వేమూరి వేంకటేశ్వరరావు
తొలిపలుకు
రామ కథ రావణుడితో ముడిపడి ఉంది. రావణుడు లేకపోతే రామాయణమే లేదు. రావణుడు మాత్రం సామాన్యుడా? అసమాన్య ప్రతిభావంతుడు. చివరికి రావణుడిని పడగొట్టింది అతని అహంకారం.
చంద్రశేఖర్ కథ ఎడింగ్టన్ తో ముడిపడి ఉంది. ఎడింగ్టన్ లేకపోతే చంద్రశేఖర్ కథ మరొకలా ఉండి ఉండేదేమో! ఎడింగ్టన్ మాత్రం సామాన్యుడా? అసమాన్య ప్రతిభావంతుడు. అతను జాత్యహంకారంతో తనని పడగొట్టడానికి ప్రయత్నం చేసేడని చంద్రశేఖరే అభియోగం చేసేడు; అయినా చిట్టచివరి వరకు ఎడింగ్టన్ యెడల గౌరవభావం సడలనివ్వ లేదు.
చంద్రశేఖర్ పేరు మొట్టమొదట నేను అమెరికా వచ్చిన కొత్తలో, 1961 లో, విన్నట్లు జ్ఞాపకం. అంతకు పూర్వమే విన్నానేమో, చెప్పలేను. అమెరికా వచ్చి మూడు నెలలు అయింది. డిసెంబరు నెలలో, సెలవులకి, అన్నయ్య దగ్గరకి రాచెస్టర్ వెళ్లేను. అప్పుడు చాల విషయాల మీద చాల కబుర్లు చెప్పుకున్నాం. మా కబుర్లలో అప్పటికి అమెరికాలో సజీవంగా ఉన్న ముగ్గురు విశిష్టులైన భారతీయుల పేర్లు దొర్లేయి: సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, జార్జి సుదర్శన్, సుందరం శేషు. అప్పటికి సుదర్శన్ రాచెస్టర్లో పి. ఎచ్. డి పట్టా సంపాదించి, సిరక్యూస్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర విభాగంలో ఆచార్యుడుగా పనిచేస్తున్నాడు. సుందరం శేషు యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో, విద్యుత్ వలయాల మీద పరిశోధనలు చేసి, చిన్న వయస్సులోనే ఆచార్య పదవి చేరుకున్నాడు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ చికాగో విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఎర్కిస్ వేధశాలలో ఖగోళభౌతిక శాస్త్రంలో ఆచార్యుడు.
“అన్యాయం చేసేరురా. చంద్రశేఖర్ కి నోబెల్ బహుమానం ఇవ్వవలసింది. ఎప్పుడో ఇవ్వవలసింది. ఇప్పటి వరకు ఆయనకి గుర్తింపు రాలేదు! అయన దగ్గర చదువుకున్న ఇద్దరు విద్యార్థులకి నోబెల్ బహుమానం ఇచ్చేరు. ఆ ఇద్దరికీ పాఠం చెప్పడం కోసం అయన వారానికి రెండు సార్లు, ఇటు 100 మైళ్ళు, అటు 100 మైళ్ళు కారు తోలుకుని చికాగో వెళ్లేవారు.” చాల బాధ పడుతూ చెప్పేడు. అప్పుడు ‘చంద్రశేఖర్ లిమిట్’ అంటే ఏమిటో స్థూలంగా చెప్పేడు. ఎప్పుడో 1930 ప్రాంతాలలో ఇంకా విద్యార్ధి దశలో ఉండగానే కనిపెట్టేరుట ఈ అవధిని. “ముప్పయ్ ఏళ్ళు దాటిపోయింది. ఇంకా ఇవ్వ లేదు. ఇహ ఇస్తారన్న నమ్మకం కూడా పోయింది.”
చివరికి చంద్రశేఖర్ అవసానకాలం చేరుకుంటున్న సమయానికి, 1983 లో, నోబెల్ బహుమానం ఇచ్చేరు; ఎప్పుడో 1930 లో, ఇంగ్లండుకి వెళ్లే దారిలో, విద్యార్థి దశలో, పడవలో కూర్చుని చేసిన పనికి! మహాత్మా గాంధీకి ఇవ్వలేదు. యల్లాప్రగడ సుబ్బారావుకి ఇవ్వలేదు. జార్జ్ సుదర్శన్ కి ఇవ్వలేదు. వీరు ముగ్గురు భారతీయులు కనుక మనం మనకి అన్యాయం జరిగిందని అనుకుంటున్నాం. హైజెన్బర్గ్ అంతటి వాడు ఆర్నాల్డ్ సోమర్ఫెల్డ్ కి నోబెల్ బహుమానం ఇవ్వకపోవడం అన్యాయం అన్నాడు. రసాయన శాస్త్రానికి ఆయువుపట్టు అనదగిన ఆవర్తన పట్టికని ఆవిష్కరించిన మెండలియవ్ కి కూడా నోబెల్ బహుమానం ఇవ్వలేదు. ఆ బహుమానం రాకపోయినంత మాత్రాన వీరి ప్రతిభ తరిగి పోలేదు. కానీ అదేమిటో ఆ నోబెల్ బహుమానం ప్రతిభకి ఒక కొలమానం అయి కూర్చుంది.
నోబెల్ బహుమానం ఇవ్వకపోతే పోయారు, చేసిన విప్లవాత్మకమైన పనికి గుర్తింపు కూడా ఇవ్వకుండా చంద్రశేఖర్ ని వెనక బెంచిలో కూర్చోబెట్టి విస్మరించడం మాత్రం అన్యాయం. ఆయనకి జరిగిన అన్యాయం ఏమిటో పరిపూర్ణంగా అర్థం కావాలంటే జరిగిన కథ ఏమిటో, అందులో పాత్రలు ఎవరెవరో, సందర్భం ఏమిటో అర్థం అవాలి. అందుకే ఈ పుస్తకం.
“రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ జరిగిన రెండేళ్లలో రామన్ కి నోబెల్ ఇచ్చేరు కదా! నోబెల్ బహుమానం అందుకోడానికి ప్రయోగికమైన ఋజువు చూపించాలంటారు. కేవలం గణితపరమైన సిద్దాంతాలకు, వాదాలకి ఇవ్వరట కదా?” నోబెల్ కమిటీని వెనకేసుకొని వస్తూ, “చూడు అయిన్^స్టయిన్ అంతటి వాడికి సాపేక్ష వాదం ఆవిష్కరించినందుకు ఇవ్వలేదు” అన్నాను.
ఆ సందర్భం లోనే ఎడింగ్టన్ పేరు కూడా విన్నాను. నిజానికి ఎడింగ్టన్ పేరు అంతకు పూర్వమే విన్నాను. అయిన్^స్టయిన్ లేవదీసిన సాపేక్ష వాదనని ఋజువు చెయ్యడానికి ఇతగాడే పెద్ద పటాటోపంతో ఆఫ్రికా వెళ్లి, సూర్య గ్రహణానికి ఫోటోలు తీసి, “ఇదిగో ఋజువు” అని జబర్దస్తీగా దబాయించి ప్రపంచంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. దరిమిలా ఎడింగ్టన్ చేసిన ప్రయోగం దోషభూయిష్టం అనిన్నీ, ఆ ఫలితాలలో కిట్టింపు కాసింత ఉందనిన్నీ అభియోగాలు కూడా వచ్చేయి.
ఒక వాదాన్ని ముందుగానే నమ్మేసి దానిని ఋజువు చేద్దామని ప్రయత్నం చేస్తే మనం ఏ ఫలితం ఆశిస్తున్నామో అదే కనిపిస్తుంది వస్తునిష్టత (objectivity) పోతుంది. కానీ అప్పటికే, “ప్రపంచంలో సాపేక్ష వాదనని అర్థం చేసుకున్నది ఈయన ఒక్కడే” అని కితాబు ఇచ్చేసేరు. ఈ కథ నా బాల్యంలో బాగా ప్రచారంలో ఉండేది.
దరిదాపు ఒక దశాబ్దం గడచిన తరువాత నా పరిశోధనా ప్రస్థానంలో చంద్రశేఖర్ పేరు కాకతాళీయంగా తారసపడింది. నేను పి. ఎచ్. డి పట్టా గణించుకున్న కొత్త రోజులలో నేను చేసిన పనిని బెల్మన్, కేలబా అనే పేర్లు గల ఇద్దరు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల ముందు వివరించడానికి 15 నిముషాలు అవకాశం దొరికింది. అప్పుడు కేలబా నాకు “ఇన్వేరియంట్ ఎంబెడ్డింగ్” అనే పద్ధతిని పరిచయం చేసి, ఈ పద్ధతిని చంద్రశేఖర్ ప్రవేశపెట్టినట్లు చెప్పేరు. ఈ ఇన్వేరియంట్ ఎంబెడ్డింగ్ అనే పద్ధతిలో కిటుకు టూకీగా చెబుతాను. ఏవైనా కొరుకుపడని సమస్యలు ఎదురైతే అటువంటి సమస్యలని ఒకటొకటి చొప్పున పరిష్కరించడం కంటే ఆ సమస్యలన్నిటిని కూడగట్టి, కలిసికట్టుగా, ఒక్కుమ్మడి పరిష్కరించడం తేలిక. ఉదాహరణగా గళ్ళనుడికట్టుని నింపడమే తీసుకుందాం. “అడ్డు” ఆధారం ఒక్క దానితో “అడ్డు మాట” స్ఫురణకి రాకపోవచ్చు. “నిలువు” ఆధారం ఒక్క దానితో “నిలువు మాట” తేలక పోవచ్చు, కానీ రెండింటితో “అడ్డు,” “నిలువు” ఒకే సారి తేల్చవచ్చు. మరొక ఉదాహరణ. “జిగ్ సా పజిల్” అనే బొమ్మల ప్రహేళికని చూసే ఉంటారు. ఇక్కడ అడ్డదిడ్డంగా, వంకరటింకరగా కత్తిరించిన బొమ్మ ముక్కలని సరి అయిన వరసలో పేర్చి బొమ్మని తయారు చెయ్యాలి. వీటిల్లో ఒక్క ముక్క చేత్తో పట్టుకు చూస్తే అది ఎక్కడ నప్పుతుందో ఒక పట్టాన అర్థం కాకపోయినా, నాలుగైదు ముక్కలని ఒకే సారి పరిశీలిస్తే వాటి స్థానాలు అర్థం అవుతాయి.
దరిదాపు మరొక దశాబ్దం గడచిన తరువాత మా అన్నయ్య, “సిరక్యూస్ యూనివర్సిటీ లో పనిచేస్తున్న నా స్నేహితుడు, కామేశ్వర్ వాలి అనే భౌతిక శాస్త్ర ఆచార్యుడు, చంద్రశేఖర్ జీవితం మీద ఒక పుస్తకం రాస్తున్నాడు” అని చెప్పేడు. ఆ పుస్తకం ఇటీవలి కాలం వరకు నేను చూడనే లేదు. ఆ పుస్తకం పీఠికలో “ఈ పుస్తకం రాయడానికి V. L. N. శర్మ ప్రేరణ కారణం” అంటూ వాలి మా అన్నయ్య పేరుని ప్రస్తావించేడు. అప్పుడు ఆ పుస్తకాన్ని చదివేను. కామేశ్వర్ భారతీయ సంతతి వాడు కనుక చంద్రశేఖర్ మీద అభిమానం కొద్దీ కొంచెం పక్షపాత బుద్ధితో రాసుండొచ్చు కదా. ఆ అనుమానం అలా గొలుకుతూనే ఉంది.
కొద్ది రోజుల క్రితం, అయాచితంగా, ఒక స్నేహితుడు నాకు ఒక పుస్తకం ఇచ్చి చదవమన్నాడు.
ఆ పుస్తకం రాసినది ఆర్థర్ ఏ. మిల్లర్. ఈయన లండన్ లోని ఇంపీరియల్ కాలేజీలో చరిత్ర, తత్త్వం విభాగంలో ఆచార్యుడు. ఈయన ప్రత్యేకత చరిత్రని అధ్యయనం చెయ్యడం. పైగా ఈయనకి శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి అవగాహన ఉంది. ఈయన చంద్రశేఖర్ కి, ఎడింగ్టన్ కి మధ్య జరిగిన ఘర్షణ అద్భుతంగా వర్ణిస్తూ రాసిన పుస్తకం ఇది. పక్షపాతం ఉంటే ఈయనకి అటువైపు ఉండాలి – బ్రిటిష్ వాడు కనుక. వాలి రాసిన పుస్తకం, మిల్లర్ రాసిన పుస్తకం చదివిన మీదట, వాటిని ఆధారాలుగా చేసుకుని – భౌతిక, ఖగోళ శాస్త్రాలతో నాకు ఉన్న పరిచయాన్ని జోడించి – ఈ వ్యాసాలు రాసేను. భౌతిక, ఖగోళ శాస్త్రాలతో కూడిన అంశం కనుక కొంచెం శాస్త్రం అర్థమయితే వివాదం ఎలా పుట్టుకొచ్చిందో అర్థం అవుతుంది.
పరాభవం
ఈ కథని శుక్రవారం, 11 జనవరి, 1935 తో మొదలు పెడదాం. లండన్ లోని పికడిల్లీ దగ్గర ఉన్న బర్లింగ్టన్ హవుస్ లో రోయల్ ఎస్ట్రనామికల్ సోసైటీ వారి సమావేశం అప్పుడే ముగిసింది. సమావేశానికి హాజరయిన వారంతా నక్షత్ర శాస్త్రంలో ఉద్దండ పండితులు. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ బయటకి వస్తున్నారు. సమావేశంలో ఒక వక్త మరొక వక్త మీద సంధించి వదలిన బ్రహ్మాస్త్రం ఎవ్వరూ గమనించినట్లు లేదు. లేక, అది బ్రహ్మాస్త్రం అని ఎవ్వరూ అనుకోలేదా? లేక, ఎవ్వరూ పట్టించుకోలేదా?
ఆ రోజు సాయంకాలం 6:30 గంటలకి పూర్తిగా పాతిక ఏళ్ళు కూడా నిండని ఒక యువకుడు సభ వేదిక మీదకి వచ్చేడు – ప్రసంగించడానికి. గత అయిదేళ్ళబట్టి తన మనోఫలకం మీద మధిస్తూన్న ఊహకి సమగ్రమైన రూపకల్పన చేసి సభాసదుల ముందు ఉద్ఘాటించేడు. ఆ యువకుడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి అప్పుడప్పుడే పి ఎచ్. డి పట్టా పుచ్చుకున్న డాక్టర్ సుబ్రహ్మణియన్ చంద్రశేఖర్. ఆ యువకుడు ట్రినిటి కాలేజి నుండి ప్రతిష్టాత్మకమైన “ఫెలోషిప్” గెలుచుకున్న ఘనుడు.
ఆ సభలో చంద్రశేఖర్ తన ప్రసంగంలో ఆవిష్కరించినది సరికొత్త పరిశోధనా ఫలితం. అంతవరకు కొమ్ములు తిరిగిన శాస్త్రవేత్తలని తికమక పెడుతున్న సమస్యకి పరిష్కారం! నమ్మశక్యం కాని ఫలితం. గభీమని మింగుడు పడని ఫలితం. సాధారణంగా శాస్త్రవేత్తలు అనూహ్యమైన క్రొంగొత్త ఫలితాలని త్వరగా ఆమోదించరు, ఆదరించరు. ఎక్కడో ఏదో లొసుగు ఉండుంటుందని అనుమానం ప్రకటిస్తారు. ఆక్షేపించడానికి వెనుకంజ వెయ్యరు. గెలీలియో, కోపర్నికస్, డార్విన్, ప్రభృతులే నిలదొక్కుకున్న ఆచారాలని, నమ్మకాలని ఎదిరించి ఇక్కట్లు పాలయ్యారు. ఒక ఫలితాన్ని, ఆ ఫలితాన్ని ఇచ్చిన తర్కాన్ని అనుమానించడంలో తప్పు లేదు; ఆ ధోరణి శాస్త్రీయ పద్ధతికి మూల స్తంభం. పైపెచ్చు సభలో ఉన్నవారంతా అనుభవజ్ఞులు, నిష్ణాతులూను. విప్లవాత్మకమైన ఆ కొత్త ఫలితం మీద విజ్ఞులు ఆమోద ముద్ర వేస్తే అతనికి ఎదురుగా ఉన్నది రాజ మార్గం!
వయస్సులో చిన్నవాడే అయినా నక్షత్రభౌతిక శాస్త్రం (astrophysics) మీద అతని పట్టు ఉడుం పట్టు! అఖాతం అంత లోతైన అవగాహన! పద్దెనిమిదేళ్ల చిరుత ప్రాయంలో, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో, మొట్టమొదటి సారి అతను తన పరిశోధనా పత్రం చదివి ఆహూతులని ముగ్ధుల్ని చేసేడు. ఆ పత్రాన్ని 1928 లోనే “ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్” అనే పత్రికలో ప్రచురించేడు. సహాధ్యాయులు, గురువులు అతనిని “అఖండ మేధావి” అని కొనియాడారు. ఇప్పుడు, ఇంగ్లండులో, ఈ సమావేశంలో, అందరికి 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చిన నిర్వాహకులు చంద్రశేఖర్ కి ప్రత్యేకించి 30 నిమిషాలు ఇచ్చేరు! అతని తరువాత మాట్లాడబోయేది మరెవ్వరో కాదు. ఆచార్య సర్ ఆర్థర్ స్టేన్లీ ఎడింగ్టన్!
ఈ ఇద్దరు వ్యక్తులకి ఏ కోశన్నా పోలిక లేదు. చంద్రశేఖర్ పిన్న వయస్కుడు. సగటు పొడుగు. నల్లటి మేని ఛాయ, అంతకంటే నల్లటి జుట్టు. నిండైన పెదవులు. కాసింత బూరి బుగ్గలు. నుదుటి మీద పడకుండా అదుపులో పెడుతూ ఒద్దికగా దువ్వుకున్న జుత్తు. పాశ్చాత్య ధోరణిలో బట్టకట్టు: పంట్లాము, చొక్కా, టై, కోటు, మిలమిల మెరిసే బూట్లు. తలపాగా లేకపోయినా ఆ రూపం, ఆ వాలకం చూడగానే ఆభిజాత్యం మద్రాసీ అయ్యరు అని పోల్తి పట్టడం కష్టం కాదు. ఉడుకు రక్తంతో ఉబలాటపడుతున్న అనుభవం లేని అమాయకత్వం ఆ ముఖంలో తొణికిసలాడుతోంది. ఎడింగ్టన్ ఇతనికి అన్ని విధాలా వ్యతిరేకం.
ఆర్థర్ ఎడింగ్టన్ వయస్సు ఏభై రెండు. అనుభవశాలి. నక్షత్రభౌతిక శాస్త్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్లుమియన్ ఆచార్య పీఠాన్ని అధిష్టించేడు. ఆయనకి జరగని పురస్కారం లేదు, అయన అందుకోని పతకం లేదు. మనిషి మంచి పొడగరి. సూర్యకాంతి లేని ఇంగ్లండులో పెరగడం వల్ల తెల్లగా పాలిపోయిన ముఖ వర్చస్సు. చిరునవ్వు చిందని, బిగించిన సన్నని పెదవులు. విచారగ్రస్తమైన ముఖకవళికలు. పెడసరం, వెటకారం మేళవించి మాట్లాడే మాట తీరు. సన్నటి పొడుగాటి ముక్కు మీద కళ్లద్దాలని సుతారంగా ఆనించి, గజం బద్దలా నిటారుగా నిలబడతాడు. నలిగిపోయిన కోటు జేబు నుండి గడియారం వేల్లాడుతూ ఉంటే చూసేవాళ్ళకి ఆక్స్ఫర్డ్-కేంబ్రిడ్జి ఆభిజాత్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. వాలకం, తీరు, చూస్తే ఈయనే బ్రిటిష్ సామ్రాజ్యపు రాజప్రతినిధా అనిపిస్తుంది. ఆయన ప్రసంగంలో ఇతరులని గేలి చేసి, దుమ్మెత్తి పొసే పోకడలు ఎక్కువగా ఉంటాయి కనుక అవి విని ఆనందించటం కోసం ప్రత్యేకించి వచ్చే శ్రోతలు కూడా ఉంటారు. అటువంటి వారికి ఎడింగ్టన్ ఎన్నడూ ఆశాభంగం కలిగించడు. పిల్లికి చెలగాటం అయేది ఎలుకకు ప్రాణ సంకటం అవచ్చు అనే ఇంగిత జ్ఞానం ఆయనకి లేదు. ఉన్నా, లెక్క చేసే రకం కాదు.
చంద్రశేఖర్ పరిశోధన చేసి ఆవిష్కరించిన సత్యం ఏమీ ఆషామాషీ విషయం కాదు. మనం నిత్యం ఆకాశంలోచూసే నక్షత్రాలు అలా శాశ్వతంగా ఉండిపోతాయా? లేక వాటికి కూడా జనన మరణాలు, బాల్య, కౌమార, వార్ధక్య దశలు ఉంటాయా? అవి మరణిస్తే ఆ మృతదేహాలు ఏమవుతాయి? ఈ ప్రశ్నలకి నికార్సయిన సమాధానం చెప్పటానికి చంద్రశేఖర్ ఒక దిశానిర్దేశం చేసేడు. దారి, తెన్నూ లేని అడుసులో ఎవ్వరు ముందు అడుగు వేస్తారో వారి కాలికే బురద అంటుకుంటుంది. తప్పదు.
ఆ రోజులలో నక్షత్రాల గురించి తెలిసినది చాల తక్కువ. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని తెలుసు. సూర్యుడు వేడి, వెలుతురూ విరజిమ్ముతున్నాడంటే అక్కడ ఏదో మంట లాంటిది మండుతూ ఉండుండాలని ఉహించుకునేవారు – ఆ రోజులలో. ఆ మండేదేదో పూర్తిగా కాలిపోయిన తరువాత ఏమవుతుంది? కాలిన కట్టెలు చల్లారి, నివురు గట్టినట్లు తారలు చల్లారి, తెల్లటి నివురు గట్టిన నిప్పు పోగులలా మారిపోతాయా? అలా కాలడం అయిపోయి, చల్లారుతూన్న తారలని “శ్వేత కుబ్జతారలు” (white dwarfs) అని పిలవడం మొదలు పెట్టేరు. తరువాత ఏమవుతుంది? ఈ విషయం మీద పరిశోధన చేసి చంద్రశేఖర్ అప్పటికే రెండు పరిశోధన పత్రాలు ప్రచురించేడు. ఈ పత్రాలలో ఎడింగ్టన్ 1926 లో ప్రచురించిన “తారల అంతర్గత నిర్మాణ తత్త్వం” (The Internal Constitution of Stars) అనే పుస్తకంలో లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానాలు వెతికేడు. అంటే ఎడింగ్టన్ చూపిన దారి వెంట నడవడానికి ప్రయత్నం చేసేడు. ఒక విధంగా ఇక్కడ ఎడింగ్టన్ ద్రోణాచార్యుడు, చంద్రశేఖర్ ఏకలవ్యుడు.
శ్వేత కుబ్జతారల మీద చంద్రశేఖర్ 1931 లో పరిశోధన పత్రం ప్రచురించేనాటికి అతని వయస్సు కేవలం ఇరవై ఏళ్ళు. పెద్ద చదువులకి ఇంగ్లండు వెళ్లే ముందు రాసిన పత్రాలు అవి. అనుభవం పూర్తిగా పూజ్యం అయిన రోజులు. ఇండియాలో ఉన్న శాస్త్రీయ పత్రికలో ప్రచురించేడు. తరువాత ఇంగ్లండు వెళ్లిన సంవత్సరం, అనగా 1932 లో, ఈ పాత పత్రం లోని లోపాలని సవరించి, తను ప్రతిపాదిస్తున్న వాదాన్ని కాసింత బలపరచి, ఇంగ్లండు లోని మరొక పత్రికలో ప్రచురించేడు. ఇంగ్లండు లోని శాస్త్రీయ వర్గాలు ఈ పత్రాన్ని పట్టించుకోలేదు. ఎవ్వరూ ప్రోత్సాహ పరచలేదు సరికదా కనీసం వ్యాఖ్యానం కూడా చెయ్యకుండా విస్మరించేరు. ఎడింగ్టన్ ఉలక లేదు. తన దిశా నిర్దేశకుడు రాల్ఫ్ ఫౌలర్ పెదవి మెదప లేదు. తన శ్రేయస్సు కోరే స్నేహితుడనుకున్న గణిత శాస్త్రపు ఆచార్యుడు ఎడ్వర్డ్ మిల్ని మౌనం వహించేడు. తన యెడల వీరంతా కూడబలుక్కున్నట్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో చంద్రశేఖర్ కి అవగాహన కాలేదు. తప్పు దారిలో పడ్డ చంద్రశేఖర్ చేత దారి మళ్లించడానికి స్నేహితులు చేస్తున్న ప్రయత్నమా ఇది? లేక వృత్తి ఉద్యోగాలలో సర్వసాధారణంగా కనిపించే అసూయ, ఓర్వలేనితనమునా? లేక…. “తెల్లవాడి మోచేతి నీరు తాగుతూ ఒక మూల పడుండవలసిన ఈ నల్లవాడు, రవి అస్తమించని రాజ్యాన్ని ఏలుతున్న ఇంగ్లీషువాడి దగ్గర భృత్యుడుగా పడుండవలసిన ఈ నల్లవాడు, తమకి పాఠాలు చెప్పడానికి ఉద్యుక్తుడవుతాడా?” అన్న జాత్యహంకారమా?
ఈ ఆలోచనలతో ఆ జనవరి, శుక్రవారం నాడు కేంబ్రిడ్జి నుండి లండన్ వరకు అతను చలిలో బిగిసిపోతూ చేసిన రైలు ప్రయాణం పూర్తవడానికి యుగాలు పట్టినట్లనిపించింది. అది ఆత్రుత కాదు. భయం కాదు. ఇలాంటి ప్రసంగాలు చెయ్యడం అతనికి కొత్త కాదు. పూర్వపు ఫలితాలు వేరు. ఇప్పటి ఫలితం వేరు. పూర్వం ఇతరులు చేసిన పనికి మెరుగులు దిద్దేవాడు. ఇప్పుడో? ఇది అతను స్వయంగా పరిశోధన చెయ్యగా కనుక్కున్న సరి కొత్త ఫలితం. ఈ దెబ్బతో అతని ప్రజ్ఞకి గుర్తింపు వచ్చి తీరాలి. ఎన్నాళ్ళు ఉదాసీనతతో ఉపేక్షిస్తారు?
కానీ అతని మనస్సు ఎందుకో పీకుతోంది. ముందు రోజు, అనగా గురువారం, రోయల్ ఎస్ట్రనామికల్ సోసైటీ (Royal Astronomical Society) కార్యదర్శి చంద్రశేఖర్ ని ఒక వారకి పిలచి, ముఖస్థంగా, “రేపు నీ ప్రసంగం తరువాత ఎడింగ్టన్ మాట్లాడుతారు” అని చెప్పేడు. “ఏ అంశం మీద?” అని వాకబు చేస్తే, “చంద్రశేఖర్ ప్రసంగం పై వ్యాఖ్యానం” అని తెలిసింది. చంద్రశేఖర్ మనస్సు కీడు శంకించింది. ఎందుకంటే ఆ ముందు రోజు రాత్రి, అనగా గురువారం రాత్రి, భోజన సమయంలో, ఎడింగ్టన్ ని కలుసుకున్నప్పుడు, చంద్ర అడిగేడు, “మీరు ఏ విషయం మీద మాట్లాడుతున్నారు?” అని. అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పకుండా ఎడింగ్టన్ కప్పదాటు వేసేడు. పైపెచ్చు “చూడు చంద్ర! నువ్వు చెప్పేది చాల ఉంది కనుక నీకు అందరి కంటే రెట్టింపు కాలం ఇమ్మని కార్యదర్శితో చెప్పేను” అంటూ మాట మార్చేడు.
“నాకు చాలా చిరాకు వేసింది. ఈ పెద్దమనిషి – ఈ ఎడింగ్టన్ – వారం వారం వచ్చి నా పని ఎలా కొనసాగుతోందో కుతూహలంతో అడిగి తెలుసుకునేవాడు. కానీ ఇదే విషయం మీద వ్యాఖ్యానిస్తూ అతను కూడా ఒక పత్రం చదవబోతున్నట్లు మాటవరసకైనా నాతో చెప్పలేదు” అని చెప్పుకుని చంద్రశేఖర్ బాధ పడ్డారు. తన పనిని ఎడింగ్టన్ విమర్శిస్తాడని భయం ఎందుకు? అంతటివాడు వ్యాఖ్యానిస్తే తాను చేసిన పని అందరి దృష్టిలో పడుతుంది కదా? ఇలా చంద్ర సమాధాన పడ్డాడు తప్ప రాబోయే అశనిపాతాన్ని కలలో కూడా ఊహించుకోలేదు.
అలవాటు ప్రకారం లివర్పూల్ స్టేషన్లో రైలు బండి దిగి టేక్సీలో కెన్సింగ్టన్ చేరుకున్నాడు. అక్కడ స్నేహితుడు, సహాధ్యాయి అయిన విలియం మెక్రే తో లంచి తింటూ తన అంతర్మధనాన్ని బయటకి వెళ్లగక్కేడు. రాల్ఫ్ ఫౌలర్ పూర్వ విద్యార్థులలో మెక్రే ఒకడు. ఇంగ్లండు లోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్య వర్గాలలో రాజకీయాలు, కుమ్ములాటలు తెలిసినవాడు. లౌక్యం ఎరిగినవాడు. లేనిపోని అపోహలతో మనస్సు పాడుచేసుకోవద్దని చంద్రకి సలహా ఇచ్చేడు. “ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం రావడమే ఒక గుర్తింపు. నీ ప్రసంగం అయిన తరువాత జరిగే చర్చలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోడానికి అవకాశం ఉంటుంది” అంటూ చంద్రకి హితోపదేశం చేసి ఉద్వేగాన్ని చల్లార్చేడు.
లంచి తరువాత ఇద్దరూ నడచుకుంటూ “తేనీటి పానం” వేళకి సభాస్థలికి వచ్చేరు. ఎవరేమి చేస్తున్నారో అన్న కుతూహలంతో అందరూ పిచ్చాపాటీలో పడ్డారు. ఆ మందలో ఆత్మవిశ్వాసంతో, రాజసం ఉట్టిపడుతున్న భంగిమలో, ఎడింగ్టన్ కూడా ఉన్నాడు. అంతగా పరిచయం లేకపోయినా మెక్రే – చంద్ర చెయ్యి పట్టుకుని – చొరవగా ముందుకి వెళ్లి ఎడింగ్టన్ ని పలకరించి, “మీరు ఈ రోజు ఏ విషయం మాట్లాడుతున్నారు?” అని అడిగేడు. చంద్ర వైపు కనీసం కన్నెత్తి అయినా చూడకుండా, నడుస్తున్న భంగిమ కుంటు పడకుండా, “అది ఈ నాటి విస్మయాంశం!” అని ఎడింగ్టన్ గుంభనంగా చెప్పిన సమాధానం విని చంద్ర ఖంగు తిన్నాడు. ఇది అపశకునం. ఎందుకంటే చంద్ర మొట్టమొదటి సారి 1931 లో ఎడింగ్టన్ ని కలుసుకున్న సందర్భంలో, అతని ప్రత్యర్థి అయిన సర్ జేమ్స్ జీన్స్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ, సభ్యత లేకుండా, “వాడొక పచ్చి అబద్దాల కోరు” అని బిగ్గరగా అరిచేడు. ఆ సందర్భం జ్ఞాపకం వచ్చి చంద్రశేఖర్ తాను ఏ గండం ఎదుర్కోవాలో అని భయపడసాగేడు.
సమయం 4:25. ఎంతో హుందాగా ఉన్న సమావేశ మందిరం నిండడం మొదలయింది. మందిరపు గోడల మీద నక్షత్రభౌతిక శాస్త్రంలో ఉద్దండుల చిత్రపటాలు వేలాడుతున్నాయి. నూటన్ తైలవర్ణ చిత్రపటం అధ్యక్ష పీఠానికి వెనుక ఉండి ప్రేక్షకుల వైపు చూస్తోంది. యూరెనస్ గ్రహం ఉనికిని నిర్ధారించిన సర్ విలియం హెర్షెల్ చిత్రపటం పక్క గోడ మీద ఉంది. మొదటి వరుసలో హేమాహేమీలు అయిన ఎడింగ్టన్, ఫౌలర్, జీన్స్, ప్రభృతులు ఆసీనులయ్యారు. కేవలం ‘హేమీ’ మాత్రమే అయిన మిల్ని రెండవ వరసలో కూర్చున్నాడు. మెక్రే, చంద్ర వంటి వారిని కుర్రకుంకల కింద జమకట్టి చివరి వరసలో వెనకని పడేసేరు – కేంబ్రిడ్జిలో ఉన్న వర్ణాశ్రమ ధర్మం ప్రకారం!
సభ ఠంచనుగా 4:30 కి మొదలయింది. గది కిటకిటలాడుతోంది. నెల వారీగా జరిగే ఈ సమావేశాలు బోధనాత్మకంగా ఉండేవి. చాల మంది పెద్దలు కూడ హాజరయేవారు. బ్రిటిష్ వాళ్లు ఉగ్గుపాలతో అభ్యసించిన నిమ్నోక్తులతో (understatements) కూడిన సంభాషణలతో ఈ సమావేశాలు వినోదాత్మకంగా కూడ ఉండేవి.
గుహలా ఉన్న ఆ సభాస్థలికి కిటికీలు లేవు. బయట ఎంత చలిగా ఉన్నా ప్రజలతో నిండిన సభా మందిరం క్రమేపి వేడెక్కుతోంది. ఆరుగురు వక్తలు 15 నిమిషాలు చొప్పున మాట్లాడేరు. ప్రశ్నోత్తరాలకి కొంత సమయం పోగా వేళ 6:15 దాటింది. ఎట్టకేలకు సభాధ్యక్షుడు చంద్రని వేదిక మీదకి ఆహ్వానించేడు. చంద్ర వేదిక ఎక్కే వేళకి గది ఉక్క పోసేంత వేడిగా తయారయింది. రెండు గంటల బాదుడు తరువాత వినే వాళ్ళకి కూడ ఓపిక నశించి పోయి ఉండాలి. చంద్ర నక్షత్రాల గురించి చెప్పే కథనం ఏమి వినుంటారో ఏమో?
ఇరవైయవ శతాబ్దపు ఆరంభ దశలో నక్షత్రాల గురించి మనకి తెలిసినది చాలా తక్కువ. అవి అనూహ్యమైనంత పెద్ద వాయు గోళాలు అని మాత్రం ఒక ఏకాభిప్రాయం ఉండేది. నూటన్ గురుత్వాకర్షణ బలం ప్రభావం వల్ల ఈ గోళాల లోని వాయువు కేంద్రం వైపు లాగబడుతుంది. అలా కుదింపుకి లోనయినప్పుడు గోళం మధ్యలో పీడనం పెరుగుతుంది. దానితో గోళం వేడెక్కి వ్యాకోచం చెందుతుంది. ఈ వ్యాకోచ బలం గోళాన్ని బుడగలా బయటికి ఊదుతూ ఉంటే, గురుత్వాకర్షణ బలం గోళాన్ని కేంద్రం వైపు లాగుతూ ఉంటుంది. ఈ రెండు బలాల మధ్య సమ తుల్యత ఉన్నంత సేపు నక్షత్రం స్థిర నిశ్చలతలో ఉండి వెలుగు, వేడి విరజిమ్ముతూ ఉంటుంది. నక్షత్రంలోని ఇంధనం ఖర్చు అయిపోగానే, చల్లారిపోతున్న నక్షత్రంలో వ్యాకోచ బలం తరిగి, గురుత్వాకర్షణ బలం ప్రభావం పెరిగి అత్యంత సాంద్రత గల బంతిలా తయారవుతుంది. తరువాత ఏమవుతుందో? ఎడింగ్టన్ ఊహ ప్రకారం “ఆరిపోయి” రాయిలా తయారవుతుంది. మరొకలా ఊహించడానికి అంతవరకు ఎవ్వరూ సాహసించ లేకపోయారు.
సాంద్రత పెరుగుతున్న గోళంలో గురుత్వాకర్షణ బలం పెరగాలి కదా? ఆ బలంతో ఇంకా నొక్కుకు పోదా? అప్పుడు సాంద్రత ఇంకా పెరిగిపోదా? అప్పుడు గురుత్వాకర్షణ బలం ఇంకా పెరగదా?… సాంద్రత ఇంకా… ఆకర్షక బలం ఇంకా… ఈ ప్రహేళిక ఎడింగ్టన్ కి కొరుకుబడలేదు.
ఈ సమస్యని ఎడింగ్టన్ సహాధ్యాయి అయిన రాల్ఫ్ ఫౌలర్, 1926 లో, గుళిక వాదం (quantum theory) ఉపయోగించి కొంతవరకు పరిష్కరించేడు. గుళిక వాదం అనేది భౌతిక శాస్త్రంలో తలెత్తుతున్న సరికొత్త దృక్పథం. దీనిని మేక్స్ ప్లేంక్ 1900 లో ఆవిష్కరించేడు. దానికి 1905 లో అయిన్^స్టయిన్ ఒక తోపు ఇచ్చేడు. ఆ తోపుతో అది ఊపు అందుకుని భౌతిక శాస్త్రంలో పెను దుమారం లేపి ఒక మహా వృక్షంగా ఎదిగిపోయింది. కానీ దాని శాఖలు నక్షత్రభౌతిక శాస్త్రంలోకి ఇంకా ఎగబాకలేదు. ఈ శాఖని అర్థం చేసుకున్న నక్షత్రభౌతిక శాస్త్రవేత్తలలో రాల్ఫ్ ఫౌలర్ ఆద్యుడు. ఈయన, కొత్తగా తలెత్తుతున్న ఈ గుళిక వాదం ఉపయోగించి, గురుత్వాకర్షణ బలం ప్రభావంతో కుదించుకుపోతున్న వాయుగోళం గతి ఏమవుతుందో లెక్క కట్టి చూసేడు. ఈ లెక్క ప్రకారం కుదించుకుపోతున్న వాయుగోళం ఒక దశకి వచ్చిన తరువాత మరకట్టు వేసినట్టు అకస్మాత్తుగా ఆగిపోతుంది. హమ్మయ్య! ఒక కొరుకుడు పడని సమస్యకి పరిష్కారం దొరికిందని అంతా సంతోషించేరు. ఎడింగ్టన్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు.
చంద్రశేఖర్ దృష్టికి ఫౌలర్ ప్రతిపాదించిన పరిష్కార మార్గంలో చిన్న లొసుగు కనిపించింది. గుళిక వాదం అనే అస్త్రాన్ని ప్రయోగించిన ఫౌలర్ ఆ రోజుల్లోనే ఊపందుకుంటున్న, అయిన్^స్టయిన్ ప్రతిపాదించిన, సాపేక్ష వాదాన్ని విస్మరించేడు. చంద్రశేఖర్ మద్రాసు నుండి ఇంగ్లండు వెళ్లే పడవలో ప్రయాణం చేస్తూ ఫౌలర్ ప్రతిపాదించిన నమూనాని తీసుకుని దానికి, అయిన్^స్టయిన్ ప్రతిపాదించిన, సాపేక్ష వాదాన్ని జోడించి, లెక్కని తిరిగి ఉరమరగా చేసేడు. ఈ గణనానికి కేవలం పది నిముషాలు పట్టిందిట. ఈ లెక్క ప్రకారం, ఒక నక్షత్రం యొక్క ప్రారంభ పరిమాణం (లేదా గరిమ) ఒక అవధిని మించి ఉంటే ఆ నక్షత్రంలో గురుత్వాకర్షక బలాన్ని అధిగమించగలిగే అంతర్గత బలాలు ఉండవు కనుక చిట్టచివరకు అటువంటి పెద్ద నక్షత్రాలు గురుత్వాకర్షక బలానికి బలి అయిపోతాయి. గురుత్వాకర్షక బలానికి బలి అయిపోవడం అంటే? దాని అంతరార్థం అప్పట్లో చంద్రశేఖర్ కి అవగాహన కాలేదు. అంటే, పెద్ద పెద్ద తారలు శ్వేతకుబ్జ తారల దశ చేరుకోకుండా అకస్మాత్తుగా కుప్పకూలిపోతాయా? మాయం అయిపోతాయా? ‘గురుత్వాకర్షక బలానికి బలి’ అంటే కుప్పకూలిపోవడమా? అంటే? మాయం అవడమే? ఎడింగ్టన్ తన పాఠ్య పుస్తకంలో లేవదీసిన ప్రహేళికకి ఇది సమాధానమా?
ఈ ఫలితాన్ని ప్రకటిస్తూ ఆ వేదిక మీద నిలబడ్డ చంద్రశేఖర్ హంసల మధ్య కాకిలా కనబడ్డాడు. అయితేనేమి? ఎట్టకేలకు అతను ఆకాంక్షిస్తున్న శ్రోతల ఎదుట తన వాదాన్ని ఉద్ఘాటించే అవకాశం కలిగింది.
అయిన్^స్టయిన్ 1905 లో తన ప్రత్యేక సాపేక్ష వాదాన్ని ప్రతిపాదించినప్పుడు అయన ఇదే విధమైన అనుభూతిని పొంది ఉంటాడు. దారి తెన్నూ లేకుండా నట్టడవిలో చిక్కడిపోయిన భౌతిక శాస్త్రానికి అయిన్^స్టయిన్ ఒక వెలుగు మార్గం చూపించేడు. చంద్ర ఇప్పుడు చేసిన పని అటువంటిదే! దారి తెన్నూ లేకుండా నట్టడవిలో చిక్కడిపోయిన నక్షత్త్రభౌతిక శాస్త్రానికి చంద్ర ఒక వెలుగు మార్గం చూపిస్తున్నాడు! .
వేదిక మీద నిలబడ్డ యువకుడు మెడలో ఉన్న టై ని కాసింత వదులు చేసుకుని, నుదిటి మీద చేరిన ఘర్మజలాన్ని తుడుచుకుని, ఒక గుక్క నీళ్లు తాగి, తాను ముందుగా, జాగ్రత్తగా రాసి తెచ్చుకున్న ఈ దిగువ ముక్తాయింపు మాటలు చదివి, తన ప్రసంగాన్నిముగించేడు:
“పెద్ద గరిమ గల నక్షత్రాల జీవితాలకి, చిన్న గరిమ గల నక్షత్రాల జీవితాలకి మధ్య మౌలికమైన తేడా ఉంది. చిన్న నక్షత్రాలు సహజంగా తమ వృద్ధాప్యం చేరుకునే సరికి శ్వేత కుబ్జతారలుగా పరిణామం చెంది, తదుపరి ఆరిపోతాయి. పెద్ద గరిమ గల నక్షత్రాల జీవనయానంలో శ్వేత కుబ్జ దశ ఉండదు. వాటి చివరి రోజులు ఎలా పరిపక్వము చెందుతాయో ఊహాగానం చెయ్యవలసిన అంశం.”
ప్రసంగం ముగించి, కాగితాలు కూడదీసుకుని, వేదిక దిగి, వెనక వరసలో తాను కూర్చున్న స్థలం చేరుకున్నాడు.
చర్చ, తర్జనభర్జన, సమాలోచన మొదలయ్యాయి. ప్రేక్షకులలో కూర్చున్న మిల్ని తాను సాధించిన ఫలితం దరిదాపు ఇలాంటిదే, ఇందులో నవ్యత ఏమీ లేదు అంటూ పెదవి విరిచేడు. చంద్రకి కావలసినది మిల్ని అభిప్రాయం కాదు. ఉత్కంఠతో వేచి ఉన్నాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం. నాటకీయంగా ఎడింగ్టన్ లేచేడు. లేస్తూనే ఒక్క ఉదుటున వేదిక మీదకి లంఘించేడు. లంఘిస్తూనే సింహంలా మెడని తాడించి “ప్రాణాలతో బయటపడతానో లేదో” అంటూ ఒక వెటకారంతో మొదలు పెట్టి “చంద్ర వాడిన తర్కం మూలంలోనే దోషభూయిష్టంగా ఉంది. ఇది ఒక అనిష్టాపత్తి కి ఉదాహరణ. ఇది ఒక గగనకుసుమం. చంద్ర ప్రతిపాదిస్తున్న వాదం అభిషవ శశవిషాణం అన్న సమాసానికి ఒక ఉదాహరణ! ఈ వాదానికి తలా, తోకా లేవు. శ్వేత కుబ్జతారల గరిమకి ఒక అవధి అంటూ ఏమీ లేదు…..” నిష్కర్షగా వచ్చిన ఈ తీర్పు విని సభాసదులు దిగ్భ్రమ చెందేరు. చంద్ర తల తిరిగిపోయింది. తను ఎడింగ్టన్ మాటలు సరిగ్గా విన్నాడా? తను గత మూడేళ్ళబట్టి పడుతున్న శ్రమ అంత బూడిదలో పోసిన పన్నీరేనా? ఎడింగ్టన్ మాటవరసకైనా ఈ అభ్యంతరం తనతో చెప్పలేదే!
ఎడింగ్టన్ అగ్రహావేశంతో చేసిన ప్రసంగం సారాంశం ప్రకారం ఆయన ఫౌలర్ ఫలితంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాడన్నమాట. అనగా ప్రతి నక్షత్రము అవసాన దశలో శ్వేత కుబ్జతారగా మారి, చల్లారి, చైతన్యం లేని శిలలా అంతరించాలి కానీ, చంద్రశేఖర్ ఉటంకించినట్లు కొన్ని తారలు శ్వేత కుబ్జ దశ చేరుకోకుండా, కూలిపోయి, అమాంతం మాయం అయిపోడానికి వీలు లేదు. అనుమానానికి ఆస్కారం లేకుండా బల్ల గుద్ది చెప్పేడు ఎడింగ్టన్!
“నిజమే! నేను 1926 లో రాసిన పుస్తకంలో ఎదో అలంకారం కోసం “కొన్ని తారలు కూలిపోయి మాయమయిపోయే సావకాశం ఉంది” అని అనుమానపడుతూ అనడం అన్నాను. కానీ ఇప్పుడు ఈ చాకు లాంటి కుర్రాడు నా అనుమానం నిజమే అని ఋజువు చేసేడు. ఈ కుర్రాడిని నా పర్యవేక్షణలో పెట్టుకుని, మేమిద్దరం కలసి దీని అంతు ఏమిటో తేలుస్తాం!” అని ఎడింగ్టన్ అని రాజమార్గం తీసుకుని ఉండుంటే చరిత్ర ఎలాగుండేదో? ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురయినప్పుడు నీల్స్ బోర్, ఆల్బర్ట్ అయిన్^స్టయిన్ అదే పని చేసేరు. తన మేథకి అందని అత్యంత ప్రతిభావంతుడు ఎదురైనప్పుడు హార్డీ ఏమిటి చేసేడు? రామానుజన్ మేధాశక్తిని కొలవగలిగే తాహతు తనకి లేదని బహిరంగంగా ఒప్పుకుని తనకి చేతనైన సహాయం చేసేడు.
చంద్ర యెడల ఎడింగ్టన్ ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తించేడు? చంద్ర బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించేడు. గతంలో తన యెడల ఎడింగ్టన్ ఎప్పుడూ ద్వేషభావం చూపించలేదే? అవసరం వచ్చినప్పుడల్లా వీలయిన సహాయం చేస్తూనే ఉండేవాడే! అకస్మాత్తుగా ఎందుకీ ద్వేషం? విజ్ఞులలో సాధారణంగా కనిపించే భేదాభిప్రాయం, అనేకత్వం కాదిది. ఎడింగ్టన్ విషం కక్కేడు. ఎందుకు?
ఈ ప్రశ్నకు రెండు కోణాల నుండి సమాధానం వెతకొచ్చు. ఒకటి ఎడింగ్టన్ మనస్తత్త్వం. రెండు, నక్షత్రభౌతిక శాస్త్రంలో పాతుకుపోయిన పాత సంప్రదాయపు ఆలోచనా సరళి. ఎడింగ్టన్ యొక్క అసలైన మనోభీష్టం ఏమిటో అయన అన్న మాటలలోనే గమనించవచ్చు: “నక్షత్రాలు ఇటువంటి వక్ర గతిలో ప్రయాణం చెయ్యకూడదని ఒక ప్రకృతి నియమం ఉండాలి.” ఈ వాక్యం అంతరార్థం ఏమిటి? “నా ఖగోళ శాస్త్రపు నమ్మకాలకి పరిధులు నిర్మించడానికి భౌతిక శాస్త్రానికి ఎన్ని గుండెలు?” భౌతిక శాస్త్రంలో పెను విప్లవ సిద్దాంతాలు, పెను మార్పులు వస్తున్న రోజులవి. గణితాన్ని ఆసరాగా చేసుకుని, ఊహకందని రీతిలో యువకులు సిద్దాంత సౌధాలు నిర్మిస్తున్నారు. కానీ ఈ మార్పులు నక్షత్రభౌతిక శాస్త్రం లోనికి చొరబడకుండా అడ్డుకుంటున్న సనాతన వాదులు కొందరు ఉన్నారు. వారిలో ఎడింగ్టన్ ఒకరు. బూజు పట్టిన పాత సిద్దాంతాల ధోరణినే అయన సమర్ధిస్తూ ఉంటే – అయన పరపతికి భయపడి కాబోలు – సభలో అందరూ అంగీకారంతో తల పంకిస్తున్నారు. వారిలో తన స్నేహితుడు మెక్రే కూడా ఉండడంతో రేగిన పుండు మీద కారం జల్లినట్లయింది. కొద్ధి గంటల క్రితం ఈ మెక్రే – తన వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పిన ఈ మెక్రే – ఇప్పుడు ఎడింగ్టన్ చెబుతున్నది సబబు గానే ఉందని పక్కనుండి చెవి కొరుకుతున్నాడు!
ఈ పరాభవానికి సమాధానం చెప్పాలి. చెప్పి తన పరువు నిలబెట్టుకోవాలి. చంద్ర లేచి నిలబడ్డాడు. కానీ సభాధ్యక్షుడు చంద్రకి అవకాశం ఇవ్వకుండా చర్చ ముగించేడు. “ఈ పత్రం పై చర్చకి ఇది అనుకూలమైన సమయం కాదు,” అంటూ తదుపరి కార్యక్రమం వైపు దృష్టి మరలించేడు. సభ ముగిసిన తరువాత అందరూ వచ్చి చంద్రని “అయ్యో!” అని పరామర్శ చేసి వెళ్లిపోయారు.
“ఎడింగ్టన్ వాదనలో ప్రతిభ లేకపోయినా అతని పరపతిని ఎదిరించడానికి అక్కడ ఉన్నవారికి ఎవ్వరికీ దమ్ములు లేక పోయాయి. ఎడింగ్టన్ మినహా మరెవ్వరయినా ఆ పని చేసి ఉంటే చంద్ర వాదనే నెగ్గి ఉండేది” అంటూ పరోక్షంగా కళ్ళ నీళ్లు తుడిచేడు మెక్రే. బహిరంగంగా భేదాభిప్రాయం వచ్చినప్పుడు వాళ్ల వాడైన ఎడింగ్టన్ ని సమర్ధించేరు తప్ప పరాయివాడిని కాదు. కొన్ని సంవత్సరాల తరువాత, ఉద్రేకాలు చల్లారిన తరువాత, చంద్రశేఖర్ ఇలా అన్నారు: “నాకు తెలిసినంత వరకు ఎడింగ్టన్ ఒకే ఒక సారి తప్పు చేసి, ఆ తప్పుని ఒప్పుకుందుకి ఇష్టపడ లేదు: అది నా విషయంలోనే జరిగింది. ఎడింగ్టన్ నన్ను ఎగతాళి చేస్తూ ఉంటే సభికులు గొల్లున నవ్వేరు. అది ఈ జన్మలో మర్చిపోలేను.”