-తమిరిశ జానకి
నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువతో వేకువ పరిమళభరితం
సుతిమెత్తని పూలవానలా స్నేహితాల పలకరింపులు చరవాణిలో
క్రమం తప్పని కాలగతి కళకళలాడే పచ్చని ప్రకృతిలా పరవశాన పాడేపాటలా
వచ్చి నిలిచింది నా ముందు మరొకవత్సరానికి తెర తీస్తూ !
వెనుకకి తల తిప్పితే ఏదో తెలియని వింత గుబులు
గతాన గేలి చేసిన ఒడిదుడుకులు
తలదించుకోక తప్పని తప్పులతడకలు
అన్నీతరుముకొస్తున్న భ్రాంతి !
ఎదరకి చూపు సారిస్తే ఎరుకలేని ప్రశ్నావళి
అంతుచిక్కని చిక్కుముడులై చుట్టూ బిగిసిపోతున్నసమస్యలవలయాలు
సవాలుగా తీసుకోక తప్పదు సవాలక్ష ప్రశ్నలైనా
సమస్యని విడగొడితే కద సానుకూల పరిస్థితి నెలకొనేది !
ఆగదుగా కాలం ఎవరికోసమూ అంతూదరీ అంతుపట్టక సాగిపోతూనే ఉంటుంది
తెలుసుకోలేకపోయాను కాలం విలువ ! కష్టాలకి కుంగి కాలాన్నితిట్టడం
సుఖాలకి కళ్ళు నెత్తికెక్కి కాలాన్ని మరవడం అదేకదా అలవాటు
చేసిన తప్పులు సరిదిద్దుకోడానికే చాలట్లేదు జీవితం
ఇక మంచిపనులకు పునాదులు తవ్వేదెప్పుడు
మొక్కవోని ఆకృతిని నిలిపేదెన్నడు!
మంచితనం నిజాయితీలతో ధర్మంగా నడుచుకు పోవడమే
కాలానికి మనమివ్వగల గొప్ప విలువ అని తెలుసుకోగలిగాను !
దేనితోనూ కొలవలేము కాలాన్ని ఒక్క దానితో తప్ప
మంచిపనుల సమాహారంతో తప్ప !
కాలం కంఠసీమలో వేయగలగాలి మంచిపనుల మాలికని
అప్పుడే కాలానికి మనిషి విలువ ఇచ్చినట్టు కాలం మనిషిని మెచ్చినట్టు
సాగిపోయే కాలం తీసుకుపోగలదప్పుడు ముందుతరాలకు ఆ మనిషి పేరు !