డి.నాగజ్యోతిశేఖర్
మురమళ్ళ,
తూర్పుగోదావరి జిల్లా.
9492164193
కాలం గుప్పిట్లో బందీనై
నిన్ను నేను ఎడబాసినప్పటికీ…
నా ఒంటరి నిశీధి అంచుల్లో
చెకుముకి రాళ్ళై నీ జ్ఞాపకాలు
నాలో రాపాడుతూనేఉన్నాయి!
వేదనకొమ్మల్లో పూలపిట్టలై
నీ ఆలోచనలు
నాతో సంఘర్షిస్తూనేఉన్నాయి!
గతం శిథిలాల్లో స్మృతుల తీగలై నీ చేరువలు
నన్ను అల్లుకోవాలని తపనపడుతూనే ఉన్నాయి!
కన్నీటి కొసల్లో కొసమెరుపులై నీ సాంగత్యాలు
నన్ను ఓదారుస్తూనేఉన్నాయి!
గుండె పటం ఫ్రేములో
వెచ్చని ముద్రలై నీ ఔన్నత్యాలు
నన్ను తడుముతూనే ఉన్నాయి!
నాకు తెలుసు…
నేనేం కోల్పోయానో…
ఇంక…
నీ ఎడబాటు చీకటిని
తరగడం నా తరం కావడం లేదు!
నీ జంటబాసిన సమయాలను దాటాలంటే
నా శ్వాసకు అడుగుసాగడం లేదు!
నీవు లేని ఈ ‘ఏకాంతాన్ని’ ఏలాలంటే
దహనమౌతున్న నా హృదయతనువుకు సాధ్యం కావడం లేదు!
పొరలుపొరలుగా పొగిలివస్తున్న దుఃఖ సంద్రాన్ని వెలేయడానికి
గుండె గొంతుకకు శక్తి చాలడం లేదు!
ఓ కవితా!
నీలో ఐక్యమయ్యి అక్షరమవ్వితే తప్ప ఈ అశ్రుకణికల్ని ఆర్పలేను!
నీ పరిష్వంగంలో తేజోవాక్యాన్ని అయితే తప్ప
ఈ గాయవనాన్ని తిరిగి పుష్పింపచేయలేను!
అందుకే ఈ క్షణమే నేను పద్యమై జనించి ‘సమాజ సమూహంలోనికి’ చొచ్చుకుపోతాను!
‘వెలిగిన తిమిరాన్నై’
ఏకాకితనాన్ని బద్దలుకొట్టి ఏకతా గీతిని రచిస్తాను!