కవితా స్రవంతి

స్వార్థమనర్థము

-చంద్రశేఖర్. పి.వి.

తానొక సమిధగా పరమార్థభావనతో
ప్రకృతి మన ప్రత్యక్ష దైవమై స్ఫూర్తిగా నిలిచె !

పృథివి పథము జూపె, జనుల మనుగడ నెంచె
సహన మార్గమే మనకు సహజమని నేర్పె !

ప్రాణవాయువు మనకు పరమావశ్యమనె
కలుష జీవనమది విషతుల్యమని ఎంచె !

నింగి నేలను కలుపు నిత్యరశ్మితో మనకు
చైతన్యము నింపె మనము చతురతతో మెలగ !

రెక్కలతో పైకెగిరి విత్తన వ్యాప్తితో
సతత హరితము కొరకు పక్షులు ప్రాకులాడె !

కొండకోనలు దాటి నిండైన మనసుతో
దాహార్తి తీర్చిన నీరు ప్రాణదాతగ మెరిసె !

ఎదిగి ఒదగమని దిగజారవద్దని
ఆకసమే హద్దని వృద్ధి హితవుల పలికె !

పంచభూతాలన్ని పరహితము నెంచగా
కించిత్ ప్రేమ లేని ఈ మానవాళి !

కలికాలమన్న ఏ కాలమో ఎరుగ
అపకారమే కాని ఉపకారమెరుగదు !

స్వార్థ రచనలే కాని, సర్వహితములు లేవు
ఆర్తనాదమే కానీ, ఆర్ద్రతలు కరువు !

విశ్వ విజయమునకు నిస్వార్థ మవసరము
మానవా ! మానవా ? స్వార్థచింతనము !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked