ధారావాహికలు

భయం భయం రోగ భయం !

( హైపోకాండ్రియాసిస్ )

అమరనాథ్.జగర్లపూడి

( రోగ భ్రమ లేదా రోగ భయ స్థితి ఫై ఒక వ్యాసం)

మానసిక ఆరోగ్యమే శరీర ఆరోగ్యానికి రక్షణ కవచం .”రోగం మనిషిని చంపదు దాని తాలూకా భయమే మనిషికి హాని చేస్తుంది” దీనికై మన పట్ల, మన శరీరం పట్ల మనకు అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా వుంది ! శరీరానికి వ్యాధి అనేది చాలా సహజమైన లక్షణం ఈ విషయంలో మానవ శరీరం అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తుంది. దాదాపు చిన్న చిన్న రోగాలను సైతం తనకు తానుగా రక్షించుకునే శక్తి శరీరానికి వుంది. కానీ ఆ అవకాశం శరీరానికి ఇవ్వకుండా మన ఆత్రుత, అనవసర ఆందోనళనతో మరి కొన్ని అనవసర సమస్యలు తెచ్చి పెట్టుకుంటాము. ఇందులో ముఖ్యంగా హైపోకాండ్రియాసిస్ దీనినే రోగ భ్రమ స్థితి లేదా రోగ భయ స్థితి అంటాము. ఇది ఒక మానసిక సమస్య ఇందులో చిన్న చిన్న రోగ లక్షణాలు కన్పించినా దానిని భూతద్ధంలో చూస్తూ తనకేదో అయిపోతుందనే భ్రమతో ఆందోళనకు గురి అవుతుంటారు కొందరు, మరికొందరు ఏవైనా వ్యాధులతో బాధపడేవారిని చూసినా, వారిని ఏదయినా సందర్భాలలో కలిసినా ఆ రోగం తమకు కూడా వస్తుందేమోనని భయ పడుతుంటారు. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలసింది దీర్ఘకాలిక వ్యాధులలో సైతం దశాబ్దాల పాటు తమదైన వ్యాపకాలతో హాయిగా జీవితం సాగించే వారున్నారు.
ముఖ్యంగా ఈ హైపోకాండ్రియాసిస్ లో (రోగ భ్రమ లేదా రోగ భయ స్థితి) స్వల్పమైన వ్యాధులలో సైతం డాక్టర్ చేప్పేదాని మీద కూడా నమ్మకం కుదరక పోగా, పదే పదే డాక్టర్స్ ను మారుస్తూ చేసిన పరీక్షలే చేయించుకుంటూ చివరికి డాక్టర్లకి కూడా ఏమి తెలియదనే స్థితిలో అంతర్లీనంగా ఒత్తిడి పెంచుకుంటారు. దీనికి ఇతిమిద్ధంగా కారణాలు తెలియక పోయినా ఈ వ్యాధి తాలూకా బీజాలు చిన్న తనంలోనే పడి పెరుగుతున్న వయసుతో పాటు ఇవి కూడా మనసులో గూడు కట్టుకుంటాయి. శరీరం పట్ల ప్రతి ఒక్కరికి తమదైన మమకారం ఉంటుంది తప్పులేదు! కానీ కొందరికి దీని మోతాదు ఎక్కువగా ఉండి మనసుని అనవసర చికాకులకు, ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. ఇదేదో ప్రమాదకరమైన మానసిక వ్యాధేమీ కాదు సుమా! మన సంయనం, మనం పెంచుకొనే అవగాహనతోనే దీని నుండి బయట పడవచ్చు. దీనికై మొట్ట మొదట గా మనం గుర్తుంచు కోవలసింది మనకు మనం అతీతులం కాదు మనం కూడా సమాజం లో భాగమే అని ! ఈ హైపోకాండ్రియాసిస్ లో చెడు అలవాట్ల వలన జరిగే సంఘటనల ప్రభావం కూడా ఉండవచ్చు. ఉదాహరణకు సిగరెట్ త్రాగే ఒకవ్యక్తి ఊపిరితిత్తుల కాన్సర్ తో చనిపోతాడు అదే సిగరెట్ త్రాగే ఇంకొక వ్యక్తి తనకు కూడా ఇదే వ్యాధి వస్తుందేమో ననే భయానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో దీని నుండి పాఠం నేర్చుకొని చెడు అలవాట్ల పట్ల దూరంగా ఉంటే మనకు మానసిక భరోసా దొరికే అవకాశం ఉంటుంది! దీనికై మన దైనందిక జీవితంలో మన ఆహార అలవాట్ల ఫై కూడా మనకు జాగ్రత్త చాలా అవసరం .
దీనికై మొదటగా మన పట్ల మన ఆహార అలవాట్ల పట్ల జాగురూకతతో వ్యవహరించటం .శారీరక వ్యాయామ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ప్రతి రోజూ కొద్ది సమయం దానికై కేటాయించటం. వయస్సులో వున్నవారైనా లేదా వృద్దాప్యంలో వున్నవారైనా సాధ్యమైనంత వరకు వ్యాపకాలను పెంచుకొనే ప్రయత్నం చేయాలి. Ideal man’s brain is devil’s workshop అనేది మనందరికీ తెలిసిన విషయమే. అందుకే మనసును ఏదో ఒక మంచి వ్యాపకం లోకి లీనం చేయాలి అందులో ముఖ్యంగా నైతికవిలువలు , ఆధ్యాత్మికంగా మానసిక పరిణితిని పెంచే పుస్తక పఠనానికి ప్రాధాన్యత నివ్వటం. చదవటం అలవాటు లేని వారి సైతం ప్రారంభం లో చిన్న చిన్న కధల ద్వారా ప్రయత్నం ప్రారంభించాలి. ఉద్రేక, ఉద్వేగాలను రెచ్చకొట్టే మీడియా ప్రోగ్రామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సున్నిత మనస్కుల ఫై వీటి ప్రభావం త్రీవ్రంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతకు మంచి మ్యూజిక్ చక్కటి ఫలితాలను ఇస్తుంది. మానసికంగా పేరుకున్న ఒత్తిడి నుండి ఉపశమనానికి మనసులోని మాట బయటకు రావాల్సిందే దానికి మన అనుకొనేవారితో మన అనుభవాన్ని పంచుకోవటం లేదా మన ఆలోచనలు మన నమ్మకాలు మన భావాలపై మన ప్రవర్తన ఫై ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయో తెలిసికొని సరిదిద్దుకోవాలంటే కాగ్నెటివ్ బిహేవియర్ థెరఫీ ద్వారా(Congative Behaviour Theraphy) సైకాలజిస్ట్ నుండి సహాయం తీసుకోవటం అనేది కూడా అవసరమైన ప్రక్రియే!
వేగవంతమైన సామాజిక పరిణామాలలో ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నా కూడా ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు తరచూ విషయాలను పంచుకోవటాన్ని అలవాటుగా చేయాలి. దీని వలన కచ్చితం గా చిన్నతనంనుండే కొంతలో కొంత రోగ భయాల పట్ల మానసిక పరిణితిని మరియు బతుకు పట్ల భరోసా పెంచే ప్రయత్నం జరుగుతుంది. మానసికంగా బాధను అనుభవిస్తూ మానసిక ఒత్తిడిని పెంచుకోవటం కంటే మనకంటూ ఒక మంచి సలహా కోసం మాటను పంచుకోవటం అనేది చాలా అవసరం ఇందులో ఎటువంటి మొహమాటాలకు అవకాశం ఇవ్వద్దు. మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది శారీరక వ్యాధుల్లో మందులు తప్పనిసరి కానీ ప్రధానంగా మానసిక రుగ్మతల విషయం లో ఎక్కువగా మాటే భరోసా గా నిలుస్తుంది. ఈ విషయం లో అన్ని వయస్సులవారు తమ తమ ఆలోచన పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకే ఆలోచన , ఒకే భయం పదే పడే వెంటాడు తుంటే కచ్చితం గా మనకు మాట సాయం అవసరం. మన జీవితం మనకు చాలా ముఖ్యం, మన జీవితం ప్రశాతంగా నడవటానికి, నడపటానికి మనపై మనం భరోసా పెంచుకోవటం చాలా అవసరం. ఎందుకంటె మనం సంఘ జీవులం . అందుకే మంచి మాటే మందుగా ( మంత్రం గా) పనిచేస్తుంది.

****

ఇట్లు
అమరనాథ్.జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257

Leave a Reply

Your email address will not be published. Required fields are marked