సాహిత్య అకాడమీ గ్రహీతలకు అభినందనలు
ఎన్నో ఏళ్ళ కృషి, దీక్ష, పట్టుదల తో సాగుతున్న కవి లేదా రచయిత ఎవరైనా ఒక్క సాహిత్య అకాడమీ అవార్డు రావడంతో ఒక్కసారిగా సేదదీరుతారు. అంటే సాహిత్యం లో తమకంటూ ఒక పేజీ ఉంటుందని ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం కవిగా సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న దిగంబర కవి నిఖిలేశ్వర్ గారు అసలు పేరు కుంభం యాదవరెడ్డి. తెలుగులో నిఖిలేశ్వర్ రచించిన అగ్నిశ్వాస కవిత్వానికి ఈ అవార్డు ఇచ్చారు. వీరు కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని నిఖిలేశ్వర్ గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు.దిగంబర కవులలో ఒకరిగా, 1965 నుండి 1970 వరకు మూడు సంపుటాల దిగంబర కవిత్వమును ప్రచురించారు. నిఖిలేశ్వర్ విప్లవ కవిత్వోద్యమంలో కూడా ప్రధానమైన కవి. దిగంబర కవిగా ఉన్న ఆయన ఆ తర్వాతి కాలంలో విప్లవ కవితోద్యమం లో ప్రధాన భూమికను పోషించారు..
అలాగే కధా రచయిత్రిగా ఎంతో కృషి చేసిన కన్నెగంటి అనసూయకు బాలసాహితి పురస్కారం, ఎండ్లూరి మానసకు యువ పురస్కారం లభించింది. మిలింద షార్ట్ స్టోరీని మానస ఎండ్లూరి రచించారు. 18 భాషల్లో 2020 సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు ఇచ్చారు. బావుంది.. 2020 సంవత్సరానికి గాను ముగ్గురు తెలుగు వారు సాహిత్య అకాడమీ అవార్డులు సాధించడం అంటే నిజంగా గర్వకారణం.