కథా భారతి

మోసం

– ఆర్. శర్మ దంతుర్తి

ఈ కారు కొని పదేళ్ళవుతోంది. ఎప్పుడూ పెద్ద రిపేర్లు చేయించలేదు. ఆ మాటకొస్తే, అసలు వెనక చక్రాల బ్రేకులు గత పది సంవత్సరాలలో రిపేర్ మాట అలా ఉంచి ఎప్పుడూ వాటికేసి చూసి ఎలా ఉన్నాయో చూసిన పాపాన పోలేదు. ముందు చక్రాల బ్రేకులు, రోటార్లు, వెనక చక్రాల షూస్, డ్రమ్స్ ఆఖరికి వాటి సిలిండర్లు, అన్నీ కూడా పాడయ్యాయిట. అయితే తప్పనిసరిగా చేయించాల్సిన ఆయిల్ ఛేంజ్ చేస్తున్నప్పుడు మిడాస్ స్టోర్ వాడు నన్ను కంగారు పెట్టేసాడు, ఈ బ్రేకులు రిపేర్ చేయించకపోతే ఏక్సిడెంట్ అవ్వచ్చనీ, ఇవి చాలా అర్జంట్ గా చేయించాల్సిన పనులనీ. ఆశ చావక ఇంకో మెకానిక్ దగ్గిర చూపించాను. వీడి నోటా అదే మాట.
‘ఆ చూద్దాంలే,’ అని ఊరుకున్నాక అసలు గొడవ మొదలైంది. ఓ రోజు పొద్దున్నే ఆఫీస్ కి బయల్దేరుతుంటే, చలిలో రోడ్డు మీద టైర్లు జారిపోయి బ్రేకులు మొరాయించాయి. పొద్దున్నే చలిలో బయల్దేరాను కదా, ఇంజన్ ఇంకా వేడెక్కకపోతే అలాగే జరుగుతుందిలే అని నాకు నేను సమాధానం చెప్పుకుని, బండి కదిలించాను. ఓ ఐదారు మైళ్ళు వెళ్ళాక సడన్ గా బ్రేక్ వేయాల్సొచ్చింది. అప్పుడు బండి మొత్తం కదిలిపోయి, కారు పొడి రోడ్డుమీద కూడా, స్కిడ్ అయి జారిపోయింది. రోడ్డుమీద అదృష్టం కొద్దీ ట్రాఫిక్ లేదు గానీ లేకపోతే కాస్తలో ఏక్సిడెంట్ అయ్యేదే.

వెంట్రుకవాసిలో ముందు కారుకి తగలకుండా తప్పించుకున్నాను. ముందు కార్లో ఉన్న తెల్లావిడా, వెనక కార్లో ఉన్న ఇంకో ఎర్రావిడా నాకేసి అదోలా చూడడం గమనిస్తూనే ఉన్నాను. వెనకావిడ మధ్య వేలు చూపించిందేమో కూడా. అది వేరే సంగతి. మొత్తం మీద అప్పుడు సరైన పాఠం నేర్చుకున్నాను. వెంటనే ఆ పై శనివారం పొద్దున్నే వెంకటేశ్వరుడి పటం ముందు లెంపలు వేసుకుని మరో మెకానిక్ దగ్గిర కెళ్ళాను.

ఈ మెకానిక్ మన వాడే, దేశంలో పంజాబ్ నుంచి వచ్చిన సర్దార్జీ. వాడికి వెబ్ సైటూ అదీ ఉంది ఇంటర్నెట్ లో. అంతా చూసాక చెప్పాడు, “మొత్తం ఆరొందల డాలర్లు అవుతుంది, మీకిష్టం ఉంటే ఇప్పుడే మొదలు పెడదాం కష్టం అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మొత్తం పని ఆరు గంటలు పడుతుంది, నాకు ఇంకా చాలామంది ఉన్నారు లైనులో మిగతా పనులకి.” మన సర్దార్జీ చెప్పింది కొంచెం సబబే. కానీ కారు రిపేర్ కి ఇచ్చేటప్పుడు, అంత ఇ చ్చుకోలేనన్నట్టూ ఏడుపు మొహం పెట్టకపోతే, చివర్లో ఇదీ, అదీ కలిపేసి ఇది ఎగస్ట్రా, అది ఎగస్ట్రా అని ఎక్కువ గుంజుతాడు. మిడాస్ షాపులో చెప్పనే చెప్పాడు ఎనిమిది వందల పైన అవుతుందని, అందుకే కాస్త ఏడుపుమొహం పెట్టి చెప్పేను, “సరే, మొదలుపెట్టండి, ఇక్కడే కూర్చోవచ్చా పని పూర్తి అయ్యేదాకా?” “తప్పకుండా, ఆ టివిలో మీ ఇష్టం వచ్చినది చూడండి.”

టివి చూస్తూ ఒక్కొక్కళ్ళే రావడంతో వాళ్లని గమనించడంతో కాలం గడుస్తోంది. ఒకరికి చిన్న ఆయిల్ ఛేంజ్ అయితే ఇంకోళ్ళకి కొంచెం పెద్ద పని. ఆ రోజు నాదే సర్దార్జీకి పెద్ద పని.

నా కారు పని అయ్యేసరికి మధ్యాహ్నం మూడైపోయింది. పొద్దున్న తొమ్మిదింటికనగా ఇచ్చిన కారు మళ్ళీ నా చేతిలోకి వచ్చేసరికి ఆరు గంటలు పట్టింది, మెకానిక్ చెప్పినట్టే. షాపులోంచి బయటకొచ్చిన సర్దార్జీ చెప్పేడు, “ఇదిగో మీ కారు. ఏడు వందలు ఇవ్వండి.” “అదేమిటీ, ఇచ్చేటప్పుడు ఆరొందలన్నారుగా, ఇప్పుడేమో ఇంకో వంద కలిపేరా?” అడిగాను. “ఇచ్చేటప్పుడు చెప్పింది ఎస్టిమేషన్. అదీ కాక మీ కారు బ్రేకులు పరమచెత్తలాగ ఉన్నాయి. ఎగస్ట్రా పని చేయాల్సొచ్చింది.” వాదోపవాదనలు అయ్యేక వీడి రోగం కుదర్చడానికి నా దగ్గిర ఆఖరి ఆయుధం తీసి ప్రయోగించాను. “మీ వెబ్ సైట్ లో చూసి కారు తీసుకొచ్చాను, అలా చేస్తే పది శాతం డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు కదా.” సర్దార్జీ దెబ్బతిన్నట్టు చూసాడు నాకేసి. కాని వెంటనే పక్కనే ఉన్న వాడి పార్ట్నర్ అన్నాడు, “అబ్బే ఆ వెబ్ సైట్ డిస్కౌంట్ ఇప్పుడు లేదు. ఏడువందలు ఇవ్వా ల్సిందే.” సర్దార్జీ వాడి పార్ట్నర్ ని మెచ్చుకోలుగా చూస్తే నేను ‘ఓరి దొంగవెధవా’ అన్నట్టు చూసాను. కొంతసేపు వాగ్వివాదం జరిగాక వాడే చెప్పేడు “ఆరొందల యాభై కేష్ ఇచ్చేయండి. లేకపోతే ఇంకో యాభై కలుపుకుని మీ క్రెడిట్ కార్డ్ మీద ఛార్జ్ చెయ్యొచ్చు.” గట్టివాడే, నన్ను సేల్స్ టాక్సు ఎగ్గొట్టమనీ, వాడు ఇన్ కం టాక్సు ఎగ్గొడతాననీ చెప్తున్నాడు ఇన్ డైరక్ట్ గా. ఇటువంటి పనులతో జాగ్రత్తగా ఉండాలి కనక అడిగేను, “కేష్ ఇస్తే రిపేర్ కి వారంటీ ఉంటుందా?” “కేష్ కి వారంటీ ఇవ్వలేను.

సారీ” “క్రెడిట్ కార్డిస్తే వారంటీ ఉంటుందా?” “ఆ, ఓ ఏడాది వారంటీ ఉంది.” అలా క్రెడిట్ కార్డ్ మీద మొత్తం ఏడు వందలిచ్చుకుని బయటపడ్డాను. ఇంటికొచ్చేదారిలో ఆలోచనలు ముసురుతున్నాయి. ఈ సర్దార్జీ షాపులో నేనున్నంత సేపట్లో ఓ పదిహేనుమంది వచ్చుంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గిరా ఎంతలేదన్నా ఓ వంద సంపాదించాడనుకుందాం. రోజుకి ఇరవైమంది కస్టమర్లు వస్తే వాడి ఆదాయం రోజుకి రెండువేలు. నెలకి యాభై, అరవైవేలు. ఏడాదికి దగ్గిరదగ్గిర ఓ ముప్పాతిక మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు వీడు, రోజంతా మురికి గుడ్డలేసుని. ఇంత ఆదాయం ఉన్నా వీడు టాక్సు ఎగ్గొడదామనుకుంటున్నాడు. అదీకాక వీడు దేశం నుంచి వచ్చాడు కనక వీడి దగ్గిరకొచ్చే చాలామంది మనవాళ్ళే. ఎవరూ పట్టించుకోరు టాక్స్ కట్టాడా లేదా అనేది. అలోచన్లతో ఇంటికొచ్చాను. ఇంకా కోపం తగ్గలేదు. అప్పటికే నాలుగయ్యేసరికి ఇంక ఈ పూటకి లంచ్ ఎందుకులే అని ఓ చిన్న ఫలహారం చేస్తూ ఏదైనా ఈమెయిల్ వచ్చిందేమో నని ఇంటర్నెట్ చూస్తూంటే గబుక్కున ఆటోజోన్ వెబ్ సైట్ చూడాలనిపించింది. అసలు ఈ మెకానిక్ లు ఛార్జ్ చేసే పార్ట్ ల ఖరీదు తెలుసుకోడానికి.

అప్పుడు ఇంటర్నెట్లో కనిపించింది, బ్రేక్ సిలెండర్లు ఒక్కోటీ ఇరవై డాలర్ల నుంచి ముప్ఫై లోపు. నాకు ఛార్జ్ చేసింది ఒక్కోదానికీ డబ్భై! బ్రేక్ పేడ్స్ అన్నీ కలిపి నలభై కానీ నాకు తొంభై ఛార్జ్ చేసాడు. ఇలా లెక్కట్టుకుంటూ పోతే అసలు ఛార్జీలు అన్నీ కలిపితే నూట యాభై ఐతే నా దగ్గిర మూడొందల పైన లాగాడు. ఒళ్ళు మండిపోయింది. వెంటనే ఫోన్ చేసి అడిగాను “ఇంటర్నెట్ లో ఖరీదులు ఇలా ఉన్నాయి, నన్ను మోసం చేసావు.” “నేను పని బాగానే చేసానే? ఆఖరికి వారంటీ కూడా ఇచ్చాను కదా? నేను మాట మీద నిలబడే వాడ్ని” చెప్పాడు సర్దార్ జీ. “అంత మాట మీద నిలబడేవాడివైతే, నా పార్ట్ లు నేనే తెచ్చుకునేవాడ్ని కదా.”

“భలేవారే, ఇంటర్నెట్ లో చూసి నన్ను దెబ్బలాడుతున్నారా? మేం ఇంటర్నెట్ లో కొనం పార్ట్ లు. కస్టమర్ షాప్ లోకిచ్చి కూచున్నాక ఇంటర్నెట్ లో పార్ట్ లు ఆర్డర్ జేసుకోడం కైసే హో సక్తా హై? అదీగాక, కస్టమర్లు తెచ్చే పార్ట్ లు మేం ఒప్పుకోం. అది మా కంపెనీ పాలసీ” అన్నాడు. ఓ ఐదు నిముషాలు మాట్లాడాక వాడు ఫోన్ పెట్టేసాడు, ఇంతకన్నా చెప్పేదేమీ లేదూ, నేను చాలా బిజీగా ఉన్నానూ అంటూ. నా కడుపు మంట వెంటనే తగ్గలేదు. పై సోమవారంలో ఆఫీస్ లోనూ, తెలుసున్న ఫ్రెండ్స్ కీ చెప్పేను. చాలా మంది ఇదంతా చాలా మామూలే అన్నట్లు ఓదార్చారు కానీ ఆఫీసులో కొత్తగా జేరిన జపాన్ కుర్రాడన్నాడు “మనం ఆఫీస్ లో రోజూ చేసే మోసంతో కంపేర్ చేస్తే ఇదేమంత పెద్ద విషయం కాదు.” ఆఫీస్ లో అందరూ గొల్లుమని నవ్వులు. జపాన్ వాడు చెప్పినది నిజమేనేమో? నేను ఆఫీస్ లో మా కంపెనీని మోసం చేసాను ఎన్నోసార్లు – ఆఫీస్ పని చెయ్యకుండా నా సొంత పనులు చేసుకుంటూ. అన్ని రోజుల్లోనూ దాదాపు ఓ రెండు గంటలు ఇంటర్నెట్టూ, ఈ-మెయిల్ చదవడానికే వాడుతున్నాను. ఆ టైము కంపెనీకి వృధాగా పోతోంది. అయినా నాకు ఫుల్ టైము జీతం ఇ స్తున్నారు.

జీతం పైన ఇచ్చే బెనిఫిట్స్ సరే సరి. ఎవరూ అడగలేదనుకోండి కానీ అడిగితే నేనే కాదు మనం అందరం ఇచ్చే సమాధానం ఏమిటంటే “కంపెనీ పనీ, ఇచ్చిన డెడ్ లైన్స్ లోపల ప్రాజెక్ట్ పనీ పూర్తి చేస్తున్నాం కదా?” అని. మనసులో చిన్నగా ఎవరో అరుస్తున్నట్టూ అనిపించింది, సర్దార్జీ నేను ఫోన్ చేసినప్పుడు అలాంటి సమాధానమే చెప్పాడుగా? చటుక్కున ఎందుకో సామెత గుర్తొచ్చింది, “అల్పుడ్ని బల్పుడు కొడితే, బల్పుడ్ని బ్రహ్మదేవుడు కొట్టాడుట!” అంతే, మళ్ళీ ఎప్పుడూ ఎవరి దగ్గిరా ఈ మాట చెబితే ఒట్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked