కథా భారతి

దెయ్యాలు

-ఆర్. శర్మ దంతుర్తి

పెళ్ళైన అయిదేళ్లకి పుట్టింట్లో ముగ్గురు అక్కచెల్లెళ్ళు మళ్ళీ కలుసుకున్నాక అందరికీ ఒకటే ప్రశ్న – గీతకి ఇంకా పిల్లలెందుకు పుట్టలేదో? ఈ ప్రశ్న ఎలాగా ముందునుంచీ అడుగుతారన్నుకున్నదే కనక గీత తయారుగా ఉంచుకున్న సమాధానం – మా ఆయనకి అప్పుడే పిల్లలక్కర్లేదుట, స్వంత కిరాణా కొట్టు ఉద్యోగం కనక పగలూ రాత్రీ పనీ, అదిగాక కొంత కాలం కుటుంబ నియంత్రణ అవలంబిస్తున్నాం. అడిగిందే అడిగాక, చెప్పిందే చెప్పి ఇంక అందరి నోర్లూ మూసుకున్నాక గీత వెనక్కొచ్చేసింది మొగుడి దగ్గిరకి.

తన ఇంటికి వచ్చిన రోజు రాత్రి తాను పడుకుందన్నమాటే గానీ నిద్ర లేదు. పక్కన పడుకున్న రమణ కేసి చూసింది – ఆయన నిద్రలో ఉన్నట్టు గురకే చెప్తోంది. మళ్ళీ ఎప్పుడు లేస్తాడో, పొద్దున్నే లేచి ఎప్పుడు పనిలో పడతాడో తెలియదు. పొద్దున్న ఏడునుంచి రాత్రి తొమ్మిది దాకా అలా కొట్లో కూర్చుని సామాను అమ్ముతూ చిల్లర లెక్కపెట్టుకోవడంలోనే ఈయన జీవితం అయిపోతోంది. ఆలోచనలు ముసురుతున్నై. ఓ నిట్టూర్పుతో లేచి నిద్రమాత్ర వేసుకుని పడుకుంది. మరో గంటగ్గానీ ఈ మాత్ర పనిచేయదు తనకి, శరీరానికి అలవాటైపోయింది కాబోలు.

తన పెళ్ళికి ఎంత ఆర్భాటం! లక్షల ఖరీదు చేసే కిరాణా కొట్టు, లంకంత ఇల్లూ, వాకిలీ, వళ్ళు వంచుకోకుండా పనిచేసే మొగుడు. ధాం, ధూం అంటూ, తనని చదివే బి.కాం మానిపించి మరీ చేసారు పెళ్ళి. తను ఇప్పుడు మళ్ళీ పైకి చదువుకుంటానంటే అయ్యగారికి ఇష్టం లేదుట. అయినా తన చదువుకి ఈయన ఇష్టం ఏవిటో? ఆ మాటే అడిగితే పిల్లలు పుడితే చూడ్డానికి నీకు తీరుబడి ఉండొద్దూ అని సమాధానం. ఓ ఏడాదిలో అంతా అలవాటైపోయింది ఇంట్లో కూర్చోవడం. ఆ తర్వాత పిల్లలకోసం ప్రయత్నం. ఏం చేసినా తన తలరాత ఇలానే ఉంది కాబోలు, ఎప్పుడు పుట్టింటికి చుట్టపుచూపుగా వెళ్ళినా పిల్లలు పుట్టలేదే అంటూ అడగడం, తాను రడీగా పెట్టుకున్న అబద్ధం తీసి చెప్పడమూను. డాక్టర్ దగ్గిరకి వెళ్దాం అంటే ఎందుకు డబ్బు దండగ అని అయ్యవారి సమాధానం.

పెళ్ళైన సరిగ్గా నెలలోపునే రమణ, అతని కుటుంబం సంగతి తెలిసి వచ్చింది గీతకి. ఒకే కొడుకు ఉన్న తల్లికీ తండ్రికీ పనేమీ లేదు, ఇంట్లో కూర్చుని గీతని సాథించడం తప్ప. ఈ ముగ్గురికీ, కొట్టుకీ, అక్కడొచ్చే ఆదాయానికీ అవినాభావ సంబంథం. టివి చూడరాదు కరెంట్ అయిపోతుంది. పనిమనిషి లేదు అంట్లు కడగడానిక్కూడా, అదెందుకు డబ్బు దండగ, కోడలు పిల్ల ఉంది కదా? ఎక్కువ వంట చేయకూడదు, తిండి దండగ. ఏదైనా రోగం వచ్చినా, అత్తగారూ మావగారూ డాక్టర్ దగ్గిరకి వెళ్ళరు. డబ్బులు దండగకాదూ? తమ కొట్టుకి వచ్చే మనుషుల్లో ఎవరితోనో రమణ మాట్లాడి ఏదో ఒక మందు కొని పట్టుకొస్తే రోగం అదే తగ్గుతుంది. ఇటువంటి ఆలోచనల్తో తలతిరిగిపోయిన గీతకి మరో ఆరునెలలకి వీళ్ళు మారడం అసంభవం అని తెలిసివచ్చింది.
అదిగో అప్పట్నుంచే తనకి పట్టుకున్న జబ్బు మానసికంగా కుంగదీయడం మొదలైంది. చెప్పుకోవడానికి పుట్టింట్లో ఎవరూ లేరు. అక్కచెల్లెళ్లలో ఎవరికీ తీరికా కోరికా ఓపికా లేవు తన గురించి వినడానికి. గుండెలమీదనుంచి కుంపటి దింపుకున్న అమ్మానాన్నలకి మళ్ళీ గుండెలమీదకి ఆ కుంపటిని ఎక్కించుకోవడానికి ఎక్కడ ఓపిక? అక్కడకీ ఓ రోజు రమణని కూర్చోబెట్టి తనకున్న గొడవలూ, మనసు పాడవడం అన్నీ చెప్తే ఆయన పుల్ల విరిచేసాడు, ఇదంతా మామూలే రెండేళ్లలో అన్నీ సర్దుకుంటాయి అని. తన మానసిక జబ్బు అలా తగ్గేదేనా?

రెండేళ్లకి పైన మరో రెండేళ్ళుకి గీత పోరి పోరి ఏడిచి రమణని డాక్టర్ దగ్గిరకి తీసుకెళ్ళాక అన్నీ పరీక్ష చేస్తే తెలిసి వచ్చిన విషయం – రమణ చేసే పనివల్లో, కొట్లో కూర్చుని ఉండడం వల్లో లేకపోతే మరొకటో కానీ అతనిలోనే లోపం ఉంది. అతనికి పిల్లలు పుట్టడం అసంభవం. ఆ రోజు గీతకి తానో అగాథంలో కూరుకుపోయిన అనుభూతి.

నిద్రమాత్ర పనిచేస్తున్నట్టుంది, మెల్లిగా కళ్ళు మూతలు పడుతుంటే అలాగే నిద్రలోకి జారిపోయింది గీత.

మర్నాడు లేచి పొద్దున్నే కొట్టుకి బయల్దేరే రమణతో చెప్పింది – ఓ సారి అందరం కల్సి హరిద్వార్, కాశీ వెళ్దామా అంటూ. ఆశ్చర్యపోయిన రమణ అడిగేడు, “అంతదూరమా? ఎందుకిప్పుడు?”

“హరిద్వార్, కాశీ గంగలో స్నానం చేస్తే ఎంతటి వారికైనా పిల్లలు పుడతారుట,” మా అక్క చెప్పింది.

“నిజమా? అక్కడకెళ్తే సన్యాసులు డబ్బులు దండుకుని నెత్తిమీద గుడ్డ వేస్తారులే” ఏ సమయానికీ, సందర్భానికైనా డబ్బుని ముడిపెట్టగల గీత మొగుడు చెప్పేడు.

“ప్రతీదీ డబ్బుతోనే ముడిపెట్టడం దేనికీ? ఎవరికీ పైసా ఇచ్చేపని లేదు, దారి ఖర్చులొక్కటే మనం పెట్టేది.”

“అమ్మతో మాట్లాడు ఏమంటుందో?” బయటకెళ్తూ చెప్పేడు రమణ. ఈయన మళ్ళీ రాత్రిక్కానీ రాడు.

మధ్యాహ్నం భోజనం అయ్యేక గీత అడిగింది అత్తగార్నీ, మావగార్నీ, “మనందరం హరిద్వార్, కాశీ వెళ్దామండి, అక్కడా కాశీలోనూ గంగలో స్నానం చేస్తే పిల్లలు పుడతారుట తప్పకుండా. దారి ఖర్చులు తప్ప మరొకటి ఏమీ లేదు మనకి. విశ్వనాథుణ్ణీ అమ్మవార్నీ చూసి రావొచ్చు.”

“విశ్వనాథుణ్ణి చూడ్డానికి అంత దూరం ఎందుకూ ఇక్కడే శివాలయంలో చూడొచ్చుగా?” ఖర్చు అనే మాట వినగానే చెప్పేడు, గీత మావగారు.

ఏదైతేనేం ఏమీ తేలలేదు. మరో అయిదారు రోజులు అదేపనిగా చెప్తూ మొత్తానికి గీత ముగ్గుర్నీ ఒప్పించింది. అయితే ఇందులో లొసుగు ప్రకారం సరిగ్గా వెళ్ళిన ఆరో రోజుకి వెనక్కి రావాలి. కొట్టు అంతకన్నా ఎక్కువ రోజులు కట్టేస్తే లాభాలు పోతాయి. అత్తగారూ మామగారూ రారు; డబ్బులు దండగ అదీగాక కొట్టు చూడొద్దూ? రమణా, గీతా వెళ్ళి వచ్చేయండి.

గీత మనసులో ఛీ, ఛీ అనుకున్నా సరే అంది పైకి.

అలా తమ ఊర్నించి వెళ్ళి విజయవాడలో బండెక్కారు ఇద్దరూ. గీత తనకున్న నగలూ అన్నీ ఇంట్లోనే పెట్టి సరిగ్గా రెండే రెండు జతల బట్టల్తో బయల్దేరడం చూసి అత్తగారు ఏదో అనబోతూంటే గీతే చెప్పింది, “అంత దూరం వెళ్ళేటప్పుడు అన్నీ పట్టుకెళ్తే ఏవైనా పోయాయనుకోండి. మరో తలనెప్పికాదూ?” డబ్బు మహిమే కాబోలు, అత్తగారు మరి మట్లాళ్లేదు.

దారి అంతా రమణ తన పీనాసి తనం చూపిస్తూనే ఉన్నాడు – ఏదైనా కొనడానిక్కానీ, తినడానిక్కానీ. గీత అసహ్యించుకుంటూనే ఉంది. అయినా గీత మనసులో ఏదో నిశ్చయం ఉన్నట్టు తనకేమీ పట్టనట్టూ చూస్తూ కూర్చుంది మొత్తం ప్రయాణంలో.

హరిద్వార్ లో వడివడిగా పోయే గంగా ప్రవాహం చూసాక గీత మొహంలో ఓ చిర్నవ్వు. వెంటపడే పండా బ్రాహ్మలని తప్పించుకుంటూ మొత్తానికి హరిద్వార్ చూసాం అని చెప్పుకుని కాశీ బయల్దేరింది కుటుంబం.

గీతకి ఎక్కడో చదివినట్టు గుర్తు – కాశీ వెళ్ళాలంటే అమ్మవారు పిలవాలిట. ఆ పిలుపు లేకుండా వెళ్ళిపోదాం అనుకుని టికెట్లు కొనేసుకున్నా కుదరదు. తనని పిలిచినట్టే ఉంది. కాశీ చేరాక గంగలో స్నానం, తర్వాత అమ్మవారి దర్శనం, మర్నాడు బండెక్కి ఇంటికి పోవడం. ఇష్టం ఉంటే మరోసారీ మరోసారీ గంగలో స్నానం చేయొచ్చు. అలా మొదటి స్నానం, అయ్యగారి, అమ్మవారి దర్శనం అయ్యాక సాయంత్రం గీత మరోసారి గంగలో స్నానం చేద్దాం అనేసరికి మరోసారి బయల్దేరారు ఇద్దరూ.

దశాశ్వమేథ్ ఘాట్లో ఉరవళ్ళుతో పోయే గంగలో దిగాక కాస్త ముందుకు నడుంలోతుకి వెళ్ళారు. విపరీతమైన జనం. ఒకరి చేతులొకరు పట్టుకుని మూడు మునకలకి మొదటిసారి మునిగి లేచేసరికి ఇద్దరి చేతులూ కలిసే ఉన్నై. ముందూ, వెనకా, పక్క ఉన్న జనం తోపిడిలో ఏం జరుగుతోందో తెలిసే లోపుల గీత తన చేయి రమణ చేతినుంచి బలవంతంగా విడిపించుకోవడం నీళ్ళలో లోపలకి వెళ్తూ మునగడం అన్నీ జరిగిపోయేయి.

ఓ రెండు నిముషాలు ఏమైందో అర్థంకాక చుట్టూ చూశాడు రమణ. గీత తన పక్కన ఉండకపోవడంతో ఈ జనంలో గీత ఎక్కడ తేలిందా అనుకుంటూ. సమయం గడిచే కొద్దీ ఆదుర్దా.

అరగంటలో తెలిసివచ్చింది ఏమిటంటే గీత గంగలో కొట్టుకుపోయింది. తనకి రాని హిందీ భాష. వచ్చిన తెలుగులో అరుస్తూంటే అర్ధంకాని జనం తనకేసి పిచ్చివాడిలా చూడ్డం. మరో అరగంటకో తెలుగు తెల్సిన కుటుంబం కనిపిస్తే చెప్పేడు రమణ. వాళ్ళూ ఇతనూ కలిసి అందరికీ చెప్పేసరికి మరో అరగంట. వెతికినంత మేర వెతికాక తెల్సినది గీత ఎక్కడా లేదు. అదే రమణ ఆఖరిసారి గీతని చూడ్డం.

ఏవో పోలీస్ రిపోర్టనీ మరోటీ అనీ ఇచ్చాక మాడిపోయిన మొహంతో రమణ వెనక్కొచ్చాడు ఒక్కడూ ఇంటికి. దశాశ్వమేథ్ ఘాట్ లో వడివడిగా పోతున్న ప్రవాహంలో కొట్టుకుపోయిన గీత, నీళ్ళు మింగుతూ అలా పదో పదిహేనో ఘాట్ లు దాటి, మణికర్ణికాలో నీళ్ళలో వదిలే సగంకాలిన శవాలతో ఇంకా కిందికి ప్రవాహంలో కల్సిపోయింది.

రమణ వెనక్కొచ్చిన తర్వాత ఓ రోజు కొట్టులో కూర్చుని ఉన్నప్పుడు ఎందుకో ఓ సారి చటుక్కున గుర్తొచ్చింది – గీత కాశీ వెళ్ళేటప్పుడు రెండే రెండు జతల బట్టలు తీసుకెళ్ళడం, దారంతా ముభావంగా ఉండడం, కావాలని రెండోసారి గంగలో స్నానానికి తనని బలవంతంగా బయల్దేరదీయడం, అన్నీను. అన్నింటికన్నా ముఖ్యంగా అతన్ని వదల్లేని జ్ఞాపకం, తాను మూడోసారి మునుగుతుంటే గీత తన చేయి బలవంతంగా వదిలించుకోవడం, ఆ తర్వాత మునకవేస్తూ ఆ చేయి తనకి టా, టా చెప్తున్నట్టూ, తాను వెళ్ళిపోతున్నట్టూ ఊపడం. ఒక్కసారి కడుపులో దేవినట్టైంది.

ఆ తర్వాత ఎవరో వార్త పట్టుకొచ్చేరు రమణ ఇంటికి – తల్లికీ, తండ్రికీను. రమణ కొట్లో లేడుట; గల్లా పెట్టె దగ్గిర ఎవరూ లేకపోవడం చూసి వచ్చి చెప్పేరు. తర్వాత చాలాకాలం రమణ కోసం తల్లీ తండ్రీ చూసారు కానీ అతనేమయ్యాడో ఎవరికీ తెలియలేదు. మరి కొన్నాళ్లకి రమణ ఊరివాడొకడికి రమణ కలత్తాలో రోడ్డుమీద అడుక్కుంటూ కనిపించాడని చెప్పుకున్నారు కానీ ఏమీ ఇతమిథ్థంగా తెలియలేదు.

రమణ నాన్న ఓపికున్నంత కాలం కొట్టు చూసుకుంటూ గడిపాడు. ఆయనపోయాక ఇంటావిడ అన్నీ అమ్ముకుని ఎక్కడికో పోయిందని ఒకవార్తా, ఆవిణ్ణెవరో చంపేసి అన్నీ దోచుకున్నారని మరోవార్తా వచ్చేయి. ఊళ్ళో వాళ్ళు అందరికీ తలోరకంగా వచ్చిన ఆలోచనలు కొంతకాలం గింగిరాలు తిరిగాక అన్నీ సర్దుకున్నై. వైభవంగా జరిగిన రమణ పెళ్ళితో వాళ్ల జీవితాలు చివరకి అలా సర్వనాశనం అయ్యేయి. “కోడలు వస్తే మంచిదనుకున్నాం గానీ ఇలా దెయ్యమై కూర్చుంటుందని తెలియలేదు,” అని గీత అత్తా మామలు జీవించి ఉన్నంతకాలం ఊళ్ళో చెప్పుకున్నారు.

అయితే గీత అత్తా మామలిద్దరికీ మాత్రం అసలు సిసలు దెయ్యాలు తామేననీ తమ వల్లే రమణ తమలాగే పీనాసిలా తయారయ్యాడనీ, గీత గంగలో మునగడం జరిగిందనీ ఎప్పటికీ తెలియలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked