కథా భారతి

ఆత్మఘోష

అన్ని ఛానెల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. విశాల్ ఇండస్ట్రీస్ అధినేత చైర్మన్ భరద్వాజ్ తన ఆఫీస్ బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండస్ట్రీ ప్రపంచంలో భరద్వాజ్ అనే పేరు ఒక సంచలనం. భరద్వాజ్ తండ్రిపేరు విశాల్. తండ్రిపేరుమీదే గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ వున్నాయి. మొట్టమొదట టెక్సటైల్స్ తో ప్రారంభమైన వ్యాపారం, మూడు పువ్వులు ఆరు కాయలు గా ఎదుగుతూ సిమెంట్, హార్డ్వేర్, టాయ్స్,హోటల్స్ ఇలా విస్తరించి పెద్దదయింది. షుమారు పది సంవత్సరాలలోనే ఇండియాలోనే ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థగా విశాల్ ఇండస్ట్రీస్ ఎదిగింది. తండ్రి తరువాత, భరద్వాజ్ చైర్మన్ పదవి చేపట్టాడు. భరద్వాజ్ చైర్మన్ అయిన తరువాత విశాల్ ఇండస్ట్రీస్ మరింతగా అభివృద్ధి చెందింది. ఉద్యోగస్తుల సంఖ్య యాభై వేలకు పెరిగింది. స్టాక్ మార్కెట్ లో షేర్ విలువ పదింతలు పెరిగింది. అన్నే సవ్యంగానే సాగుతున్నాయి.
కానీ ఒకరోజు భరద్వాజ్ హఠాత్తుగా తన ఆఫీస్ బిల్డింగ్ మీదినుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండియా ఒక్కసారిగా నివ్వెర పోయింది. ఏం జరిగింది. ఎందుకు జరిగింది. రాత్రి షుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరుతున్నానని సిబ్బందికి చెప్పి, బిల్డింగ్ పైనుంచి దూకేసాడు. అది పది అంతస్తుల భవనం కావడంతో, కిందపడిన భరద్వాజ్ తలకు బలంగా దెబ్బ తగలడంతో వెంటనే చనిపోయాడు. భరద్వాజ్ మరణవార్త వినగానే లోకమంతా ఒక్కసారి మేల్కొంది. మీడియావాళ్లు ఆత్మహత్యా ప్రదేశానికి చేరుకున్నారు. వెంటనే పోలీసువాళ్ళు వచ్చారు. భరద్వాజ్ బంధువులు స్నేహితులు అభిమానులతో ఆ ప్రదేశం కిటకిటలాడుతోంది. ఎవరిపని వాళ్ళు చేసుకుంటున్నారు.
ఒక్కసారిగా చనిపోయిన భరద్వాజ్ శరీరంనుంచి భరద్వాజ్ ఆత్మ మెల్లగా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన భరద్వాజ్ ఆత్మకు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. కాసేపటికి మెల్లగా అర్ధం అయింది. భరద్వాజ్ గా వున్న శరీరం చనిపోవడంతో ఆ శరీరంనుంచి తను బయటకు వచ్చింది. ఆత్మకు అక్కడ అంతా కొత్తగా వుంది. ఒక్కసారి భరద్వాజ్ ని తట్టి లేపాలి ప్రయత్నించింది. కానీ వీలుకాలేదు. ఇక భరద్వాజ్ శరీరం లేవదు. అందుకే తను బయటకు వచ్చింది. అది తలచుకోగానే ఆత్మకు వణుకు పుట్టింది. ఆత్మకు ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టూ వున్నపోలీసులు, అక్కడ చేరిన గుంపును పక్కగా సర్దుతున్నారు. ఇంతలో అంబులెన్సు వచ్చింది. అందులోనుంచి దిగిన డాక్టర్లు భరద్వాజ్ శరీరాన్ని హాస్పిటలుకు తీసుకువెళ్ళటానికి, డిఎస్పీ పర్మిషన్ అడుగుతున్నారు.
“మా ఫార్మాలిటీస్ అయిన తరువాత తీసుకవెళ్ళవచ్చు” అని డాక్టర్లకు చెప్పారు పోలీసులు. తన ఒక్కడి గురించి కుటుంబ సభ్యులు, సిబ్బంది, తన కంపెనీల్లో పెట్టుబడిపెట్టిన ప్రజలు, తనతో వ్యాపారంచేసే అందరూ బాధపడుతున్నారు.
ఇంతమందిని బాధ పెట్టి తను ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు సమంజసం. సమస్యలు అందరికీ వస్తాయి. చిన్నవాళ్లకు చిన్న సమస్య, పెద్దవాళ్లకు పెద్ద సమస్య. సమస్యలు వున్నాయి కదా అని ఇలా అందరూ ఆత్మహత్యలు చేసుకుంటే, వాళ్ళ మీద ఆధారపడిన ఎన్నో కుటుంబాలు ఏమైపోతాయి.
ఆలోచనలో పడింది ఆత్మ. ఇంతకూ తానెందుకు ఆత్మహత్య చేసుకుంది. ఆలోచింపసాగింది. ఒక్కసారిగా తన వ్యాపారాలు, వాటి అభివృద్ధికి తను పడ్డ శ్రమ గుర్తుకొస్తున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభోత్సవం తళుక్కున మెరిసింది. సిమెంట్, హార్డ్వేర్, టాయ్స్ పరిశ్రమలలో బాగా లాభాలు రావడంతో విశాల్ ఇండస్ట్రీస్ హోటల్ వ్యాపారం వైపు ద్రుష్టి పెట్టింది. ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టడానికి నిర్ణయించుకొంది. బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఫైవ్ స్టార్ హోటల్ ప్రస్తావన వచ్చింది. డైరెక్టర్లు తలా ఒక సలహా ఇచ్చారు. కొంతమంది హోటల్ ఇండస్ట్రీ గురించి అనుకూలంగా చెప్పారు. కొంతమంది వ్యతిరేకించలేదుకానీ, ఎక్కువ లాభాలు రావని చెప్పారు. అన్నీ విన్న భరద్వాజ్ ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులతో కూడా చర్చించాడు. తల్లి విమలాదేవి, భార్య వినీల వాళ్ళ అనుభవాలతో తగిన సూచనలు చేశారు. ఒక నెలపాటు హోటల్ ఇండస్ట్రీ గురించి మళ్ళీ పరిశీలించి ఫైవ్ స్టార్ హోటల్ విశాఖపట్నంలో కట్టడానికి నిర్ణయించుకున్నాడు.
ఇక పెట్టుబడి విషయంలో కొంతమంది డైరెక్టర్స్ మిగతా వ్యాపారాల్లోని లాభాలనుండి కొంత, మిగతాది కొత్తగా వాటాలు జారీ చేయటం ద్వారా పెట్టుబడి పెట్టాలంటే, తల్లి, భార్య కొంత లాభాలనుండి, మిగతా పెట్టుబడి బ్యాంకులనుండి రుణాల రూపంలో తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. భరద్వాజ్ చివరకు మిగతా వ్యాపారాల్లోని లాభాలను పూర్తిగా మళ్లించడానికే ఇష్టపడ్డాడు. అంతే. ఫైవ్ స్టార్ హోటల్ విశాఖపట్నంలో కట్టడం పూర్తయింది. ప్రారంభోత్సవం చాలా గొప్పగా జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు వచ్చి, ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరిపారు. ముగింపు ఉపన్యాసంలో భరద్వాజ్ ఉద్యోగులందరికీ, ఒకనెల బోనస్ కూడా ప్రకటించాడు. అంతా సవ్యంగా సాఫీగా జరిగిపోతోంది. రెండు సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి.
మళ్ళీ కొత్త ప్రస్తావన. హైదరాబాద్, బెంగళూరు లో కూడా రెండు కొత్త ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టాలని అనుకున్నాడు భరద్వాజ్. ఈ తడవ ఎవ్వరి సలహా తీసుకోలేదు. తనే స్వయంగా బ్యాంకులనుండి అప్పు తీసుకోవాలనుకున్నాడు. డైరెక్టర్స్ మీటింగులో కొంతమంది వ్యతిరేకించినా, మొత్తానికి తీర్మానం భరద్వాజ్ కి అనుకూలంగానే వచ్చింది. రెచ్చిపోయిన ఉత్సాహంతో కావలసినదానికన్నా ఎక్కువ అప్పు తీసుకున్నాడు. మళ్ళీ రెండుసంవత్సరాల వ్యవధిలో హైదరాబాద్, బెంగళూరు లో రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ ప్రారంభోత్సవాలు జరుపుకున్నాయి. భరద్వాజ్ గాల్లో తేలిపోతున్నాడు. తను అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి. తనకు ఇక తిరుగులేదు అనే నిర్ణయానికి వచ్చాడు. భారద్వాజ్ కఠిన శ్రమకు గుర్తింపుగా కొత్త సంవత్సరం ప్రారంభంలో చైనా సిమెంట్ ఇండస్ట్రీ నుండి ఒక బృందం, విశాల్ ఇండస్ట్రీ ని పరిశీలించడానికి వచ్చింది.
వాళ్లకు విశాల్ సిమెంట్ ఇండస్ట్రీ పనిచేసే తీరు నచ్చింది. విశాల్ ఇండస్ట్రీస్ తో వ్యాపార ఒప్పందం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. భరద్వాజ్ చైనా సంస్థలతో ఒప్పందాలకు, ఏమైనా అడ్డంకులున్నాయో క్షుణ్ణంగా పరిశీలించాడు. కేంద్ర పరిశ్రమలశాఖ, విదేశాంగ శాఖల నుండి అనుమతులు కూడా వచ్చాయి. ఇంకేం రెండువేల కోట్ల రూపాయలమేరకు వ్యాపార ఒప్పందాలు జరిగాయి. అన్నట్లు మీకు చెప్పలేదుకదా! చైనా ప్రపంచంలోనే ఎక్కువ సిమెంట్ ఉత్పత్తి చేసే దేశం. భరద్వాజ్ ఆనందానికి అంతులేకుండా పోయింది.
తను చైర్మన్ అయిన తరువాతా విశాల్ ఇండస్ట్రీస్ రూపురేఖలు అతి త్వరగా మారిపోయాయి. నాన్నగారి హయాంలో కన్నా తను చైర్మన్ గా వున్నప్పుడే విశాల్ ఇండస్ట్రీస్ బాగా పెరిగింది. భరద్వాజ్ లో మెల్ల మెల్లగా అహంకారం కూడా పెరిగింది. అది అహంకారమో లేక తన సామర్ధ్యం మీద వున్న నమ్మకమో నిర్ణయించుకోలేకపోయాడు. విశాల్ ఇండస్ట్రీ ఎదుగుదల చూసి అమెరికా, సింగపూర్ నుండి కూడా వ్యాపార ఒప్పందాలకై భరద్వాజ్ కు ఆహ్వానాలు వచ్చాయి. అమెరికాలో వారంరోజులు, సింగపూర్లో వారం రోజులు, తన బోర్డు అఫ్ డైరెక్టర్స్ తో బిజినెస్ టూర్స్ వెళ్ళాడు. ఎక్కడకు వెళ్ళిననా ఘనస్వాగతం, కోట్ల కొద్దీ ఒప్పందాలు. డైరెక్టర్స్ కి కూడా మనసులో వ్యాపారం వృద్ధి చెందటం ఆనందంగా వున్నా వ్యాపారం చేసే తీరుమీద కొంత వ్యతిరేకత ఉండేది. ఎందుకంటే భరద్వాజ్ ఎప్పుడూ ఒక వ్యాపారంలో లాభాలను ఇంకో వ్యాపారానికి మార్చేవాడు. దానివల్ల నియంత్రణ తప్పిపోయేది. కానీ సలహా ఇచ్చే ధైర్యంకానీ, ఎదిరించే దమ్ముకానీ ఉండేవికావు. ఎందుకంటే తనను ఎవరైనా ఎదిరిస్తే, వాళ్ళని బోర్డు అఫ్ డైరెక్టర్స్ నుండి తొలగించేవాడు. అందువల్ల డైరెక్టర్స్ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. విశాల్ ఇండస్ట్రీస్ కి పోటీదారులు కూడా ఎక్కువే. కానీ నాణ్యత, ఖాతాదారుల సేవ ఎక్కువగా ఉండటంతో విశాల్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులన్నీ ఎక్కువగా అమ్ముడుపోయేవి. భరద్వాజ్ కూడా పోటీదారులతో సన్నిహిత సంభందాలు కలిగివుండేవాడు.
ఒకసారి సిమెంట్ ఇండస్ట్రీ లో ప్రధాన పోటీదారుడైన కుమార్ ఇండస్ట్రీ ని కొందామనే ప్రతిపాదన వచ్చింది. కుమార్ ఇండస్ట్రీ వ్యాపార రీత్యా బాగా నష్టపోయింది. ఉద్యోగులు షుమారు పదివేలమంది వుంటారు. కానీ ఆస్తులు వున్నాయి. అందుకనే కుమార్ ఇండస్ట్రీ ని కొందామనే ప్రతిపాదన వచ్చింది. ఈ విషయంలో మాత్రం బోర్డు అఫ్ డైరెక్టర్స్ అందరూ వ్యతిరేకించారు. చివరకు తల్లి, భార్య కూడా వద్దని సలహా ఇచ్చారు. కానీ భరద్వాజ్ లో వున్న అహం, వారి సలహాలను పెడచెవిన పెట్టింది. దాంతో కుమార్ ఇండస్ట్రీ ని విశాల్ ఇండస్ట్రీ కొనేసింది. విశాల్ ఇండస్ట్రీ ఆర్ధిక వ్యవహారాలు చూసే గణేష్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా ఈ ప్రతిపాదన వద్దన్నారు. అక్కడనుంచే విశాల్ ఇండస్ట్రీ పతనం ప్రారంభమైంది. ఆ సంవత్సరంనుంచే లాభాలు తగ్గటం ప్రారంభమైంది. మొదటిసారిగా విశాల్ ఇండస్ట్రీ హోటల్ విభాగంలో లాభాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇంకేముంది. హోటల్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజి లో వాటాలను అమ్మడం ప్రారంభించారు. రెండువేలు వున్న వాటా విలువ ఐదు వందలకు పడిపోయింది. దాన్ని చూసే మిగతా వాళ్ళుకూడా వాటాలు అమ్మడం మొదలుపెట్టారు.
స్టాక్ ఎక్స్చేంజి లో వాటా విలువ పడిపోతే దాని ప్రభావం ఇండస్ట్రీ మీద చాలా ఉంటుంది. ఈ పతనం మెల్లగా సిమెంట్, టాయ్స్, హార్డ్వేర్ విభాగాలమీద కూడా పడింది. అంతే మార్కెట్లో విశాల్ ఇండస్ట్రీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిపోయింది. భరద్వాజ్ కి ఏంచేయాలో అర్ధంకాలేదు. అప్పటికి కానీ తానెక్కడున్నాడో తెలియలేదు. బోర్డు అఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో డైరెక్టర్స్ అందరూ తలా ఒక రకంగా మాట్లాడారు. భరద్వాజ్ నిరంకుశ ధోరణి వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. భరద్వాజ్ కి తల తిరిగిపోతోంది. ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో తల్లి విమలాదేవి ధైర్యంచేసి వ్యాపార ప్రస్తావన తీసుకొచ్చింది.
“భరద్వాజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఏ వ్యాపారాల్లో నష్టం వస్తోందో వాటిని అమ్మేసెయ్. దానివల్ల మిగతావి నిలబడతాయి” అని సలహా ఇచ్చింది.
ఏం చెయ్యడానికి అర్ధం కాని భరద్వాజ్ కి ఎవరిమాట వినాలో, ఎవరిమాట వినకూడదో తెలియటంలేదు. రోజురోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. హోటల్ ఇండస్ట్రీ లో పనివాళ్ళు, జీతాలు పెంచాలని సమ్మె చేస్తామంటున్నారు. అసలే నష్టాలు వస్తున్నప్పుడు జీతాలు పెంచడం అసంభవం. ఇదే అదనుగా విశాల్ ఇండస్ట్రీస్ పోటీదారులు విశాల్ ఇండస్ట్రీస్ కి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలవల్ల, మరింత ఇబ్బంది కలుగుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే ఎలా మొదలు పెట్టాలో అర్ధం కాలేదు.
ఆఖరికి భార్య వినీల “ఎవరైనా అనుభవం వున్న ఉద్యోగుల సలహా తీసుకోమని” చెప్పింది. కానీ అలా సలహా తీసుకోవడానికి, భరద్వాజ్ అహం అడ్డొచ్చింది. ఫలితం హోటల్ ఇండస్ట్రీ మూతపడే ప్రమాదం వచ్చింది. పుండు మీద కారం చల్లినట్లు, మిగతా వ్యాపారాలలో కూడా నష్టాలు వస్తున్నాయి. బ్యాంకులనుండి తీసుకున్న అప్పులు సరిగ్గా చెల్లించలేకపోయేసరికి బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. దాంతో వాటాల విలువ బాగా పడిపోయింది. విశాల్ ఇండస్ట్రీస్ నుండి సరైన జవాబు రాకపోవడంతో, బ్యాంకులు ఆస్తులు జప్తు నోటీసులు ఇచ్చాయి. ఆవేశంలో బ్యాంకులనుండే కాకుండా ప్రైవేట్ వ్యక్తులనుండి కూడా అప్పులు తీసుకొన్నాడు భరద్వాజ్. వాళ్లందరికీ ఇదే మంచి సమయం దొరికింది. భరద్వాజ్ పైన వత్తిడి తేవడం ప్రారంభించారు. ఆరోజూ రాత్రి భరద్వాజ్ తెగ బాధ పడ్డాడు. తను చేసిన తప్పులు మెల్ల మెల్లగా తెలియడం ప్రారంభించాయి. ఆ పక్క రోజు, తమ అకౌంట్స్ చూసే గణేష్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ని పిలిపించాడు.
“మీరు షుమారు ఇరవై సంవత్సరాలనుండి మాకు సలహాదారులుగా వున్నారు. ఇప్పటి పరిస్థితినుండి బయటపడే మార్గం చెప్పండి.” అడిగాడు భరద్వాజ్.
“మీకు చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు మళ్ళీ చెపుతున్నాం. ఏ వ్యాపారమైనా దెబ్బతినడానికి ముఖ్యమైన కారణాలు పెట్టుబడి వేరే వ్యాపారాలకు మళ్లించడం, అతిగా ఖర్చులు పెట్టడం. వ్యాపారాలలో గ్యాంబ్లింగ్. వీటివల్ల ఎంత పెద్దవాడైనా ఇలాగే అవుతాడు. మీ నాన్న గారి మీద వుండే గౌరవం కొద్దీ చెపుతున్నాం. ఇప్పటికైనా మా మాట విని నష్టాలలోవున్న వ్యాపారాలను వదిలించుకోండి.” సలహా ఇచ్చారు గణేష్ అకౌంటెంట్స్.
ఇవన్నీ తనకు తెలిసినా, మొదలుపెట్టిన వ్యాపారాలు అమ్మేయటం పరువు సమస్యగా భావించాడు భరద్వాజ్. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. బాగా తాగేశాడు. ఉదయాన్నే లేచి, చాలా త్వరగా ఆఫీసుకి వెళ్ళాడు. రాత్రి తొమ్మిదయిన తరువాత ఇంటికి వెళ్తానని సిబ్బందికి చెప్పి, పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు భరద్వాజ్. జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే గుర్తుకువచ్చాయి భరద్వాజ్ ఆత్మకి. అప్పటికిగానీ తాను చేసింది తప్పని తెలియలేదు. తను ఆత్మహత్య చేసుకున్నందువల్ల సమస్య పరిష్కారం అవుతుందా. ఈ వ్యాపార గొడవలన్నీ ఎవరు చూసుకుంటారు. తల్లికి పెద్దవయసు, భార్యకు కొంచెం తెలిసినా ఇవి పరిష్కారం చేయడం కష్టం. పిల్లలకు అసలు తెలియదు. తనెంత తప్పు చేసాడు. ఆత్మహత్య చేసుకోకుండా ఉండవలసింది. ఇప్పుడు తిరిగి తను బ్రతకగలడా. అసంభవం. తిరిగి బ్రతకడం అసంభవమైనప్పుడు తనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి. తీవ్రంగా ఆలోచిసున్నది భరద్వాజ్ ఆత్మ. తనకు ఎవరైనా సర్దిచేప్పి ఇలా ఆత్మహత్య చేసుకోకుండా చేసినట్లయితే ఎంతబాగుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఆత్మహత్య చాలా పాపం. తనిప్పుడు దేవుడి దృష్టిలోనూ, మిగతా అందరి దృష్టిలోనూ దోషిగా మిగిలిపోయాడు.
ఒక్కసారి తల్లిని, భార్యను చూద్దామని ఇంటికి వచ్చింది ఆత్మ. తల్లి స్పృహ తప్పి మంచం మీద వుంది. భార్య ఏడుస్తోంది. పిల్లలకేమీ అర్ధం కాక మెల్లగా ఏడుస్తున్నారు. ఆ దృశ్యం చూడలేకపోయింది భరద్వాజ్ ఆత్మ. తను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఎంతమందిని బాధపెడుతోంది. ఊహించలేకపోయింది భరద్వాజ్ ఆత్మ. గణేష్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొచ్చాయి.
“నష్టాలు వస్తున్న వ్యాపారాలను అమ్మేసి, మిగతా వాటి మీద ద్రుష్టి పెడితే కనీసం రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ విశాల్ ఇండస్ట్రీస్ పరిస్థితి మెరుగవుతుంది. మీకు ఇప్పుడు వున్న ఆస్తులు, అప్పులకన్నా ఎక్కువగా వున్నాయి. కాబట్టి భయంలేదు. కాకపొతే ఆస్తులు అమ్మేటప్పుడు కొంత నష్టం రావచ్చు. దానికి మనం తయారుగా ఉండాలి.” అయ్యో తనెంత తప్పుచేసాడు. తన అహం అడ్డు రావటంవల్ల వాళ్ళ మాటలు వినలేదు. విపరీతంగా బాధపడుతోంది ఆత్మ. చాలా సేపు చూసి చూసి ఏమీచేయలేక అందనంత దూర తీరాలకు వెళ్ళిపోయింది భరద్వాజ్ ఆత్మ.

ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు క్షణికావేశంవల్ల పెద్ద తప్పు చేస్తారు. ఆ క్షణం లో వాళ్లకు నచ్చచెప్పే వాళ్ళుంటే బాగుంటుందని వాళ్ళ ఆత్మలకు అనిపిస్తుంది. కాని వాళ్ళు ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి వాళ్లకు ఇతరులు సలహా ఇచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఎవరికీ వారే జాగ్రత్త పడాలి.

***@***

హామీ పత్రం
ఈ కధ దేనికీ అనువాదం కాని, కాపీ కాని, అనుసరణ కానీ కాదు. ఇది నా స్వంత కధ అని ద్రువపరచుచున్నాను. ఈ కధ అముద్రితము. ఏ బ్లాగుల్లోనూ, వెబ్ మ్యాగజైన్స్ లోనూ ప్రచురణ కాలేదు. ఏ పత్రిక పరిశీలనలో కూడా లేదు.

యనమండ్ర భానుమూర్తి
(YANAMANDRA BHANUMURTHY),
F-505, VIJAYASIKHARA ENCLAVE,
RAMAMURTHY COLONY,
MEHDIPATNAM,
HYDERABAD-500028.
MOBILE: 7032906117

Leave a Reply

Your email address will not be published. Required fields are marked