కథా భారతి

మురికి

 -ఆర్ శర్మ దంతుర్తి

అప్పల్నాయుడు సర్పంచి అయినప్పటినుండీ డబ్బులు వెనకేసుకోవడంలో చూపించిన చొరవ మరొకరెవరికీ చేతకానికిది. ఎక్కడ ఏమూల పైసా దొరికినా అందులో నాయుడి చేతిలోకి వాటా రావాల్సిందే. అయితే ఎలా తినేసినా కొంతలో కొంత ఊరికి మంచి చేసినట్టే లెక్క. మరుగుదొడ్లు కట్టించడం, వాటిని రోజూ క్లీన్ చేయడానికో టీం ఏర్పాటు అలా మొత్తంమీద ఏదో ఒక మంచి చేస్తూంటే ఎలక్షన్ లలో నెగ్గుతూ వస్తున్నాడు. అయితే మరుగుదొడ్లు కట్టడంలో ఇరవై శాతం తినేసాడనీ, వాటిని రోజూ క్లీన్ చేయడానికి ఇచ్చే సరుకుల్లో, ఫినాయిల్ కి ఇచ్చే డబ్బులో సగం నాయుడిదేననీ జనం అనుకున్నా మనం అటువంటి పనికిరాని అమాయకపు ప్రశ్నలు అడగరాదు.

చేతులు తడవకుండా ఉత్తినే ఎవరూ ఏ పనీ చేయడానికి ఇది సత్యయుగం కాదు కదా? సర్పంచ్ నుంచి, ఎమ్మెల్యే దాకా ఎదిగే సరికి నాయుడికి మూడు కార్లూ, ఒక బంగళా, గేటు దగ్గిర కాపలాకి గూర్ఖా, వీళ్ళందర్నీ చూడ్డానికో పెర్సనల్ సెక్రటరీ ఇలా మందీ మార్బలం వచ్చి చేరాయి. మురికివాడల్లో జనాలు మరుగుదొడ్లలో మురికి వదిలించుకుంటూంటే ఆ మురికి కడగడానికి అయ్యే ఖర్చుల్లో సగానికి సగం నాయుడికి చేరిపోతోంది. అలా ఊరి మురికి డబ్బుల్తో, ఎమ్మెల్యే అయ్యేక హైద్రాబాద్ లో దొరికే మరింత మురికితో నాయుడు బంగ్లా మీద అంతస్తులు ఒకదానివెంట ఒకటి లేస్తున్నాయి. ఊళ్ళో స్థలాలూ, నగరంలో అపార్ట్ మెంట్లూ సరేసరి. ఆ తర్వాత ఢిల్లీ లో మంత్రిగా పిలుపురావడానికి ఆట్టే సమయం పట్టలేదు.

నాయుడు సంపాదించే మురికి చివరకి మెడకి తగుల్తుందని ఎవరు చెప్పినా నాయుడు వినలేదు. అయినా మన చాదస్తం కానీ మురికి డబ్బు వెనకేసుకుని మెడకి తగులుకుని కష్టపడ్డ ఓ నాయకుణ్ణి చూపించండి చూద్దాం? అధర్మం చేస్తూంటే దేవుడు చూస్తాడనీ అది కట్టికుడుపుతుందనీ డబ్బులు సంపాదించడం చేతకాని దద్దమ్మలు అనేమాట. నాయుడి లాంటివాళ్ళు హాయిగా ఉన్నారు మురికి కూడగట్టుకుంటూ. దేవుడనే వాడుంటే ఆయన చూస్తూనే ఉన్నాడు కూడా. ఆయన దిగిరావడానికి అప్పుడే ఏం కంగారు, ఇంకా కలియుగం మొదట్లోనే కదా ఉన్నాం? ముప్ఫై అయిదేళ్ళు రాజకీయాల్లో తిరిగేక రక్తపోటూ, మధుమేహం, కీళ్ళ నెప్పులూ అన్నీతగిలించుకుని నాయుడు వారసత్వానికి తన కొడుకుని ఎమ్మెల్యేగా చేసేసి ఇంటికొచ్చేసాడు. నాయుడు, ఇంట్లోనే కూర్చుని ఇప్పుడు కొడుకు పంపించే మురికి – అదే సంపద – పోగేసుకుంటున్నాడు.

రాజకీయాల్లో రిటైర్ మెంట్ ఉండదు కనక డబ్భై సంవత్సరాలొచ్చేసరికి మరోసారి పిల్చేరు అధిస్ఠానం వారు నాయుణ్ణి – ఈ సారి ఈశాన్య సరిహద్దులో ఉండే రాష్ట్రానికి గవర్నర్ గా. నాయుడు చేతి కర్రతో మెల్లిగా నడుస్తూ ప్రమాణ స్వీకారం చేసి గవర్నర్ అయిపోయిన మూణ్ణెల్లకి ఆఫీసులో హఠాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయేడు. హుఠాహుఠిన ఆసుపత్రిలో చేర్చడం అయింది. ఈశాన్య సరిహద్దు కనక మంచి హాస్పిటల్ కలకత్తా లో గానీ లేదు. హెలికాప్టర్ లో తీసుకెళ్ళి కలకత్తా లో చేర్పించాక అప్పుడు తెల్సిన విషయం – నాయిడికి కిడ్నీలు రెండూ పాడయ్యేయి. చాలాకాలంగా ఉన్న మధుమేహం తిరగబెట్టింది. అయితే గుండె, ఊపిరితిత్తులూ బాగానే ఉన్నై కానీ పేగులో ఏదో మడతబడి తిండి లోపలకి వెళ్ళదూ, వెళ్ళినది బయటకి రాదూ. కంచంలో అన్నం ముందు పెడితే అసహ్యం గా ఉందిట, పాపం ఏదీ తినలేకపోతున్నాడు. సర్జరీ చేద్దామా అంటే ఈ వయసులో ఏమౌతుందో తెలియదు. మధుమేహం చెక్ చేస్తే వంట్లో చక్కెర నాలుగు వందల పైబడి ఉంది. డాక్టర్ చెప్పడం ప్రకారం డయాలసిస్ చేస్తారు కొంతకాలం. బాగుపడే ఛాన్స్ ఉంటే ఉంది, లేకపోతే లేదు.

అలా డయాలసిస్ మొదలుపెట్టిన అయిదో రోజుకి కాస్త తెరిపిన పడ్డాడు నాయుడు. ముఖ్యమంత్రిగారూ, ఉప గవర్నర్ గారూ మిగతా పెద్దలందరూ ప్రజా ధనం ఖర్చుపెట్టి కారులో వచ్చి చూసి వెళ్ళారు. పువ్వులూ పళ్ళూ ఇచ్చారు కూడా. అవి వంట్లో మురికి పేరుకుపోతున్న నాయుడు తిన్నాడా లేదా అనేది చూసుకోవడానికి ఎవరికీ తీరిక లేదు. ప్రధానమంత్రిగారు, దేశాధ్యక్షులవారూ కూడా ఒక్కొక్క సందేశం పంపించారు – నాయుడు సత్వరితంగా కోలుకోవాలని ఆశిస్తూ. అయితే మరో మూడు రోజులకి పరిస్థితి విషమించింది, డయాలసిస్ మెషీన్ నాయుడి వంటిమీదనుంచి తీసేయగానే. చక్కెర అయుదువందల కౌంట్ చూపిస్తూంటే, రక్తం మిగతా పరీక్షకి పంపించారు. అందులో తెల్సిన విషయాల ప్రకారం, కిడ్నీలు ఇంక పనిచేయట్లేదు. పాంక్రియాస్ అనేది ఎప్పుడో పాడైంది. కిడ్నీలు చేయాల్సిన పని చేయకపోవడంతో, చక్కెర ఆరువందలు, యూరియా అత్యధికం; రక్తంలో మురికి రోజు రోజుకూ పెరుగుతోంది.

అప్పుడు డాక్టర్ చెప్పిన సలహా – ఈ వయసులో డయాలసిస్ ఎంత చేసినా ఇంక లాభంలేదు. రక్తంలో పేరుకుపోయే మురికి వదలదు. ఇంటికెళ్ళిపోయి కాస్త విశ్రాంతి తీసుకుంటూ రామా కృష్ణా అనుకోవలసిందే. నాయుడు బాగా పేరున్న రాజకీయనాయకుడు కనక డాక్టర్ గారు అన్ని పత్రికల్తో గోష్టి ఏర్పాటు చేసి, పత్రికా ముఖంగా చెప్పేరు – ఇదిగో ఇలా మురికి పేరుకుపోయింది నాయుడి వంట్లో, మేము చేయగల్గేది చేస్తున్నాం అని. అలా ఇంటికి వచ్చేసిన నాయుడు మూడో రోజున అపస్మారక స్థితిలో, మరీ అంత ఢాం అని కాదుకానీ, మామూలుగానే చచ్చిపోయేడు. పోయేటప్పుడు నాయుడి వంట్లో చక్కెర, యూరియా అవీ పూర్తిగా దారుణమైన స్థాయిలో రెచ్చిపోయి, మెదడులోకి పోయి అక్కడ ఉన్న కణాలని తమ కూడా తెచ్చుకున్న మురికిలో ముంచేసాయి. అలా బుర్ర పనిచేయక అపస్మారకం అయి నాయుడు చచ్చిపోయాడు.

జనాలమీద అన్యాయంగానూ గడించిన ఏ మురికి డబ్బు అయితే తనని గొప్పవాణ్ణి చేసిందో ఆ మురికి తనని ఎప్పటికీ అంటదనుకున్న నాయుణ్ణి అదే మురికి బయట ఎవరికీ కనపడకుండా వంట్లోనే ఉండి పిప్పి చేసి పీల్చేసి చంపేసింది. అయితే ప్రధానమంత్రీ, ముఖ్యమంత్రి ఆదేశాలతో నాయిడి మురికి శరీరానికి మాత్రం అద్భుతంగా అంత్యక్రియలు ఏర్పాటు చేయబడ్డాయి – అవును ప్రజాధనంతోటే; ఆర్మీ వారి శాల్యూట్ తో సహా. నాయుడంటే తెల్సిన, తెలియని ప్రతీ ఒక్కరూ నాయుడింత, అంత అంటు బ్రహ్మ రధం పట్టారు మూడురోజులు.

పైకి రావడానికి తాపత్రయ పడుతున్న ప్రతీ కుర్ర రాజకీయనాయకుడూ వచ్చి చూసి మురికిలో మునిగి చచ్చిపోయిన నాయుడి పార్థివ శరీరానికి నమస్కారం చేసి శ్రద్ధాంజలి ఘటించారు కూడా. వార్తా పత్రికలు సరేసరి – వాటికీ మూడు రోజులూ బోల్డంత తీరికలేని పని. అంతా అయ్యాక చితా భస్మం, మిగిలిన ఎముకలూ ఏరి నాయుడి కొడుకు వాటిని గంగలో కలపడానికి వారణాసి వెళ్ళాడు, వేద పండితులని వెంటబెట్టుకుని. నాయుడి మురికి భస్మం గంగలో వదులుతుంటే, మణికర్ణికా ఘాట్ లోంచి చూస్తున్న మిగతా ప్రజలకి, పండితుల మంత్రాలు దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నా ఎందుకో ఆ రోజు – గంగమ్మ బాగా చిక్కిపోయినట్టూ, అతి విచారంగా ఉన్నట్టూ అనిపించింది.

————— End —————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked