– తాటిపాముల మృత్యుంజయుడు
కవిత్వమంటే
కర్రుమొనలోంచి మట్టి పలికినట్టుండాలి
చెమట ఆవిరిలోంచి మబ్బుపట్టినట్టే ఉండాలి
కరీం నగర్ జిల్లా హనుమాజీపేట వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) తన కవిత్వంలో కూడ మట్టి వాసనను ఆఘ్రాణించాడు. పాఠశాల విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో జరిగిన సినారె కు చిన్నప్పుడు ఊళ్ళో జరిగే హరికథలు, ఒగ్గుకథలు విని, ప్రదర్శనలు చూసి తెలుగుభాష మధురిమలకు ఆకర్షితుడైనాడు.
రాస్తూ రాస్తూ పోతాను
సిరా ఇంకే వరకు
పోతూపోతూ రాస్తాను
వసుపు వాడే వరకు
అంటూ కవిత్వమే తన ఊపిరిగా చేసుకొని చివరి క్షణం వరకు బతికాడు.
గురువులు, ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని వంటి దిగ్గజాల మెప్పు పొంది, పాఠాలు, పరిశోధనలచే అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి, గేయాలు, గజళ్ళు, గ్రంథాలు రాసి పాఠకుల అభిమానాన్ని చూరగొని, పాటలతో ప్రేక్షకలోక అభిమానాన్ని సంపాదించి, రాష్ట్ర, జాతీయ పురస్కారాలతో తెలుగుమాతను అలంకరించిన నిత్యకృషీవలుడతడు.
వారి 1962నాటి పి.హెచ్ డి సిద్ధాంతగ్రంథం ‘ఆధునికంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు ‘ ఈనాటికి పరిశోధనలు చేసే విద్యార్థులకు హస్తభూషణమే అంటే అతను కవిత్వాన్ని వేదాల కాలము నుండి ఆధునిక కవిత్వం వరకు ఎంత లోతుగా శోధించాడో ఇట్టే అర్థం చేసుకోగలము.
ప్రకృతిలో ఒక అంతర్భాగమైన మనిషి ఉనికిని ఆవిర్భావం నుంచి అభివృద్ధి దశ వరకు దీర్ఘ కవితలో సరళమైన పదాలతో మనసుకు హత్తుకొనేలా చేసిన రచన ‘విశ్వంభర ‘. జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చిపెట్టింది. అందులో ఒకచోట ఇలా చెప్పాడు.
ఎందాక ఈ నడక?
ఈ అడుగు సాగినందాక.
ఎన్నాళ్ళు సాగుతుందీ అడుగు?
ఎదురుగా లోయ నిలిచేదాక.
జూన్ 12న నడక తన ముగించిన పద్మభూషణ్ సి. నారాయణరెడ్డికి సిలికానాంధ్ర ఘనంగా నివాళులు అర్పిస్తున్నది.