అమరనాథ్. జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257
ఆవేశ మనేది ఒక అగ్ని లాంటింది ఇది ఆవేశపడే వారినే కాదు ఒక్కొక్కసారి తోటివారిని కూడా దహించి వేస్తోంది వేగంగా మారుతున్నఈనాటి సామాజిక పరిస్థితులలో ప్రతి రోజు ఈ ఆవేశాలకు బలిపీఠం ఎక్కుతున్నవారికి సంబంధించిన వార్తలు రాని పత్రికలు, మీడియాలు, సామాజిక మాధ్యమాలు లేవంటే అతిశయోక్తి లేదు! అనేక కుటుంబాలు, యువకులు, విద్యార్థులు, వ్యాపార వ్యవహారాలలో వున్నవారు ఒకరేమిటి అన్ని రంగాలలో వారిని ఈ భావోద్రేకాలు ఆవరించి దాని ఫలితంగా అసహనాలు పెరుగుతూ అవే ఆవేశాలకు ఆజ్యంగా మారి అనేకానేక జీవితాలు నేల కూలుస్తున్నాయి. అనర్ధాలకు మూలం ఆవేశం అని తెలిసినా కూడా ఆవేశానికి మూలాలు కనుగొని దానిని నియంత్రించడంలో మనము ఇంకా వెనుక పడే వున్నాము. ఆవేశమనేది ప్రమాదకారిగా మన జీవితానికి ప్రతిబంధకంగా ఉంటుందో తెలిసి కూడా నియంత్రణ అనేది ఒక్కొక్కసారి మన చేయిజారి పోవటం విచారకరం. ఈ ఆవేశమనేది సామాజిక, సాంఘిక, ఆర్ధిక మరియు మానసిక అంశాల ప్రభావంతో మానవ జీవితాలపై ప్రఘాఢమైన ప్రభావాలు చూపటంతో పాటు, ఈ ఆవేశమనేది అదుపు చేసుకోలేని స్థాయిలో ఎదిగి తమతో పాటు కొన్ని సందర్భాలలో ఇతర జీవితాలను సైతం భారీ మూల్యాలు చెల్లించుకునే పరిస్థితులను ఉత్పన్నం చేస్తోంది.
ఈనాటి ఈ సామాజిక వాతావరణంలో సహజంగా ఎదురయ్యే చిన్న చిన్న అపజయాలను సైతం తట్టుకోలేని విధంగా మానసిక స్థితులు ఉద్రిక్తలు చెందుతున్నాయి. అనవసర పోటీతత్వాలు, తృప్తి లేని తృప్తి చెందని జీవితాలకు అలవాటు పడుతూ ఏ చిన్న అవాంతరమైనా తట్టుకోలేని సున్నితత్వాన్ని మానవ మనస్సులు మార్పులు చెందుతున్నాయి. ఈనాటి ఈ ఆవేశ పరిస్థితులకు కారణాలుగా భావోద్రేకాలు సంబంధించిన, నైతిక విలువలకు సంబంధించిన అవగాహన పాఠశాల స్థాయిల నుండే విద్యార్థులలో లేకపోవటం ఒకటైతే, అసహజం, అసూయలను ప్రోది చేసి కొత్తదనం పేరుతొ సాగే వికృత వినోదాలు పోటా పోటీలుగా చూపే బుల్లి తెరల, పెద్ద తెరల కార్యక్రమాల ఫై నియంత్రణ లేకపోవటం, అన్ని రంగాలలో అనవసర పోటీతత్వాలు, రాజకీయాల్లో కలుషిత వాతావరణాలు, సమతూల్యం లోపించిన చదువులు ఇవే కాక సోషల్ మీడియాల్లో విచ్చలవిడిగా విచక్షణారహితంగా పంపకం కాబడుతున్న విషయాలు ఈ ఆవేశకావేశాలకు అగ్నికి వాయువులా ఊపిరులూదుతున్నాయి వీటి వలన మానసిక సమతూల్యతలు దెబ్బతింటూ ఆవేశాలు నియంత్రలు తప్పుతున్నాయి.
తానూ జీవితంలో పొందవలసినవి పొందలేనేమోననే, తానూ ఎదగవలసిన స్థాయికి ఎదగలేనేమోననే మరియు తనకు దక్కనివి తన అని అనుకునే వారికి దక్కుతాయేమోననే అసూయా భావనలు, ఈర్ష్యా ద్వేషాలుగా అంతర్లీనంగా రూపాంతరం చెంది ఆవేశ రూపంలో మనిషి పై కరాళ నృత్యం చేస్తున్నాయి! విలువైన జీవితంలోని ఆటుపోట్లను అర్ధం చేసుకుంటూ జీవితాన్ని సమర్ధవంతంగా, ధైర్యంగా కొనసాగించాలి కానీ పనికిరాని ఆవేశంతో జీవితాన్ని నాశనం చేసుకోవటం తెలివి తక్కువ పనే. చిన్న విషయాలకే భావోద్రేకాలకు లోనై ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వాళ్ళ జీవితాలు కేవలం వారితోనే ముగిసిపోదు కన్న వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు కూడా సభ్య సమాజంలో దోషులుగా నిలబడవలసి వస్తుందనేది వాస్తవం. సామాజిక పరిస్థితులు, నివసించే ప్రదేశాలకు అనుగుణంగా మన స్థాయికి తగ్గ విచక్షణ తో ప్రవరించటమనేది ఎల్లప్పుడూ శ్రేయస్కరం మనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఆవేశంతో తీసుకునే ఏ నిర్ణయమైనా అనర్ధాలకు దారి తీస్తుంది! పరీక్షల్లో అనుకున్న రాంక్ రాలేదు, అనుకున్న ఉద్యోగపు ఇంటర్వ్యూలో ఎన్నిక కాలేదు, చేస్తున్న వ్యాపారం లాభసాటిగా లేదు, ఉద్యోగంలో అనుకున్న స్థాయిల్లో ప్రమోషన్స్ రావటం లేదు, ఆటల్లో నా కంటే ముందుగా ఎపుడూ నా ప్రత్యర్ధే ఉంటాడు, నా పిల్లల కంటే ఎదురింటి పిల్లలే బాగా చదువుతారు, నాతొ చదివినవారు నా కంటే వున్నత స్థానాల్లో వున్నారు, నేనింకా స్కూటర్ దశలోనే వున్నా కానీ నా జూనియర్ కారు లెవెల్ కు ఎదిగాడు ఇలా ఒకటి కాదు మానవ జీవితంలో అసహనానికి గురిచేసి మనలో ఆవేశ తత్వాలను పెంచటానికి కొన్ని వేల కారణాలుండవచ్చు.అధిక భాగం వీటిలో మనం చేయగలిగినవే మరి దానికి మనపై మన పరిశీలన, సహనం, సాధనా ఉన్నాయా ఆలోచించండి!
ఆవేశ నియంత్రణకు అవకాశాలు:
- మాటకు మాట ఎప్పటికి సరైన సమాధానం కాదు. ఎదైనా ఒక విషయం విన్నప్పుడు మన విచక్షణ భావోద్రేకాలు దారి తీయని విధంగా ఉండాలి!
- ఎదైనా సంఘటన పట్ల మనం స్పందించే తీరులో మన చర్య ఇతరులలో అవగాహన పెంచే విధంగా ఉండాలి తప్ప ఆవేశం అహింసల కు దగ్గరగా ఉండకూడదు.
- ఆవేశానికి గురి అయ్యే ప్రతి సందర్భంలో మన భావోద్రేకాలను మౌనంగా నియంత్రించుకోవడం చాలా శ్రేయస్కరం!
- భావావేశాన్ని అదుపు చేసే సందర్భంలో మన ఆలోచలనలను వేరే వైపు దారి మళ్ళించుకొనే అవకాశాలను పరిశీలించాలి.
- ఆవేశాలకు గురి అయ్యే ప్రతి సందర్భంలో జరగబోయే పరిణామాలలో మన గురించి మన కుటుంబ సభ్యుల గురించి ఒక్కసారి ఆలోచించటం చాలా అవసరం.
- ఆవేశంలో జరిగే ఏ అనర్ధాలలో నైనా సమాజంలో మనం తలవంచు కొనే మరియు ఎదుర్కొన బోయే నగుబాటును బలంగా గుర్తుంచుకోవాలి.
ఆవేశాలకు అడ్డుకట్ట వేయటానికి ఏం చేద్దాం! .
- విజయానికి కారణాలెన్నో అపజయానికి కారణాలన్ని ఉంటాయి ఆత్మపరిశీలన ద్వారా తప్పొప్పులను సమీక్షించుకుంటే విజయం మన వెనకే నిలబడుతుంది ఇటువంటి సమయాలలో ఆవేశాలు కాదు ఆలోచనే ముఖ్యం!
- ఎట్టి పరిస్థితులలో కూడా ఊహల్లో మేడలు కట్టవద్దు, ఊహలకు వాస్తవాలకు చాలా తేడా ఉండవచ్చు దేశ పటంలో చూపినట్లుగా దేశ సరిహద్దులుండవనేది గుర్తుంచుకోవాలి.
- చేయగలనా? లేదా? అనే ఊగిసలాటతో పనిని ప్రారంభం చేయవద్దు ఇటువంటి అనుమానాలతో చేసే పనిలో సహజంగానే తప్పులు దొర్లే అవకాశముంటుంది ఇక్కడ అసహనం దానికి తోడుగా ఆవేశం జత చేయటం కాదు చేసే పని పట్ల మన అవగాహనే మనల్ని ముందుకు నడిపిస్తుందనేది బలంగా నమ్మండి!
- ఏదైనా విషయంలో సమస్యలు ఎదురైనప్పుడు కంగారుతో కుంగకుండా పనికి సంబంధించి అవగాహన ఉన్న అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా అవసరమైన విషయం. దీనివలన కొలిక్కిరాని అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.
- మన అని అనుకునే వారితో మనం చేస్తున్న పనికి సంబంధించిన భావాలు పంచటం ద్వారా ఒక్కోసారి క్లిష్టమైన సమస్యలకు కూడా పరిష్కారాలు దొరుకుతాయి.
- సాంకేతిక పరిజ్ఞానాన్ని(సెల్ ఫోన్స్ ,ఇంటెర్నేట్స్) అవసరమైన మేరకే వాడాలి. మితిమీరిన వాడకం మెదడు లోని న్యూరోట్రాన్సమీటర్స్ సమతూల్యతలు దెబ్బతీసి మానసిక దౌర్బల్యానికి తీయిస్తుంది. ఎందుకంటె మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాల సమతూల్యతలకు మెదడు పాత్ర కీలకమైనది.
- మనతో ఉన్నవారి విజయాలను చూసి మనం అలా సాంధించగలమా! అనే కంగారు ,భయాలకు లోను కావద్దు ఆ విజయాల వెనక వున్న కృషిని ఆదర్శంగా తీసుకొని తిరిగి మన ఆలోచనలకు పదును పెట్టి ప్రయత్నాలు కొనసాగించాలి
- ఎప్పుడైనా అపజయం ఎదురైనప్పుడు ఆమ్మో ఇంకేముంది అంతా అయిపోయిందనే కుంగుబాటు అవసరం లేదు మనం తిరిగి సాధించే విజయానికి మరో తలుపు తెరిచే ఉంటుందని తెలిసికోండి.
- సమాజంలో పేరు గాంచిన వ్యక్తులు, సంఘటనలు అధ్యయనం చేయటం ద్వారా లేదా ఇతరుల ద్వారా వినటం ద్వారా వారి జీవితాలలో విజయాలకు పునాదులు ఓర్పు, సహనమనేది మరవద్దు.
- ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో తమకు తాముగా రోజువారీ చేసే పనుల పట్ల పరిశీలన ఎంతైనా అవసరం. ఎటువంటి ఒత్తిడి లేకుండా తమకు తాము నిజాయితీగా పరీశీలుంచుకుంటే ఎప్పుడు, ఎక్కడ,ఎలా స్పందించాలనే అవగాహన పెరుగుతుంది. ఇది ఆవేశాన్ని అదుపులో ఉంచటానికి సహాయ పడుతుంది.
ఆవేశమనేది అదుపు తప్పిన ఒక మానసిక ఉద్వేగం! చేయబోయే పని పట్ల అవగాహన దాని వలన వచ్చే మంచి చెడుల విచక్షణే కొంతలో కొంత మానసిక ఆవేశాలకు అడ్డుకట్ట వేస్తుంది! దీనికి బాల్యం నుండే కుటుంబాల నుండి అవగాహన ప్రారంభం కావాలి. ఏం జరిగిన ఫరవాలేదు నేను చేసేది ఎటువంటి పర్యవసానాలకు దారి తీసిన సరే అని ఆలోచించే మనుషుల మనస్సులు వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న మానవ జన్మకు మన మిచ్చే నిర్వచనం ఇదేనా అని? అందుకే ఆవేశాన్ని మన విచక్షణతో కూడిన ఆలోచనతో అడ్డుకట్ట వేద్దాం! ఆనంద జీవితాన్ని స్వాగతిద్దాం!
*****