ధారావాహికలు

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ఇంద్రజిత్ సంహారం

ఈ విధంగా వాళ్ళు ఎన్నో ప్రభావమహితాలైన దేవతాస్త్రాలతో పోరాడారు. ఇట్లా ఎడతెగని పోరు సలుపుతూ ఉండగా లక్ష్మణుడు ఒక తీవ్రాతితీవ్ర శరాన్ని ఇంద్రాస్త్రంతో అభిమంత్రించి –

ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది,

పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిమ్ (యుద్ధ 01.72)

“ఓ బాణమా! దశరథమహారాజు పెద్దకొడుకు శ్రీరాముడు ధర్మాత్ముడూ, సత్యసంధుడూ, అవక్రవిక్రమపరాక్రముడూ అయితే, నీవు ఇంద్రజిత్తును తక్షణం వధించాలి’’ అని అంటూ ప్రయోగించాడు.

అప్పుడా బాణం వెళ్ళి ఇంద్రజిత్తు తలను ఖండించింది. ఆకాశంలో దేవతలు, మహర్షులు, గంధర్వులు హర్షధ్వానాలు చేశారు. లక్ష్మణుణ్ణి వానర యోధులు ఆలింగనం చేసుకొని అభినందించారు. అప్పుడిక లక్ష్మణుడు-జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు పక్కన తనకు ఊతమిస్తుండగా శ్రీరాముణ్ణి దర్శించటానికి వెళ్ళాడు. శ్రీరాముడు, లకష్మణుడి శిరసు నాఘ్రాణించి సంబరంతో కౌగిలించుకున్నాడు. ఇక రావణుడు యుద్ధానికి వస్తాడు. వాడిని అంతం నేను చేస్తాను అని శపథం చేసినట్లు పలికాడు. యుద్ధరంగంలో క్షతగాత్రులై డస్సిపోయిన లకష్మణుడికీ, విభీషణుడికీ చికిత్స చేయవలసిందిగా వానరులలో వైద్యవిశారదుడైన సుషేణుణ్ణి శ్రీరాముడు అర్థించాడు. గాయాలపాలు అయిన వారందరినీ స్వస్థదేహులను చేయవలసినవాడివి నీవే కదా అని అభినందించాడు. అప్పుడు సుషేణుడు వానరులందరికీ చికిత్స చేశాడు. లక్ష్మణుడికీ, విభీషణుడికీ కూడా చికిత్స చేసి వాళ్ళ గాయాలు తొలగిపోయేట్లు చేశాడు.

మంత్రులు వెళ్ళి రావణుడికి, ఇంద్రజిత్తు రణరంగంలో మరణం పొందిన ఘోరవార్త నినిపించారు. రావణుడి దుఃఖానికి అంతులేదు. ఇంక రామలక్ష్మణులను చంపివేస్తానని భీకరావేశంతో ఉద్ఘోషించాడు కాని, ఇంతకూ మూలకారకురాలైన సీతను వధించాలని ముందుగా నిశ్చయం చేసుకున్నాడు. తన ప్రియపుత్రుణ్ణి లక్ష్మణుడు చంపినందుకు ఇదే తగిన ప్రతీకారం అని నిర్ణయించాడు. ఇంద్రజిత్తు మాయసీతను చంపివేస్తె నేను అసలు సీతనే చంపుతానని కఠోరనిర్ణయం తీసుకున్నాడు. తన మంత్రులనూ భార్యలందరినీ వెంటబెట్టుకొని జానకి ఉన్న తావుకు బయలుదేరాడు. తనను చంపటానికి వస్తున్న క్రూరుడైన రావణుణ్ణి చూసి వైదేహి గజగజ వణికిపోయింది. తాను మారుతి వీపుమీద కూర్చొని రాముణ్ణి చేరుకొని ఉంటే ఈ దురంతం జరిగేది కాదు కదా అని పిలపించింది. కౌసల్యనూ అయోధ్యలోని రాచకుంటుంబాన్ని తలచుకొని కడివెడు కన్నీరు కార్చింది.

సీతాసంహారానికి రావణుడి యత్నం, విరమణ

కత్తి పట్టుకుని వస్తున్న రావణుణ్ణి సుపార్శ్యుడనే సౌజన్యబుద్ధి కల మంత్రి ఆ క్రూరకార్యం నుంచి వారించి, స్త్రీ వధ చేసి ఎన్నటికీ మాసిపోని దుర్శశస్సు ఎందుకనీ, అది మహాపాపమనీ రాముణ్ణి హతమారిస్తే నీవాంఛ నెరవేరి సీత నీ వశమవుతుందనీ బోధించి రావణుణ్ణి యుద్ధానికి ప్రేరేపించాడు. ఇది కర్తవ్యమేనని భావించాడు రావణుడు.

రావణాసురుడి అహంకారం అణగిపోయింది. మిగిలి ఉన్న తన సమస్త సేనాపరివారంతో యుద్ధరంగానికి వచ్చాడు రావణుడు. రామరావణుల పోరు అత్యంత భయంకరంగా సాగింది. రాక్షసాంగనలంతా తామనుభవించబోయే ఘోర విపత్తుకు కుమిలి కుమిలి దుఃఖించారు. ఇందుకు కారణమైన పరిణామాలన్నిటినీ తలచుకొని రోదించారు. రావణుడి దుష్టత్వాన్ని ఏవగించుకున్నారు.

రావణుడు తిరిగి రంగప్రవేశం చేయటం

సమస్తాయుధాలతో, మిగిలిన తన రాక్షసబలాలతో, మహాపార్శ్యుడూ, మహోదరుడూ, విరూపాక్షుడూ తన ఆజ్ఞానువర్తులై యుద్ధసన్నద్ధులై రాగా జ్వలిస్తున్న అగ్నిహోత్రంలాగా రావణుడు రణభూమికి వచ్చాడు. ఆ రాక్షసుడప్పుడు ఎనిమిది గుర్రాల రథంమీద యుద్ధభూమిలో తన సమస్తసేనలతో మోహరించాడు. రామలక్ష్మణులున్న లంక ఉత్తరద్వారం దగ్గరకు తన రథం మీద వచ్చాడు రావణుడు. చండప్రచండంగా వానరవధ సాగించాడు.

అప్పుడు సుగ్రీవుడితో ఘోరయుద్ధానికి పూనుకున్నాడు విరూపాక్షుడు. వాళ్ళ మధ్య యుద్ధం ఘోరంగా సాగింది. రణపరాక్రమోత్సాహులై కత్తులతో, వివిధ మారణాయుధాలతో వాళ్ళు పోరాడారు. తర్వాత ద్వంద్వయుద్ధం చేశారు. సుగ్రీవుడు, విరూపాక్షుణ్ణి ముఖం మీద చేతితో మోది చంపివేశాడు.

తన సైన్యం క్షీణించిపోవడం చూసి రావణుడు మరింత కోపోద్రిక్తుడైనాడు. వానరసేనను ఊచకోత చేసి నిర్మూలించాల్సిందని మహోదరుణ్ణి పురికొల్పాడు.

వానరాలను ఘోరంగా మహోదరుడు చంపివేస్తుండగా వానరులు సుగ్రీవుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు సుగ్రీవుడికీ, మహోదరుడికీ గొప్ప యుద్ధం జరిగింది. వాళ్ళు పరస్పర జయకాంక్షతో వివిధాయుధాలతో ఒకరినొకరు హింసించుకున్నారు. అప్పుడు ఒక పరిఘతో మహోదరుడి రథాశ్వాలను కూల్చివేశాడు సుగ్రీవుడు. ఆ ఇద్దరూ ఆబోతుల మాదిరిగా ఢీకొన్నారు, కుమ్ముకున్నారు. ద్వంద్వయుద్ధంలో పిడికిళ్ళతో ఒకరినొకరు పొడుచుకున్నారు. ఒకరినొకరు లేవనెత్తి విసరిపడేశారు.

తరువాత ఇద్దరూ కత్తీ, డాలూ ధరించి పోరాడారు. సుగ్రీవుడు, మహోదరుడి తల తన కత్తితో నరికివేశాడు. వానరులంతా అప్పుడు సింహనాదాలు చేశారు. ఇట్లా సుగ్రీవుడి చేతిలో మహోదరుడు హతుడు కావటం మహాపార్శ్యుడు చూశాడు. పోయి అంగదుడిపై విజృంభించాడు. మేటి వానరవీరులను కూడా తన లక్ష్యం చేసుకొని పోరాటం సాగించాడు మహాపార్శ్యుడు. అప్పుడు మహాపరాక్రమశాలి అయిన గవాక్షుడు తన భల్లూకసైన్యం నుంచి విడివడి మహాపార్శ్యుడిపైకి దాడికి వెడలాడు. గవాక్షుణ్ణీ, జాంబవంతుణ్ణీ, మహాపార్శ్యుడు ఢీకొనటం చూసి అంగదుడు కుపితుడై ఆ రాక్షసుడి చెంపపై బలంగా చరిచాడు. గండ్రగొడ్డలితో మహాపార్శ్యుడు, అంగదుడిపై తిరగబడ్డాడు. దానిని తప్పించుకొని మహాపార్శ్యుడి వీపుమీద బలమైన పిడికిటి పోటు పొడిచాడు అంగదుడు. వెంటనే ఆ రాక్షసుడి ముందుకు వచ్చి గుండెమీద ఒక్కపోటు పొడిచాడు. దానితో గుండె వక్కలై మహాపార్శ్యుడు నేలకూలాడు. రాక్షస సైన్యమంతా కకావికలైంది. అది చూసి వానరయోధులు కోలాహాలంగా సింహనాదాలు చేశారు. ఆకాశంలో దేవతలు జయజయధ్వానాలు చేశారు. అప్పుడు రావణుడు మహోగ్రనేత్రుడైనాడు.

రామరావణయుద్ధం

రామలక్ష్మణులను ఇప్పుడే వధిస్తానని రావణుడు బయలుదేరాడు. వానరసేనపై తామసాస్త్రాన్ని ప్రయోగించాడు. అది వాళ్ళను దగ్ధం చేసింది. తక్కినవాళ్ళు పారిపోయారు. అప్పుడు రామ, రావణులు పరస్పరం తీవ్రనారాచాలు ప్రయోగించుకున్నారు. రాముడు ధనుఃస్ఫాలనానికి రావణుడి ధనుష్టంకారానికీ ఇరుపక్షాలు సంక్షోభించాయి. రాముడు అనుజ్ఞ తీసుకొని ముందుగా రావణుణ్ణి నిలువరించాడు లక్ష్మణుడు. రావణాసురిడి మీద అగ్ని శిఖలవంటి బాణాలను వదిలాడు లక్ష్మణుడు. రావణుడు వాటిని లక్ష్యపెట్టలేదు. తన బాణాలతో ఆకాశంలోనే వాటిని తుత్తునీయలు చేశాడు. ఇక లక్ష్మణుణ్ణి నిర్లక్ష్యం చేసి రాముడిపైకి దూసుకొని పోయినాడు రావణుడు. అప్పుడు రాముడూ, రావణుడూ రుద్రుడూ-యముడూలాగా పోరాటం సాగించారు. వాళ్ళ బాణకాంతులతో ఆకాశం మెరుపులతో మెరిసినట్లు మెరిసిపోయింది.

అప్పుడు సూర్యాస్తమయం అయింది. రావణుడు మహాభయంకరమైన అసురాస్త్రాన్ని రాముడిపై ప్రయోగించాడు. అది బహురూపాలతో భయంకరమై రాముణ్ణి చుట్టుముట్టింది. దానిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు రాముడు. రావణుడి అస్త్రాలు రాముడి అస్త్రాలముందు దగ్ధమైపోయినాయి. రావణాసురుడి కోపం మరింత తీవ్రమయింది. రావణుడు, రాముడిపై రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడప్పుడు అందులోంచి భయంకర ఆయుధాలు పట్టి రాముడిపైకి వచ్చాయి. అప్పుడు రాముడు రావణుడిపై గాంధర్వాస్త్రం ప్రయోగించాడు, ఆ అస్త్రం ముందు రావణుడి రౌద్రాస్త్రం నిష్ప్రయోజనమైపోయింది. అప్పుడు రావణుడు మండిపడుతూ సౌరాస్త్రం (సూర్యాస్త్రం) ప్రయోగించాడు రాముడి మీద. అనేక చక్రాయుధాలు అందులోనుంచి బయలుదేరి రాముణ్ణి చుట్టుముట్టాయి. కాని రాముడు వాటన్నిటినీ ధ్వంసం చేశాడు తన బాణాల చేత. తరువాత రాముడు అమితతీక్షణమైన అస్త్రాలను రావణుడిపై ప్రయోగించాడు. అప్పుడు లక్ష్మణుడు, రాముడికి ఒకింత విశ్రాంతి కలుగజేయాలని తాను రణరంగంలో రావణుణ్ణి ఢీకొన్నాడు. లక్ష్మణుడప్పుడు రావణుడి రథపతాక పడగొట్టాడు. తన బాణాలతో రథసారధిని చంపివేశాడు. అప్పుడు విభీషణుడు, లకష్మణుడికి కొంత విరామం కల్పించదలచి చేతిలో గద ధరించి వచ్చి రావణుడి రథాశ్వాలను నేలగూల్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked