వీక్షణం

వీక్షణం-77

— విద్యార్థి

 

వీక్షణం 77వ సమావేశం జనవరి 13, 2019 నాడు, శ్రీమతి విజయా ఆసూరి, శ్రీ వేణు ఆసూరి దంపతుల స్వగృహమునందు జరిగినది. భోగి పండుగ నాడు జరిగిన ఈ సమావేశం సంక్రాంతి సాహిత్య సభగా, ఒక ఆత్మీయ సమావేశంగా సాగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన వారు ఆచార్య చెన్న
కేశవ రెడ్డి గారు. ఈ సభలో మొదటి అంశం రావి శాస్త్రి గారి “పిపీలికం” కథా పఠనం మరియు చర్చ. కథ ఎంత బాగుందో, వేణు ఆసూరి గారి కథా పఠనం కూడా అంత ఆసక్తికరముగా సాగింది. ఈ కథ గురించి వేణుగారు వివరిస్తూ, “రావి శాస్త్రి గారు ఆంధ్ర జ్యోతి పత్రిక వారివద్ద అప్పు తీసుకుని, ఆ అప్పు తీర్చటం కోసం వ్రాసి ఇచ్చిన బాకీ కథలలో పిపీలకం ఒక కథ” అని వివరించారు. ఈ కథ శ్రామిక వర్గాలలో చైతన్యం నింపే కథ. వేరే వారెవరూ కాకుండా, పీడిత ప్రజలు తమకు తాము చైతన్యవంతులై దోపిడీవర్గాలను ఎదుర్కోవటాన్ని తెలిపే కథ. కథా శైలి గురించి విపులంగా జరిగిన చర్చ ఆసక్తికరముగా సాగింది.
ఆ తరువాతి కార్యక్రమం డా|| కె. గీత గారి “సిలికాన్ లోయ సాక్షిగా” కథా సంపుటి పుస్తకావిష్కరణ. గీతగారు అమెరికా లోని సిలికాన్ లోయకు వచ్చిన కొత్తలో వారి జీవిత అనుభవాలను, వారు గమనించిన ఇతర భారతీయుల మిథ్యాచారాలను, ఇక్కడి స్పానిష్ శ్రామిక వర్గం ఆత్మీయతలను పొందుపరుస్తూ వ్రాసిన కథల సంపుటి. శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు ఈ కథల సంపుటిని ఆవిష్కరించి, పుస్తక పరిచయం చేశారు. వారి మాటలలో “ఈ కథలు ఇచ్చటి సమాజాన్ని మంచితనం, మానవత్వంతో విశ్లేషించి, ఇచ్చటి వారి సమతను మమతను వివరించిన కథలు” అని చెప్పారు. తరువాత గీత గారు పుస్తకంలోని కథలను వివరిస్తూ కథలలోని పాత్రలన్నీ ప్రధాన పాత్ర చుట్టూ అల్లుతూ సాగిన గొలుసు కథలివన్నీ అని వివరించారు. నవ చేతనా పబ్లిషర్సు ప్రచురించిన ఈ కథా సంపుటి గీత గారి తొలి కథా సంపుటి. అధ్యక్షులు చెన్నకేశవ రెడ్డి గారు తమ స్వీయ రచనలు అందరికీ పరిచయం చేసారు. వారి “అక్షర న్యాసం” ఒక మంచి అధ్యయన వ్యాస సంపుటి. “మకాం మార్చిన మణి దీపం” వారి జీవితానుభవాల కవితా సంపుటి. కిరణ్ ప్రభ గారి ప్రశ్నావళి కార్యక్రమం ఎప్పటివలెనే అత్యంత ఆసక్తికరముగా, ఉత్సాహంగా జరిగినది.

తర్వాత విద్యార్ధి కథ “కల” గురించి లెనిన్ గారు ఉపన్యసించారు. ఆఖరుగా జరిగిన కవిసమ్మేళనంలో శ్రీ సాయిబాబా ఎప్పటిలా పేరడీ కవితను, శ్రీ చెన్న కేశవ రెడ్డి గారు గీత ను తమ పుత్రికగా భావిస్తూ రాసిన కవితను వినిపించి అందరినీ అలరించారు. శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ ఇక్బల్, శ్రీ మృత్యుంజయుడు తాటిపామల, శ్రీ హరనాథ్, శ్రీ సాయిబాబా, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి కోటేశ్వరి, శ్రీమతి ఉమా వేమూరి మొదలైన స్థానిక
ప్రముఖులు పాల్గొన్న ఈ సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

—0—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked