచ్చిన తరువాత చంద్రకి ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం పెరిగేయి. రోయల్ సోసైటీలో సభ్యత్వం సంగతా? దాని మీద మక్కువ పోయింది. “ఆ సభ్యత్వం ఇచ్చే ఉద్దేశం వారికి ఉంటే నేను అమెరికా వెళ్లినంత మాత్రాన ఆ అవకాశం పోదు” అని తండ్రికి నచ్చచెప్పేడు.

చంద్రకి కేంబ్రిడ్జిలో ఉద్యోగం ఇద్దామా వద్దా అన్న అంశాన్ని హేమాహేమీలయిన ఎడింగ్టన్, ఫౌలర్ మాటవరసకైనా ఆలోచించినట్లు లేదు. అమెరికాలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్, చికాగో విశ్వవిద్యాలయాలు తడుముకోకుండా, సంశయించకుండా, అడగకుండా పిలిచి ఉద్యోగాలు ఇచ్చేయి. ఈ తేడాని చంద్ర గమనించకపోలేదు.

తను భారతదేశానికి ఇతోధికంగా సేవ చెయ్యవలసిన అవసరం ఉందని చంద్రకి తెలుసు. కానీ భారతదేశంలో మాత్రం, సైన్సు రంగంలో, రాజకీయాలు తక్కువా? రామన్ ఎన్నో సార్లు ఉద్యోగం ఇప్పిస్తానని ఆహ్వానించేడు. కానీ రామన్ మాట మీద ఇంట్లో ఎవ్వరికీ గౌరవం లేదు; దానికి కారణం సంసారంలో ఉండే అంతర్గత కీచులాటలు. ఇండియాలో రామన్ తో దీటుగా నిలబడగలిగే శాస్త్రవేత్త మేఘ్నాథ్ సహా. కానీ రామన్ కి సహా కి పడేది కాదు. “నేను సహా తో కూడా మాట్లాడేను. ఆయన ధోరణిలో ఎగతాళి, వెటకారం, పన్నాగాలు, కుట్రలు, కుత్సితపు బుద్ధులు కనిపించేయి తప్ప దేశాన్ని ఒక తాటిమీద నడిపించి పురోభివృద్ధికి పాటు పడదామన్న అభిలాష కనిపించలేదు. నేను ఇండియా వచ్చిన తరువాత తన పక్షంలో ఉండి పోరాడమని సూచన చేసేడు,” అని చంద్ర ఇండియా రాలేకపోవడానికి ఒక కారణం చెప్పేడు, తండ్రికి రాసిన ఉత్తరంలో.

ఇండియా తిరిగి రాలేకపోతే పోయాడు, కనీసం ఒక సారి ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటే బాగుండునని తండ్రికి ఉంది. చంద్రకి పెళ్లి అయితేకాని తమ్ముళ్ళకి పెళ్లిళ్లు చెయ్యడానికి వీలు లేదు. తల్లి పోయిన తరువాత ఇంట్లో పెద్ద దిక్కుగా మరొక అడది లేదు. కనుక చంద్ర చెల్లెళ్లకి పెళ్లిళ్లు చేసే ముందు పెద్ద కోడలు ఇంటికొస్తే బాగుంటుందని తండ్రి కోరిక. చంద్ర ఇండియా వచ్చి స్థిరపడితే కానీ ఈ పనులు ఏవీ జరిగే అవకాశం లేదు.

ఈ ఇబ్బందులన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చంద్ర జూలై నెలలో పడవ ఎక్కి ఆగష్టులో బొంబాయిలో పడవ దిగేడు. ఇండియా వదలిపెట్టి ఆరేళ్ళు అయిపోయింది! సెప్టెంబరు 11 తేదీన చంద్రకి, లలితకి పెద్ద పటాటోపం లేకుండా వివాహం జరిగిపోయింది. అక్టోబరు 13 తేదీన కొత్త దంపతులు పడవ ఎక్కి అమెరికా ప్రయాణం అయేరు.

దారిలో కేంబ్రిడ్జిలో ఆగి, స్నేహితులందరికీ వీడ్కోలు చెప్పి, ఎడింగ్టన్ ఇంట్లో టీ తాగడానికి కలుసుకున్నారు. తన భర్త జీవితానికి ఒక తంటసంలా పరిణమించిన ఎడింగ్టన్ ని లలిత కలుసుకోవడం అదే మొదటి సారి, అదే ఆఖరి సారి కూడా!

డిసెంబరు 1936 వచ్చేసరికల్లా చంద్రశేఖర్ దంపతుల అమెరికా జీవితం ఒక గాడిలో పడింది. యర్కిస్ వేధశాల జినీవా సరస్సు ఒడ్డున, అందమైన ప్రాంగణంలో – ముందు వాకిట్లో పచ్చని గడ్డి మైదానం, పెరటి వైపు అడవిలా గుబురుగా పెరిగిన చెట్లు – విలియమ్స్ బే అనే చిన్న ఊళ్ళో ఉంది. చికాగో నగరానికి 80 మైళ్ళు దూరంలో ఉండబట్టి పొగ, ధూళి, దీపాలనుండి విరజిమ్మే వెలుగు లేకపోవడం వల్ల ఆకాశంలో నక్షత్రాలు బాగా కనిపిస్తాయి.

విలియమ్స్ బే చిన్న పల్లెటూరు. అదొక అడవి మధ్యలో ఉంది! అక్కడే ఒక ఇల్లు కొనుక్కున్నారు. వేధశాలకి రోజూ నడచి వెళ్లేవారు. సహోద్యోగులే ఇరుగు పొరుగువారు! స్నేహితులంటూ మరెవ్వరూ లేరు. అందువల్ల ఒక్క ఖగోళ శాస్త్రవేత్తలకి తప్ప చంద్రశేఖర్ ఉనికి పై వారికి తెలియలేదు. ఈ పల్లెటూళ్ళో, నాగరిక సమాజానికి దూరంగా, వివాదాలకు దూరంగా, చంద్రశేఖర్ 27 ఏళ్ళు గడుపుతారు. ఈ కాలం దంపతులు ఇద్దరూ దరిదాపు అజ్ఞాతవాసం చేసేరనవచ్చు.

అమెరికాలో కాలు నిలదొక్కుకున్న తరువాత, 1939 లో, చంద్ర An Introduction to the Study of Stellar Structure అనే పుస్తకం ప్రచురించేడు. ఆ పుస్తకం ప్రచురణతో అతను శ్వేత కుబ్జతారల పై పరిశోధనకు స్వస్తి పలికేడు. ఎడింగ్టన్ తో యుద్ధానికి కూడా అదే స్వస్తి వాచకం. ఆ పుస్తకం చూసి, పిలవని పేరంటంలా, “తప్పుడు తడకలన్నింటిని ఒక చోట ఎంత బాగా అమర్చేడో కదా!” అన్నాడుట ఎడింగ్టన్!

తరువాత, 1943 లో, The Principles of Stellar Dynamics అనే పుస్తకం చంద్ర ప్రచురించేడు. ఆ పుస్తకం మీద అభిప్రాయం రాయమని ప్రకాశకులు ఎడింగ్టన్ ని నేరుగా అడిగేరుట! అందిన అవకాశాన్ని జారవిడవకుండా, ఎడింగ్టన్ ఆ పుస్తకాన్ని చీల్చి చెండాడేడు. అతిగా గణితం వాడేడన్నది మొదటి అభ్యంతరం. “ముప్ఫయ్ ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన సాహస యాత్ర మేము మొదలు పెట్టేం. ఈ మహా ప్రస్థానం నేటికి ఒక గణిత సమీకరణాల పుట్టలా జుగుప్సాకరంగా తయారవడం గర్హనీయం” అని ఎడింగ్టన్ అలవాటు ప్రకారం చీదరించుకున్నప్పటికీ, పైన చెప్పిన రెండు పుస్తకాలూ ఖగోళ భౌతికశాస్త్రపు ఆకాశంలో ధ్రువతారలుగా నిలచిపోయాయన్నది సర్వులు అంగీకరించిన విషయమే!

జూలై 1939లో చివరి సారిగా ఎడింగ్టన్, పేరిస్ లో ఒక అంతర్జాతీయ సమావేశంలో, చంద్రని కలుసుకోబోతున్నాడు. అప్పటికి చంద్ర ఎడింగ్టన్ నీడ లోనుండి బయటపడి అమెరికాలో స్థిరపడి, తన రెండు కాళ్ళ మీద నిలబడడం నేర్చుకుని, రెండేళ్లు అయింది. పేరిస్ కి వెళ్లే దారిలో చంద్ర కేంబ్రిడ్జిలో ఆగినప్పుడు అగ్రస్థానంలో ఉన్న బల్ల దగ్గర విందు ఆరగించేడు. అప్పుడు ఆ బల్ల దగ్గర హేమాహేమీలయిన ఎడింగ్టన్, డిరాక్ తో పాటు మరీస్ ప్రయిస్ అనే కుర్ర భౌతిక శాస్త్రవేత్త ఆసీనులై ఉన్నారు. భోజనానంతరం జరిగే చర్చ కోసం అందరూ నెవిల్ కోర్టులో ఉన్న మరీస్ ప్రయిస్ ఆఫీసులో సమావేశమయేరు. మరీస్ ప్రయిస్ చర్చ మొదలు పెడుతూ, “ముందు, నాకు అర్థం అయిన మేరకి, చంద్ర యొక్క సాపేక్ష శిధిలత్వవాదాన్ని ఖండిస్తూ ఎడింగ్టన్ పేర్కొంటున్న అంశాలని సమగ్రంగా పొందుపరచి చెబుతాను,” అంటూ కొంత సేపు చంద్ర-ఎడింగ్టన్ మధ్య చెలరేగుతున్న వివాదంలో ఎడింగ్టన్ ఎక్కడ నిలబడ్డాడో వివరించి చెప్పేడు. “నా వాదనని నిష్పక్షపాతంగా, సమగ్రంగా క్రోడీకరించిన ప్రయిస్ సమర్ధతని మెచ్చుకుంటున్నాను,” అంటూ ఎడింగ్టన్ ఒక కితాబు ఇస్తూ, “ఇంతకీ ఈ ఇక్కడ వివాదం ఏమిటో!” అని ఆశ్చర్యం ప్రకటించేడు. దానికి సమాధానంగా ప్రయిస్ “నేను క్రోడీకరించి చెప్పిన అంశాలతో మీరు ఏకీభవిస్తారా?” అని డిరాక్ ని సూటిగా అడిగేడు. “అంగీకరించను” అని ముక్తసరిగా డిరాక్ సమాధానం చెప్పేడు. దానికి ప్రతిస్పందనగా, “నేను కూడా అంగీకరించలేను” అని ప్రయిస్ అన్నాడు. ఎడింగ్టన్ ఉగ్రుడై లేచి నిలబడ్డాడు. “ఎడింగ్టన్ కి అంతగా కోపం రావడం నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు” అని చంద్ర తరువాత అంటాడు. లేచి, ఇటు అటు పచార్లు చేస్తూ, “ఇదేమీ తమాషా కాదు” అంటూ “ప్రయిస్ మొదట్లో చేసిన క్రోడిక అంతా తప్పుల తడక” అని దుమ్మెత్తి పోసేడు. అయిదు నిమిషాల క్రితమే, “నా వాదనని నిష్పక్షపాతంగా, సమగ్రంగా క్రోడీకరించిన ప్రయిస్ సమర్ధతని మెచ్చుకుంటున్నాను,” అని ఉటంకించిన పెద్ద మనిషే ఇతను! తరువాత గంట సేపు ముగ్గురూ ఎడింగ్టన్ ఏకాంతభాషణని, మర్యాదకి భంగం రాకుండా, మౌనంగా భరించేరు.

మరునాడు చంద్ర దగ్గరకి ఎడింగ్టన్ వచ్చి, “ఎలక్ట్రాను ప్రవర్తన మీద డిరాక్ లేవదీసిన స్పిన్నర్ వాదం డిరాక్ కే పూర్తిగా అర్థం అయినట్లు లేదు!” అంటూ అభియోగం మోపేడు. (ఎడింగ్టన్ లేవదీసిన ప్రాథమిక వాదానికి డిరాక్ లేవదీసిన స్పిన్నర్ వాదం మూల స్తంభం.) ఎడింగ్టన్ వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభావం చూపకుండా, విభేదించకుండా, గోడ మీద పిల్లిలా, చంద్ర “మీరు శుశ్రూష చేసి పెంచుకు వస్తూన్న ప్రాథమిక వాదం ఎంత మేరకి సాపేక్ష శిధిలత్వం మీద మీకున్న అభిప్రాయాల మీద ఆధారపడి ఉంది?” అని అడిగితే, “అంతా! నిస్సందేహంగా” అని ఎడింగ్టన్ సమాధానం ఇచ్చేడు. ఆ సమాధానం విని చంద్ర స్పందించకుండా మౌనంగా ఊరుకున్నాడు. ఒక నిమిషం ఆగి, “ఎందుకు ఆ ప్రశ్న వేసేవు?” అని ఎడింగ్టన్ అడిగితే, “నాకు మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది!” అని చంద్ర సమాధానం చెప్పేడు. ఆ సందర్భంలో ఆ సమాధానం ఆలా చెప్పడం మర్యాద అనిపించుకోదు. కానీ అప్పటికి ఎడింగ్టన్ చూపెడుతున్న స్వాభిమానం, స్వోత్కర్ష, ధిషణాహంకారం తలుచుకునే సరికి చంద్రకి చిర్రెత్తుకొచ్చి ఆలా సమాధానం చెప్పవలసి వచ్చింది.

చంద్ర అమెరికా తిరిగి వచ్చేసిన తరువాత, సెప్టెంబరులో రెండవ ప్రపంచ యుద్ధం ఊపు అందుకుంది. పేరిస్ సమావేశంలో జరిగిన సంగతులు అన్నీ పూసగుచ్చినట్లు తండ్రికి ఉత్తరంలో రాసేడు. అయన సమాధానంలో, “పేరిస్ సమావేశంలో జరిగిన సంఘటనల వివరాలన్నీ The Observatory పత్రికలో చదివినట్లు డాక్టర్ కృష్ణన్ రాసేరు. నువ్వు ఎడింగ్టన్ ని కించపరచి తూలనాడినట్లు చదివేను. ఎందుకు ఆ పని చేసేవు? పరిస్థితులు ఎంత అనుకూలంగా లేకపోయినా మాట పొందిక లేకపోతే ఎలా?”

దీనికి సమాధానంగా, “పేరిస్ సమావేశపు సంచాలకుడు ప్రొఫెసర్ రస్సెల్ నేను ప్రదర్శించిన సంయమనాన్ని మెచ్చుకున్నారు. ఎడింగ్టన్ నడచిన బాటలోనే నేను కూడా నడచి ఉండుంటే, ఎడింగ్టన్ తప్పులన్నీ నేను బహిరంగంగా వేదిక మీద ఎత్తి చూపి వేధించి ఉండుంటే నా వాదానికి ఎంతో ప్రచారం వచ్చి ఉండేది. నిజానికి ఆ సమావేశానికి హాజరు అయిన ఫాన్ నోయిమన్, హైజెన్బర్గ్ లు నన్ను మెచ్చుకోవడమే కాకుండా ‘నువ్వు ఎడింగ్టన్ అని చూసి ఆలా భయపడుతూ అంతగా సంయమనం చూపించడం కూడా తప్పే’ అని చెప్పేరు.”

చిట్టచివరికి, చంద్ర వాదాన్ని సమర్ధిస్తూ, ఎడింగ్టన్ వాదాన్ని పూర్వపక్షం చేస్తూ, 1942 లో డిరాక్, పైయల్స్, ప్రయిస్ (Dirac, Peierla, Pryce) On the Lorentz Invariance in Quantum Theory అనే ఒక పత్రాన్ని ప్రచురించి రగులుతున్న ఈ వివాదానికి ఒక ముగింపు తీసుకువచ్చేరు. చంద్ర వాదం మీద ఎడింగ్టన్ యొక్క కీలకమైన ఆక్షేపణ ఏమిటంటే, నక్షత్రంలో ఉన్న ఎలక్ట్రాను వాయువు లో ఉన్న ఎలక్ట్రానులు విశృంఖలంగా తిరుగుతూ ఉంటాయన్న చంద్ర ఊహనం తప్పు అనిన్నీ, సదరు ఎలక్ట్రానులు ఒకదానితో ఒకటి సంకర్షించుకోవడమే కాకుండా కేంద్రంలో ఉన్న కణికతో కూడా సంకర్షించుకుంటాయనిన్నీ, ఈ సంకర్షణలు అన్నీ చంద్ర లెక్కలోకి తీసుకోలేదనిన్నీ! డిరాక్, పైయల్స్, ప్రయిస్ తమ పత్రంలో రుజువు చేసినది ఏమిటంటే, అటువంటి సంకర్షణలు అన్నిటిని పరిగణన లోకి తీసుకున్నా – శ్వేత కుబ్జతారల యెడల – చివరికి వచ్చే ఫలితంలో తేడా రాదని!!

చంద్ర వాదాన్ని తప్పు అని ఋజువు చేసే తొందరలో ఎడింగ్టన్ సాపేక్ష వాదాన్ని కాసింత, గుళిక వాదాన్ని కాసింత, తన భావాలకి అనుకూలంగా, కిట్టించడానికి ప్రయత్నించేడు. అయినా ఎడింగ్టన్ ఒప్పుకోలేదు. చివరికి 1960 దశకంలో కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేక ఈ లెక్కని సంతృప్తికరంగా చెయ్యగలిగేరు. అప్పుడు చంద్ర వాదం సరి అయినది అని అనుమానానికి ఆస్కారం లేకుండా ఋజువయింది! ఏమి లాభం? జరగవలసిన పరాభవం జరిగిపోయింది. రావలసిన గుర్తింపు రాకుండా పోయింది. ఎడింగ్టన్ బతికి ఉండగా ఈ ఋజువు లభించి ఉంటే చంద్రకి కొంత ఊరట ఉండేదేమో! ఎడింగ్టన్ బతికి ఉండగా ఎడింగ్టన్ ని ఎదిరించి తనని సమర్ధించే ధైర్యం శాస్త్ర ప్రపంచంలో ఎవ్వరికి ఎందుకు లేకపోయింది అనే అనుమానం చండ్రని జీవితాంతం పీడించింది.

గతం మరచిపోడానికి ప్రయత్నం చేస్తూ జీవితం మరొక గదిలో పోనిస్తూ ఉన్న తరుణంలో, 1944 లో, లలిత నెల తప్పింది. గట్టు తెగిన ప్రవాహంలా వారి సంతోషానికి అవధులు లేకపోయాయి. ఇంతలోనే విషాధ వార్త! గర్భం నిలవలేదు. తరువాత వారికి సంతానం కలుగలేదు.

చంద్రని ఇండియా రప్పించే ప్రయత్నం రామన్ చేస్తూనే ఉన్నాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో మేఘనాథ్ సహా అధిష్టించిన పీఠం ఖాళీ అయితే అది చంద్రకి వచ్చేటట్లు రామన్ పాటు పడ్డాడు. కేంబ్రిడ్జి రాజకీయాల నుండి అప్పుడప్పుడే బయట పడ్డ చంద్రకి వెంటనే ఇండియాలోని దంతపు కోటలలో జరిగే రాజకీయాలలో తలదూర్చే సహనం లేకపోయింది. రామన్ కి ధన్యవాదాలు చెబుతూ అలహాబాద్ ఉద్యోగాన్ని తిరస్కరించేడు.
పట్టు విడవని విక్రమార్కుడిలా రామన్ అంత తేలికగా వదలలేదు. రోయల్ సోసైటీలో సభ్యత్వానికి చంద్ర పేరుని రామన్ ప్రతిపాదించేడు. ఆ ప్రతిపాదనకు దన్నుగా అయిదుగురు ప్రముఖులు ఉత్తరాలు రాయాలి. ఎవరి పేర్లు ఇస్తే బాగుంటుందని చంద్రని సలహా అడిగితే, మిల్ని, ఫౌలర్, ఎడింగ్టన్, జీన్స్, హ్విటకర్ల పేర్లు సూచించేడు చంద్ర. తన ప్రతిపాదనని సమర్ధించడానికి మిల్ని పేరుని, చంద్ర తరఫున ఉత్తరాలు రాయడానికి ఫౌలర్, ఎడింగ్టన్, జీన్స్, హేరీ ప్లేస్కెట్ అనే కెనడా దేశపు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తని ఎన్నుకున్నాడు, రామన్! మార్చి 1944 లో చంద్రకి రోయల్ సోసైటీలో సభ్యత్వం వచ్చింది.

కానీ ఎందువల్లనో కానీ రామన్ చేసిన కృషిని గుర్తించడానికి చంద్ర సుముఖత చూపలేదు. సంసారంలో అంతర్గత కీచులాటలు, కుమ్ములాటలు కారణం అయి ఉండవచ్చు. మరొక కారణం తను రాసిన Hydrodynamics and Hydromagnetic Stability అనే ఉద్గ్రంథం మొదటిసారి చూసినప్పుడు చంద్ర సమక్షంలోనే “ఇదొట్టి చెత్త” అని రామన్ హేళన చేసేడని చంద్ర అభిప్రాయపడ్డాడు. నిజంగా రామన్ ఒక బ్రిటిష్ రచయిత రాసిన మరొక పుస్తకాన్ని చూపిస్తూ “ఇదొట్టి చెత్త” అని ఆక్షేపించి, “ఇంత పెద్ద పుస్తకం రాయడానికి నీకు తీరుబడి ఎక్కడ దొరుకుతోంది?” అన్నాడుట. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము. సందర్భ శుద్ధిలేని రామన్ మాటలని చంద్ర అపార్థం చేసుకున్నాడు.

జరిగిన పొరపాటుకి రామన్ వగచి చంద్ర తో సంబంధాన్ని మరమ్మత్తు చేసుకోడానికి ప్రయత్నించేడు. చంద్ర పేరుని 1944 లో నోబెల్ బహుమానానికి ప్రతిపాదిస్తానన్నాడు. చంద్ర ఆ ఊహని మొగ్గలోనే తుంచేస్తూ, “నోబెల్ బహుమానాలు భౌతిక శాస్త్రంలోనే ఇస్తారు కానీ ఖగోళ భౌతికశాస్త్రంలో ఇవ్వరు” అంటూ మర్యాదగా తిరస్కరించేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked