కథా భారతి

తేడా

-ఆర్. శర్మ దంతుర్తి

దేశంలో ఎన్నికలు జరుగుతున్నపుడు రెండు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పైకి రావడం మొదలైంది. మొత్తం దేశం అంతా ఒకే పార్టీ ఉంటే బాగుంటుందనీ, ఇలా చిన్న ప్రాంతీయ పార్టీలకి వోట్లు వేస్తే దేశం గల్లంతౌతుందనీ అథిష్టానం నుంచి పెద్దలు వ్రాక్కుచ్చారు. అయినే ఎవరూ విన్నట్టు లేదు. ఈ రెండూ రాష్ట్రాల్లోనూ మొత్తానికి ప్రాంతీయపార్టీలే నెగ్గాయి. ఈ పార్టీలు కూడా ఈ మధ్యనే కాలేజీలోంచి పాసయ్యీ, అవకా అవసరాన్ని బట్టి సమ్మెలు చేస్తూ బయటకొచ్చిన కుర్రగాళ్ళవి. అందువల్ల ఏ అభ్యర్ధికీ కూడా ముఫ్ఫై దాటలేదు వయసు. పక్క పక్క రాష్ట్రాలు కనక ఒకే భాష మాటాడకపోయినా, దాదాపు వీళ్ళ భాష వాళ్ళకీ, వాళ్లది వీళ్ళకీ అర్థం అవుతుంది, తిండీ తిప్పలూ ఇద్దరివీ ఒకటే రకానివి. అధిష్టానం వేరే పార్టీ అయినా ఈ రెండు ఈశాన్య రాష్ట్రాలూ వేరేపార్టీతో అధికారంలోకి వచ్చేయి. ఈశాన్యం ఒకటికి బందోపాధ్యాయ్ ముఖ్యమంత్రి అయితే ఈశాన్యం రెండుకి చంద్రికాదేవి ముఖ్యమంత్రి అయింది. మిగతా కుర్రాళ్ళలో అందరికీ తలో మంత్రి పదవి ఇచ్చాక దేశం మళ్ళీ గాడిలో పడింది.

అధిష్టానం మాత్రం మిగతా రాష్ట్రాల్లో నెగ్గి అధికారం చేబుచ్చుకుంది. ఈ అధిష్టానంలో ప్రధానంగా కుర్చీలో కూర్చునేది ఒకే ఒక నేత. మిగతావాళ్ళందరూ ఆయనేం చెప్తే అదే తందాన తాన అనడం రివాజు. ఎన్నికలయ్యేక చూస్తే ఈ కుర్చీలో కూర్చోడానికి ఒకడంటే ఒకడే నేత తేలేడు. పెళ్ళాం తో ఇరవైయ్యేళ్ళు కాపురంచేసి ఆవిడ పోయాక రాజకీయాల్లోకి దిగిన రామ్ మలానీ అనే ఆయన. పెళ్ళయ్యాక ఎంత కష్టపడినా, ఆవిడా ఆయనా విడివిడిగానూ కలిసికట్టుగానూ ఏ డాక్టర్ దగ్గిరకెళ్ళినా మలానీ గారికి పిల్లలు పుట్టలేదు. ఆవిడ ఆ దిగుల్తోనే వెళ్ళిపోయాక ఈయన మిగిలిన జీవితం బ్రహ్మచర్యం అవలంబించి, రాజకీయాల్లో ఈదుకుంటూ ఇలా తేలాడు ప్రధాననేతగా. ఆయన అధిష్టానంలోకి వస్తూనే చేసిన మొదటిపనేమంటే – ‘దేశం వెలిగిపోతోంది, ఏ దేశేమేగినా ఎందుకాలిడినా’ అంటూ జనాలని ఊదరకొట్టడం, పని ఉన్నా లేకపోయినా అనేకానేక దేశాలు తిరిగి అందర్నీ కల్సుకుని తమ దేశం రావాల్సిందిగా కోరడం వగైరాలు.

ఓ ఏడాది గడిచేసరికి ఏ నాయకుడు మనకి మంత్రి అయినా మన బతుకులు ఎప్పుడూ ఎలాగా బాగుపడవు కాబట్టి దేశం గాడిలో పడింది ఎప్పటిలాగానే. గాడిలో పడటం అంటే ఏంటనే గూట్లే ప్రశ్నలు అడుగుతారేం? గాడి అంటే ఎప్పట్లాగానే ఉల్లిపాయల ఖరీదు కేజీ మూడువేలకి జేరడం, వరదలొచ్చి జనం కొట్టుకుపోవడం, అల్లవరం ప్రోజక్ట్ ముప్ఫై ఏళ్లయినా ఇంకా పూర్తవకపోవడం, మేము అథికారంలోకి వస్తే ఈ అల్లవరం ప్రోజక్ట్ ముత్యం మూడునెలల్లో చేసేస్తాం అనే నేతలు మళ్ళీ ఈ అల్లవరం గురించి నోరెత్తకపోవడం, రోడ్డు, రైల్ ఏక్సిడెంట్లు అవీ అయ్యి జనం చావడం లాంటివన్నమాట. ఇలా దేశంలో అన్నీ “సజావుగా” సాగిపోతున్నప్పుడు పాలగిన్నెలో విషం చుక్కలా ఒక ఉదంతం బయటకొచ్చేసింది – ఎవరెంత కష్టపడి దాద్దామనుకున్నాను – దాచాలంటే దాగనులే అంటూ.

ఈ ఉదంతం ప్రకారం అధిష్టానం నేత గారు ప్రపంచంలో ఓ మారుమూల ఉన్న పాపా న్యూ గినియా అనే ద్వీపంలో ఉండే వలసపోయిన దేశ జనాభాని పలకరించి వాళ్ళ క్షేమం కనుక్కోవడం కోసం వెళ్ళారు. ఎందుకయ్యా అంత దూరం అంటే ఆ వలస జనాభా దగ్గిర కోట్ల రూపాయలు మూలుగుతున్నై. వాటిని పట్టుకొచ్చి దేశంలో పెట్టుబడి పెడితే కోడి పిల్లల్ని పెట్టినట్టూ వృధ్ధి చేసేసుకోవచ్చు. అదీగాక తాను నేత అయ్యేక దేశంలో శాంతి భద్రతలు అద్భుతంగా పుంజుకున్నై. అందువల్ల దయచేసి దేశం రండ్రండి మొర్రో అని చెప్పడానికన్నమాట. ఈయన ఇలా శాంతిభద్రతల గురించి ఆ వేరే దేశంలో మాట్లాడుతున్నప్పుడే ఈయన ఉండే పట్టణంలో ఈయన ఇంటి వెనక వసారాగా చెప్పబడే శివార్లలో నలుగురు ఒక లేడీ డాక్టర్ రాత్రి డ్యూటీ ముగించుకు వస్తున్నప్పుడు మీదపడి అమానుషంగా అత్యాచారం చేసేరు. పోనీ అలా చేసి వదిలేస్తే బాగానే ఉండేది కానీ ఆవిణ్ణి అత్యాచారం చేసేక ముక్కుదగ్గిర వేలు పెట్టి చూస్తే ఆవిడ గాలి పీల్చడంలేదని తెల్సుకున్నాక దగ్గిర్లో ఉన్న శ్మశానం లో శాస్త్రోక్తంగా చితిపెట్టి తగలబెట్టేసి చేతులూపుకుంటూ ఇళ్ళకెళ్ళిపోయేరు. మరో రెండు రోజులకి డాక్టర్ గారి వాళ్ళాయన పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు ఈవిడ కనబట్టంలేదని. అది సరిగ్గా చేతిలోకి వచ్చి దాని మీద ఏం చేద్దామా అని పోలీసులు ఆలోచించేసరికి మరో వారం గడిచిపోయింది. అప్పుడు రంగంలోకి దిగి కూపీలాగారు. కూపీ అంటే ఆవిడ కనిపించిన చోటల్లా కెమెరాల్లో ఏది కనిపిస్తే అది చూట్టం. ఈవిణ్ణి నలుగురు లాక్కెళ్లడం కనిపించింది ఓ దాంట్లో. మరో మూడు వారాలు లాగి లాగి ఈ నలుగుర్నీ పట్టుకున్నారు. ఈ కథంతా బయటకొచ్చేసరికి నేతగారు దేశం వెనక్కి వచ్చి ఉన్నారు. వస్తూనే “చూసారా మా దేశంలో ఎంత లాఘవంగా, అతి తొందరగా నేరస్తుల్ని పట్టుకుంటామో?” అని జండా ఎగరేసారు. ఛోటానాయకులు చంకలు గుద్దుకుని తందానా, తందానా అన్నారు కూడా.

ఈ నలుగురిని ఏం చేయాలి? ఉరి “అమానుషం” కదా? డాక్టర్ గారిని సామూహికంగా మానభంగం చేసి ఆవిడ ఊపిరి పీల్చనప్పుడు కోమాలోకి వెళ్ళిందో, మరోటో అసలు బతికి ఉందా, చచ్చిపోయిందా చూడకుండా వీళ్ళు నలుగురూ మాత్రం ఆవిణ్ణి దహనం చేస్తే చేసారుగాక మనం, మనుషులమైన మనం – ఉరిలాంటి అమానుష చర్యలు చేయరాదు కదా? అందువల్ల ఈ నలుగుర్నీ జెయిల్లో పెట్టి ఉంచారు. కోర్టులో కేసొకటి పారేసారు పనిలో పనిగా. న్యాయమూర్తులు సావుకాశంగా తీర్పు ఇచ్చాక అది రాజ్యాంగం ప్రకారం అమలు చేస్తారు. తొందరేల? అసలే పాపం న్యాయమూర్తులకి బోల్డు పని, తీరికలేదు. ఏదైనా కేసుకి – అనేక వందల పేజీల రాజ్యాంగం పుస్తకం చదివి, దాని ప్రకారం తీర్పు చెప్పడానికి సమయం పట్టదూ? ఈ నలుగురూ చచ్చిపోయేలోపుల తీర్పు చెప్తారు, కంగారేం లేదు. అయినా దశాబ్దాలనుంచి ఉల్లిపాయలు రేటు పెరిగినా రైల్వే ఛార్జీలు పెరిగినా నోరుమూసుకు భరించే మనుషులు ఆ మాత్రం ఓపికపట్టలేరా? మరో ముఖ్య విషయం ఏమంటే ఈ కేసు కోర్టులో వాదించడానికి ఒక ముఖ్యమైన ఎల్లెల్బీ సికెపి ముందుకొచ్చాడు. సికెపి అంటే చెట్టుకింద ప్లీడరు, ఎల్ ఎల్ బి చదివిన వాడన్నమాట. ఆయనెందుకొచ్చాడో అందరికీ తెల్సిన విషయమే. దేశం అంతా గమనించే కేసు – నేరస్తులు చేసింది ఎంత దౌర్భాగ్యపు పని అయితే మాత్రం – వాదిస్తే పేపర్లో, న్యూసులో తనపేరు ఎంతో పైకొస్తుంది. అలా ముందు ముందు బాగా డబ్బులొచ్చే ఛాన్స్ ఎక్కువ కదా?

కేసు నత్త నడక నడుస్తూనే ఉండగా ప్రజలకి – అందులోనూ ముఖ్యంగా నేరస్తులకి తెలిసొచ్చినదేమంటే ఎవడైనా, ఎక్కడైనా, ఏ అమ్మాయినైనా సరే మానభంగం చేసి శరీరాన్ని కాల్చిపారేసినా తమ వంటిమీద ఈకలు పీకడానిక్కూడా ఎవరికీ ధైర్యంలేదు – నేతలనుంచి న్యాయమూర్తులదాకా. న్యాయం బయటకొచ్చేసరికి ఇరవై నుంచి ముప్ఫై ఏళ్ళు పడుతుంది. ఈ లోపున జైల్లో కూర్చోబెట్టి వెచ్చటి బట్టలూ, కోడికూరా, బిర్యానీలతో పసందైన భోజనం పెడతారు. ఏ పనీ చేయక్కర్లేదు జైల్లో. బయట ఎంత వళ్ళు వంచి కష్టపడితే మాత్రం ఈ భోగం దొరుకుతుంది? ఈ కొత్తగా తెల్సిన విషయాల ప్రకారం మానభంగాలు రోజు రోజుకీ ఎక్కువవడం మొదలైంది.

ఇటువంటిరోజుల్లో ముందు చెప్పుకున్న రెండు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక మానభంగం జరిగింది. ఈ మానభంగం మాకు వోటువేయని రాష్ట్రాల సరిహద్దుల్లోది కనక అధిష్టానం – ఇక్కడ జనం తమకి ఓటు వేయలేదు అనే మాట గుర్తుంచుకుంది కాబోలు – ఇది మాకు సంబంధించింది కాదు అని చేతులు దులుపుకుంది. ఇక్కడ మంత్రులు ముందు చెప్పుకున్నట్టూ అక్క చెల్లెళ్ళూ, అన్న దమ్ములూ ఉన్న కుర్రకారు. అందులోనూ యువరక్తం ఉరుకులు పారే జనం. మానభంగం జరగ్గానే ఈ ఈశాన్య ముఖ్యమంత్రులిద్దరూ కూడబలుక్కుని ఒక నిర్ణయం చేసారు. దానిప్రకారం ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఆ ఆదేశాలు వెనువెంఠనే అమలు చేయబడ్డాయి కూడా.

ఈశాన్య రాష్ట్రాల్లో మానభంగం జరిగిన కొన్నాళ్లకి పోలీసులు నేరస్తులని జీపులో వేరే జైలుకి తరలిస్తున్నప్పుడు ఒకచోట జీపు ఆపారుట – అల్పాచమానానికి. పోలీసులు ఇలా జీపు దిగి వెళ్ళారో లేదో నేరస్తులు జీపు దిగేలోపులే ఓ బాంబు పేలిందిట జీపులో. నేరస్తులు అందరూ ఏ కీలుకి ఆకీలు ఊడిపోయి అక్కడికక్కడే చచ్చిపోయారు. అసలీ బాంబు ఎవరు అమర్చారు, ఎలా వచ్చిందీ, అది గానీ ఒక పది నిముషాల ముందుపేలితే పోలీసులకి ఎంత నష్టం వచ్చి ఉండేదీ అనేవి ఇంకా లెక్కలు కడుతున్నారు. అదృష్టం ఏమిటంటే నేరస్తులు పోయినా పోలీసులకి ఏమీ కాలేదు. నేరస్తులు ఇలా పోయినందుకు ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు – అదే మంచి న్యాయం అన్నట్టూ. తర్వాత మరో రెండు మూడు వారలక్కాబోలు ఒక నివేదిక ఇవ్వబడింది ముఖ్యమంత్రులిద్దరికీను, ఈ బాంబు పేలుడం గురించి.

ఆ నివేదిక ప్రకారం మానభంగం చేసిన నేరస్తులే కాస్తో కూస్తో సిగ్గుపడ్డారో, అవమానం భరించలేకో తమ స్నేహితుల్లో ఒకర్ని అడిగారుట ఇలా జీపులో బాంబు పెట్టి తమతో సహా పోలీసులని కూడా చంపేయమని. కానీ జరిగినదేమంటే పోలీసులు ముందు జీపు దిగడం వల్ల వాళ్ళు బతికిపోయి నేరస్తులు మాత్రం పోయారు. అలా ఈశాన్య రాష్ట్రాల కేసు సరిగ్గా రెండే రెండు వారాల్లో తీరిపోయింది.
***
తాను విన్న కధ చెప్పడం ఆపి సుధాకర్ అడిగేడు రామ్మూర్తిని, “నాకు ఒకే ఒక ధర్మ సందేహం ఈ కధలో.”

“అడుగు, నాకు తెలిస్తే సమాధానం చెప్తా,” రామ్మూర్తి అన్నాడు, కధంతా విన్నాక.

“దేశం ప్రధాన పట్టణం, అధిష్టానం నేత గారి వెనక వరండాలో జరిగిన మాన భంగానికీ, ఆ లేడీ డాక్టర్ ని దహనం చేసిన నేరస్తులనీ పట్టుకుని ఆరేడేళ్ళు అవుతున్నా కేసు ఇంకా కోర్టులో నానుతోంది. ఆ నేరస్తులని కోడికూరతో మేపుతున్నారు కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కేసు సరిగ్గా రెండే రెండు వారాల్లో తేల్చారు. ఇదెలా సాధ్యమైంది?”

“ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులెవరో, చిన్న మంత్రులెవరో తెలుసా?” రామ్మూర్తి అడిగేడు.

“అంత బాగా తెలియదు కానీ విన్నాం వాళ్ళగురించి, ఈ మధ్యనే కాలేజీలోంచి వచ్చారుట కుర్ర నాయకులు. ఏమీ రాజకీయ అనుభవం కూడా లేదు.”

“వాళ్ళకి ఎవరు అండగా ఉన్నది?”

“వాళ్లకి అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ, బంధుకోటి అంతా అండగా ఉన్నారని చెప్పుకున్నార్లే”

“మరి అధిష్టానం వారికో?”

“ఆయనకి పిల్లా జెల్లా లేరు. పెళ్ళాం కొన్నేళ్ళ క్రితం పోయింది. అంతవరకే తెలుసు.”

“అదే నీ ప్రశ్నకి సమాథానం గురువా. పిల్లా జెల్లా, అన్నా తమ్ముడూ అక్కా చెల్లీ లేని నేతకి తన స్వంత చెల్లో అక్కో ఉంటే ఈ ఆడంగులకి జరిగిన భాధ తెలుస్తుంది కానీ అవన్నీ లేనివారికి కడుపుకోత ఎలా తెలుస్తుంది? అదీగాక ప్రధాననేత గారికి ప్రపంచదేశాలు చుట్టి రావడంలో ఉన్న ఉత్సాహం తన వెనక వరండాలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి లేదు. ఆయనకెంతసేపూ “దేశం వెలగడం” గురించే ఆందోళన. అదే ఈ ఈశాన్య రాష్ట్రాలకీ ఆయనకీ ఉన్న పెద్ద తేడా. అర్థం అయిందా?”

“మరీ మానభంగాలు అలా జరుతుతూనే ఉంటాయంటావా?”

“విదేశాలకెళ్ళి పెద్ద చదువులు చదువుకుని మాంఛి డబ్బులు సంపాదించుకుంటూ దేశం చూట్టానికొచ్చిన నీలాంటోడు ఇటువంటి గూట్లే ప్రశ్నలు వేయరాదు తమ్ముడూ. మహాభారతం లో ద్రౌపదిని దుశ్శాశనుడు సభాభవనంలో అతిరధమహారధులు చూస్తూండగా బట్టలూడదీసేడు, రామాయణంలో రావణాసురుడు బలవంతంగా, ఎంత తిడుతున్నా, గింజుకుంటున్నా సీత అమ్మవార్ని ఎత్తుకుపోయేడు. అప్పుడేటైంది? ఇది మన దేశ సంస్కృతి, దేశం అనేక రంగాల్లో ‘వెలిగిపోతున్నప్పుడు’ గర్వపడాలి కానీ ఇలా గూట్లే ప్రశ్నలేయచ్చా? ‘అనన్యాశ్చింతయంతోమాం యేజనా పర్యుపాసతే…’ అనికాదూ శీకిష్టపరమాత్మ గీతలో చెప్పింది? అన్నీ ఆయనే జూస్కుంటడు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked