అయ్యయ్యో ! శివ శివా! –
(సూత్రంః శివ నిందాస్తుతి. మొదటి రెండు వాక్యాలు నిందాస్తుతి, మూడవ వాక్యం స్తుతితో శివతత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం. మహాశివరాత్రి తరుణంలో మనబడి భాషాప్రేమికులు అల్లిన మారేడు దళ మాలిక. ఆలోచనః వేణు ఓరుగంటి )
- ఎద్దునెక్కుతావు, పులితోలు తొడుగుతావు
భూతదయ నీకెక్కడయ్యా భూతేశా? శివ శివా!
పంచభూతాలూ నువ్వేకదా ఓ పరమేశా! (వేణు ఓరుగంటి)
- బూడిద రాస్తావు, పుర్రెల హారం చుడతావు!
నీదేమి అందమయా గౌరీశా? హరహరా!
నీలో సగమైనది జగన్మోహనం ఓ అర్ధనారీశా! (భాస్కర్ రాయవరం)
- త్రిశూలం పట్టుకుంటావు, శ్మశానంలో ఉంటావు,
నువ్వంటే భయంతో చావాలి కానీ, హరోం హర!
చచ్చినాకా నీదగ్గరకే చేరాలని తపస్సు! మృత్యుంజయా! (వేణు ఓరుగంటి)
- బొమ్మతల కొట్టేవు, బొమ్మకు తలపెట్టేవు
ఇదేమి తిక్కనో తెలీదు కానీ, తిక్కశంకరయ్యా!
చక్కటి కథలురాసిచ్చే బొమ్మ దేవుణ్ణిచ్చావు కదా, శివయ్యా! (చంద్ర రెంటచింతల)
- గరళాన్ని తృటిలో మింగావు ఎంతో సాహసం చేసితిననుకొంటివా పరమశివా!
ఎల్ల వేళలా నీవే దిక్కని కొలవమందువా ఇదెక్కడి న్యాయము సదాశివా!!
నీ మహిమ తెలిసీతెలియని అజ్ఞానులమనుకుంటివా మహ దేవా!!! (రమ కాకుళవరపు)
- కాలు కదిపితే ఆటట, నీ కన్ను తెరిస్తే మంటట
నీ నాటకాన మేమంతా నటులట, ఒట్టు వట్టి చీమలమట,
ఈ ఆటయ్యాక చేరేది నీ గూటికేనట నటరాజా! (సుజన పాలూరి)
- శివశివ అంటేను పాపములు తొలగేను
హరహర అంటేను భయములు తీరేను
పాలాభిషేకముతో నిన్ను ప్రసన్నము చేసేము
రుద్రాభిషేకముతో నిన్ను శాంతమ్ము పరచేము
ఓరగంటితో చూసి మా కష్టాలు తీర్చేవు! (శైలజ అత్తిలి)
- పాపమణచమంటె ఒంటికాలిపై లేస్తావు!
కరుణచూపగనువ్వు కన్నెఱ్ఱ జేస్తావు! భవహరా !
నీ శరణన్న మరి అక్షరగతియే గాద సదాశివా! (రాజశేఖర్ అంబటి)
- చీమ నైన కదల నీయవు గదయ్య నీ ఆజ్ఞ లేనిదే ! పాపాత్ములకేలనయ్య బాసటగా నిలిచేవు ఓ గరళ కంధరా !
కల్మషం లేని ఇలని మాకందియ్యవయ్యా ! (శ్రీవాణి మాదేటి)
- నీ కామమును దీర్చ దరికి జేరిన వాని నిండార చూసి కాల్చినావు
ముక్కంటితో నీవు జూసినావంటే మాడిమసయ్యేను ముల్లోకము
ఎక్కువేమి కాదు తక్కువే కోరాము ఓరగంటను జూసి కనికరించు! (జ్యోత్స్న అంబటి)
- మహాభద్ర, వీరకాళుల చేత భీభత్సాన్ని సృష్టించావు
ఇదేమి న్యాయమయ్యా సాంభయ్యా!
గంగ విన్యాసాలని జఠాధరంలో ఆపి లోకాన్నే ఆదుకున్న గంగయ్యా (శైలజ కొట్ర)
- చిన్న పొగడ్తకే బొల్తా పడతావు భోళా శంకరా!
రాక్షసులకా వరములిచ్చెది అఙ్ఞానివయ్య హర హర!!
ఙ్ఞానవరములిచ్చావు ప్రసూనంబకు దక్షిణకైలాసవాసా శ్రీకాళస్తీశ్వరా! (భారతి అన్నె)
- ముప్పుతిప్పలు పడి మూడు లోకాలు తిరిగితేగాని గణనాధుడవ్వనీవు!
అర్థనారీశ్వరుడవు నీ చూట్టు తిరిగితే మాత్రం వరాల పంట పండిస్తావు!
ఓహో నీ లీల ఏమనని పొగడము ఓ నీలకంఠా!! (భారతి అన్నే)
- అడుగుదామంటే నీవే తొలి బిక్షగాడివయ్యా!!
ఇద్దామంటే నీతలతో చిక్కే గంగయ్యా!
నన్నే నీకిచ్చుకుంటా గొంతున దాచుకో శితికంఠా!! (భాస్కర్ రాయవరం)
- క్షీరసాగరమ్ములో పోరుప్రజలకు పోగాలమగునని,
విషమ్మింగుతానని నీవడిగితే సమ్మతించినది సర్వమంగళ
పుస్తెలత్రాడుమీద అదేమినమ్మకమో పార్వతమ్మకు! (వేణు ఓరుగంటి)
- అంతటా తిరుగుతావు, అంతంతమాత్రపు యోగివనిపిస్తావు
అంతమే నువ్వని అర్ధమయ్యేసరికి, అయ్యయ్యో!
కాలం గడిచి కాలే సమయమొచ్చేసింది, కాళేశా! (వేణు ఓరుగంటి)
- ఆకారమే లేని లింగానివే, నీవు జంగానివే!
కన్ను నీవే, కోడి గుడ్డు నీవే, నిండైన ఆ బోడిగుండూ నీవే!
నిరాకారా, వేయేల ఎంచి చూడగ బ్రహ్మాండమంత నీవే! (సుజన పాలూరి)
- మెళ్ళో పాము, మొల్లోపాము, బుసబుసలు కొడతూవుంటే
పార్వతమ్మ పక్క చేరేదెట్లయ, పన్నగేశా!
ఆదిదంపతులే అట్లాగుంటే మా పుట్టుక మాయేగదా అంబరీషా! (వేణు ఓరుగంటి)
- జగమంతట నీవు జనమంతయు నీవట జంగమయ్యా!
మరి ఈ భవ బంధాల గోల మాకేలయ్యా! (కిష్ నారే)
- ఏనుకు చర్మం చుడితివి, ఏనుగు తలనెడితివి!
ఎద్దునెక్కి తిరిగితివి, నందిని కాపలనెడితివే భూతనాథా!!
సింగమెక్కిన అంబతో కాపురమిడి జగమేలితివే జంగమయ్యా! (భాస్కర్ రాయవరం)
- అసురుని పొట్టలోన ఉంటావు అనంత విశ్వమంతయు నీవు
గుళ్ళు గోపురాలు నీకెందుకయ్యా?
నా గుప్పెడు గుండెలోన ఉండిపోవా శివా!! (కిష్ నారే)
- కస్తూరి తిలకాలు మేనంతటద్దు తందంగ యంబ యాలింగనము సేయఁ
కూసింత దయలేక చీరంత మసిబూసి యర్ధాంగినే నీవుఁ జిన్నఁబుచ్చేవు
మారేడు నీరాల సేవించువాఁడ నింకేమి యాశింతునాబూడిదై నిన్నంటదప్ప (అంబటి రాజశేఖర్)
- గరళం మింగటమో గొప్పా ? మరుభూమిలో
ద్రిమ్మరిగ తిరగటమో లెక్కా? మరినేను భవసాగరమీదటంలేదా, మహదేవా!
దమ్ముంటే నా ఇక్కట్లను దీర్చి చూడవయ్యా ఓ ముక్కంటీ! (వేణు ఓరుగంటి)
24.కోపమొస్తే మూడవకంటినే తెరిచేవు
అది అణచకుంటే వీరభద్రుడవే అయ్యేవు భవభయహరా !
వరములిచ్చే కైలాస యోగివే నీవయ్య సిద్ధేశ్వరా ! (శ్రీవాణి మాదేటి)
- కదిలెడిదే వల్లకాడట, కనుదెరిచిన ఆప వల్లకాదట!
గుల్లగు జీవము నీవల్ల ఏ ఫణితి గోరు లయమన
వల్లకాని వరమై కనుదెరుచుట మూయుట నీవలనేనా? ఓ పరమేశా! (చంద్ర రెంటచింతల)
26.ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటీ?
మాయలో కన్నుమూసుకొన్న మాకు జాగారమేలయా జంగమయా!
మాలో మత్సరమనచనగా మూడోకన్ను తెరవవయా త్రినేత్రా! (భాస్కర్ రాయవరం)