ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు – 11

సత్యం మందపాటి చెబుతున్న
పదండి ముందుకు!

“నిన్నొక విషయం అడగనా, బావా? కొత్త ఉద్యోగంలో చేరి ఇంకా ఒక్క సంవత్సరం కూడా కాలేదు, పాలు త్రాగే పసి వెధవ అప్పుడే పరుగెడతానంటున్నాడేమిటని అనుకోవు కదా!” కొంచెం సంకోచిస్తున్నా, నవ్వుతూనే అడిగాడు అర్జున్.
పెద్దగా నవ్వాడు కృష్ణ. “సరే అడుగు. ఏ పసి వెధ.. నువ్వే ఏదో అన్నావు కదా.. ఎవరైతేనేమిలే.. ఎలాగైనా నువ్వు స్పెషల్. అడిగేసెయ్.. నేనేమీ అనుకోనులే..” అన్నాడు.
“నువ్వే చెప్పావు కదా.. ప్రతి మనిషికీ ఒక ధ్యేయం వుండాలనీ, ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారం మనం అనుకున్నది సాధించాలనీ.. “
“అవును. మరి నీ లక్ష్యం ఏమిటి? ఎలా అది సాధిద్దామనుకుంటున్నావు?” అడిగాడు కృష్ణ.
అర్జున్ ఒక్క క్షణం ఆలోచించాడు.
అతను ముందే తన లక్ష్యం, ఆ లక్ష్య సాధనకి ఒక మంచి ప్రణాళిక ఆలోచించి పెట్టుకున్నాడని అర్ధమవుతూనే వుంది. తను చెప్పినవి పూర్తిగా పాటిస్తూ, వాటిని ఉపయోగించటంలో అప్పుడే ముందుకు వెడుతున్న అర్జున్ని చూస్తే ముచ్చట వేసింది కృష్ణకి. అందుకే అతని ఆలోచనలకి సమయం ఇస్తూ, మౌనంగా వున్నాడు కృష్ణ.
అర్జున్ అన్నాడు, “బావా! నా ఐదేళ్ళ ప్లాన్ ఏమిటంటే, ఇంజనీరింగ్ మేనేజ్మెంటులోకి వెళ్ళాలని. బల్ల దగ్గర కూర్చుని పని చేయాలంటే నా కాళ్ళు వూరుకోవు. అదీకాక నాకు ఉత్సాహంగా ప్రొడక్షన్ ఫ్లోర్ మీద బిజీగా తిరుగుతూ, వారి సమస్యలు తీరుస్తూ పనిచేయటం అంటే ఇష్టం. అక్కడే ఒక మేనేజర్ అవాలని వుంది. దాని తర్వాత.. ఆపరేషన్స్ మేనేజ్మెంట్.. ఆ దారినే పైకి వెళ్ళాలని వుంది. దానికి కావలసిన మార్గాలు కొన్ని చెబుతావా?”
అలా అడుగుతుంటే అర్జున్ కళ్ళల్లో ఒక విధమైన మెరుపు కనిపిస్తున్నది.
కృష్ణ అదే అన్నాడు అర్జున్ కేసి చూస్తూ. “నీ కళ్ళలోనే తెలుస్తున్నది నీ పాషన్. ఏదో మెకానికల్గా కాక, అలా ఇష్టంతో చేసే ఏ పనయినా తప్పక విజయవంతమవుతుంది. కాకపోతే నువ్వు ఎంచుకున్న మార్గం చాల పటిష్టంగా వుండాలి. ఇలా మేనేజరుగానో, డైరెక్టరుగానో, ఇంకా పైకి వెళ్ళాలన్నా, ఎలా మెలగాలో నీ ఆశయం ఎలా సాధించవచ్చో నాకు తెలిసినది చెబుతాను. ఆచరణలో పెట్టటానికి ఎప్పుడు, ఎక్కడ ఎంత మోతాదులో వాడుకోవాలో అది నువ్వు సందర్భానుగుణంగా చేయవలసిన పని” సాలోచనగా ఒక్క క్షణం ఆగాడు కృష్ణ.
అర్జున్ తన భావాలు కృష్ణ అర్ధం చేసుకుని, సహాయం చేస్తున్నందుకు సంతోషం వేసి అతని వేపు గౌరవభావంతో చూశాడు.
కృష్ణ నవ్వి, “అంత సీను వద్దులే బామ్మరిదీ. ఆలోచిస్తున్నాను, ఎక్కడ మొదలుపెడదామా అని.. సరే కానీ.. నేను మహాత్మా గాంధీగారి జీవిత చరిత్ర మీద కొన్ని పుస్తకాలు, ఆయనే వ్రాసిన ‘మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్’ పుస్తకం, అలాటివి ఎన్నో చదివాను. రిచర్డ్ ఎట్టిన్బరో తీసిన ‘గాంధీ’ సినిమా కూడా ఎన్నోసార్లు చూశాను. మహాత్మా గాంధీగారు దక్షిణాఫ్రికాలో నల్లవారికీ భారతీయులకీ, స్వేత జాత్యహంకారుల చేతుల్లో జరుగుతున్న అన్యాయాలని అరికట్టటానికి తన ప్రాణం కూడా లెఖ్కచేయక ఎలా పోరాడారో మనకి తెలుసు. అప్పుడే గోపాలకృష్ణ గోఖలే, ఆయన్ని భారతదేశానికి పిలిపించి, దేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. అప్పుడు గాంధీగారు చెప్పిన మాటలు నాకెంతో ఇష్టం. ‘నాయకులను ఒకరు నియోగిస్తే, వాళ్ళు నాయకులయిపోయి విజయం సాదించలేరు. వాళ్ళంతట వారికే ఆ స్పందన, ఉత్సాహం, ఉద్రేకం రావాలి. అప్పుడే వాళ్ళ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి’ అంటారు. ‘అయితే ఆ నాయకత్వ లక్షణాలు మీలో వున్నాయో లేదో దేశమంతా తిరిగి, మన ప్రజలతో మాట్లాడి చూడండి’ అంటాడు గోఖలే. ఆ సలహా పాటించి, భారతదేశం అంతా తిరిగి, బ్రీటిష్ వారి చేతుల్లో భారతీయులు ఎలా కష్టాలు పడుతున్నారో, ఎలా ప్రాణాలు త్యాగం చేస్తున్నారో చూసి ఆయన చలించిపోయారు. అప్పటి దాకా బ్రీటిష్ వారు అక్కడక్కడా అడ్డుపడుతున్న కొంతమందిని కాల్చి చంపటం చూసి, అది పధ్ధతి కాదనీ, దేశమంతా ఒక్క త్రాటిన సమైక్యంగా పోరాడితే విజయం సాధించవచ్చనీ చెప్పి, ఆయనే సారధ్యం వహించి ముందుకు వచ్చారు. అందుకని ఆ నాయకత్వపు లక్షణాలు నీలోనించి వెలికితీయటానికి ముందు నువ్వే ప్రయత్నించాలి. మనం చేసే పనులు ఎక్జిక్యుటివ్ మేనేజర్లకి కనిపించాలి. వాళ్ళనే కంపెనీ అవసరాలకు నిన్ను గుర్తించి ప్రోత్సహించే పరిస్థితికి నువ్వు తీసుకురావాలి” అన్నాడు.
“అవును. నాయకత్వపు లక్షణాలు పుట్టుకతో వస్తాయంటారు కానీ, నేను అలాటి పిచ్చి మాటలు నమ్మను. ఎందుకంటే మన భారతదేశంలో వారసత్వపు నాయకుల్లో తొంభై శాతం పైన, పండిత పుత్రులు శుంఠలే. అలాగే ఐఏఎస్, ఐపిఎస్ వారూ.. కులాల పేరుతోనూ, నాలుగు పుస్తకాలు బట్టీ పెట్టి పరీక్ష వ్రాస్తేనూ పదవుల్లోకి వచ్చినవారే. చదువులతోనూ, అనుభవంతోనూ రావలసిన నాయకత్వపు లక్షణాలు వీళ్ళకి ఎలా వస్తాయి? అందుకే ఇక్కడో అక్కడో తప్ప, ఎక్కువ మంది లంచాలు తినటానికి తప్ప దేనికీ పనికిరావటం లేదు” అన్నాడు అర్జున్.
“మనకా రాజకీయాలు ఇప్పుడు వద్దులే. కానీ నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. మేనేజ్మెంట్ టెక్నిక్స్ మీద ఎన్నో పుస్తకాలున్నాయి. నాకు బాగా ఇష్టమైనవి జాన్ మాక్స్వెల్ వ్రాసిన పుస్తకాలు. నా దగ్గర కొన్ని వున్నాయి. ఇస్తాను. చాలమంది వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు. అవి చదువు. అలాగే బాసుకీ లీడరుకీ ఎన్నో తేడాలున్నాయి. ఈరోజుల్లో బాసుగాడిగా వుంటే అభాసుపాలే. అలాటివారు ఎక్కువ రోజులు వుండలేరు. తన క్రింద పనిచేసే వారిని ప్రభావితం చేసి, లీడ్ చేసేవాడే లీడర్. అటువంటివారు కార్పొరేట్ రంగంలో త్వరగా పైకి వస్తారు. నువ్వు ‘లీ అయోకోకా’ అనే ఆయన పేరు ఎప్పుడైనా విన్నావా?” అడిగాడు కృష్ణ.
“లేదు” అని తల అడ్డంగా వూపాడు అర్జున్.
“అమెరికా పారిశ్రామికరంగంలో పెద్ద కంపెనీలలో ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంటులో వుండి, దాన్ని లాభాలలో నడిపించటం బాగా పదునైన కత్తి మీద నడవటం లాటిదే. ఆ కంపెనీ బోర్ద్ ఆఫ్ డైరెక్టర్లూ, స్టాక్ మార్కెట్టూ, షేర్ హోల్డర్సూ వేయి కళ్ళతో చూస్తుంటే, లాభాలు చూపించి పైకి వెళ్ళటమో, లేదా నష్టాలతో పైకే వెళ్ళటమో. రెండే మార్గాలు. 1960లలో కార్లు తయారు చేస్తున్న ఫోర్డు కంపెనీ కష్టాల్లోనే కాక. నష్టాల్లో కూడా వుంది. అప్పుడు ఏదో ఒక మహాత్యం జరిగితే తప్ప, ఆ కంపెనీ లాభాల్లోకి వచ్చే ఆశ, అవకాశం కనపడలేదు. అప్పటి ఆ మహాత్యం పేరే ‘లీ అయోకోకా’. 1964 ఏప్రిల్ 17వ తారీఖున ఆయన ఆధ్వర్యంలో ఫోర్డ్ కంపెనీ తమ మొట్టమొదటి మష్టాంగ్ కారుని న్యూయార్క్ వరల్డ్ ఫైర్లో ప్రవేశపెట్టింది. టాపు తీసివేసి నడుపగలిగే ఆ కారు, ఇటు ధనవంతులకీ, అటు మధ్య తరగతివారికీ అందరికీ అందుబాటులో వుండేలా, రెండువేల ఐదు వందల డాలర్లకే లభించింది. ఐదేళ్ళలో రెండు మిలియన్ల పైగా అవి అమ్ముడుపోయాయి. ఫోర్డ్ కంపెనీ మళ్ళీ లాభాల్లో పడింది”
“అవును, మష్టాంగ్ కార్ల గురించి విన్నాను. చాలా పేరు వచ్చిన కారు” అన్నాడు అర్జున్.
“దాని తర్వాత క్రైస్లర్ కంపెనీ కష్టాలు ప్రారంభం అయాయి. ఆ కంపెనీ దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ఆ నష్టాల్లోనించీ బయటపడటానికి, కంపెనీని ఏవైనా జపాన్ కారు కంపెనీలకి అమ్మేద్దామనుకున్నారు. అప్పుడే క్రైస్లర్ కంపెనీని రక్షించటానికి లీ అయోకోకాని రంగంలోనికి దించారు. అతని నాయకత్వంలో కే కారు అనే సామాన్యుల కారుతో మొదలుపెట్టి, ఖరీదైన కార్లు, కుటుంబంతో వెళ్ళగలిగే వ్యానులూ తయారు చేయింఛాడు. క్వాలిటీ పెంచి, అన్ని హంగులూ పెట్టి, తక్కువ ధరకి అందించాడు. నష్టాల్లో వున్న కంపెనీ ఒక్కసారిగా లాభాల్లో పడింది. అమెరికాలో మూడవ పెద్ద కార్ల కంపెనీ అయింది. ఆయన ఎక్కువగా అమలు పరచిన సిధ్ధాంతం జనరల్ పాటన్ చెప్పినదే. దాని పేరు ‘లీడ్, ఫాలో, ఆర్ గెటవుట్ ఆఫ్ ది వే’. దాన్ని తెలుగులో ‘నడిపించు, నడు, లేదా తప్పుకో’ అందాం”
“కొంచెం వివరణ ఇస్తే బాగా అర్ధమవుతుంది బావా” అన్నాడు అర్జున్.
“వస్తున్నా.. వస్తున్నా.. నీలో నాయకత్వపు లక్షణాలు వుంటే, ఏదన్నా ప్రాజెక్ట్ కానీ, ఒక కంపెనీనీ కానీ, ఏదయినా సరే సవ్యంగా నడిపించు. అవి లేనప్పుడు, ఎవరైనా నాయకత్వం వహించి ‘పదండి ముందుకు’ అంటుంటే, నువ్వు కూడా వాళ్ళతో పాటూ నడిచి లక్ష్యం సాధించు. అదీ చేతకాకపోతే, పని చేసే వాళ్ళ కాళ్ళకి అడ్డం రాకుండా తప్పుకో. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా.. ‘హవ్ నాట్ టు డూ’ మనుష్యులు వుంటారని. వాళ్ళన్న మాట”
“అవును. అర్ధం అయింది. మరి ఒక నాయకుడితోపాటు నడిచేవాడిలో కూడా, నాయకత్వపు లక్షణాలు వుంటే, వాళ్ళ మధ్య గొడవలు రావా? రెండు పొటేళ్ళు ఒక దాని మీద ఒకటి కొమ్ములు విసిరినట్టు” అడిగాడు అర్జున్.
“మంచి ప్రశ్న అడిగావు అర్జున్. అవును వస్తాయి. ఒక నాయకుడికి వుండవలసిన లక్షణం, తన అభిప్రాయాలు, పధ్ధతి, ఆలోచన అందరి మీదా రుద్దటం కాదు. అది బాసుగాళ్ళు చేసే పని. వాళ్ళు ఎక్కువ రోజులు మేనేజ్మెంట్లో వుండలేరని చెప్పుకున్నాం కదా. మంచి నాయకుడు, తన టీములో వున్న అందరితోనూ చర్చించి, వారి అభిప్రాయాలు కూడా సేకరించి, తన ప్లానుని పటిష్టం చేసుకుని ముందుకి వెడతాడు. అదే టీములో వున్న ఇంకొక నాయకుడు, పక్కకి తప్పుకుని విమర్శలు చేయక, ఒక టీమ్ మెంబరుగా తన సలహాలు చెప్పి, తనూ ముందుకి నడుస్తాడు. అంటే నాయకుడికి వుండవలసిన ఒక ముఖ్య లక్షణం, అవసరం అయినప్పుడు లీడర్ అవతారంనించీ ఫాలోవర్ అవతారం ఎత్తటం. అలా ద్విపాత్రాభినయం చేయటం వల్ల, అలాటివారికే కాక, ఆ కంపెనీలకి కూడా ఎన్నో లాభాలే కానీ నష్టాలు వుండవు. అది అవసరం కూడా”
“మరి నాయకుడికి విజన్ వుండాలంటారు కదా.. అదేమిటి?”
“ఇందాక మహాత్మా గాంధీగారి గురించి చెప్పుకున్నాం కదా. ఆయనకి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించటమే లక్ష్యం. దాన్ని ఎన్నోరకాలుగా సాధించవచ్చు. కానీ ఆయన అహింసా సిధ్ధాంతాన్ని ఎన్నుకుని, దేశ ప్రజలందరినీ ఒక్క తాటిన నడిపించి, కష్టాలూ నష్టాలూ భరించి, ఎన్నో త్యాగాలు చేసి తను అనుకున్న పధ్ధతిలోనే సాధించాడు. అలాగే అమెరికాలో బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, మైకెల్ డెల్, మొదలైన ఎంతోమంది ఏవో డబ్బులు సంపాదించుకుందామని వ్యాపారాలు చేయలేదు. ప్రపంచ సాంకేతికరంగ చరిత్రనే మార్చేశారు. ఎవరూ ఊహించనంతగా మన జీవన వాహినినే మార్చేశారు. అదే నా ఉద్దేశ్యంలో విజన్ లేదా ముందు చూపు అంటే”
“నేను చదివిన చాల పుస్తకాల్లో, మైక్రో మేనేజ్మెంట్ మంచిది కాదు అంటారు. అదేమిటో కూడా చెప్పు బావా?” అడిగాడు అర్జున్.
“మైక్రో మానేజ్మెంట్ అంటే, మీ అక్కయ్య రుక్మిణి మాంచి ఉల్లిపాయల సాంబార్ పెడుతున్నదనుకో, నేను పక్కనే చేరి, ‘ఆ.. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయి.. ఇంకొంచెం సాంబారు పొడి కలుపు.. మరికొంచెం కారం ఆ సాంబార్ కళ్ళల్లో కొడితే బాగుంటుంది..’ అంటూ వెంట పడితే, ఆవిడకి కోపం వచ్చి ‘అయితే మీరే చేసుకోండి’ అని బాపు బొమ్మలా ముక్కు విరిచి వంటింట్లో నించి వెళ్ళిపోవటం అన్నమాట. ఆవిడకి ఉల్లిపాయ సాంబార్ చేయటంలో పద్మవిభూషణ్ వుంది. నేను నా జన్మలో వంటింట్లో ఒక్కసారి కూడా గరిటె తిప్పలేదు. మరి అలా వెంటబడి విసిగిస్తుంటే, అంటే అలా మైక్రో మానేజ్మెంట్ చేస్తుంటే, ఇలాగే అవుతుంది. ఒకసారి ఆపుల్ కంపెనీ స్టీవ జాబ్స్ అంటాడు, ‘నేను దేశంలో వున్న గొప్ప ఇంజనీర్లకు మా కంపెనీలో ఉద్యోగాలిచ్చేది, వాళ్ళేం చేయాలో చెప్పటానికి కాదు. వాళ్ళే నాకు వాళ్ళేం చేయగలరో చెప్పటానికి’ అంటాడు. ప్రాజక్ట్ ప్లాన్ అంతా సిధ్ధమయాక, అందరికీ ఎవరు చేయవలసిన పని, ఎప్పటికి పూర్తిచేయాలో మొదలైనవి చెప్పేసి, అవి ఎలా సాధించాలో వాళ్ళకే వదిలేస్తే పని సవ్యంగా జరగటమే కాక, మిగతావారిలో వున్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి, అనుకున్న దానికన్నా బాగా పూర్తి చేసే అవకాశం వుంటుంది. డెలిగేషన్ ఆఫ్ వర్క్ అన్నమాట. అలా అని అన్నీ వదిలేస్తే, ప్రాజెక్ట్ చేయి జారిపోయే అవకాశం వుంటుంది. అందుకని అవసరాన్ని బట్టి వారానికొకసారో, నెలకొకసారో ప్రాజెక్ట్ మీటింగ్ పెట్టి, ప్రాజెక్ట్ ఎలా నడుస్తున్నదో చూడవచ్చు. ఏ విధంగా మెరుగు పరచవచ్చో వాళ్ళనే అడగవచ్చు. దాన్నే కంటిన్యుయస్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే సహాయం చేయవచ్చు. అంతేకాని మరుగుతున్న సాంబారులో వేలుపెట్టి, మైక్రో మానేజ్మెంట్ చేస్తే వేలు కాలుతుంది” అన్నాడు కృష్ణ.
అర్జున్ చిరునవ్వి, “మైక్రో మేనేజ్మెంట్ అంటే, ఇక జన్మలో మరచిపోకుందా చెప్పావు. మరి ఇందాక నువ్వు బాసుగాడిలో వుండకూడని లక్షణాలు.. లేదా ఒక నాయకుడులో వుండవలసిన లక్షణాలు చెబుతున్నావు, అవేమిటి బావా?” అన్నాడు.
“ఇక బాసుగాడిని మరచిపో. ఒక నాయకుడిలో అంటే లీడరులో వుండవలసిన ముఖ్యమైన లక్షణాలు కొన్ని చెబుతాను. జీవితం అంటేనే ఒక పాఠశాల. మనకి ఎదురుగా కనపడే మంచీ చెడూ, మనం రోజువారీ అనుభవవించే కష్ట సుఖాలు, ఇలాటివన్నీ పాఠ్య పుస్తకాలు. ప్రతిరోజూ ఏవో క్రొత్త విషయాలు నేర్చుకుంటూనే వుంటాము. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, చాలమందికి అలా నేర్చుకుంటున్నట్టు కూడా తెలియదు. నేను గత సంవత్సరంలో వున్నట్టుగా ఇప్పుడు లేను. నేను నేర్చుకున్న కొత్త విషయాలతో, నా ప్రవర్తనలోనూ, మాట్లాడే తీరులోనూ ఎంతో మారాను. నేనే కాదు, నువ్వూనూ. నేనూ నువ్వే కాదు, ప్రతి వ్యక్తి కూడాను. చాలమందిలోని మార్పు మంచికే అయితే, కొంతమందిలోని మార్పు పురోగమనానికి కాక, తిరోగమనానికి వెళ్ళి వుండవచ్చు. మార్పు సహజం. అందుకని మార్పుని ఆహ్వానించటానికీ, కొత్తవి నేర్చుకోటానికీ ఇబ్బంది పడకూడదు. ఎంత తొందరగా మంచి మార్పుని ఆహ్వానిస్తే, ఆచరిస్తే అంత మంచిది. అది కూడా మంచి నాయకత్వపు లక్షణమే. అలాగే, మాట్లాడటానికన్నా, వినటానికి ఎక్కువ ప్ర్రాధాన్యం ఇస్తాదు మంచి నాయకుడు. తనకి ఏమైనా సమస్యలు, ప్రశ్నలు వస్తే, అవి తన జట్టులోని వారితో చర్చించి, వారి సమాధానాలకోసం ఎదురు చూస్తాడు. ఇక్కడ నాయకు’డు’, డు అంటున్నానని, నేను మగ పక్షపాతిని కాదు. నేను ఆడవారు మంచి మేనేజర్లు అవరు అని చెప్పటం లేదు. ఎంతోమంది ఆడవారు కొన్ని పెద్ద కంపెనీలకే సి.ఇ.ఓ. పదవుల్లో వున్నారు. చెప్పటానికి సులభంగా వుంటుందని అలా చెబుతున్నాను. అంతే. నాయకుడు అంటే లీడర్ అనే నా ఉద్దేశ్యం. ఇది చెబుతుంటే గుర్తుకి వచ్చింది. నీ జట్టులో రంగు, దేశం, ప్రాంతీయం, కులం, మతం, భాష, ఆడా మగా మొదలైన తేడాలు లేకుండా, అర్హతలు వున్నవారికే అవకాశం ఇవ్వు. బాస్కెట్ బాల్ ఆట ఆడుతున్నప్పుడు, కోచ్ ఎలా పని చేస్తాడో, నువ్వూ అదే చేయి. కోచ్ ఆట ఆడడు. ఆట ఆడవలసింది నీ జట్టులోని ఆటగాళ్ళు. వాళ్ళ చేత ఒక ప్లాన్ ప్రకారం ఆట గెలిపించే నాయకుడివి నువ్వు. నీ జట్టు గెలవటమే నీ లక్ష్యం. దాని మీదే నీ ఏగాగ్రత. దారిలో ఎదురు వచ్చే చిన్న చిన్న విషయాల మీద కాదు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే, ఇక నీకు అడ్డు వుండదు. పదండి ముందుకు అంటూ ముందుకే వెడతావు” అన్నాడు కృష్ణ.
రుక్మిణి వచ్చి, “ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడే ఉల్లిపాయల సాంబార్ పెట్టాను. బ్రహ్మాండంగా వచ్చింది. అన్నీ సిధ్ధంగా బల్ల మీద వున్నాయి. రండి” అన్నది.
అర్జున్ బావగారి వేపు చూసి చిరునవ్వు నవ్వాడు.

౦౦౦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked