సత్యం మందపాటి చెబుతున్న
అమెరికా ఉద్యోగ విజయాలు – 3
మాటే మంత్రము
“బావా, మొన్ననే ఒక ఇంటర్వూకి వెళ్ళాను. నువ్వు చెప్పినట్టే నెమ్మదిగా వాళ్ళకి అర్ఢమయేటట్టు జవాబులు చెప్పాను. సరిగ్గా నువ్వు అన్నట్టు ఆ బిహేవిరల్ టైపులోనే అడిగారు అన్ని ప్రశ్నలూ. అన్నీ బాగానే చెప్పానుగానీ, ఆ హైరింగ్ మేనేజరు నేను చేతులు కట్టుకుని కూర్చుంటే, మాటిమాటికీ నా చేతుల వేపే చూస్తూ కూర్చున్నాడు. ఎందుకంటావ్?” అడిగాడు అర్జున్, ఆరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి.
కృష్ణ కొంచెం నొచ్చుకుంటూనే, ఇబ్బందిగా నవ్వి అన్నాడు, “అవును. నేను ఈ విషయం కూడా ముందే చెప్పవలసింది. పోనీలే మిగతా ఇంటర్వూలలోనూ, తర్వాత ఉద్యోగం వచ్చాక నీకు ఉపయోగ పడుతుంది. చాల ముఖ్యమైనది ఇది. విను” అని కొంచెం ఆగాడు.
“ఏమిటది, బావా?” అడిగాడు కృష్ణ.
కృష్ణ సాలోచనగా చెప్పటం మొదలుపెట్టాడు. “ముఫై ఐదేళ్ళయిందేమో, నేనిక్కడే ఒక హైటెక్ కంపెనీలో పనిచేస్తున్నపుడు ఒక సంఘటన జరిగింది. అప్పటికి మేము అమెరికా వచ్చి ఐదేళ్ళయింది. ఆ ఐదేళ్ళలోనూ అమెరికా సంస్కృతి గురించి, భాష గురించి ఎన్నో తెలుసుకున్నా, ఇంకా పూర్తిగా అమెరికనైజ్ అవలేదు మరి. ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, వారం వారం ఏదో మీటింగులు వుండేవి. ఒక రోజు అలాటి మీటింగ్ ఒకటి అయిపోయిన తర్వాత, ఒక గంటకి మా డైరెక్టర్ తన గదికి రమ్మని పిలిచాడు. ఎప్పుడూ పిలవని వాడు ఎందుకు పిలిచాడా అనుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళాను. నన్ను తనకి ఎదురుగా కూర్చోబెట్టి చెప్పటం మొదలుపెట్టాడు. ‘నువ్వు మీటింగుల్లో ఏమీ పట్టనట్టు కూర్చుంటావుట. అలా అయితే ఎలా? ఎందుకని అలా అంటీ అంటనట్టు వుంటావు?’ అని అడిగాడు. ఆయన ఆ మాట అనగానే ఆశ్చర్యం వేసింది. ‘అదేమిటి. నేను మంచి టీం ప్లేయర్నని అందరూ అంటుంటే. అవసరమైనప్పుడల్లా చెప్పవలసింది చెబుతున్నాను. ఉత్సాహంగా అన్ని ప్రాజెక్టుల్లోనూ పాల్గొంటున్నాను. ప్రాజెక్టులని మేనేజ్ చేస్తున్నాను…. ఏదన్నా ఉదాహరణగా చెప్పగలరా?’ అని అడిగాను”
“ఎందుకలా అన్నాడాయన?” అడిగాడు అర్జున్.
“వస్తున్నా.. వస్తున్నా.. ‘అలా అని ఎవరు చెప్పారు?’ అని అడిగాను.
‘షెర్లీ’ అన్నాడాయన. ‘ఒకసారి షర్లీని రమ్మనండి. అదేదో ఇక్కడే నివృత్తి చేసుకుందాం’ అన్నాను.
ఆయన షెర్లీని అడిగాడు ఆమె అలా అనటానికి కారణాలు ఏమిటో చెప్పమనీ, ఏవన్నా ఉదాహరణలు ఇవ్వమనీ. షెర్లీ నెమ్మదిగా అంది. ‘అవును. కృష్ణ ఎప్పుడూ మీటింగుల్లో చేతులు కట్టుకుని కూర్చుంటాడు. అంటే నన్నెవరూ ముట్టుకోకండి, నా లోకంలో నేనున్నాను, మీతో నా ఆలోచనలు పంచుకోవటం నాకిష్టం లేదు
అని కదా ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పేది’
‘అవును. నిజమే. షెర్లీ చెప్పిన దానికి నువ్వేమంటావ్?’ అడిగాడు బాసుగాడు.
ఇంకా చెబుతున్న కృష్ణ మాటలకి అడ్డం వస్తూ అన్నాడు అర్జున్. “అదేమిటి? ఇండియాలో అలా చేతులు కట్టుకుంటే, నేను మంచి బాలుడిని అనీ, నేను మీరు ఏం చెప్పినా చేయటానికి సిద్ధంగా వున్నాను అనీ కదా అర్ధం”
కృష్ణ నవ్వి “అవును. కానీ మనం వున్నది ఇండియాలో కాదు అమెరికాలో. బి ఎ రోమన్
న్ రోమ్’ అన్నారు కదూ. మరి అమెరికాలో అమెరికన్ సిద్ధాంతాలూ, అలవాట్లూ, సంప్రదాయాలు పాటించవద్దూ! అప్పటినించీ కొంచెం జాగ్రత్తగా నా బాడీ లాంగ్వేజ్ గమనిస్తూ, ఇతరుల దగ్గర ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను” అన్నాడు కృష్ణ.
“అవును. అమెరికాలోనూ, యూరప్ లోనూ.. భుజాలు ఎగరేసి మాట్లాడటం, చేతులు తిప్పుతూ మాట్లాడటం,.. ఇలాటివి ఎక్కువ. వాటి గురించి చెప్పు బావా?” అడిగాడు అర్జున్.
“అదే చెప్పబోతున్నాను. ఇండియాలో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే అగౌరవం. అమర్యాద. ముఖ్యంగా పెద్దవాళ్ళతోనూ, బాసుగాడితోనూ. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే ‘చూడు ఇక్కడ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాడు. తల పొగరు వెధవ’ అంటారు. అలా ‘కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు’ తెలుగు సినిమాల్లో ప్రేమికులకే పరిమితం. కానీ ఇక్కడలా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడకపోతే మనమేదో దాస్తున్నట్టు అర్ధం. అంతేకాదు మనమెటో చూస్తూ మాట్లాడితే అమర్యాదగానూ వుంటుంది. అందుకని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం అవసరం. ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. పడమటి సంస్కృతిలో తల అడ్డంగా తిప్పితే కాదు అనీ, నిలువుగా వూపితే అవును అని. అవునా, కాదా అని అమెరికన్స్ అడిగినప్పుడు, మనవాళ్ళు తల గుండ్రంగా తిప్పుతారు. అది అవును కాదుల మధ్యనించీ గిరగిరా తిరిగి, మధ్యే మధ్యే ఆగి వాళ్ళని బిత్తరపోయేలా చేస్తుంది. ఇలాటివి ఏవో పాఠాల్లా చెప్పేవి కావు. కొంచెం నిశితంగా వాళ్ళు ఆ బాడీ లాంగ్వేజిని ఎలా వాడుతున్నారు అని చూసి, కాపీ కొట్టేయ్. తప్పేమీ లేదు. మరి ఇంకో…”
ఇంకా చెప్పబోతున్న కృష్ణ మాటలకి అడ్డం వస్తూ అన్నాడు అర్జున్. “Communication మీద కొంచెం చెప్పు బావా” అడిగాడు అర్జున్.
పెద్దగా నవ్వాడు కృష్ణ.
కృష్ణ ఎందుకు నవ్వాడో అర్ధంకాక బిత్తరబోయి చూస్తున్నాడు అర్జున్.
“అలా నవ్వినందుకు ఐ యాం సారీ.. అదే చెప్పబోతున్నాను. ఎవరైనా మాట్లాడేటప్పుడు అడ్డు వచ్చి మాట్లాడటం కూడా మనవాళ్ళలో సాధారణంగా చూస్తూ వుంటాం. ఒక్కొక్కసారి ఇద్దరు భారతీయులు, ఎవరి మానాన వాళ్ళు, ఒకళ్ళు చెప్పేది ఇంకొకళ్ళు వినకుండా ఒకేసారి మాట్లాడుతుంతారు. అది అమెరికన్సుకి నచ్చదు. వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు అడ్డు రారు. పూర్తిగా చెప్పటం అయాకనే వాళ్ళు జవాబిస్తారు. అలాగే మనం కూడా చేయాలని అభిలషిస్తారు. అమెరికన్సుతో పోలిస్తే మనవాళ్ళు చాల వేగంగా మాట్లాడుతారు. భారతీయుల్లో కూడా ముఖ్యంగా తెలుగువాళ్ళు ఇంకా వేగంగా మాట్లాడుతారు. ఆ వేగం తగ్గించటం చాల అవసరం. ఆమధ్య ఒక పార్టీలో హైద్రాబాదునించీ కొత్తగా వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ అమ్మాయిలు మాట్లాడుకుంటుంటే చూశాను. తెలుగులో మాట్లాడుకుంటున్నారేమోననుకున్నాను. కానీ అది తెలుగు కాదు. తర్వాత ఇంగ్లీష్ ఏమో అనుకున్నాను. అది ఇంగ్లీషూ కాదు. అందులో ఒకమ్మాయి అయితే గబగబా సంస్కృతంలో మంత్రాలు చదువుతున్నట్టు, లేదా ఎవరో తరుముతున్నట్టు మాట్లాడుతున్నది. నెమ్మదిగా అర్ధం చేసుకుంటే, నాకు అర్ధమయింది ఏమిటంటే, ఆ అమ్మాయి తెలుగు, హిందీ, ఇంగ్లీషూ మూడూ కలిపి మాట్లాడుతున్నది. ఇంగ్లీషులో మాట్లాడుతూ, మధ్యే మధ్యే లేకిన్ లేకిన్ అంటున్నది. వాళ్ళ అఫీసులో అమెరికన్స్ ఆ మాటలు అర్ధంకాక ఎంత తంటాలు పడుతున్నారో చెప్పుకుంటూ, అమెరికన్ ఇంగ్లీషుని ఎగతాళి చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అంతేకానీ అమెరికన్సుకి అర్ధమయేటట్లు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్టు కనపడలేదు. ఆఫీసులో ఎక్కువమంది భారతీయులతో కలిసి పనిచేసే వాళ్ళు, ఆ చతురస్రంలోనించీ, అంటే ఆ కంఫర్ట్ జోన్ నించీ బయటికి రావటానికి కొంచెం వెనుకాడుతుంటారు. అది ఒక కారణమయే అవకాశం వుంది. అలాగే అమెరికాలో ఎన్నాళ్ళున్నా మనకి అమెరికన్ యాస పూర్తిగా రాదు. మన పిల్లలకే మన భాష అర్ధం కాని పరిస్థితిలో మనం మాట్లాడుతుంటే, ఇక అమెరికన్సుకి ఏమర్ధమవుతుంది? వాళ్ళ చేత పదిసార్లు చెప్పించుకునే బదులు మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా సాధ్యమైనంత స్పష్టంగా, క్లుప్తంగా మాట్లాడటం అవసరం”
కృష్ణ చెప్పటం ఆపాడు. అర్జున్ మౌనంగా అలోచిస్తున్నాడు.
అతను తన మాటలకి అడ్డు రాకపోవటం చూసి, తను చెప్పేది నెమ్మదిగా నెమరు వేస్తున్నాడని అర్ధం చేసుకుని, మళ్ళీ చెప్పటం కొనసాగించాడు కృష్ణ.
“ఈ భావ ప్రకటన (Communication) అనేది మూడు రకాలుగా వుంటుందని చెబుతున్నారు.
ఒకటి ఆడియో టైప్. అంటే శ్రవణపరంగా చెప్పటం. మా చిన్నప్పుడు, వార్తలు చదువుతున్నది పన్యాల రంగనాధరావ్, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు అని రేడియోలో తెలుగు వార్తలు, హియర్ ఈస్ ది న్యూస్ రెడ్ బై చక్రపాణి, లేదా మెల్విన్ డిమెల్లో అని ఇంగ్లీష్ వార్తలు వస్తుండేవి. వాళ్ళు ఆ వార్తలని చక్కటి మాడ్యులేషన్లతో కళ్ళకు కట్టేటట్టుగా చెబుతుంటే, మనకి ఏదో న్యూస్ రీల్ చూస్తున్నట్టుగా వుండేవి. అలాగే రేడియోలో క్రికెట్ కామెంటరీ. ఆనందరావ్, చక్రపాణి, డిక్కీ రత్నాకర్, నరోత్తం పూరి తమ మాటలతో మన కళ్ళ ముందు క్రికెట్ ఆట జరుగుతున్నది జరుగుతున్నట్టుగా చూపించేవారు.
రెండవది విడియో టైప్. అంటే దృశ్య ప్రకటన. ఇది అమెరికన్సులోనూ, యూరోపియన్సులోనూ బాగా కనిపిస్తుంది. చేతులు తిప్పుతూ, కళ్ళు కదుల్చుతూ, తల విదుల్చుతూ, భుజాలు ఎగరేస్తూ మాట్లాడటం అన్నమాట. మాటలతో కలిపిన ఈ దృశ్య భావ ప్రకటన అన్నిటిలోకీ విశిష్టమైనది. కాకపోతే ఒక చిన్న ప్రమాదమూ వుంది. మన ఆఫీసుల్లో కొంతమంది బలవంతాన ఏదన్నా పనిని చేస్తానని నోటితో చెప్పినా, వాళ్ళ శరీర చేష్టలు అది వాళ్ళు ఇష్టపడి చేయటం లేదని చెబుతూనే వుంటాయి.
నేను పైన చెప్పిన షెర్లీ సంఘటన ఈ శరీరచేష్టల్లో భాగమే. మన సంస్కృతిలో ఎక్కువగా కనపడదిది. మనకి అశరీరవాణి మీద నమ్మకం ఎక్కువవటం వల్లనేమో, శరీరవాణి వెనకపడిపోయింది! మనిషి కూర్చునే విధానం బట్టీ, చేతులు తల తిప్పే విధానం బట్టీ మన మనసుల్ని చదివేసే వారూ వున్నారు.
ఇక మూడవది ఫీలింగ్ టైప్. అంటే చెబుతున్నప్పుడు చెబుతున్నది అనుభవిస్తూ చెప్పటం. వాళ్ళ ముఖంలో భావాలు మారుతూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి కానీ, మాటలు మాత్రం అంత తొందరగా బయటికి రావు. ఒక్కొక్కప్పుడు మొత్తం విషయం రాబట్టటానికి కొన్ని నిముషాలు పడుతుంది. ఎక్కువమంది భారతీయులు ఈ కోవకి చెందినవారే! “అబ్….. బ్బ! ఎం..థ.. బావుందో… ” అంటాడు ముఖమంతా సంతొషం ఓడుతుంటే మా సుబ్బారావు, మేమంతా అమెరికన్ స్నేహితులతో లంచికి వెళ్ళి ఏ దోశో తింటున్నప్పుడు. వాడు మరీ… (పళ్ళు కొరికి, నోరు వికటంగా పెట్టేసి).. అదో రకం మనిషి” అంటాడు అప్పారావ్. తన అసంతృప్తిని ప్రకటించటానికి “ప్చ్! ప్చ్!” అంటాడు మా వెంకట్రావ్, తల అడ్డంగా వూపుతూ. ఏదన్నా ప్రాజెక్ట్ మీటింగుల్లో కూడా అంతే. సరిగ్గా సమయానికి వాడవలసిన మాటలు అవసరానికి బయటికి రావు.
ఒక విశాలాక్షి మీటింగులో ఇలా అంటుంది. ‘అతను రాలేదు’ అని. జాన్ అడుగుతాడు ‘ఎవరు?’ అని.
‘మైక్ అంటుంది’ విశాలాక్షి. జాన్ ‘మైక్ ఎక్కడికి రాలేదు?’ అని అడుగుతాడు. ‘ఆ రోజు మీటింగుకి’ అంటుంది విశాలాక్షి. ‘ఏ రోజు?’ అడుగుతాడు జాన్. ‘మంగళవారం’ అంటుంది విశాలాక్షి. ‘మంగళవారం ఏ మీటింగుకి మైక్ రాలేదు?’ అని అడుగుతాడు జాన్. ‘ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ గురించి మాట్లాడామే, ఆ మీటింగుకి’ విశాలాక్షి జవాబు.
ఆమె నోట్లోనించీ ఇన్ని మాటలు రాబట్టటం శ్రమతో కూడుకున్న పని! ఆవిడ చెప్పదలుచుకున్నదంతా రెండే రెండు వాక్యాల్లో ఇలా చెప్పేస్తే, సమయం కలిసి వస్తుంది. ‘పోయిన మంగళవారం ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ గురించి పెట్టిన మీటింగుకి మైక్ రాలేదు. కాబట్టి మా ప్రాజెక్ట్ ప్లాన్ పూర్తవలేదు’ చెప్పటం ఆపాడు కృష్ణ.
పెద్దగా నవ్వాడు అర్జున్. “అవును. నా స్నేహితుడు పీతాంబరం తను మనసులో సగం వాక్యం అనుకుంటూ, మిగతా సగమే పైకి అంటాడు. అతన్ని అర్ధం చేసుకోవటం చాల కష్టం”
“ఇది ఫీలింగ్ టైప్ వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది” అన్నాడు కృష్ణ.
“మనవాళ్ళ ఇంగ్లీష్ కొంచెం బ్రిటిష్ ఇంగ్లీష్ అంటావా బావా?” అడిగాడు.
నవ్వాడు కృష్ణ. “అదీ పూర్తిగా కాదు. మనం మాట్లాడేది బ్రిటిష్ వాళ్ళకీ అర్ధం కాదు. బ్రిటిష్ వాడి ఇంగ్లీష్ మనవాళ్ళు కాపీ కొట్టి, నాలుగు గంటలకి ఫోర్ ఆర్స్ అంటారు. ఆ నాలుగార్లు ఏమిటో నాకు అర్ధమయేదికాదు. ఆర్స్ అంటే అవర్స్ అనీ, గాళ్స్ అంటే గర్ల్స్ అనీ వాళ్ళ ఉద్దేశ్యం. అమెరికాలో ఆర్ అనే అక్షరాన్ని సుభ్భరంగా పలుకుతారు. టి అనే అక్షరం చాల మాటల్లో సైలెంట్. అలాగే కొన్ని మాటలకి అర్ధాలూ వేరు. జనవరికి జాన్ అంటారు మన దేశంనించీ కొత్తగా వచ్చిన యువతరం. జాన్ అంటే అమెరికాలో “ఇంకో” అర్ధం వస్తుంది. ఈ విషయాలు ఇంకోసారి చెప్పుకుందాం. అమెరికాలో వున్నా, మనవాళ్ళు కొంతమంది తెలుగు డాక్టర్ దగ్గరికే వెడతారు. అక్కడ సంభాషణ కూడా గమ్మత్తుగా వుంటుంది. ‘నా కడుపులో అదోలా వుంది డాక్టర్!’ అంటాడు రామారావ్. ‘పొట్టలో గుర్రు గుర్రు మంటున్నది’ అంటాడు రంగారావ్. ‘నా కాలు లాగుతున్నదండీ’ అంటుంది నీలవేణి. ‘తల తిరిగిపోతున్నది’ అంటుంది కృష్ణవేణి. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే అవేమిటో మన తెలుగు డాక్టర్లకి అర్ధమయిపోతాయి! కానీ అవే మాటలు ఇంగ్లీషులోకి తర్జుమా చేసి చెప్పేవాళ్ళూ వున్నారు. నాకు మోషన్లవుతున్నయ్ అంటాడు మోహన్, అమెరికన్ డాక్టరుతో.. ఇంగ్లీషులో. ఆ మాట ఆయనకి అర్ధం కాదు”
“అవును బావా. ఒక మనిషి చెప్పేది, ఇంకో మనిషి అర్ధం చేసుకోవటమే భాషకీ, భావ ప్రకటనకీ ముఖ్యోద్దేశం. అదే కదా కమ్యూనికేషన్ అంటే.. సరిగ్గా అర్ధం అయేటట్టు చెప్పకపోతే ఎలా.. “ అర్జున్ అన్నాడు.
“నోరారా చెప్పేదయినా, మూగ భాషైనా, సంకేతాల ద్వారా చెప్పేదయినా, నటించి చెప్పేదయినా, కూచిపూడి ముద్రల ద్వారా చెప్పేదయినా…ఏదన్నా ఒకటే. నువ్వు చెప్పేది నాకు అర్ధం కావటం, నేను చెప్పేది నీకు అర్ధం కావటం. అదే ముఖ్యం. కాకపోతే మనం ఏం చెబుతున్నాము అన్నదానితో పాటూ, ఎదుటివారికి అర్ధమవుతున్నదా లేదా అని ఆలోచిస్తూ సంభాషించటం అవసరం. మన సహోద్యోగులతో మాట్లాడటానికే కాదు, ఇంటా బయటా మాట్లాడేటప్పుడు కూడా ఇలాటివి గుర్తుపెట్టుకుని మాట్లాడటం అవసరం” అన్నాడు కృష్ణ.
“వచ్చే రెండు వారాల్లోనూ ఇంకో రెండు ఇంటర్వ్యూలు వున్నాయి బావా. ఒకటి ఇంటర్వూ ఇక్కడే అయినా ఉద్యోగం మాత్రం మీ వూళ్ళోనే. వాళ్ళు కనక నన్ను సెలెక్ట్ చేస్తే, నేను మీకు దగ్గరగా వుండొచ్చు”
“తప్పకుండా.. అంతకన్నా కావలసిందేముంది” అన్నాడు కృష్ణ.
“ఆ ఇంటర్వూల్లోనూ, తర్వాత ఊద్యోగాల్లోనూ, ఇంటా బయటా, నీ సలహాలు తూచా తప్పకుండా పాటిస్తాను బావా” అన్నాడు అర్జున్.
“అది సరే! తూచా అనే మాటని ఇంగ్లీషులో ఏమంటారు?” అడిగాడు కృష్ణ నవ్వుతూ.
“ఏమో నువ్వే చెప్పాలి, నువ్వేగా అన్నీ చెబుతున్నావ్. కృష్ణుడు చెబుతున్న భగవద్గీతలా నువ్వు చెప్పేది వింటున్నాను. నేను మానవమాత్రుడిని. అంతే” అన్నాడు అర్జున్ గడుసుగా.
0 0 0