పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

-నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్
ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
కూరలు లేకుండఁ జేయు కూరయె రుచియౌ

ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి.

చిరువోలు విజయ నరసింహా రావు, రాజమహేంద్రవరము
(1) కం.
భూరిగ సంతర్పణకయి
చేరిరి మిత్రులొక తోట, చేయుచు క్రీడల్
వారట మెచ్చిరి, దుంపల
కూరలు లేకుండ జేయు కూరయెరుచియౌ!
(2)కం.
వారము నందొక రోజున
చేరిన మిత్రులకు వంటజేయు మనంగా
కోరినవి తెచ్చి, వలదను
కూరలు లేకుండ జేయు కూరయెరుచియౌ!
(3)కం.
కోరకు పలురుచుల నెపుడు
తీరికగా వండిపెట్టి తినిపించగలే
మేరికి, నొకచో దుంపల
కూరలు లేకుండ జేయు కూరయె రుచియౌ!
(4)కం.
చేరిన హితులకు మేలగు
సారపు పాకములబెట్ట, సంతస మగునే
వారడిగినవిడి, నచ్చని
కూరలు లేకుండ జేయు కూరయె రుచియౌ!
చిరువోలు  సత్య ప్రసూన, న్యూ  ఢిల్లీ

(1)కం.
కూరలు లేకుండ తరమె
కూరలు వండగ? మనమున కోరిన రీతిన్
వారెట్లు మెచ్చి తినద(న)గు?
కూరలు లేకుండ జేయు కూరయె రుచియౌ?
(2)కం.
ఘోరము మీవంట లనుచు
పోరాడిరి పెండ్లివారు, బుధులు తెలుపగా
నారాటమున మసాలా
కూరలు లేకుండ జేయు కూరయె రుచియౌ!
(3)కం.
వారికి నచ్చవు కూరలు
పేరుకు విందునకు వచ్చి,పెట్టిరి తగవుల్
కోరినవి కొన్ని దొరకని
కూరలు లేకుండ జేయు కూరయె రుచియౌ!
(4)కం.
కోరిన కూరలు దొరకవు,
కోరక తెచ్చినవి మెచ్చు కుదురది లేదే!
వారికి నచ్చని యరుదగు
కూరలు లేకుండ జేయు కూరయెరుచియౌ!
ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్
(1)కం.
చేరగ బజారు కష్టము
కోరిన కూరలను గొనగ, కోవిడ్ వలనన్
దోరగ పప్పులు వేపియు,
కూరలు లేకుండ జేయు కూరయె రుచియౌ!
(2)కం.
కూరలు జేతురనేకము
కోరిన రుచులందు జనులు గూడిన శాకా
హారుల కెపుడున్ మాంసపు
కూరలు లేకుండజేయు కూరయె రుచియౌ!
మద్దాలి స్వాతి, రెడ్వుడ్ సిటీ, కాలిఫోర్నియా
కం.
భారీగా ధరలు పెరుగ,
కూరల నాణ్యత కొరవడె, కొరత పెరిగె; చే
కూరిన సరుకున, పుచ్చిన
కూరలు లేకుండఁ జేయు కూరయె రుచియౌ.

గతమాసపు సమస్యకు (రైలింజెను రోడ్డుమీద రయమున దిరిగెన్) అందిన మరొక పూరణ:
నాగిని (కలం పేరు), హైదరాబాదు
కం.
నీలపు వర్ణపు శకటము
నేలకు యాన్చుచు నడుపుచు నిండుగ నవ్వే
బాలుర చేతిన బొమ్మగు
రైలింజెను రోడ్డు మీద రయమున దిరిగెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked