ధారావాహికలు

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

స్త్రీ గురించి రాసే మరో కవయిత్రి జయప్రభ. ‘ స్వేచ్చకోసం కవిత్వం వ్రాస్తున్నాను, స్వేచ్చకోసం కవిత్వం రాస్తాను’ అని ఈవిడ ప్రకటించుకున్నారు. ఈవిడ తన కవిత్వం ఫెమినిస్టు ధోరణికి చెందినదని చెప్పుకుంటారు. సమాజంలో తనకు జరిగిన అన్యాయాల వల్ల ఒక స్త్రీ సానిగా మరవలసి వచ్చింది. అటువంటి స్త్రీని ‘ సానిపాప’ అనే ఖండికలో సమాజంపై తిరగబడమని చెప్తున్న సందర్భంలో –
“రగులుతున్న ఆవేశాన్ని ఆరానీకు,
చైతన్య తూరుపులా ప్రజ్వరిల్లు !
అప్పుడు
బిగిసిన నీ పిడికిలి మాటున
సూర్యుడు కూడా ఉదయిస్తాడు “32 అంటూ స్త్రీ జాతికి సూర్యోదయం కావాలని ఈవిడ కోరుకుంటున్నారు. సమాజంలో జరిగే అనేక సంఘటనలు ఈవిడకు వస్తువులుగా మారాయి. స్త్రీలపై మగవాళ్ళు చూసే చూపులను వర్ణిస్తూ, వాటిని ఎదుర్కొంటే జయం స్త్రీలదే అని ఆవిడ తెలిపారు. అందుకని –
” అప్పుడనుకుంటాను
కళ్ళకే కాదు
ఈ దేశంలోని ఆడదానికి
వాళ్ళంతా ముళ్ళుండే రోజు
ఎప్పుడొస్తుందా అని 33″ ప్రతి స్త్రీకి వళ్ళంతా ముళ్ళుండే రోజుకోసం ఆవిడ ఎదురుచూస్తున్నారు.
ఈ కాలంలోనే స్త్రీ సమాజం పట్ల తన బాధను రచనల్లోప్రతిఫలింపచేసిన కవయిత్రి ఈశ్వరి. తన బతుకుబాధల్లోంచి పుట్టిన వేదనా గుళికలే ఆవిడ కవిత్వం. సహజంగానే జీవితంలో పురుషుల చేత భాదింపబడిన, ఆ బాధను అనుభవించడం వల్ల ఈవిడ రచనలు మరింత సహజంగా కన్పిస్తాయి.
‘ మంచి రోజులు’ అనే ఖండికలో స్త్రీ జాతికి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. స్త్రీ జాతి పట్ల సానుభూతితో, స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయాలపై ఆవేదనతో రాసిన కవిత ఇది.
“అమ్మకు – నీ జాతినే
కంటోందని నాన్ననుండి
విదిలింపులే ఉండవురా చిన్నా”34
స్త్రీ పురుషుల మధ్య ఎంత విభేదం ఉందో, వాళ్ళ దగ్గర నుంచి చిన్నప్పటినుంచీ విదిలింపులు ఉండవని పుట్టని ఆడశిశువుల గురించి ఈశ్వరి గారు ఆవేదనతో ఆర్తితో వరసిన కవిత ఇది.
” ఎన్ని చావులైనా ఊతచేసుకొని
రథచక్రాన్నడ్డు పెట్టుకున్న అభిమన్యుడిలా
ప్రాణదీపం ఆరిపోకుండా పళ్ళబిగువున యుద్ధం చేయాలని”35
స్త్రీ ఒక శత్రువుగా, సమాజంలో ఉండకూడని వ్యక్తిగా చూస్తున్న ఈ సమాజంలో తప్పకుండా ఆడపిల్లగానే పుట్టి, పద్మవ్యూహం లాంటి ఈ సమాజాన్ని ఎదిరించాలని ఉందని కొండేపూడి నిర్మలగారు ‘యుద్ధశిశువు’ అనే ఖండికలో తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.
స్త్రీవాద కవిత్వమంతా సమాజంలో స్త్రీకి సహజంగా జరుగుతున్న అన్యాయాలను ఎదోర్కోవాలనీ, పురుషాధిక్యాన్ని తగ్గించాలని, సమాజానికి స్త్రీ పురుషులు ఇద్దరూ సమ ఉజ్జీలుగా ఉండాలని, స్త్రీకి ఎదిరించే హక్కు, ధైర్యం రావాలని కావాలని ఆశిస్తోంది. కానీ ఈ కవిత్వమంతా సమాజంలో ఉన్న వాస్తవిక చైతన్యాన్నీ ఇంద్రియ ప్రవృత్తి ద్వారానే పోషించబడుతోంది. మున్ముందు వీరు తమ తమ అనుభూతులను ఇతర ప్రవృత్తుల ద్వారా వెలువరించగలరనే nenu ఆశిస్తున్నాను.
ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి “శిలామురళి” కథాశ్రయ అనుభూతి కవితకు మంచి ఉదాహరణ. గేయచందస్సులో సాగిన కావ్యం ఇది. శిలామురళిలోని కథ ముఖ్యంగా బౌద్ధమతానికి, బౌద్ధనాగరికతకు సంబంధించింది.
సునంద, ప్రధ్యుమ్నుల ప్రేమకథని విషాధంగా పరిణమింపచేశారు.
“కాలమే ఒక నదిగా భావించి చూస్తే
కదలిపోయే ఆలలు యీ బ్రతుకులన్నీ,
ఎవరు ఉన్నా లేకపోయినా గాని
ఈ నదిని ఆనుకునీ ఆశ ఉంటుంది” 36
అంటూ జీవిత సత్యాన్ని తెలిపారు ఇంద్రగంటివారు.
” ఋతువు వెంబడి ఋతువు గడిచింది గాని
ఈ అడవి గుండెలో దిగులు పోలేదు
కొమ్మ కొమ్మకు ఆకురాలిందిగాని
గుండెనంటిన బాధరాలింది.
గుండెలోనేనెదిగి కొండనవుతాను
గొంతులో పాటతో వాగునవుతాను
నా మాట బాటలో నడచిపోతాను
నన్ను కదపిన ‘వారి’ కథను చెపుతాను…” 37
ప్రకృతి పరంగా కవి పలికిన పలుకులే అయినా, గతంలో జరిగిన విషాద ప్రేమగాథాను అడవితోటి చెప్పటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked