– డా. అక్కిరాజు రమాపతిరావు
“అన్నా! నీవు పితృవాక్య పరిపాలన రూపమైన సన్మార్గం అవలంభించి, జితేంద్రియుడవై ఉన్నా నిన్ను ధర్మం ఆపదలనుండి కాపాకలేకపోతున్నది. కాబట్టి ఆ ధర్మం నిష్ప్రయోజనం. లోకంలో స్థావరాలు (చెట్లు, కొండలు మొ.), జంగమాలు (పశువులూ, మనుషులూ మొ.) కనపడినట్లు ధర్మాధర్మాలు కనపడటం లేదు. కాబట్టి ధర్మాధర్మాలనేవి లేనే లేవు. అధర్మమే వాస్తవానికి ఉండవలసివస్తే రావణుడివంటి అధార్మికుడు కష్టాలపాలు కావాలి. నీవంటి ధార్మికుడికి కష్టాలే రాకూడదు.రావణుడికి ఆపదలు రాకపోవాటాన్నీ, నీకు కష్టాలు రావటాన్నీ పరిశీలిస్తే – అధర్మం, ధర్మఫలాన్నీ, ధర్మం అధర్మఫలాన్నీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అధర్మమే ఆచరించేవారికి సంపదలూ, ధర్మాన్నేఆచరించేవారికి కష్టాలు కలగటాన్ని బట్టి ధర్మాధర్మాలు నిష్ఫలాలు. ఉన్నదో లేదో తెలియని, అది ఉత్తమఫలాన్నే ఇస్తుందనే నిశ్చయం లేని ధర్మాన్ని పట్ట్టుకొని పాకులాడేకంటే దాన్ని విడిచి పెట్టటమే మంచిది అనుకుంటాను.
సత్యం పలకటమే ధర్మమైతే, మొదట రాజ్యం నీ కిస్తానని చెప్పి ఇవ్వకుండా సత్యం తప్పి, దయమాలిన మన తండ్రిని నీ వెందుకు బంధించలేదు? దేవేంద్రుడు విశ్వరూపుడిని చంపి యజ్ఞం చేశాడు కదా. ధర్మమే చెయ్యాలి అంటే ఆయన యజ్ఞమొక్కటే చేయాలి; మునిని చంపకూడదు. అధర్మమే కర్తవ్యమైతే మునిని చంపాలి. యజ్ఞం చేయకూడదు. కాని ఆయన రెండూ చేశాడు. అంటే సందర్భాన్ని బట్టి క్షత్రియుడు ధర్మార్థాలు రెండూ ఆచరించవచ్చనేగా తేలుతున్నది. కాని నీవు రాజ్యం విడిచిపెట్టి ఆనాడు ధర్మానికి మూలమైన అర్థాన్ని కోల్పోయావు.
సామ, దాన, భేద, దండాలనే ఉపాయాలను ప్రయోగించి క్రమంగా అర్థాన్ని సాదిస్తే దానిలో పనులన్నీ చక్కగా సిద్ధిస్తాయి. ధనహీనుడి పనులు నశిస్తాయి. ధనమున్నవాడికే మిత్రులుంటారు. అతని వద్దకే బంధువులు చేరుకుంటారు. ధనం కలవాడే పురుషుడు. అతడే పండితుడుగా గౌరవించబడతాడు. అతడే పరాక్రమశాలి. అతడే బుద్ధిమంతుడు. అతడే భాగ్యవంతుడు! గుణవంతుడూ కూడా. నీవు రాజ్యాన్నీ, రాజ్యంవల్ల లభించే అర్థాన్నీ ఏ దోషం చూచి విడిచివేశావు? ధనమున్నవాడికే ధర్మం, కామం, అర్థం సిద్ధిస్తాయి. అంతా వానికి అనుకూలమే అవుతుంది. ధనం లేకుంటే దానికోసం ఎంత ప్రయత్నించినా అది లభించదు. ధనం పెంపొందించుకోవాలంటే ఎంతో కొంత ధనం ఉండాలికదా.
ధనమున్నవాడిలో గుణాలన్నీ శోభిస్తాయి. లభించే ధనాన్ని తోసిపుచ్చుతూ ధర్మాన్నే ఆచరించేవాడికి ఈలోకంలో సుఖాలు కలగవు. అటువంటి ధనం నీవద్ద కనిపించటం లేదు. నీవు తండ్రి ఆజ్ఞ పాటించి, అడవికి రావటం వల్లే రావణుడు నీకు ప్రాణాలకంటే ప్రీతిపాత్రురాలైన సీతమ్మను అపహరించాడు.
ఇప్పుడు నీకు ఇంద్రజిత్తువల్ల కలిగిన దుఃఖాన్ని నా పరాక్రమంతో తొలగిస్తాను. నీవు మహాత్ముడివి, బుద్ధికుశలుడివి అయి కూడా నిన్ను గూర్చి ఎందుకు తెలుసుకోవటం లేదు? సీతమ్మ మరణాన్ని చూచి కోపించిన నేను నీకు ప్రియం కలిగించటానికి ఉద్యమించి రావణుణ్ణీ, అతడి లంకానగరాన్నీ అతని చతురంగబలాల్నీ నా బాణాలతో నాశనం చేస్తాను’’ అంటూ అన్నను ఓదార్చారు.
విభీషణుడు రామలక్ష్మణులను ఒదార్చటం
అప్పుడక్కడకు విభీషణుడు తన నలుగురు మంత్రులనూ వెంటబెట్టుకొని వచ్చి అక్కడి విషాదదృశ్యాన్ని చూసి ఏం జరిగిందని లక్ష్మణుణ్ణి అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడు తీసుకొనివచ్చిన దారుణ వృత్తాంతాన్ని విభీషణుడికి తెలియజేశాడు. సుగ్రీవుణ్ణి చూస్తూ, విభీషణుడికి లక్ష్మణుడు ఇంకా ఏదో చెప్పబోతుండగా, ఆయనను ఏమీ మాట్లాడనీయకుండా వారించి విభీషణుడు ఇట్లా అన్నాడు. “సముద్రం ఎండిపోయిందంటే నమ్మటం ఎంత అసంగతమో, హనుమంతుడు తెచ్చిన వార్త అంతకేంటే అసంగతం. ఇంద్రజిత్తు కల్పించిన మాయ ఇందంతా’’ అని స్పష్టం చేశాడు విభీషణుడు. “వానరవీరులను మోసం చేసి నికుంభిలా దేవతాలయంలో వాడు హోమం చేయడానికి ఉద్దేశించిన కపటనాటక మిది. వాడా హోమం పూర్తి చేసుకొని వచ్చేట్లయితే జయించటం మాట అట్లా ఉంచి వాన్నెవరూ కళ్ళెత్తి చూడలేరు. ప్రభూ! విచారం ఏమీ అక్కరలేదు నీకు. తారకాసురుణ్ణి సంహరించ వలసిందిగా ఇంద్రుడు కుమారస్వామిని కోరినట్లు, నీవు ఇంద్రజిత్తును సంహరించ వలసిందిగా లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించు.’’ అని విభీషణుడు శ్రీరాముడికి విన్నవించుకున్నాడు.
శ్రీరాముడు శోకవ్యగ్రుడై విభీషణుడు చెప్పింది పూర్తిగా తెలుసుకోలేదు. కాని విభీషణుడు నెమ్మదిగా అప్పుడు చేయవలసిన కర్తవ్యం వివరించి “రామచంద్రా! లక్ష్మణుణ్ణి వానరసైన్యంతో పంపించి, నికుంభిలా దేవాలయంలో హోమం చేస్తున్న ఇంద్రజిత్తును, అది పూర్తికాకుండానే చంపివేసేట్లు చూడు’’ అని వివరంగా ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడి నుంచి సంపాదించిన వరాలు, వాడెట్లా వధ్యుడయ్యేదీ కూడా శ్రీరాముడికి చెప్పాడు. అన్న అనుమతి తీసుకొని లక్ష్మణుడు నికుంభిలా దేవాలయానికి వానర ప్రముఖులతో వేగంగా చేరుకున్నాడు. అక్కడ కాపలాకాస్తున్న రాక్షససైన్యాన్ని చూశాడు. నికుంభిలా దేవత ఆలయస్థానాన్ని గుర్తించటం సమస్య అయింది లక్ష్మణుడికి. ముందుగా ఆ రాక్షసపరివారాన్ని పరిమార్చితే కాని ఇంద్రజిత్తును యుద్ధానికి పురికొల్పటం జరగదు అని విభీషణుడు చెప్పగా, హనుమంతుడు భయంకరంగా పోరి ఆ రాక్షససేనను నిర్మూలించాడు. అప్పుడు ఇంద్రజిత్తు క్రుద్ధుడై రథంమీద అధిరోహించి యుద్ధరంగానికి వచ్చాడు. ఇంద్రజిత్తును ఆయువుపట్టు మీద కొట్టి చంపవలసిందిగా లక్ష్మణుణ్ణి విభీషణుడు ప్రబోధించాడు. లకష్మణుడితో ఉన్న తన పినతండ్రి విభీషణుణ్ణి, ఇంద్రజిత్తు పరుషంగా నిందించాడప్పుడు. “నీవు స్వజనాన్ని చంపటానికి విరోధిని తీసుకొని వచ్చావు’’ అని తూలనాడాడు. విభీషణుడు కూడా అప్పుడు అందుకు తగిన సమాధానం చెప్పాడు.
అప్పుడు ఇంద్రజిత్తు, విభీషణుణ్ణి చంపటానికి భయంకర ఖడ్గం చేత ధరించి వెళ్ళాడు. హనుమంతుడి మూపున ఉన్న లక్ష్మణుణ్ణి చూసేప్పటికి ఇంద్రజిత్తుకు కోపం ఇంకా జ్వలించింది. పక్కనే ఉన్న విభీషణుణ్ణి కరకు పలుకులతో దూషించాడు. అప్పుడు ఇంద్రజిత్తుకూ, లకష్మణుడికీ తమ తమ బలపరాక్రమాలు ఉద్ఘాటిస్తూ సంవాదం జరిగింది. ఒకరినొకరు ఎత్తిపొడుచుకున్నారు. నిరసించుకున్నారు. ఇక పరమభయంకరంగా పోరుసలిపారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో, దేవేంద్రుడు వృత్తాసురిడితో పోరాడినట్లు పోరాడాడు. ఇంద్రజిత్తు ముఖం కళతప్పడం, రాక్షసులకు దుర్నిమిత్తాలు, అపశకునాలు కనపడి కలవరపడుతూ ఉండడం చూసి విభీషణుడు వెంటనే ఇంద్రజిత్తును వధించవలసిందిగా లకష్మణుణ్ణి హెచ్చరించాడు. ఇంద్రజిత్తు కూడా ఏమాత్రం చలించలేదు. అప్పుడు వాళ్ళిద్దరూ హోరా హోరీ పోరాడారు. క్రుద్ధులై ఒకరినొకరు వధించాలని పరాక్రమించారు. విభీషణుడు ఇదే అదను సుమా అని వానరవీరులను పురికొల్పాడు. వానరవీరులు అసమానవీరవిక్రమంతో రాక్షసులను చంపివేస్తుండగా రాక్షసులు జాంబవంతుణ్ణి తమ లక్ష్యం చేసుకుని ఆయనను చుట్టుముట్టారు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుణ్ణి తన మూపునుండి దింపి ఒక పెద్ద సాలవృక్షంతో రాక్షససంహారానికి పూనుకున్నాడు. విభీషణుడప్పుడు ఇంద్రజిత్తును ఎదుర్కొని ద్వంద్వయుద్ధం చేయటం సాగించాడు. ఇంతలో లక్ష్మణుడు కనిపించేటప్పటికి ఇంద్రజిత్తు మళ్ళీ లక్ష్మణుణ్ణి లక్ష్యం చేసుకున్నాడు. అత్యంత నిశితమైన శాస్త్రాలను ఇంద్రజిత్తు లకష్మణుడిపై ప్రయోగించాడు. ఘోరపోరాటం జరిగింది. అశేష జన నాశనం, జంతువధ, సంపద్వినాశనం చూసి ఇక ముందు ఏ యుద్ధం లేకుండా సమస్తలోకాలు సుఖంగా ఉండాలి అని మహర్షులు ఆకాంక్షించారు.
లక్ష్మణుడు ముందుగా ఇంద్రజిత్తు రథసారథిని చంపివేశాడు. అప్పుడు ఇంద్రజిత్తే స్వయంగా రథసారథ్యం చేసుకుంటూ పరాక్రమించాడు. అప్పుడు లక్ష్మణుడు బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తు రథం గుర్రాలను కూల్చివేశాడు. ఇంద్రజిత్తు వదనం పాలిపోయింది. విషన్నుడైనాడు. అప్పుడు ప్రమాథీ, శరభుడూ, రథసుడూ, గంధమాదనుడు అనే నలుగురు వానరయోధులు లక్ష్మణుడికి బాసటగా వచ్చి ఇంద్రజిత్తు రథాన్ని చూర్ణం చేశారు.
విరథుడైన ఇంద్రజిత్తు మీద లక్ష్మణుడు శరవర్షం కురిపించాడు. రాక్షసులూ, వానరులూ పరస్పరజయేచ్చతో తమ పరాక్రమం చూపుకున్నారప్పుడు. ఇంద్రజిత్తు తన రాక్షసయోధులను వానరులతో మీరు తుములయుద్ధం చేస్తూ ఉంటే, నా మాయాకౌశలంతో లంకనుంచి వేరే రథం ఎక్కి వస్తానని మెరుపువేగంతో వెళ్ళి, మళ్ళీ యుద్ధసన్నద్ధుడై వచ్చాడు. లకష్మణుడిపై మళ్ళీ బాణవర్షం కురిపించాడు. వాళ్ళు పరస్పరం తీవ్ర శరఘాతాలతో ఒకరినొకరు ఎదుర్కొన్నారు. లక్ష్మణుడు వారుణాస్త్రం ప్రయోగిస్తే ఇంద్రజిత్తు రుద్రదేవతాకమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. యముడు ఇచ్చిన బాణాన్ని ఇంద్రజిత్తు ప్రయోగించగా కుబేరుడిచ్చిన బాణాన్ని లక్ష్మణుడు ప్రయోగించాడు. ఆ రెండూ పరస్పరం ఢీకొట్టి నిస్తేజము లైనాయి.
(-సశేషం)