వీక్షణం

వీక్షణం-82

వీక్షణం 82వ సమావేశం కాలిఫోర్నియాలోని మోర్గాన్ హిల్ లో డా||కె.గీత గారింట్లో ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం డా||కె.గీత, భర్త శ్రీ సత్యన్నారాయణ గారితో బాటూ కలిసి సభకు ఆహ్వానం పలికారు.
ఈ సభకు శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా “తెలుగురచయిత.ఆర్గ్” నుండి శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి “ఉద్వేగాలు” కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు.
రాజు, శేషి అన్నా చెల్లెళ్లు. కథా ప్రారంభంలో “ఉద్వేగాలు అంటే నాకు చాలా అసహ్యం. ఏమీ కారణం లేకపోయినా ఏడవగలగడం ఒక గొప్పతనమేమోగాని, సంఘమర్యాదకీ, నాగరికతకీ తగినదిమాత్రంకాదు. పెద్దవాళ్లెవరేనా కంటనీరు పెట్టుకొని ఏడిచారంటే నాకు రోత. నాకేగాదు, నాగరికత అంటే తెలిసిన ప్రతివాడికీని. హరిశ్చంద్రనాటకంలో కూర్చుంటేవేషాలు వేసేవాళ్లు సరిగా ఏడవలేకపోయినా, మనకి అటూ ఇటూ కూర్చున్నవాళ్లు ముక్కులు చీదుకుంటూ, గొంతులు సవరించుకొంటూ కళ్లనీళ్లు తుడుచుకోవటం చూసినప్పుడల్లా ‘అరెరే ఏమిటీ మూఢత్వం?’ అనుకుంటాను. పరామర్శకి వెళ్ళే పెద్దమనుష్యులంతా తేలికగా కళ్లనీళ్లు తెప్పించుకుని కష్టమంతా తమదయినట్టుగా నటించగలగడం చాలా కష్టమేమోగాని, అది సభ్యత ఎంతమాత్రం కాదని నా నిశ్చితాభిప్రాయం.” అంటూ ఉపోద్ఘాతంలోనే రాజుకు ఉద్వేగాల్ని ప్రదర్శించే వాళ్లంటే చిరాకు అని మొదలవుతుంది కథ. చెల్లెలు అందుకు భిన్నంగా అన్నిటికీ చలించే పాత్ర. వయసుతో బాటూ శేషి, శేషుగానూ, శేషప్పగానూ మారే తరుణంలో రకరకాల సంఘటనల్లో శేషు ప్రవర్తన ప్రదర్శించిన ఉద్వేగాలు రాజులో చివరకు ఆలోచనలు రేకెత్తిస్తాయి. “మనసులో విచారాన్నంత పయికి వదిలివేయడం తప్పా? దానికి మనసులో ఒకటే సమాధానం. తప్పు కాకపోయినా సభ్యతకాదు. అయితే అటు వంటి పరిస్థితులో నేను ఏం చెయ్యాలి? దానికిమాత్రం నా మనసులో సమాధానం లేదు.” అంటూ మీమాంసతో ముగుస్తుంది కథ.
అనంతరం కథా చర్చ జరిగింది. మానవ సహజమైన ఉద్వేగాలు నాగరికత, సభ్యత ముసుగు చాటున ఎలా దాక్కుంటాయో తెలియజెప్పే కథ అని, కథ లో అంతర్లీనమైన అంశంగా భావోద్వేగాల్ని చెప్పడం బావుందని, పద్మరాజు గారి శైలి విలక్షణమైనదనీ…అంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసారు అందరూ.
ఆ తర్వాత దానికి కొనసాగింపుగా సభలోని వారి కోరిక మేరకు కిరణ్ ప్రభ గారు గత 22 వారాలుగా ఆసక్తిదాయకంగా కొనసాగుతున్న తన చలం టాక్ షో పై సంక్షిప్త ప్రసంగం చేసారు.
20వ శతాబ్దపు అత్యంత వివాదాస్పద, సంచలన రచయిత – “తన మార్గాన్ని తానే వెదుక్కుంటూ , ఒక వ్యక్తి ఒక జీవితకాలంలో ప్రయాణించగలిగినంత దూరం ప్రయాణించిన ప్రేమర్షి” – చలం సాహిత్యం – జీవితం- అంటూ కొనసాగిన టాక్ షోలో విలక్షణ చలం సాహిత్యం, జీవితంతో బాటూ చలంగారి కారుణ్య దృష్టి, మానవ సేవా దృక్పథ వివరణ, చలం గారి కుటుంబసభ్యులు, పిల్లల వివరాలు, వారి అనుపమాన వ్యక్తిత్వాలను గురించి వివరంగా సాగిన ప్రసంగం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.
విరామం లో “ఫాదర్స్ డే” సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు గీత గారు.
విరామం తర్వాత జరిగిన సాహితీ క్విజ్, కవిసమ్మేళనం, పాటల కార్యక్రమం లో అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
వీక్షణానికి తొలిసారిగా విచ్చేసిన సాగర్ గారు పాడిన “జగమంత కుటుంబం నాది” పాట, డా|| గీత గారు “మేఘమా దేహమా “, ఉమా వేమూరి గారు పాడిన “రావోయి బంగారి మామా” పాటలు, పిల్లలమర్రి కృష్ణకుమార్ గారి సంస్కృత పద్యాలు, వనపర్తి సత్యన్నారాయణ గారు గొంతెత్తి ఆలపించిన ఉమర్ ఆలీషా కవిగారి పద్యాలు, కిరణ్ ప్రభ గారి కవితలు, గీత గారి కవిత “మెసేజీ యుగం” అందరినీ ఆనంద సాగరంలో ఓలలాడించేయి. స్థానిక ప్రముఖులతో బాటూ కొత్తగా వీక్షణానికి విచ్చేసిన సాహిత్యాభిలాషుల ఆనందోత్సాహాల మధ్య ముగిసింది ఈ నాటి సభ.

—–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked