అప్పుడు దేవతలు ‘నాయనా శ్రీరామా! నిన్ను చూడాలని స్వర్గలోకం నుంచి నీ తండ్రి దశరథ మహారాజు విమానంలో వచ్చాడు’ అన్నారు. ‘మీ అన్నదమ్ములాయనకు నమస్కరించండి’ అని పరమశివుడు వాళ్ళకు చెప్పాడు.
విమానంలో ఉన్నతాసనం మీద దివ్యకాంతులతో ఉన్న దశరథ మహారాజుకు అన్నదమ్ములు నమస్కరించారు. దశరథ మహారాజు వాళ్ళను కౌగిలించుకున్నాడు. జరిగిన సంగతులన్నీ శ్రీరాముడికి మళ్ళీ గుర్తు చేశాడు దశరథ మహారాజు. తరువాత మళ్ళీ ఆయన స్వస్థానానికి వెళ్లి పోయినాడు.
దేవేంద్రుడప్పుడు శ్రీసేతారామలక్ష్మణులను ప్రశంసించి ఏదైనా వరం కోరుకోవలసింది అని శ్రీరాముణ్ణి కోరాడు. అప్పుడు శ్రీరాముడు యుద్ధంలో మరణించిన వానరులు, గోలాంగూల (కొండముచ్చుల) యోధులు, అందరూ పునర్జీవితులయ్యేట్లూ ఎటువంటి శరీరాయాసం పొందకుండా ఉండేట్లు, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేట్లు వరం ఇవ్వవలసిందిగా దేవేంద్రుణ్ణి అర్థించాడు. అందుకు దేవేంద్రుడు తథాస్తని సంతోషంగా చెప్పి అయోధ్య వెళ్ళి సకల సౌఖ్యాలతో రాజ్యపాలన చేయవలసిందిగా శ్రీరాముడికి తన శుభాకాంక్షలు అందజేసి దేవతలందరితో కలిసి స్వర్గలోకానికి వెళ్ళిపొయినాడు.
అప్పుడు విభీషణుడు శ్రీరాముణ్ణి ప్రార్థించి ఆయన పరివారానికి మంగళస్నానాలు చేయించాడు. పుష్పక విమానాన్ని వారి అయోధ్య ప్రయాణానికి సిద్ధపరచాడు. శ్రీరాముడు, సీతాదేవితో, లకష్మణుడితో అయోధ్య ప్రయాణానికి బయలుదేరాడు.
అప్పుడు విభీషణుడు, శ్రీరాముడికి చేతులు జోడించి ‘ఇప్పుడు ఇక నా కర్తవ్యమేమిటి’ అని అడిగాడు. శ్రీరాముడు మనకోసం ఎన్నో కష్టాలను ఓర్చుకొని, ప్రాణాలు ఒడ్డిన ఈ వానరవీరులను సత్కరించవలసిందని విభీషణుణ్ణి కోరాడు. అప్పుడు విభీషణుడు వానరవీరులందరినీ యథార్హంగా, యథాసంతుష్టిగా సన్మానించాడు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి, తక్కిన వానరయూథపతులను ‘మీ ఇండ్లకు వెళ్లి సుఖించండి’ అని కోరాడు. కాని వాళ్ళంతా ‘అయోధ్యకు వచ్చి తల్లులను, మీ సోదరుడు భరతుణ్ణి చూడాలని కాంక్షిస్తున్నాము, నీ పట్టాభిషేకాన్ని కనులపండువుగా చూడాలని ఉత్సుకులమై ఉన్నాము, మీరు అనుమతించవలసినది’ అని శ్రీరాముణ్ణి వేడుకున్నారు. శ్రీరాముడు వారి మాటలకు ఎంతో సంతోషం పొందాడు. సుగ్రీవుడు తన బలగంతో, విభీషణుడు
తన పరివారంతో పుష్పకవిమానం ఎక్కారు. శ్రీరాముడు అందరి ప్రస్తుతులు వింటూ అలకానగారాధిపతి వలె విరాజిల్లాడు. అప్పుడిక పుష్పకం బయలుదేరింది.
ఆ పుష్పకవిమానంలో తన సరసనే కూచుని ఉన్న సీతాదేవికి ప్రియభాషణలతో మార్గ విశేషాలన్నీ చెపుతూ శ్రీరాముడు ప్రయాణం సాగించాడు. సముద్రతీరంలో సేతువు నిర్మించటం, మైనకాపర్వతం తనను సత్కరించటానికి హనుమంతుడిని ప్రార్థించటం ఆమెకు కథలు కథలుగా చెప్పాడు. ఇంతలో వాళ్ళకు కిష్కింధా నగరం కనిపించింది. కిష్కింధా నగర వృత్తాంతం సీతాదేవికి, శ్రీరాముడు వినిపించాడు. అప్పుడు సీతాదేవి కిష్కింధలోని రాణివాసాన్ని కూడా మనతో అయోధ్య తీసుకొని పోదాము అని శ్రీరాముణ్ణి ప్రార్థించింది. ఆ మాట విని శ్రీరాముడెంతో ఆనందించాడు. సుగ్రీవుడు కిష్కింధ అంతఃపురంలోకి వెళ్ళి రాణులందరినీ వెంటనే ప్రయాణానికి సిద్ధం కావల్సిందిగా కోరాడు. ‘మనమంతా దశరథ మహారాజు పత్నులను చూసి వద్దాము’ అని తన రాణులతో ప్రియవచనాలు పలికాడు సుగ్రీవుడు. వారితో మళ్ళీ పుష్పకవిమానం బయలుదేరింది. అప్పుడు ప్రయాణమార్గంలో సీతాదేవికి పంపా సరస్సు వృత్తాంతం చెప్పాడు శ్రీరాముడు. తరువాత గోదావరినదిని చూసి ఆనందించాడు శ్రీరాముడు.
ఇంతలో వాళ్ళకు దూరంగా అయోధ్యా నగరం కనిపించింది. ‘ఇదుగో అప్పుడు భరతుడు వచ్చి మనలను అయోధ్యకు తీసుకొని పోవాలని పరిపరివిధాల ప్రయత్నించాడే ఆ చిత్రకూటం ఇదే’ అని చూపాడు సీతాదేవికి, శ్రీరాముడు.
ఆనాడు పంచమీ తిథి. ఆనాటితో శ్రీరాముడి పద్నాలుగేళ్ళ వనవాసం సమాప్తమైపోతుంది. పుష్పకం దిగి శ్రీరామలక్ష్మణులు భరద్వాజాశ్రమంలోకి వెళ్ళి ఆ మునికి నమస్కరించారు. అప్పుడు భారద్వాజ మహర్షి, శ్రీరామలక్ష్మణులను ఆదరించి ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచీ వీళ్ళ వృత్తాంతం ఎప్పటికప్పుడు తాను తెలుసుకుంటూనే ఉన్నట్లు వాళ్ళకు చెప్పాడు. ఆయన దగ్గర వాళ్ళు సెలవు తీసుకున్నారు. అప్పుడు హనుమంతుడితో శ్రీరాముడు ‘హనుమంతుడా! నీవు ముందుగా శృంగిబేరపురం పోయి గుహుడి క్షేమం నేను కనుక్కోవాలనుకుంటున్నట్లు చెప్పి, అక్కడ నుంచి భరతుడి దగ్గరకు వెళ్ళి అతడి వైఖరి మనపట్ల ఏమిటో గమనించు. ఒకరోజు ఇక్కడ భరద్వాజాశ్రమంలో గడిపి అయోధ్య వస్తున్నానని భరతుడికి చెప్పు’ అని హనుమంతుణ్ణి ముందుగా పంపించాడు శ్రీరాముడు. హనుమంతుడు నందిగ్రామం వెళ్ళి శ్రీరాముడి వృత్తాంతం భరతుడికి తెలియజేశాడు. శ్రీరాముడు వస్తున్నాడని భరతుడు పరమానందం పొందాడు. శ్రీరాముణ్ణి గూర్చి ఉత్సుకతతో అన్ని విషయాలు అడిగాడు. హనుమంతుడు, భరతుడికి శ్రీరామ వనవాస వృత్తాంతమంతా సవిస్తరంగా చెప్పాడు. రావణవధను గూర్చి సవివరంగా చెప్పాడు. ఇంతలో శ్రీరాముడు రానే వచ్చాడు.
భరతుడూ, తక్కిన తమ్ములూ తనను సేవిస్తుండగా, సుగ్రీవుడు, విభీషణ ప్రభృతులైన, పరమపవిత్రులు మిత్రులు తన్ను సేవాభావంతో అనుసరిస్తూ రాగా ఆయోధ్యానగరంలో శ్రీరాముడు, సీతాదేవితో ప్రవేశించాడు.
****