అన్నమయ్య శృంగార నీరాజనం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
వయస్సును బట్టి కౌశలాన్ని ఆధారంగా చేసుకుని నాయికలలో ముగ్ధ, మధ్య, ప్రౌఢ అనే మూడు రకాల నాయికలలో గత మాసం ముగ్ధ గురించి తెలుసుకున్నాం. ఈ నెలలో మధ్య నాయిక గురించి తెలుసుకుందాం. రామరాజ భూషణుడు తన సరసభూపాలీయము లో మధ్యమ నాయికను వర్ణిస్తూ..
ఉ. మానితవైఖరిన్ మణిత మంత్రములం, గబరీ వినిర్గళ
త్సూనములం బ్రసూన శర సూరుని బూజలొనర్చి తా రతిన్
మానిని యొప్పెనప్పుడసమాన మనోంబుజ వీధి నాతనిన్
ధ్యానము సేయుకై వడి రతాంత నితాంత నిమీలితాక్షియై.
తన కొప్పునుండి జారుతున్న పుష్పమాలలతో, కోకిల కంఠధ్వనితోడను, మన్మధపూజ చేసి, వివశురాలై నాయకుడినే సదా ధ్యాన్నం చేసే అవస్థను వర్ణిస్తాడు.
సాహిత్యదర్పణం లో మధ్య నాయికను వర్ణిస్తూ...“మధ్యా విచిత్ర సురతా ప్రరూఢస్మరయౌవనా|
ఈషత్ప్రగల్భ వచనా మధ్యమ వ్రీడితా మతా||.” అంటే..విచిత్రమైన సంగమము, యెక్కువైన మదన తాపముగల, ప్రగల