కథా భారతి

నిధి చాల సుఖమా

-ఆర్. శర్మ దంతుర్తి

ఆ రోజుకి చేయాల్సిన పనంతా అయిపోయాక తనకిచ్చిన వేరే గదిలోకి పోయి పడుకోబోయే ఇల్యాస్ ని పిలిచేడు మహమ్మద్ షా, “రేపు మనింటికి ఓ ముల్లా గారూ, ఆయన స్నేహితులూ మరో కొంతమంది చుట్టాలూ వస్తున్నారు. ఓ మేకని కొట్టి వాళ్లకి విందు చేయాలి. నువ్వు చేయగలవా?”
“సరే, రేపు సాయంత్రానికి కదా?” అదెంత పని అన్నట్టూ చెప్పేడు ఇల్యాస్.
“నీకు వయసు వల్ల కష్టం అవుతుందేమో అని అడిగాను అంతే. కష్టం అయితే వేరే వాళ్ళకి చెప్తాను ఈ పని.”
“అబ్బే ఏవీ కష్టం లేదు. నేను దగ్గిరుండి చూస్తాను.”
“మంచిది. మీ ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది కదా?”
“లక్షణం గా ఉంది. ఇక్కడికొచ్చి మీ ఇంట్లో పనిలో జేరాకే కదా అసలు మేమిద్దరం సంతోషంగా ఉండడం మొదలైంది.”
“పోనీలే, అదే చాలు కదా ఈ వయసులో?”

మర్నాడు షా గారి ఇంట్లో విందు జరుగుతూంటే ఇల్యాస్, వాళ్ళావిడా అన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షణ. వచ్చినవాళ్లకి వడ్డన, గ్లాసుల్లో వోడ్కా అవీ సరిగ్గా అందాయో లేదో చూస్తున్నప్పుడు షా గారి దగ్గిర గ్లాసు నింపుతూంటే ఆ పక్కనే ఉన్న మరో అతిధి తన గ్లాసు కూడా ముందుకి చాస్తూ అన్నాడు, “ముసలాయనా, ఇది కూడా నింపు మరి. నా గ్లాసు మర్చిపోతే ఎలా?”
ఇల్యాస్ నవ్వుకుంటూ ఇద్దరి గ్లాసులూ నింపి మరో చోట గ్లాసులు తీయడానికి వెళ్ళాక షా తన కూడా ఉన్న అతిధిని అడిగేడు “నువ్వు ముసలాయనా అని పిల్చిన ఆయనెవరో నీకు తెలుసా?”
“తెలియదే, నేనేమైనా తప్పుగా అన్నానా?” అతిథి కాస్త క్షమాపణ ధోరణిలో అడిగేడు.

“లేదు కానీ ఆయన పేరు మీరు వినే ఉండొచ్చు, ఇల్యాస్ అనీ…”
“ఏవిటీ? ఈ ఊరిలో జమిందారీ కామందు ఇల్యాస్ అంటే ఈయనా? ఇలా గ్లాసులెత్తే పనిలో…. అన్యాయం.” అతిథి దాదాపు అరుస్తున్నట్టూ అన్నాడు.
“అదేనయ్యా జీవితంలో విచిత్రం, నేనే చెప్పిస్తాను చూడు ఆయనచేత ఇలా ఎందుకైందో,” సమాధానం చెప్తూ షా అరిచేడు, “తాతా, ఇల్యాస్ ఇలా రా ఓ సారి.”
పిలుపు అందుకున్న ఇల్యాస్ వెంఠనే యజమాని దగ్గిరకొచ్చి అడిగేడు, “పిలిచినట్టున్నారు?”
“ఇల్యాస్, మా అతిథి నీ గురించి విని తెగ ఆశ్చర్యపడిపోతున్నాడు నువ్వొకప్పటి జమిందారువనీ అయినా ఇప్పుడు అన్నీ పోయి నా దగ్గిర పనిచేస్తున్నావనీ చెప్తే. నీకేమీ అభ్యంతరం లేకపోతే నీ జీవితం గురించి చెప్తావా?”
“అభ్యంతరమా? ఏమీ లేదు, తప్పకుండా చెప్తా, వినండి,” గొంతు సవరించుకున్నాడు ఇల్యాస్ మొదలుపెట్టడానికి.

చావుకి దగ్గిర్లో ఉన్న తండ్రి ఇల్యాస్ ని పిల్చి చెప్పేడు, “ఒరే అబ్బాయ్, నేను సంపాదించినది ఈ మూడు ఆవులూ, ఓ ఏడు మేకలూ, ఓ పది గొర్రెలూను. కొంచెం కష్టమో నష్టమో నీకో జోడు చూడగలిగేను. ఇంక నేనే వెళ్ళే సమయం వచ్చింది. నువ్వు మీ ఆవిడా కలిసి ఇవన్నీ చూసుకోవాల్సిందే. నన్ను ఇప్పటి దాకా బాగా చూసుకున్నారు మీరిద్దరూ. ఎప్పుడైనా ఇద్దరూ ఓ మాటా మాటా అనుకోవడం సరైనదే అనుకో అయినా దెబ్బలాడుకోకుండా సంతోషంగా బతకండి.”
ఆయన్ని ఖననం చేసాక తండ్రి పోయిన ఇల్యాస్, వాళ్ళావిడా ఇంట్లో చెట్టంత మనిషి పోయినందుకు కాస్త మనసులో కష్టపడ్డా, తోందర్లోనే ఇంటి పనిలో పడి మర్చిపోయేరు. రెక్కల కష్టంతో తండ్రి ఇచ్చిన పశువుల్ని పెంచుకుంటూ, ఒక్కోటిగా మెట్లెక్కుతూ ఇల్యాస్ జీవితంలో పైకొచ్చేడు. ఈ లోపున ముగ్గురు పిల్లలు కలగడం, వాళ్ళని దార్లో పెట్టడం, వాళ్ళ పెళ్ళిళ్ళూ అవీ అయేసరికి ముఫ్ఫై ఏళ్ళు దాటింది.

ఈ ముఫ్ఫై ఏళ్ళలో జీవితంలో ఏం జరిగిందా అని వెనక్కి చూసుకుంటే డబ్బులొచ్చాయి. పాడీ, పంటా, పశువుల సంపదా, దాంతోబాటే ఇళ్ళూ, పొలాలూ, నౌకర్లూ చాకర్లూ, అమరేరు. ఉన్న ఒక్క అమ్మాయికీ పెళ్ళి చేసి పంపించారు ఆర్భాటంగానే. తెప్పలుగ చెరువునిండిన అన్నట్టు చుట్టూ బంధుగణం, హితులూ స్నేహితులూ వచ్చి చేరారు. సంపదల్తో బాటు ఇంట్లో పాలూ, వెన్నా, వోడ్కా ప్రవాహంలా పారాయి. వచ్చినవాళ్లకీ అన్నీ అందాయా లేదా, అందకపోతే ఎవరేం అనుకుంటారో అనుకుంటూ ఇల్యాస్ వాళ్లావిడా నా నా హైరానా పడ్డారు. మొత్తానికి ఒకరితో ఒకరు కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో అతిథులకి ఏమీ లోటు లేకుండా చూసారు.
అబ్బాయిలిద్దరూ మొదట్లో తండ్రితో సమానంగా కష్టపడి సంపాదనలో తలో చేయి వేసినా తర్వాత ఒకడికి పెళ్లై భార్య ఇంటికి రావడంతో మొత్తం పరిస్థితి తారుమారైంది. ఎన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసినా ఏ అత్తగారికీ కోడలికీ సరిగ్గా పడింది కనక? అలా అత్తా కోడలూ తిట్టుకుంటూ, కొట్టుకోవడం మొదలుపెట్టాక వేరుపడాల్సిన పరిస్థితి. వాడి పరిస్థితి అలా ఉండగానే రెండోవాడు డబ్బులు చేతులో గలగలలాడుతూంటే అందరితో తాగుడూ దెబ్బలాటలూ మొదలుపెట్టాక వాడిని ఓ రోజు కొట్లాటలో చంపేసినట్టూ వార్త అందింది ఇల్యాస్ కి.

కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయాక, కొడుకులకి ఇలా అయ్యేసరికి ఎక్కడలేని నిరాశా ఆవిరించింది ఇల్యాస్ కీ వాళ్ళావిడకీ. ఇన్నేళ్ళూ తాము ఎంత కష్టపడి ఇటుకతో ఇటుక చేర్చి కట్టాడనుకున్నాడో, ఆ కుటుంబం అనే భవనం పునాదుల్తో సహా కూలిపోయింది. ఆ నిరాశ లోంచి బయటకొచ్చి, ఏం జరిగిందో చూసుకునేలోపుల ఆస్తి అంతా హారతి హారతి కర్పూరమైపోవడం ఇల్యాస్ కి కోలుకోలేని దెబ్బ.
ఏది జరగకూడదనుకున్నాడో అదే జరిగి, చివరి రోజుల్లో వంటిమీద బట్టలూ, కప్పుకోవడానికో చిన్న శాలువా, తనతో ఇప్పటివరకూ బతికిన భార్యా మిగిలారు ఇల్యాస్ కి. ఏం చేయాలో దిక్కు తోచని రోజుల్లో అదృష్టం కొద్దీ పక్క ఇంట్లో ఇన్నాళ్ల బట్టీ ఇల్యాస్ ని గమనిస్తున్న మహమ్మద్ షా ఆదుకున్నాడు.
“ఇల్యాస్ మీరిద్దరూ బాగున్న రోజుల్లో ఎలా బతికారో తెలుసు. చేతికి ఎముకలేముండా అందర్ని ఆదుకున్నదీ తెలుసు. ఇప్పుడిలా అవడం బాధే అనుకో అయితే నేను నీ అంత డబ్బున్న వాణ్ణి కాదు. అలాగని తిండికి లేనివాణ్ణీ కాదు. నీకిష్టం ఉంటే నువ్వూ మీ ఆవిడా మా ఇంటికొచ్చేయండి. ఉన్నంతలో నీకు చేతనైన పని చేయి, మీ ఆవిడ బర్రెల దగ్గిర పాలు తీయగల్గితే సరే లేకపోయినా ఫర్వలేదు.” మహమ్మద్ షా చెప్పేడు.

“అలా ఇక్కడ తేలేం, ఇప్పుడు జీవితంలో తలమీద నీడకీ, తిండికీ, గుడ్డకీ లోటులేదు.” చెప్పడం ముగించేడు ఇల్యాస్.
ఇంటాయన మహమ్మద్ షా వెంఠనే చెప్పేడు, “నేను ఇల్యాస్ ని చేరదీయడానికి చాలా కారణాలున్నై. ఒకప్పుడు ఆయన బాగా బతికినవాడు. ఇప్పుడు ఇలా అన్నీ పోవడంతో నా పక్కింటాయన అనే అభిమానం ఒకటీ, అయనింట్లో ఎన్నోసార్లు తినడం, ఆయన ద్వారా లబ్ది పొందడం మరోటీను. అదీగాక ఇల్యాస్ కి గొడ్డు గోదా ఉండేవి కనక ఇలాంటివన్నీ చూడ్డంలో సాధకబాధకాలు బాగా తెల్సినవాడు. అందుకే అతన్ని నాతో ఉండమన్నాను.”
ఇల్యాస్ చెప్పినది అంతావిన్నాక షా ఇంటికొచ్చిన అతిధి అడిగేడు, “తాతా, ఇంతజరిగాక నీకు ఇప్పుడు మనసులో అన్నీ పోయినందుకూ, పిల్లలు దగ్గిరలేనందుకూ చాలా కష్టంగా ఉండి ఉంటుందేమో?”
ఇల్యాస్ ఓ చిరునవ్వు నవ్వేడు, “నేను చెప్తే అంత సరిగ్గా మీరు అర్ధం చేసుకోకపోవచ్చు. అందువల్ల మా ఆవిడ ఇక్కడే ఉంది, పిలుస్తాను. ఆవిడ నోటమ్మటే విందురు గాని.”

పిలిచాక వచ్చిన ఇల్యాస్ వాళ్ళావిడ అతిధి అడిగిన ప్రశ్న విని చెప్పింది సమాధానం, “నేనూ మా ఆయనా యాభై ఏళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుంటూ బతికాం; సంపదా గొడ్డూ గోదా కూడబెడుతూను. ఈ యాభై ఏళ్ళలో రోజూ బంధువులనీ, స్నేహితులనే వాళ్ళనీ విందులకీ వాటికీ పిలిచి అదే ఆనందం అనుకుంటూ దాన్ని వెదుక్కోడానికి ప్రయత్నించాం. కానీ అవన్నీ పోయాక రెండేళ్ళనుంచీ మహమ్మద్ షా గారిదగ్గిర బికారుల్లా తేలేవరకూ అసలు ఆనందం అంటేనే మాకు తెలియలేదు. ఈ రెండేళ్ళలో అనుభవంలోకి వచ్చినదేమంటే ఇప్పుడే ఇద్దరం చాలా హాయిగా సంతోషంగా ఉన్నాం. యాభై ఏళ్ళు చాకిరీ చేసి వళ్ళు హూనం చేసుకున్నాక తెలిసివచ్చినదేమంటే సంపదలు కూడబెట్టడంలో మాకు ఒరిగినది ఏమీలేదు. ఆనందం అనేది ఏదైనా ఉంటే అది మా పిల్లలు చిన్నప్పటిగా ఉన్నప్పుడూ మాకు కొంచెం మాత్రమే ఆస్తి ఉన్నప్పుడూను. గొడ్డూ గోదా పెరిగే కొద్దీ వాటిని కాపాడుకోడానికో కష్టం, పనివాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో అని మరో చింతా అలా సంపద పెరిగే కొద్దీ ఉన్న అనందం ఏదైనా ఉంటే అది కాస్తా ఆవిరైపోయింది. నిజం చెప్పాలంటే ఆస్తులేమీ లేకుండా, ఏ చింతా లేకుండా ఇప్పుడే ఇద్దరం హాయిగా ఉన్నాం.”
అతిథులందరూ ఈవిడ చెప్పినది విన్నాక, పెద్దావిడ కనక, ఆస్థులన్నీ పోయాక ఇల్యాస్ భార్యకి మతిపోయి హాస్యమాడుతోందనుకున్నారు కాబోలు పెద్దగా నవ్వేరు ఆవిడ చెప్పింది విని.

“నాకు మతిపోయిందనీ, తప్పుగా అన్నాననుకుని నవ్వుకుంటునారా? నేను భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. చెప్పిన దాంట్లో అణుమాత్రం అబద్ధం లేదు సుమా. ఇప్పుడు మహమ్మద్ షా గారి ఇంట్లో ఇలా కూలి పనిచేసుకుంటూనే మేమిద్దరం హాయిగా ఉన్నాం.” ఇల్యాస్ భార్య మరోసారి చెప్పింది స్థిరంగా.
“అవునా, ఐతే అన్నీ పోయాక మీకు అసలు ఆనందం ఎక్కడ్నుంచి వస్తోంది? ఉన్న వన్నీ పోయినందుకూ, బికార్లుగా మిగిలినందుకూ బుర్ర పాడై పిచ్చెక్కుతుంది కదా ఎవరికైనా సరే,” మరో అతిథి అడిగేడు ఇల్యాస్ వాళ్ళావిణ్ణి.
“మీరడిగారు కనక చెప్తున్నాను వినండి అయితే. డబ్బున్న రోజుల్లో బోల్డంత పని. రోజూ ఎవరికో విందో మరోటో చేయాల్సొచ్చేది. అప్పుడున్న పనిలో అసలు నేనెలా ఉన్నా, నాకు మా అయనెలా ఉన్నాడని అలోచించడానికే సమయం ఉండేది కాదు. తీరిక చేసుకుని దేవుడి గురించి ఆలోచించాలన్నా, అసలు రోజూ మేం చేసినపనులెలాంటివీ అని ఆలోచించుకోవడానికే సమయం ఉండేది కాదు. ఎంతసేపూ ఆ విందు సరిగ్గా ఇచ్చామా లేదా, అందులో పెట్టిన కూరో నారో బాగోలేదేమో, బంధువులకి సరిగ్గా పెట్టలేదని ఏమనుకుంటారో అనే చింత ప్రతీ క్షణం. మేకలూ, గొర్రెలూ రోజురోజుకీ పెరుగుతూంటే ఏ తోడేలో నక్కో ఓ గొర్రెని ఎత్తుకుపోతుందేమో అని మరో చింత. పనివాళ్ళు ఏదైనా పని సరిగ్గా చేసారో లేదో, ఏదైనా మాకు తెలియకుండా ఎత్తుకుపోతున్నారేమో అనే మరిన్ని బుర్ర తినేసే కష్టాలు. ఓ పని పూర్తి చేసి కాస్త నడుం వాల్చుదామనుకునేలోపల మరో తలనెప్పి సిద్ధంగా ఉండేది. నేను ఏ పని అయినా ఇలా చేద్దాం అంటే మా ఆయన వద్దు ఇంకోలా చేద్దాం అనడం. అలా మాటా మాటా పెరిగి రోజూ అరుచుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం. అలా రోజులు గడుస్తూంటే ఒకరి మాట ఒకరికి ఖాతరీ లేదని మాలోఒకరి మీద ఓకరికి విపరీతమైన ద్వేషం కోపం. దాని గురించి ఆలోచనే రానప్పుడు ఆనందమా, ఇంకెక్కడి అనందం?”
“మరి ఆ తిట్లు శాపనార్ధాలు అలవాటైపోయాక, ఇప్పుడు కూడా ఒకర్నొకరు తిట్టుకుంటూ ఉంటారా?” అప్పటివరకూ అన్నీ వింటున్న అతిథుల్లోంచి మరో అతిథి అడిగేడు ఇల్యాస్ వాళ్ళావిణ్ణి.

“ఇప్పుడా? ఇద్దరం పొద్దున లేవగానే మేమిద్దరం ఒకరికొకరు తప్ప మాకేం లేవని తెలిసి వచ్చింది కదా. అందువల్ల ఒకర్ని ఒకరు ప్రేమగా పలకరించుకుంటున్నాం. ఆయనకి జలుబొచ్చినా జ్వరం వచ్చినా నేనున్నాను. నాకేమైనా అయితే పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు ఇల్యాస్. యజమాని షా గారి ఇంట్లో ఏదో పని నాకు చేతనైనది చేస్తా. నాకు చేతకాకపోతే ఆయనొచ్చి ఓ చేయి వేస్తాడు. అలాగే నేను కూడా ఆయనిక్కావాలిస్తే నాకు చేతనైంది చేస్తున్నా. పిల్లలూ ఆస్థులూ అన్నీ పోయాక నేను ఆయనకీ, ఆయనికి నేనూ మాత్రమే మిగిలున్నాం అని తెలిసి వచ్చింది కనక అరుపులూ కేకలూ మానేసి ఇద్దరం సంతోషంగా ఒకర్ని ఒకరు చూసుకుంటున్నాం. ఇప్పుడైతే రోజుకి కనీసం ఓ సారి భగవంతుడి గురించి ఆలోచించడానికీ దానికీ సమయం దొరుకుతోంది. అందుకే ముందు యాభై ఏళ్లలో ఏనాడూ అనుభవించలేని ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇంక అంతకన్నా ఏం కావాలి?”
కధంతా విన్న షా చెప్పేడు, “నిజమదే కదా ఈ ముసలావిడ చెప్పినది చూస్తే మనం ఆనందం కావాలనుకుంటూ అటూ ఇటూ పరుగెడుతున్నాం. కానీ ఆ ఆనందం అనేది వస్తువులు సమకుర్చుకోవడంలో లేదు. వాటిని వదుల్చుకోవడంలోనే ఉంది.”
విందు అయిపోవచ్చేసరికి ఇల్యాస్ చెప్పేడు అందరితో, “మీకు మేము చెప్పినదానికి నవ్వు రావచ్చేమో కానీ నవ్వులాటకి కాదు చెప్పినది. మా ఆస్థి పోవడం, ఇలా జరగడం ఏదో మా అదృష్టం అని నేను అనుకుంటున్నా లేకపోతే అసలు మాకు జీవితంలో ఆనందం అంటే ఏమిటో, అసలు భగవంతుడనే వాడున్నాడనీ ఆయన గురించి ఆలోచించాలనీ కూడా తెలిసి వచ్చి ఉండేది కాదు. డబ్బే ముఖ్యం అనుకుంటూ గాఢాంధకారంలో ఉండేవాళ్ళమేమో. సావుకాశంగా ఆలోచించండి, నా జీవితంలో జరిగింది మీకు ఉపయోగపడవచ్చు, అలా అయితే అందరికీ మంచిదే కదా?”
ఇల్యాస్ చెప్పడం ముగించగానే అతిథులందరూ మౌనంగా తల ఆడిస్తూ వెళ్ళడానికి లేచారు.

(మూలం – ఇల్యాస్ – లియో టాల్ స్టాయ్ – https://en.wikisource.org/wiki/Twenty-three_Tales/Ily%C3%A1s)

*********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked