అద్భుతంగా సిలికానాంధ్ర తెలుగు సాంస్కృతికోత్సవం
పద్దెనిమిది సంవత్సరాలు నింపుకొన్న సిలికానాంధ్ర అక్టోబర్ 5న సిలికాన్ వ్యాలీలోని హేవర్డ్ నగరంలో తెలుగు సాంస్కృతికోత్సవాన్ని కన్నులపండుగగా నిర్వహించింది. అందంగా అలంకరించిన వేదికపై ఆద్యంతం తెలుగు సంస్కృతిని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఏడు గంటలపాటు ఆహ్లాదపరిచింది.
ముద్దులొలికే చిన్నారులు ‘బాల గాంధర్వం’లో మూడు గతులలో ఆరు రాగాలను వయోలిన్, వీణ, ఫ్లూటు, మృదంగా వాయిద్య సహకారాంతో ముప్పై నిమిషాలపాటు గానంచేసి అబ్బురపరిచారు. సంగీతకారిణి సుధా దూసి పర్యవేక్షణలో సింఫొనీ రూపంలో జరిగిన గాత్ర, వాయిద్యగోష్ఠిలో నలభైమందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు.
తెలుగుభాషకే సొంతమైన పద్యం యొక్క అందమైన నడకలను తెలియబరుస్తూ ‘వేనోళ్ళ వెయ్యేళ్ళ తెలుగుపద్యం’ రూపకం తెలుగుపద్య రీతులను విచ్చేసిన ఆహుతులకు మరొక్కమారు గుర్తుచేసింది. శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యంలో సంచరిస్తూ ఒక గ్రామంలో బసచేసిన నేపథ్యాన్ని వస్తువుగా తీసుకొని వివిధవృత్తులకు చెందిన కొందరు గ్రామస్థులు గానంచేస్తూ తెలుగుపద్యంపై తమకున్న మక్కువను చాటిన వైనాన్ని సిలికానాంధ్ర గాయకులు ప్రదర్శించారు. తీయనైన తెలుగు పద్యాలను అచ్చతెలుగు అవధాని శ్యామలానంద ప్రసాద్ రచించి హరి శాస్త్రి స్వరపరచగా మాధవ కిడాంబి, అనంత రావు, విద్య మహంకాళి, వంశీ నాదెళ్ళ, నారయణన్ రాజు, రవీంద్ర కూచిభొట్ల, ఈషా తనుగుల, అనికేత్ సాదనాల, శ్రియ సంగుభట్ల, హరి శాస్త్రి, పద్మ హరి, మధు ప్రఖ్య, ఆనంద్ కూచిభొట్ల (శ్రీకృష్ణదేవరాయలు) పాల్గొన్నారు.
తెలంగాణగడ్డపై పుట్టిన మహాత్మ్యులను మననం చేసుకొంటూ సాగిన ‘జయహో తెలంగాణ ‘ నృత్యరూపకానికి కూచిభొట్ల అనూష రూపకల్పన చేయగా అమెరికాలో పుట్టిపెరిగిన యువత చేసిన నాట్యం అందరిని అలరించింది..
తెలంగాణ, నవ్యాంధ్ర జానపదాలను ప్రదర్శించే ధింసా, లంబాడి, బోనాలు, కొమ్ముకోయ నృత్యాలకు హైద్రాబాద్ నుండి అతిథిగా విచ్చేసిన డా. లింగా శ్రీనివాస్ శిక్షణ ఇచ్చారు. పిల్లల నుండి పెద్దల వరకు మొత్తం రెండు వందల మంది పాల్గొన్న ఈ విభాగాన్ని స్నేహ వేదుల పర్యవేక్షించారు. ‘మొక్కజొన్న తోటలో…’ గీతాన్ని ప్రదర్శించి సిలికానాంధ్ర పెద్ద ఆడపడుచుగా అనుబంధం పెంచుకొన్న వింజమూరి అనసూయాదేవి గారిని మరొక్కమారు స్మృతి చేసుకొన్నారు.
భక్త ప్రహ్లాద గాధను ‘వందే నారసింహం’ పేరుతో ప్రదర్శించిన నాటకం ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసింది. అమోఘమైన సెట్టింగులు, అబ్బురపరిచే విన్యాసాలు, ధీటైన నేపథ్య సంగీతం, నరసింహావతార ఉగ్రరూపం నేటి సినిమాలకు సమఉజ్జీగా నిలిచాయి. పదేళ్ళ బాలుడు ప్రభవ్ నాదేళ్ళ ప్రహ్లాదుడిగా చక్కగా పద్యాలు పాడుతూ ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు. కిరణ్ హిరణ్యకషపుని పాత్రలో ఒదిగిపోగా మానసరావు, రావు తల్లాప్రగడ, రామకృష్ణ కాజ, గౌరి, లక్ష్మణ్, మూర్తి వేదుల, శర్మ అడితె, శ్రీనివాస్ పేరి మొదలగు వారు ఇతర పాత్రల్లో నటించారు. భాగవత కథను తాటిపాముల మృత్యుంజయుడు నాటకీకరణ చేయగా దిలీప్ కొండిపర్తి దర్శకత్వం వహించి నాటకాన్ని అమోఘంగా మలచారు.
ఈ కార్యక్రమానికి మకుటాయమానంగా నిలిచిన ‘వీణామృతవర్షిణి ‘ సంగీత విభావరిలో ప్రముఖ వీణావిద్వాంసుడు ఫణి నారాయణ చేసిన ప్రాక్పశ్చిమ సంగీతాల సంయోగం ఒక అపూర్వమైన ప్రయోగంగా పేర్కొనవచ్చు. శాస్త్రీయబద్ధమైన త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు కీర్తనలను తన వీణపై వాయిస్తూ, కీబోర్డు, డ్రమ్స్, డప్పు, మృదంగ వాయిద్యాలతో మేళవిస్తూ నూతన ప్రయోగాలను ఆవిష్కరించాడు. ప్రేక్షకుల చప్పట్లతో సభ మారుమ్రోగింది.
సిరికొండలో పుట్టి పదమూడేళ్ళ వయసులోనే 2013లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణను అభినందిస్తూ సిలికానాంధ్ర ఘనంగా సత్కరించింది. ఈ వేడుకలో సిలికానాంధ్ర మాసపత్రిక సుజనరంజని ప్రత్యేకసంచికను ‘సిలికానాంధ్రదర్శిని ‘ పేరుతో ప్రచురించి డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, అక్కిరాజు రమాపతిరావు చేతులమీదుగా ఆవిష్కరించారు.
పదహారణాల తెలుగు విందుతో ముగిసిన ఈ ఉత్సవానికి ప్రియ తనుగుల సారధ్యం వహించారు. సాయి కందుల, శరత్ వెలదండ్ల, ఉజ్జ్వల్,నరేన్, మాధురి కాజ, కిశోర్ బొడ్డు, సిద్ధార్థ నూకల, రవి చివుకుల, వంశీ ప్రఖ్య, చంద్ర సాధనాల, శాంతి అయ్యగారి, శ్రీరాం కోట్ని, ప్రభ మాలేంపాటి, శిరీష కాలేరు, రత్నమాల వంక, యోగి శృంగారం, సంజీవ్ తనుగుల, అనూష కొండిపర్తి మొదలైన ఎందరో స్వచ్చంద సైనికులు తమ వంతు సమయాన్ని వెచ్చించి విజయవంతం చేశారు.