ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

-సునీత పావులూరి

వీళ్ళు ఈ కాలంలో ఎందుకు ఇంత తీవ్రంగా అనుభూతి గురించి చెప్పాల్సివచ్చింది. బహుశా, వీరు రచనలు చేస్తున్న కాలంలో అంటే సమకాలీనంగా వస్తున్న రచనలను ఆధారంగా చేసుకుని చెప్పి ఉండవచ్చేమో. లేక ఇప్పటి వరకూ ఉన్న కవిత్వం ఇలా ఉంది కానీ, అలా కాక ఇలా ఉండాలి అని మార్గనిర్దేశం చెయ్యటానికి పూనుకున్నారా? లేక మానవుడు అనుభూతి జీవి కాబట్టి మానవుడికి కావలసిన అనుభూతిని మనం మన రచనల ద్వారా అందించాలనే అనుభూతి స్పృహ వీరందరికీ ఒకేసారి కలిగిందేమో.
అనుభూతివాదానికి అనుకూలంగానైనా సరే, ప్రతికూలంగానైనా సరే జరిగిన విస్తృతమైన చర్చల వల్ల 1966ప్రయోగంలోకి వచ్చిన ‘అనుభూతివాదం’ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
అనుభూతి లేని కవిత్వం ఏనాడు లేదు? అంటూ మనం ఆధునిక కవిత్వం దాకా వచ్చిన కవిత్వంలోని అనుభూతి అంశాలను పరిశీలించుకున్నాం. విదియనాటి చంద్రునిలా అనుభూతి రేఖలున్న రచనలు, పూర్ణిమనాటి చంద్రునిలా సమగ్రానుభూతిని పొందిన రచనల వరకూ మనం పరిశీలించుకున్నాం. కానీ ఈ కవిత్వాలు వెలసిన కాలంలో ఆ రచనలకు అనుభూతి కవిత్వమనే పేరు వాడుకలో లేదు. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే కావ్యాలు వెలసిన కాలమంతా ఆ రచనల్లో అనుభూతి ప్రధానంగా దర్శనం చెయ్యటం జరగలేదు. భావకవిత్వం యుగంలోనే వస్తుప్రధానాలైన కావ్యాలు మరుగున పడిపోయాయి. ఆత్మాశ్రయ కవిత్వానికి అనుకూలమైన ఖండకావ్య ప్రక్రియ వెలుగులోకి వచ్చింది. వస్తుగత రచన నవలల్లోకి వెళ్ళిపోయింది. భావకవిత్వం నుండీ ఒక పక్క అభ్యుదయకవిత్వం విప్లవించుకొని రాగా, సామాజికావసరాల కోసమే పుట్టిన మరో కవితావాదం అనుభూతి కవిత్వం. ఖండకావ్య ప్రక్రియను ఊతగా తీసుకొని రంగస్థలం మీదికి వచ్చిన అనుభూతి కవిత్వం కొందరి మన్ననలకూ, కొందరి మర్మగర్భ తిరస్కారానికి, కొందరి తీవ్ర ఆగ్రహానికి గురి అయింది.

వెనకటి కవిత్వంలో అనుభూతి లక్షణాలు గుర్తించి, అవి సమగ్రానుభూతిలో ఏయే లక్షణాలు ద్యోతకం చేస్తున్నాయో పరిశీలించాం. కానీ ఇరవయ్యో శతాబ్దం ఏడవదశకంలో ఇది అనుభూతి కవిత్వం అని చెప్పుకున్న, రాసుకున్న కవిత్వం ఆంధ్ర సారస్వతరంగం మీద అవతరించింది. ఖండకావ్య ప్రక్రియని ఆశ్రయించుకొని వెలుగు వెన్నెలలు వెదజల్లిన ఈ అనుభూతి కవిత్వం వివిదాభిప్రాయ ప్రకటనలకు కారణమై అభినందనలకు, తిరస్కారాలకు గురైంది.

కీ.శే. తిలక్ రచనల్లో అనుభూతి కవిత్వం ఉందని, ఇది అనుభూతి వాదానికి చెందినదని అద్దేపల్లి రామ మోహనరావుగారు తమ భావావిష్కరణం కావించి, ఆంధ్రకవితలో అనుభూతివాద కవిత్వాన్ని దర్శించి, ఆ వాదాన్ని ఆవిష్కరించారు. మనస్సు లోలోపలి అనుభూతులకి అక్షరకల్పన చెయ్యటమే అనుభూతి వాదమని వారి తీర్మానం. ఈ అనుభూతివాదానికి సంబంధించిన అనుభూతి కవిత్వం చెప్పటంలో బాలగంగాధర తిలక్ అపూర్వ విజయం సాధించాడని వారు తిలక్ ను ప్రశంసించారు. నిజంగా ఇది అపూర్వమూ, అనన్య సామాన్యమైన విజయమూ.

ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు, అద్దేపల్లివారు చెప్పిన దానిని మరింత విశదంగా చెప్పారు. అనుభూతి కవితను ‘స్వచ్ఛ కవిత’ అనవచ్చు అంటారు వీరు. ‘స్వచ్ఛ కవిత’ అంటే ఏమిటో కూడా వారు బాగానే వివరించారు.. వారు ఈ విధమైన కవిత్వం ఏ రాజకీయ సిద్ధాంతానికి కట్టుబడి ఉండదని చెప్పారు. ఈ మాటతోనే తేలిపోయింది అనుభూతి కవిత్వానికి వ్యతిరేకులు ఎందుకు ఉంటారో. నిబద్ధతకి కట్టుబడిపోయి రచనలు సాగిస్తున్న కవి సంఘాలకు ఈ అనుభూతివాద కవిత్వం కొరుకుడు పడలేదు. వారికిది మింగుడుపడలేదు. ఇంద్రగంటివారు ఈ విధమైన కవిత్వాన్ని “కవి తాను చూచిన దృశ్యాలు కల్పించిన స్పందనతో తన మనోలోక సంచారంలో తటిత్తుల్లా తారసిల్లిన అపూర్వ భావచిత్రాలతో, స్ఫూర్తులతో కవితను ఆవిష్కరించటమే స్వచ్ఛకవిత” అని పేర్కొన్నారు. కవిత్వంలో ఉద్రేకమే దర్శించాలనుకునే వారికి ఈ నూతన ప్రక్రియ కోపాన్ని తెప్పించింది. ‘రాబందుల రెక్కల చప్పుడు’, ‘కలకత్తా కాళిక నాలిక’, ‘ధ్వంస రచన’ కవిత్వంలో వెతుక్కునే వారికి మనోలోక సంచారంలో మెరసిన దృశ్యాల కల్పనలను కవిత్వంగా ఎలా భావించగలరు. ఈ భేదాన్నీ గుర్తించిన ఇంద్రగంటివారు “ఆత్మాశ్రయ కవితకు ప్రాణప్రదమైన, కవి ‘అనుభూతి’కి అగ్రప్రాధాన్యం ఇవ్వాలనీ, అనుభూతివాదం అంటుంది” అని వివరించారు. ఈ మాటలను చూచి అనుభూతి కవిత్వం కవి తన ఊహాలోకాల్లో తేలిపోయే వైయక్తికానుభూతి అనుకూకూదదు. సామాజికావసరాలకు అనుగుణంగా స్పందించి స్వీయానుభూతిని కవి ప్రదర్శించటాన్ని అనుభూతి కవిత్వమంటారని మనం గ్రహించుకోవాలి. యదార్థమైన, ప్రముఖమైన తేడా భావకవిత్వానికీ అనుభూతి కవిత్వానికీ ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked