చంద్రశేఖర్ చరిత్ర

కేంబ్రిడ్జి

భారత దేశం వదలి పెట్టి ఇంగ్లండు వెళ్ళడానికి పడవ ప్రయాణం చేసే వేళకి చంద్రశేఖర్ అఘమేఘాలలో ఉన్నాడు! పడవ ముందుకి కదులుతోంది, బొంబాయి నగరం వెనక్కి వెళుతోంది. ఆ సమయంలో చంద్రశేఖర్ మనస్సు డోలాయమానంగా ముందుకి, వెనక్కి ఉగిసలాడుతూ ఉండి ఉంటుంది. గత పందొమ్మిది సంవత్సరాలు బంగారు రోజులు! ఏ విధంగా చూసినా అవి మరుపురాని రోజులు. పందొమ్మిదేళ్ళ వయస్సుకే విశ్వవిద్యాలయంలో ఆనర్స్ డిగ్రీ వచ్చేసింది! అప్పటికే ఐదు పరిశోధనా పత్రాలు ప్రచురించేడు – ప్రతిష్టాత్మకమైన పత్రికలలో! విశ్వవిఖ్యాతి చెందిన ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలతో – హైజెన్బర్గ్, సోమర్ఫెల్డ్ లతో – పరిచయం అయింది. భారత దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న రామన్, సహా – ఇద్దరూ – తన మీద ఎన్నోఆశలు పెట్టుకున్నామని సందేశాలు పంపేరు. “ఏ కోణం నుండి చూసినా ఈ యువకుడు దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు.” అని రామన్ కీర్తించేడు. ఇంగ్లండు నుండి తిరిగి రాగానే ప్రెసిడెన్సీ కాలేజీలో ఆచార్య పీఠం ఎదురు చూస్తూ ఉంటుందని అధికారులు హామీ ఇచ్చేరు. భౌతిక శాస్త్ర ప్రపంచం అతనికి పాదాక్రాంతమై ఉంది. ఏ దిశ నుండి చూసినా అతని భవిష్యత్తు అతనికి వడ్డించిన విస్తరిలా కనిపించింది. తన సమ్మోహనాస్త్రాలతో ఇంగ్లండులో ఉన్న హేమాహేమీలని చకితుల్ని చెయ్యగలననే ధీమా అతనిలో ప్రస్ఫుటమవుతోంది. అది అహంకారం కాదు; ఆత్మవిశ్వాసం.

పడవ ప్రయాణం మొదట్లో ఇబ్బంది పెట్టింది. సముద్రం ప్రశాంతంగా లేకపోవడంతో, ప్రయాణికుల అసౌకర్యం సాధ్యమైనంతగా తగ్గించడానికి, పడవ జోరు సగానికి సగం తగ్గించి నడుపుతున్నారు. “గదులో కూర్చోకుండా బయటకి వచ్చి డెక్ మీద కాలం గడిపితే అస్వస్థత ఎక్కువగా ఉండదు. ఏడెన్ దాటిన తరువాత పడవ ప్రయాణం ఆహ్లాదంగానే ఉంటుంది” అని రామన్ సలహా ప్రకారం పడవ తట్టు మీద కుర్చీలో కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకాలు చదువుతూ కాలం గడపడం మొదలు పెట్టేడు, చంద్ర. చేతిలో ఎడింగ్టన్ లేవనెత్తిన సమస్యని పరిష్కరిస్తూ 1926 లో ఫౌలర్ రాసిన On Dense Matter అనే పరిశోధన పత్రం ఉంది. నోబెల్ బహుమానం అందుకున్న కాంప్టన్ రాసిన X-Rays and Relativity అనే పుస్తకంతో పాటు ఎడింగ్టన్ పుస్తకం, సోమర్ఫెల్డ్ పుస్తకం కూడా పక్కనే బల్ల మీద ఉన్నాయి. వీటికి తోడు తాను స్వయంగా ప్రచురించిన పరిశోధన పత్రాలు ఉన్నాయి.

నీలి రంగుతో సముద్రం ప్రశాంతంగా మారింది. చెయ్యడానికి మరే పని లేదు, మరే బాధ్యతా లేదు. ఆలోచించడం తప్ప మరొక పని లేదు. ఫౌలర్ రాసిన పత్రం చదువుతూ ఉంటే అందులో ఆయన తార్కిక వాదం మధ్యస్థంగా ఆగిపోయినట్లు అనిపించింది. దానిని ఎలా మలుపు తిప్పాలా అని ఆలోచన. నక్షత్రాల గర్భంలో పదార్థం సాంద్రత ఎంత ఉండాలో లెక్క కట్టడానికి ఫౌలర్ పద్ధతి ఉండనే ఉంది. ఆ పద్ధతి ప్రకారం శ్వేత కుబ్జతార అయిన మృగవ్యాధుడు బి గర్భంలో సాంద్రత లెక్క కట్టేడు. అది ఘన సెంటీ మీటరు కి మిలియను గ్రాములు ఉంటుందని లెక్క తేలింది! అనగా, నీటి సాంద్రత కంటే 1,000,000 రెట్లు ఎక్కువ. అనగా, నీటి కంటే 1,000,000 రెట్లు బరువు ఎక్కువ!. ఆశ్చర్యం! చాల ఆశ్చర్యం! నమ్మ శక్యం కాని విశేషం!

ఎదురుగా సముద్రం నీలి దుప్పటి పరచినట్లు కనిపిస్తోంది. వెనకటికి, 1921 లో, పినతండ్రి రామన్ కూడా ఇలాగే – మధ్యధరా సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తూ – సముద్రం ఎందుకు ఇంత నీలంగా ఉందని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి ఒక ఊహ తట్టింది. కాంతి కిరణాలు నీటి బణువులని ఢీకొన్నప్పుడు ప్రక్షేపం చెందడం వల్ల సముద్రం నీలంగా ఉంటుందని ఆలోచన వచ్చింది ఆయనకి. కాంతి కిరణాలు! పక్కనే ఉన్న కాంప్టన్ రాసిన X-Rays and Relativity అనే పుస్తకం కనిపించింది. అయిన్^స్టయిన్ ప్రతిపాదించిన Relativity లో కాంతి కిరణాలకి ప్రధాన పాత్ర ఉంది కదా. కాంతి శూన్యంలో సెకండుకి 186,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ విశ్వంలో ఏ రేణువూ కాంతి వేగాన్ని మించి ప్రయాణం చెయ్యలేదు. నక్షత్ర గర్భంలో జోరుగా ప్రయాణం చేసే ఎలక్ట్రానులు కూడా కాంతి వేగాన్ని మించి ప్రయాణం చెయ్యలేవు. పైపెచ్చు, ఎలక్ట్రానులు వంటి రేణువులు జోరుగా ప్రయాణం చేస్తూ ఉంటే వాటి గరిమ (mass) వేగంతో పాటు పెరుగుతుంది. నక్షత్ర గర్భంలో- శ్వేత కుబ్జతార మృగవ్యాధుడు బి లో – ఎలక్ట్రానులు ఎంత జోరుగా ప్రయాణం చేస్తాయో? లెక్క కట్టి చూసేడు. మృగవ్యాధుడు బి లో ఎలక్ట్రానులు కాంతి వేగంలో సగం వేగంతో ప్రయాణం చేస్తాయి అని లెక్క తేలింది!

చంద్ర ఆశ్చర్యానికి అంతు లేదు. అయిన్^స్టయిన్ ప్రతిపాదించిన సాపేక్ష వాదాన్ని ఫౌలర్ లెక్కలోకి తీసుకోలేదు! ఫౌలర్ పప్పులో కాలేసి, నక్షత్ర గర్భంలో సాంద్రత ఘన సెంటీమీటరుకి 100,000 గ్రాములకి మించదని అంచనా వేసుకుని, అటువంటి సాంద్రమైన యానకంలో ఎలక్ట్రానులు జోరుగా తిరగలేవని ఊహించేసుకుని, నూటనిక సూత్రాల మీద ఆధారపడి లెక్కలు కట్టేసి, అయిందనిపించేసేడు. ఫౌలర్ గుళిక వాదం వాడేడు కానీ సాపేక్ష వాదం వాడలేదు.

ఫౌలర్ తనకి కాబోయే గురువు. ఆయన అంత పరాగ్గా పప్పులో కాలేస్తాడా? మృగవ్యాధుడు బి గర్భంలో ఎలక్ట్రానులు కాంతి వేగంలో సగం వేగంతో నిజంగా ప్రయాణం చేస్తాయా? చేయగలవా? తాను తప్పు లెక్క చెయ్యడం లేదు కదా? గుళిక వాదం వాడేడు, సాపేక్షవాదం వాడేడు. ఇంకా ఏదయినా మరచిపోయాడా?

మద్రాసులో హైజెన్బర్గ్ ని కలుసుకున్న రోజు గుర్తుకి వచ్చింది. మూడేళ్ళ క్రితమే, 1927లో, హైజెన్బర్గ్ ఆవిష్కరించిన అనిశ్చితత్త్వ సూత్రం (Uncertainty Principle) మనస్సులో మెదిలింది. ఏమిటా సూత్రం? ఎలక్ట్రానులు వంటి రేణువులు ఎక్కడున్నాయో నిర్దిష్టంగా కొలవగలిగినప్పుడు, అవి ఎంత జోరుగా ప్రయాణం చేస్తున్నాయో నిర్దిష్టంగా కొలవలేము. లేదా, అవి ఎంత జోరుగా ప్రయాణం చేస్తున్నాయో నిర్దిష్టంగా కొలవగలిగినప్పుడు, వాటి స్థానం ఎక్కడ ఉందో నిర్దిష్టంగా కొలవలేము. అనగా, మనం ఎప్పుడైనా ఎలక్ట్రానులని ఏ ప్రదేశంలో చూడాలనుకుంటామో ఆ ప్రదేశంలోనే అవి ఎక్కువ జోరుగా ప్రయాణం చేస్తాయి. నక్షత్ర గర్భంలో అవి ఏమిటి చేస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటే అక్క్డడ వాటి వేగం చాల ఎక్కువ అని అంగీకరించాలి. ఈ అనిశ్చిత సూత్రం గుళిక వాదానికి మూల స్తంబం. ఇది వాడకుండా మిగిలిన గణితాన్ని ఎంత వాడినా గుళిక వాదం పరిపూర్ణం కాదు. ఫౌలర్ గుళిక వాదం వాడేడు కానీ అనిశ్చిత సూత్రం వాడలేదు. చంద్రశేఖర్ సాధించిన ఈ కొత్త ఫలితాన్ని సాపేక్ష శిధిలత్వం (relativistic degeneracy) అంటారు.

పైన ఉదహరించిన లెక్కంతటిని చంద్రశేఖర్ అరగంట లోపులోనే చేసేసేడు – ఆ పడవ తట్టు మీద కూర్చుని! ఈ పనిని పరిశోధన పత్రం స్థాయికి లేవనెత్తాలంటే తాను వాడిన గణితాన్ని బాగా కట్టుదిట్టం చేసి, వాడిన తర్కాన్ని బందోబస్తు చెయ్యాలి. ఆ పని చెయ్యడానికి ఆ పడవలో వనరులు. లేవు. ప్రస్తుతానికి ఎదో ఉరమర లెక్క చెయ్యాలి. శ్వేత కుబ్జతార గర్భంలో ఎలక్ట్రానులు దరిదాపు కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయని అనుకోమన్నాడు. అ పరిస్థితులలో శిధిలావస్థలో ఉన్న అ ఎలక్ట్రానుల వాయువులో పీడనాన్ని, సాంద్రతకి మధ్య సంబంధం సూచించే గణిత సమీకరణాన్ని ఉత్పన్నం చేసేడు. ఎలక్ట్రాను వాయువు అదర్శ గుళిక వాయువులా ప్రవర్తిస్తోందని ఊహించుకున్నాడు. ప్రస్తుతానికి ఆ వాయువులో రేణువుల మధ్య విద్యుత్ సంకర్షణని విస్మరించేడు. ఫౌలర్ అనుకున్నట్లే తాను కూడా శ్వేత కుబ్జతార పూర్తిగా చల్లారిపోయింది అనుకున్నాడు. అయిన్^స్టయిన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష వాదాన్నిలెక్కలోకి తీసుకున్నాడు. ఈ విధంగా గణితాన్ని కాసింత తేలిక పరచి, లెక్క కట్టి చూసేడు. కాగితం మీద కనిపిస్తున్న సమీకరణం చెబుతున్న సంగతి చూసి, ఆశ్చర్యంతో కుర్చీ లోంచి దిగ్గున లేచి నిలబడ్డాడు. శ్వేత కుబ్జతారల గరిమకి ఒక అవధి ఉందా? అప్పుడు చేసిన ఉరమర లెక్క ప్రకారం, శ్వేత కుబ్జతార గరిమ మన సూర్యుడి గరిమని – కొంచెం ఇటు, అటుగా – మించడానికి వీలు లేదు!

శ్వేత కుబ్జతార గరిమ చంద్రశేఖర్ గణన చేసిన ఈ అవధిని మించితే ఏమవుతుంది? శ్వేత కుబ్జతార లో ఉన్న ఇంధనం అంతా ఖర్చయిపోయిన తరువాత దాని గరిమ చంద్రశేఖర్ గణన చేసిన అవధిని మించి ఉంటే దానిలోని గురుత్వాకర్షక బలం విజృంభించి అదే పనిగా కుచించుకుంటూ, అదే పనిగా సాంద్రత పెంచుకుంటూ, …..అదే పనిగా పరిగెడుతున్న ఈ చక్రీయ ప్రక్రియని ఆపగలిగే మరకట్టు బలం లేక ఆ నక్షత్రం కూలిపోతుందా? ఏమవుతుందో ఊహించి, ఆ ఊహకి వాగ్రూపం ఇవ్వగలిగే సాహసం తనకి ఉందా? ఏది ఏమయినా, తాను ఇప్పుడు సాధించిన ఫలితం ఫౌలర్ ఫలితాన్ని తోసిరాజు అనదగ్గ ఫలితం! ఎడింగ్టన్ చెలగాటాలాడిన సమస్యకి ఇది ఒక పరిష్కారం!

ఇటలీ లోని జినోవా నగరంలో పడవ దిగి అక్కడ నుండి ఐరోపా మీదుగా ఆగష్టు 19 నాటికి లండన్ చేరుకున్నాడు. చంద్రశేఖర్ ప్రయాణానికి సంబంధించిన సాధికారమైన ప్రభుత్వపు దస్త్రాలు ఇంకా లండన్ చేరలేదు. కనుక కూడా రేవు లోనే నిలేసి, దేశంలోకి ప్రవేశం ఇవ్వ లేదు. నట్టడిపోయిన చంద్రశేఖర్ ఫౌలర్ కి ఉత్తరం రాసేడు. అయన ఐర్లండులో విహారయాత్రలో ఉన్నాడు. చంద్రశేఖర్ పంపిన వార్త అందుకుని, అక్కడ నుండే కాగితాలు కదిలే ఏర్పాట్లు చేసేడు.

ఎట్టకేలకు సెప్టెంబరు వచ్చే సరికి చంద్రశేఖర్ కేంబ్రిడ్జి చేరుకున్నాడు. ప్రయాణం బడలిక తీరిన తరువాత కుదుట పడి చుట్టూ కలయజూసేడు. కొత్త దేశం, కొత్త అలవాట్లు, కొత్త మనుష్యులు, కొత్త వాతావరణం. ఇండియాలో అతనేమో ఆముదపు మొక్కల మధ్య మహా వృక్షంలా కనిపించేడు అందరికీ. ఇండియాలో ఈ బాల మేధావికి పోటీ అంటూ లేదు. ఎక్కడికెళ్లినా అందలం ఎక్కించి ఉరేగించేరు. ఇక్కడో? కేంబ్రిడ్జిలో ఎటు చూసినా విశిష్టమైన మేధావులే! ఎడింగ్టన్! హార్డీ! ఇంకా ఎందరో మహానుభావులు. ఈ వట వృక్షాల మధ్య అతనొక తులసి మొక్క. ఈ దిగ్గజాల మధ్య అతను కాలు నిలదొక్కుకొని నిలబడగలడా? ఏదో కాకతాళీయంగా అతను ఫౌలర్ కి ఉత్తరం రాయడం, ఆయన కేంబ్రిడ్జి వచ్చి చదువు కొనసాగించమని ఆహ్వానించడం – ఇదంతా ఏదో కర్మ పరిపక్వము వల్ల జరిగినదేమో కానీ…..చంద్రశేఖర్ కి ఏ కోశాన్నయినా ఉద్ధతి, అహంభావం అనేవి ఉండుంటే అవి పటాపంచలై ఆ స్థానంలో వినమ్రత చోటు చేసుకుంది.

అక్టోబరు వచ్చేసరికి చంద్ర రెండు పరిశోధన పత్రాలు రాసి ఫౌలర్ కి చూపించేడు. ఒకటి కుబ్జ తారల సాంద్రత గురించి. అది ఎడింగ్టన్ సమస్యకి ఫౌలర్ ప్రతిపాదించిన పరిష్కారాన్ని కాసింత పొడిగిస్తూ రాసిన పత్రం. పాత చింతకాయ పచ్చడినే కొత్త జాడీలో పెట్టేడు. రెండవది కొత్తదనం ఉట్టిపడుతున్న, కాసింత విప్లవాత్మకమైన ఊహలు ఉన్న పత్రం. అతను పడవలో ప్రయాణం చేస్తూ, “శ్వేత కుబ్జతార గరిమ దరిదాపుగా మన సూర్యుడి గరిమని మించడానికి వీలు లేదు” అంటూ ఉజ్జాయింపుగా చేసిన లెక్కని గణిత సమీకరణాలతో, బందోబస్తుగా చేసిన పత్రం. ఫౌలర్ మొదటి పత్రాన్ని మెరుగుపరచడానికి కొన్ని సూచనలు చేసి, దానిని ప్రచురించడానికి సిఫార్సు చేసేడు.

ఫౌలర్ రెండవ పత్రాన్ని చదివి,పెద్దగా ఉత్సాహం చూపించలేదు. “మిల్ని కి చూపించి అతని సలహా అడుగు. కూలిపోయే నక్షత్రాల మీద అతను పరిశోధనలు చేస్తున్నాడు” అంటూ పత్రాన్ని తిరిగి ఇచ్చేసేడు. ఆశాభంగం చెందిన వాడైన చంద్ర, “ఈ రెండవ పత్రమే రెండింటిలోకి ముఖ్యమైనది. ఇందులో సరికొత్త ఫలితం ఉంది,” అని ఫౌలర్ ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ప్రయత్నం చేసేడు. “ఎడ్మండ్ స్టోనర్ 1930 లో ఇటువంటి ఫలితాన్నే సాధించేడు. అతను కూడా సాపేక్ష వాదం ఉపయోగించి శ్వేత కుబ్జతార గరిమకి అవధి ఉందని లెక్క కట్టేడు” అంటూ ఫౌలర్ పెదవి విరచేడు. గురువుగారిని తృప్తి పరచడానికి, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్న నానుడి ప్రకారం, ఎడ్మండ్ స్టోనర్ చేసిన పనిని సంప్రదించిన గ్రంథాల జాబితాలో చేర్చి, స్టోనర్ చేసిన పనికి, తాను సమర్పిస్తున్న ఫలితాలకి మధ్య తేడాలని ఎత్తి చూపి, తన పత్రాన్ని సరిదిద్దేడు. ఈ సందర్భంలో ఎడ్మండ్ స్టోనర్ తన పత్రంలో చివర ఎడింగ్టన్ తనతో సలిపిన మంతనాలకి ధన్యవాదాలు తెలుపుతూ రాసిన వాక్యం చంద్రశేఖర్ కంట పడకుండా ఉండి ఉంటుందా? అనగా, ఎడింగ్టన్ కి తారల సాపేక్ష పతనం మీద ఆసక్తి ఉన్నట్లే కదా! ఆసక్తి ఉన్నా లేకపోయినా “సాపేక్ష పతనం” అనే భావన అంటే అతనికి అసహనం లేదనే అనుకోవాలి కదా?

ఇక్కడ ఎడ్మండ్ స్టోనర్ 1930 లో చేసిన పని ఏమిటో చెప్పకపోతే ఈ సరికొత్త ఫలితం కనిపెట్టిన ఘనత ఎవ్వరికి చెందాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. స్టోనర్ చేసిన పనిలో నక్షత్రం అంతటా ఒకే సాంద్రత ఉన్నట్లు ఉహించుకుంటాడు. ఈ ఊహ నిజ పరిస్థితికి దూరం; కానీ ఈ ఊహతో లెక్క చెయ్యడం సులభం అవుతుంది. చంద్ర చేసిన పనిలో నక్షత్రం ఉపరిభాగంలో తక్కువ సాంద్రత ఉండి, లోపలికి వెళుతున్న కొద్దీ సాంద్రత పెరుగుతుంది. ఈ ఊహ నిజ పరిస్థితికి దగ్గర. స్టోనర్ చేసిన పనికి మూడు గమ్యాలు ఉన్నట్లు తోస్తుంది: ఒకటి, నక్షత్రం లోపలకి వెళుతున్న కొద్దీ తాపోగ్రత, పీడనం ఎలా పెరుగుతాయో వర్ణించడం; రెండు, ఈ పెరుగుదలకి ఆ నక్షత్రం యొక్క ప్రారంభ గరిమకి సంబంధం ఏమిటో వర్ణించడం; మూడు, శ్వేత కుబ్జతార గరిమ ఒక కీలక అవధిని చేరుకునే వేళకి తాపోగ్రత, పీడనం ఎలా ఉంటాయో వర్ణించి చెప్పడం. ఈ మూడు విషయాలు తప్ప, పర్యవసానంగా శ్వేత కుబ్జతార చివరికి ఏమవుతుందో చెప్పకుండా మధ్యస్థంగా ఆపేసాడు. చంద్ర గణితాన్ని కడితేరా పూర్తి చేసి, ఒక తార ప్రారంభ దశలో ఒక కీలక గరిమని దాటి ఎక్కువ గరిమ కలిగి ఉంటే అది శ్వేత కుబ్జతార దశని చేరుకొనే లోగా కుప్పకూలిపోయి మాయం అయిపోతుంది అని పర్యవసానం తేల్చి చెప్పేడు.

చంద్రశేఖర్ దృష్టిలో ఇది విప్లవాత్మకమైన ఫలితం. కానీ ఫౌలర్ కానీ, మిల్ని కానీ ఇసుమంతైనా కంగ లేదు. ఈ ఫలితం వారిని ఆకట్టుకోలేదు. మిగిలిన వారు “ఫలితంలో నవ్యత కనిపిస్తోంది” అంటూ మెచ్చికోలులా అనిపించే మేకతోలు కప్పి చప్పరించేసేరు తప్ప ఎవ్వరు చంద్రకి దన్నుగా నిలబడలేదు. చంద్ర దిగాలు పడిపోయి ఆ కేంబ్రిడ్జి దిగ్గజాల సరసన నిలబడే తాహతు తనకి లేదేమో అని నిస్పృహ పడిపోయేడు. సుభాషితాలలోని ఈ దిగువ పద్యం లాంటి తమిళ పద్యం జ్ఞాపకం వచ్చి ఉంటుంది:

“తెలివి యొకింత లేని యెడ తృప్తుడనై కరిభంగి సర్వముం
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితిందొలి ఇప్పుడు
జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై
తెలియనివాడనైమెలగితిన్ గతమయ్యె నితాంత గర్వమున్!”

ఈ వాతావరణంలో సర్ జేమ్స్ జీన్స్ మాత్రం చంద్ర రాసిన పత్రాన్ని చదివి “చాల ముఖ్యమైన ఫలితం” అని మనస్ఫూర్తిగా కొనియాడేసరికి అయన మద్దతుతో అమెరికాలో ప్రచురితమయ్యే Astrophysical Journal కి పంపేడు. వారు మొదట్లో నిరాకరించినా చివరికి సమ్మతించి 1931 మార్చి సంచికలో ప్రచురించేరు.

పత్రం అంటే ప్రచురణ పొందింది కానీ, చంద్ర జీవితం ప్రశాంతంగా లేదు. తను ఎంతో శ్రమపడి, ఉత్తేజపూరితుడై రాసిన పరిశోధన పత్రం ఎవ్వరికి నచ్చినట్లు లేదు; ఎక్కడనుండీ మెచ్చుకోళ్ళు రాలేదు. ఇంగ్లండు వచ్చి ఆరు నెలలు అయింది. నలుగురి మధ్య పుట్టి పెరిగిన వాడేమో ఒంటరితనం భరించడం కష్టంగా ఉంది. ఇంటి కోసం బెంగ. రుచి, పచి లేని తిండి. శాకాహారం దుర్లభం అయిపోతోంది. సతతం మేఘావృతమైన ఆకాశం. ఎండ లేదు. మనస్సులో ఉత్సాహం లేదు. ఎప్పుడూ పని, కాగితాలు, లెక్కలు తప్ప ఉల్లాసంగా కాలం గడపడానికి మరొక వ్యాపకం లేదు.
పైపెచ్చు ఇంగ్లీషు వాళ్ళకి కలుపుగోలుతనం తక్కువ. మనసు విప్పి మాట్లాడుకుందుకి స్నేహితులు ఎవ్వరూ లేరు. తోటి సహోద్యోగులతో వస్తున్న స్పర్థలు ఎవ్వరితో చెప్పుకుంటాడు? తండ్రికి అన్నీ పూస గుచ్చినట్లు ఉత్తరాలు రాసేవాడు. అయనకి భౌతిక శాస్త్రంతో పరిచయం లేదు. పైగా కేంబ్రిడ్జిలో ఉన్న రాజకీయాలు ఆయనకి ఏమి అర్థం అవుతాయి? ఇంగ్లండులో ఇతని గోడు విని హితోపదేశం చెయ్యగలిగే పెద్ద దిక్కు లేకపోయింది.

గురువుగారైన ఫౌలర్ దగ్గర దిశానిర్దేశం కోసం గంటల తరబడి పడిగాపులు పడి కూర్చోవడం తప్ప అయన దర్శనం దొరికేది కాదు. డిరాక్ ని దూరం నుండి చూసేడు తప్ప మాట్లాడే అవకాశం రాలేదు. ఇంగ్లండులో ఉన్న ఆచారం ప్రకారం ఎవ్వరో ఒక మధ్యవర్తి లాంఛనప్రాయంగా పరిచయం చెయ్యకుండా చొరవగా తోసుకువెళ్లి పలకరించడం మర్యాద కాదు. నలుగురితో కలుపుగోలుగా తిరిగే సంస్కృతిలో పెరిగిన చంద్రకి ఇంగ్లండులోని కృత్రిమమైన మర్యాదలు పాటించడం, లేనిపోని డాంభికంతో ఇష్టాగోష్టి జరపడం వంటి వాతావరణం ఉక్కిరిబిక్కిరిగా ఉంది.

మీ 1931 లో చంద్ర తల్లి స్వర్గస్థురాలయింది. చుక్కాని లేని పడవలా ఉన్న చంద్ర జీవితంలో మిల్ని ఒక్కడే దిశానిర్దేశానికి ఉత్సాహం చూపించేవాడు – అది కూడా కొంత “స్వామి కార్యం కాసింత, స్వకార్యం మేటంత” అన్న ధోరణిలోనే. తనంత తానుగా వచ్చి పరిచయం చేసుకుని పలకరించేడు. అదెంత కాదు. నిండా ములిగిపోతున్న వాడికి గడ్డి పరక చందాన! తరువాత చంద్రకి జాబు రాస్తూ మిల్ని, “కూలిపోతున్న తారల గురించి నేను చేసిన విశ్లేషణలో నువ్వు సాధించిన ఫలితం ఒక ప్రత్యేక సందర్భం అవుతుంది” అంటాడు. ఆ జాబు చూసి చంద్రకి ఒళ్ళు మండింది. ఎందుకంటే, “ఎడింగ్టన్ రాసింది కొంత, ఫౌలర్ రాసింది కొంత కలగలిపి కొత్త సీసాలో పోసిన పాత సారాలా ఉంది తప్ప మిల్ని ఫలితంలో నవ్యత ఏమీ లేదు” అని చంద్ర అనుకున్నాడు. ఈ అనుకోవడం ఎంతవరకు సమర్ధనీయమో తెలియదు కాని, ఈ సంఘటన జరిగిన తరువాతనే బర్లింగ్టన్ హవుస్ లో సమావేశం జరగడం, ఆ సమావేశంలో మిల్ని మరియొక పరిశోధనా పత్రం సమర్పించడం జరిగేయి. “ఆ పత్రంలో మిల్ని చూపిన ఫలితం ఒక్కటి చాలు ఎడింగ్టన్ సిద్దాంత సౌధాన్ని సమూలంగా కూలదోయడానికి” అని చంద్ర నమ్మేడు. కానీ ఎడింగ్టన్, ఫౌలర్, జీన్స్, ప్రభృతుల ఎదుట నిలిచి తన నమ్మకాన్ని వ్యక్తపరిచే ధైర్యం లేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked