కథా భారతి

ముష్టివాడు

-ఆర్. శర్మ దంతుర్తి

అమెరికా నుంచి వచ్చిన స్నేహితుడు రమ్మంటే రామ్మూర్తి ఊరి బయట శివాలయానికి బయల్దేరాడు. ఇదే ఊళ్ళో ఉంటూ ఎన్నాళ్ళనుంచో చూస్తున్న శివాలయంలో రామ్మూర్తికి పెద్దగా చూడ్డానికేమీ లేదు; వెళ్ళడం ఇష్టం లేదు కూడా. గుడి ఆవరణలో ఉండే బిచ్చగాళ్ళూ, కుష్టివాళ్ళనీ చూడ్డం అంటే రామ్మూర్తికి చిరాకు. పైన గుడిలో లోపలకి వెళ్ళాక పూజారి చేత్తో చాచిన కంచంలో ఏదో దక్షిణ వేయాలి. లేకపోతే ఈ పంతులు గారు ఊళ్ళో అందరితోనూ ఫలానా రైస్ మిల్లు రామ్మూర్తిగారు దేవుడికి కూడా దక్షిణ ఇవ్వలేదు అని అందరితో చెప్తాడు. సుబ్రహ్మణ్యం, ఉరఫ్ – సుబ్బుడు తనతో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాడు. అసలే అమెరికా అంత దూరం నుంచి వచ్చి పిలిచినవాడు రమ్మంటే వెళ్ళకపోతే బాగోదు కనక బయల్దేరాడు – జేబులో కాసిని చిల్లర డబ్బులు పెట్టుకుని.

సుబ్బుడు, రామ్మూర్తీ కలుసుకుని చాలా ఏళ్ళయింది కనక కబుర్లు చెప్పుకుంటూ దారిలో వచ్చేపోయే వాహనాలని దాటుకుంటూ ఆవులనీ కుక్కలనీ తప్పించుకుంటూ నడిచి గుడి ఆవరణ దగ్గిరకొచ్చారు. ప్రసాదం ఇవ్వడానికి కొబ్బరికాయో, అర్టిపండో కొనకపోతే బాగోదు కనక రామ్మూర్తి ఏదో కొని చెప్పులు అక్కడే షాపువాడి కనుసన్నల్లో పెట్టాక బయల్దేరారు లోపలకి. గుడి ద్వారం బయటే రెండువేపులా బారులు తీరి కూర్చున్నారు ముష్టివాళ్ళు.

మొదటి గుమ్మం దాటాలంటే అటూ ఇటూ కూర్చున్న దాదాపు వందమంది ముష్టివాళ్లని దాటుకుని వెళ్ళాలి. ఈ రోజు ఇంతమంది ఉన్నారేమిటా అని రామ్మూర్తి అనుకోబోయేంతలో సుబ్బుడి గొంతుక వినిపించింది – “కార్తీకమాసం సోమవారం లో గుడిలో మంచి సందడిగా ఉందే?”

సుబ్బుడి గొంతువినేదాకా తనకామాత్రం గుర్తులేనందుకు కాస్త చింత రామ్మూర్తికి. మొదటి అడుగుపడుతూంటే ముష్టివాళ్ళ గోల వినపడడం మొదలైంది – “బాబూ ధర్మం” అంటూ. ఇదేం వినిపించుకోనట్టూ రామ్మూర్తి ముందుకి నడిచాడు. ఆరేడు అడుగులు నడిచాక సుబ్బుడు తనకూడా రాకపోవడం గమనించి వెనక్కి చూస్తే అతను ఓ ముష్టివాడి ఎవరితోనో మాట్లాడ్డం కనిపించింది. వెనక్కొచ్చి వాళ్ళు మాట్లాడేది వినడం సాగించాడు.

“ఇక్కడకూర్చున్న మీరందరూ కలిసి ఎంతమందుంటారు?” సుబ్బుడు అడుగుతున్నాడు.

“యాభై మంది ఉంటావండి.”

“మీకెవరైనా పైన నాయకుడున్నాడా? ఇలా కూర్చోపెట్టి అడుకున్నాక వచ్చే డబ్బులు తీసుకుని మీకు రోజువారీ జీతాలు ఇచ్చే ఆయన?”

“లేదండి. మేవే ఉన్నాం. ఎవడికి ఎంత దక్కితే అంతే.”

“మరి ఒక్కొక్కళ్ళకీ ఇవ్వడం కుదరదు కనక అందరికీ కలిపి ఇస్తే సమానంగా తేడాల్లేకుండా పంచుకుంటారా?”

ఈ సారి పక్కనున్న ముష్టివాళ్లందరూ గొంతు కలిపి చెప్పారు “పంచుకుంటాం.”

అక్కడే నిలబడి ఇదంతా వింటున్న రామ్మూర్తి వెంఠనే సుబ్బుడి చేయి పట్టుకుని చెప్పబోయేడు, “ఒరే వీళ్ళమీద డబ్బులు తగలేయకు,” అంటూ.

సుబ్బుడు నవ్వుకుంటూ రెండువేల రూపాయల నోటు తీసి అక్కడున్న ముష్టివాడికిచ్చి చెప్పాడు. “దీనితో మీ యాభై మందికీ తలో నలభై రూపాయలు వస్తాయి. సరేనా?”

కూర్చున్న ముష్టివాళ్ళలో లేవగలిగినవాళ్ళు లేచి నమస్కారం పెట్టారు సుబ్బుడికి. అది పట్టించుకోకుండా సుబ్బుడు రామ్మూర్తితో వడివడిగా ముందుకి కదిలిపోయాడు గుళ్ళోకి.

***

గుడిలో పరమేశ్వరుడు కళకళలాడుతున్నాడు. పొద్దున్న అభిషేకం చేసాక బిల్వార్చన చేసారులా ఉంది శివలింగం నిండా మారేడు పత్రీ, పువ్వులూను. అందరితో పాటే నుంచుని తీర్థం తీసుకుని తలమీద శఠగోపంతో దేవుడి పాదాలు పెట్టించుకున్నాక బయటకొచ్చారు. చీకటి పడబోతోంది.

చేతిలో ఉన్న అరిటిపండు తింటూంటే రామ్మూర్తి అడిగాడు సుబ్బుడిని – “ఇక్కడ్నుంచి వెళ్ళి మనం ఎప్పుడూ చేసినట్టే, శేఠ్ కొట్లో మడతకాజా తిని టీ తాగుదాం, సరేనా?”

“ఇవాళ కాదురా, ఈ రోజు నేను ఉపవాసం చేసాను. మరోసారి వెళ్దాం. నేనింకా రెండువారాలు ఉంటాను కదా?”

మరోసారి చివుక్కున గుండెల్లో పొడిచినట్టైంది రామ్మూర్తికి. స్వంత ఊళ్ళో ఉన్న తనకి అసలు కార్తీక మాసం ఎప్పుడో తెలియదు, సోమవారం ఉపవాసం మాట తెలియదు. వేల మైళ్ళలో ఉంటూ పరాయి దేశం నుంచి వచ్చిన తన స్నేహితుడు చెప్పేవరకూ. ఏమైంది తనకి? సుబ్బుడు డబ్బు యావతో ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడని తాను అనుకున్నాడు. మరి తానో?

తర్వాత రామ్మూర్తే అడిగాడు సుబ్బుడిని మళ్ళీ, “ఇంత దూరం వచ్చావు కదా, దేవుణ్ణి ఏం కోరుకున్నావు?”

మెట్లమీద కూర్చుని ఎదురుగా ఉన్న అమ్మవారికేసి చూస్తున్న సుబ్బుడు వినలేదులా ఉంది. రామ్మూర్తి రెండు మూడు సార్లు అడిగాక తలతిప్పి చెప్పేడు, “ఏవుంది కోరుకోవడానికి? ఈ చిన్న పల్లె లాంటి ఊర్లోంచి నన్ను పట్టుకుని అమెరికా అంత దూరం పంపించింది అమ్మవారు. కట్టుబట్టల్తో రెండు సూట్ కేసులు పట్టుకుని వెళ్ళాను అమెరికా పదేళ్ళక్రితం. నా వెనక ఈ శివుడూ ఆ ఉమాదేవి లేకపోతే ఏమై ఉండేవాణ్ణి? ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి వచ్చి చూసి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నన్నింత కాలం కనిపెట్టుకుని ఉన్నావు, నన్నెప్పుడూ వదలకు అమ్మా అని అడగడానికి వచ్చాను. అదే చాలురా నా జీవితానికి. అంతకన్నా ఏమి అడగమంటావు?”

ఈసారి గుండెల్లో లోపలకి కసుక్కుమని ముల్లు దిగినట్టైంది రామ్మూర్తికి. ఏదో అనబోయి నోరుమూసుకున్నాడు. ఈ సారి సుబ్బుడు నవ్వుతూ అడిగేడు, “మరి నువ్వేం కోరుకున్నావు రామ్మూర్తీ?”

“రైసు మిల్లు బాగుండాలనీ, పిల్లలకి చదువు బాగా రావాలనీ, మా ఆవిడతో సహా మా అందరికీ ఆరోగ్యం బాగుండాలనీను. అంతకన్నా ఏవుంది కోరుకోవడానికి?”

సుబ్బుడు లేచాడు ఇంక బయల్దేరదామా అంటూ. బయటకొస్తూంటే మళ్ళీ ముష్టివాళ్ళ అరుపులు “ధర్మం తండ్రీ” అంటూ. రెండడుగులు వేసాక నాయకుడిలాంటివాడెవరో మిగతా వాళ్లతో చెప్పారు కాబోలు ఇంతకు ముందు సుబ్బుడు డబ్బులు ఇచ్చాడని, ధర్మం అడిగే ముష్టివాళ్లందరూ మాట్లాడకుండా ఊరుకున్నారు.

రామ్మూర్తి వీళ్ళని చూస్తూ విసుక్కుంటూనే బయటకొచ్చాక నడుచుకుంటూ వెనక్కి ఇంటికి బయల్దేరారు. గుడినుండి దూరంగా వచ్చాక రామ్మూర్తి అన్నాడు, “ఈ ముష్టివాళ్ల గొడవ మనకి ఎప్పుడు వదుల్తుందో తెలియదు కానీ దేశం బాగుపడదురా వీళ్ళు వదిలేదాకా. ఇలా బహిరంగంగా ముష్టి అడుక్కునే వాళ్ళు ఏ దేశంలోనూ ఉండర్ట కదా?”

సుబ్బుడు ఫకాలున నవ్వేడు. ఆ తర్వాత తెరలు తెరలుగా నవ్వుతూనే ఉన్నాడు చాలాసేపటివరకూ. తానేం జోకు వేసాడో తెలియని రామ్మూర్తి అనుమానంగా సుబ్బుడి కేసి చూసాడు. ఇంకా నవ్వే సుబ్బుడిని అడిగాడు అదే, “నేనన్నదాంట్లో తప్పేం ఉంది సుబ్బుడూ? ఇండియా బాగుపడాలంటే ముష్టివాళ్ళు ఉండకూడదనడం తప్పా?”

నవ్వు ఆపి సుబ్బుడు చెప్పేడు సీరియస్ గా, “బయట ఉన్న ముష్టివాళ్ళు నోరెత్తి ‘ధర్మం బాబూ’ అని అడుగుతున్నారు. నువ్వేమో లోపలున్న దేవుణ్ణి ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నావు. వాళ్లు బయట ముష్టి ఎత్తితే నువ్వు లోపల ముష్టి ఎత్తుతున్నావు. నీకు దేవుడు రైస్ మిల్ ఇచ్చాడు. పెళ్ళాం పిల్లలూ ఉన్నారు. దాదాపు కుటుంబం, బంధువులూ, స్నేహితులూ, హితులూ కావాల్సినవారందరూ ఈ చుట్టుపక్కలే ఉన్నారు. అయినా నువ్వు బిచ్చం ఎత్తుతున్నావు. అదలా ఉంచితే బయట దాదాపు ఏమీ లేని, కూడూ గుడ్డా, రాత్రి పడుకోవడానికి జాగాలేని ముష్టివాళ్ళు ఎప్పుడు దేశానికి వదుల్తారా అంటున్నావు. మరి వాళ్ళు కూడూ గుడ్డా లేని గుడి బయట ముష్టివాళ్లైతే నువ్వు కూడూ గుడ్డా ఉన్న గుడిలోపల ముష్టివాడివన్నమాట. ఏమిటి మీకిద్దరికీ తేడా? ముష్టివాళ్ళు దేశానికి వదలాలంటే మరి ఆలోచించు ఒకసారి, నీలాంటి వాళ్ళు కూడా వదలాలంటావా?”

గుండెల్లో మరోసారి శూలం దింపినట్టైంది రామ్మూర్తికి. దూరంగా శివాలంయం మైకులోంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట వినిపిస్తూనే ఉంది – ఆది భిక్షువు వాడినేది కోరేది…బూడిదిచ్చేవాడినేది అడిగేది…ఏది కోరేదీ, వాడినేది అడిగేదీ..

Tags : Mar 2020, March 2020, ఆర్. శర్మ దంతుర్తి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked