కథా భారతి

రాశి ఫలాలు

జ్యోతిష్ పండిట్, ఆస్ట్రో సిద్దాంతి, దైవఙ్ఞ చింతామణి, జంతు జీవన జిజ్ఞాసి, ప్రకృతి ప్రేమిక్, కధా రచయిత, బ్రహ్మశ్రీ

డా॥ ఆర్. శర్మ దంతుర్తి,పి.హెచ్.డి (అమెరికా)

(ఈ రోజుల్లో అసలు జ్యోతిషం అంటే ఏమిటో కూడా తెలియకుండా రాశి ఫలితాలు రాయవచ్చు అని గ్రహించడం కష్టం కాదు. “మేఘాలు వస్తే వర్షం వస్తుంది,” “రోహిణీ కార్తెలో ఎండబారి పడకుండా ఉంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు” లాంటి ఫలితాలు అంతర్జాలంలో, పత్రికల్లో చదివి నేను కూడా రాయగలను అని వెక్కిరించడానికి ఇది రాసాను. దీనికోసం తెలుగు రాయడం వస్తే చాలు; మిగతా ఎటువంటి పరిజ్ఞానం అవసరం లేదు. బ్రహ్మశ్రీ,, ఆస్ట్రో పండిట్, వేదాంతిక్ అనే బిరుదులు ఎన్నికావాలిస్తే అన్ని తగిలించుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనే వాటికి ఏ సంఖ్య వేసినా ఫర్వాలేదు. మీరుకూడా రాయవచ్చు; ప్రయత్నం చేయండి.)

[ఈ సంపూర్ణ జీవిత ఫలితాలు రాశి దృష్ట్యా చూసి నిశితంగా గమనించి రాయబడినవి. వీటిని చూసుకోవడానికి మీ జన్మ నక్షత్రం, పాదం తెలిస్తే చాలు.  అవి తెలియకపోతే మీ పేరుతో మొదలయ్యే అక్షరంతో చూసుకునే వెసులుబాటు ఉంది.   ప్రత్యేకంగా ఫలితాలు కావాల్సినవారు ప్రతీ ఒక్క ప్రశ్నకీ $16 (అమెరికన్ డాలర్లు, లేకపోతే దానికి సుమారుగా వచ్చే వెయ్యి నూట పదహారు రూపాయలు) పంపి మెయిల్ పంపితే కంప్యూటర్ తో జాతక చక్రం వేసి, ఫలితాలు పంపబడతాయి. ప్రతీ ప్రశ్నతోబాటు మీ జన్మ దినం, సమయం, ప్రశ్న వేసిన ప్రదేశం, మీకు నచ్చిన పువ్వూ, జంతువు పేరూ తప్పనిసరిగా పంపవలసి ఉంటుంది. వీసా, మాస్టర్ కార్డ్, పర్సనల్ చెక్కులూ తీసుకోవడం మా ప్రత్యేకత. చెక్కులు బౌన్స్ అయితే దానికి వేరే పెనాల్టీ ఫీజు ఉంది; గమనించగలరు. ఒక ప్రశ్నకి $16; మూడు ప్రశ్నలకి $40. ఐదు ప్రశ్నలకి $70! పండుగ రోజుల్లోనూ, కొత్త సంవత్సరం ఆరంభంలోనూ ప్రత్యేక డిస్కౌంట్లు ఉన్నాయి. కావాల్సిన వారు “1-800-దై.వ.ఙ్ఞ- చిం.తా.మ.ణి” అనే నెంబరుకు ఫోన్ చేస్తే మిగతా విషయాలు తెలియజేయబడతాయి. చెల్లించిన నగదు ఎట్టి పరిస్తితుల్లోనూ వాపసు ఇవ్వబడదు. చెక్కు పంపితే మీ సోషల్ సెక్యూరిటీ నెంబరు లేధా ఆధార్ కార్డు నెంబరు తప్పనిసరి. ఇందుమూలంగా మీకు ఐడెంటిటీ దొంగతనం జరిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు.  ముఖ్య విషయం: ఈ ఫలితాలు కంప్యూటర్ మీద, మా పండిత విద్వత్తు జోడించి తయారుచేయబడినవి. అందువల్ల ఇవి ఖచ్చితంగా గుణించబడడమే కాక మాచే పూర్తిగా అధారితమైనవి. ఇటువంటివి వేరే ఎవరైనా వారి వెబ్ సైట్లలో ప్రచురించినా నమ్మవద్దు. ఇవి మరెక్కడా ప్రచురించబడలేదు.]

మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం.  “చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 08 వ్యయం – 14 రాజపూజ్యం – 04 అవమానం – 03
ఈ రాశివారు సన్నగా ఉంటారు, నెమ్మదస్తులు. ఆకలికి తట్టుకోలేరు; తినడానికి ఏ తిండి అయినా సరే – రాశి పేరు సూచించినట్టే – ఆరగించడానికి సిద్ధమైపోతారు.  అలా అని ఎక్కువగా తినలేరు. సాధారణంగా కోపం రాదు కానీ కోపం వస్తే పదునైన కొమ్ములతో పొడిచినట్టూ ఆపదలు కొని తెచ్చుకుంటారు. వీరికి చాలా కాలం జీవితం – తిన్న తిండి నెమరు వేసుకున్నట్టుగా – స్థబ్దుగా సాగిపోతుంది. వీరిని పాచికలుగా చేసి అవతలి వారు వీరిని వాడుకుంటారు. కసాయి నరుకుతుంటే మెడ ముందుకు పెట్టినట్టూ అమాయకుల్లాగా వీరు ఆ పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేరు. ప్రయత్నాలు ఫలించడానికి శ్రమించాలి. శ్రమ అధికమైనప్పుడు, తగినంత ప్రోత్సాహంతో కార్యాలు పూర్తవుతాయి. ఏ విషయానికైనా ఇంట్లో, లేక తోటి వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే గౌరవం పెరగడంతోపాటు సమాజంలో ప్రత్యేక స్థానం లభిస్తుంది.  ఈ రాశి పురుషులు చిరుగెడ్డం పెంచడానికి ఉత్సాహపడతారు. వీరికి నప్పే రంగులు – నలుపు, తెలుపు, కొండొకచో గోధుమ రంగులు. శని ఆదివారాల్లో, పండుగలలో, పెళ్ళిళ్ళ రోజుల్లో, రంజాన్, ఇఫ్తార్ వంటి పెద్ద విందు రోజుల్లోనూ వీరికి ప్రాణాంతకం కావొచ్చు! వీరు దక్ష సంతతి వారు కనక గౌరీ, శివారాధన ఉత్తమం. స్త్రీలకు – జీవిత భాగస్వాములతో కొమ్ములతో పొడిచినట్టూ పోట్లాడి ఆపదలు కొనితెచ్చుకునే స్వభావం వదిలించుకోవాలి. సింహరాశి వారిని పెళ్ళి చేసుకోవడం తలమీద కొరివితో గోక్కున్నట్టే. నుదిటిమీద సింధూరం ధరించినప్పుడు జాగ్రత్త!! ఆ సింధూరాన్ని చూసి మిమ్మల్ని వాడుకోవడానికి కొన్ని కసాయి శక్తులు ప్రయత్నిస్తాయి. అటువంటి పరిస్థితి ఎదురవ్వకుండా ముందే జాగ్రత్త పడండి. విద్యార్ధులకి – సావుకాశంగా ఒక్కోపేజీ తిప్పుతూ నెమరు వేసుకున్నట్టుగా చదువుతారు. అందువల్ల మార్కులు ఎలా వచ్చినా “ఆ, అవి చాలు లెద్దూ” అనుకుంటూ ఒక్కో క్లాసూ నెగ్గుకు వస్తారు. ఆ ఆలోచనా క్రమం మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యద్భావం తద్భవతి అనేది గ్రహిస్తే మీకు మంచిది. చదువులో ముందు ఉండాలని ఆతృత పడి శ్రమిస్తే సఫలం కాగలరు.

వృషభం

(కృత్తిక 2, 3, 4 పాదాలు; రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.   “ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వె, వో” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 06 వ్యయం – 11 రాజపూజ్యం – 02 అవమానం – 05
ఈ రాశివారు చాలా మంది తెల్లగా ఉంటారు.  పొద్దున్న లేచినప్పటినుండి నుండి సుర్యాస్తమయం వరకూ కష్టపడి పనిచేస్తారు జీవితంలో. మెడమీద గట్టిబడిన చారికతో పోటీతత్వం ఉండని రాశి ఇది.  వీరిని జీవితం తొలి రోజులలోనే ఎవరో మచ్చికచేసి లోబరుచుకుంటారు. ఆ తర్వాత వీరికి శ్రమ తప్పదు. బుద్ధిబలాన్ని రోజువారీ పనులలో ప్రతీసారీ ఉపయోగించాలని గ్రహించినా చాలామటుకు ఈ రాశివారికి శ్రమ తప్పదు. ఎంత శ్రమ చేసినా వీరికి – ఎప్పుడో పండుగ పూటా తట్టెడు ధాన్యం అన్నట్టు తప్ప – ఎటువంటి బోనస్సులూ, మెప్పుదలలూ ఉండవు. అదృష్ట వశాన్నో దురదృష్ట వశాన్నో వీరికి కూడా వాటి గురించి పట్టింపు ఉండదు. వీరిలో కొంతమందికి అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి.  ఎప్పుడూ కష్టపడి పనిచేస్తారు కనక ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య ఛాయలు అప్పుడప్పుడూ పొడచూఫినా వీరు శాకాహారముతో ఆరోగ్యం కాపాడుకోవచ్చు. పప్పు ధాన్యాలూ, ఆకుకూరలూ వీరికి నప్పే ఆహారాలు.  సింహ, మకర రాసుల వారితో విరోధం రావొచ్చు. తస్మాత్ జాగ్రత్త. వీరు ధేను సంతతి కావడం వల్ల, సాధారణంగా శివ భక్తులై ఉంటారు; అందువల్ల శివ సహస్రనామం, పంచాక్షరీ పారాయణతో ఆపదలనుండి తప్పించుకోవచ్చు.  ఈ రాశి గురించి ముఖ్యంగా చెప్పుకోవల్సినది – వీరికి జీవితంలో పది తలల రావణులు ఎదురైనప్పుడు వారిని ధైర్యంగా ఎదుర్కొని శాపం పెట్టగల సమర్ధులు.  సింహ, ధనూరాశి వారితో జాగ్రత్తగా ఉంటే శారీరక ప్రమాదాల నుంచీ, వారివల్ల రాబోయే దెబ్బల బారిపడకుండానూ తప్పించుకోవచ్చు అని గ్రహించండి. స్త్రీలకు – మీకు వాడి కొమ్ములవంటి మాట పరుషం ఉన్నా వాటిని మీరు వాడుకోలేరు. మిమ్మల్ని లొంగదీసుకునే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులే అవుతారు. మిధునం, కన్యా రాశులవారు మీకు భాగస్వామ్యులుగా అచ్చివస్తారు; వారే మిమ్మల్ని మచ్చిక చేసుకునే వారు అయి ఉంటారు. విద్యార్ధులకి – మొదట ప్రయత్న లోపం వల్ల మార్చ్ కంటే సెప్టెంబరు ఛాన్సులో ఉత్తీర్ణతకి అవకాశం ఎక్కువ. వృషభ రాశి అవడం వల్ల సెప్టెంబర్లో అయినా సరే, ఎంత కష్టపడినా అత్తెసరు మార్కులే వస్తాయి.  అందువల్ల గాభరా పడకుండా పరీక్షలు ఒకటి కంటే ఎక్కువ సార్లు రాయడానికి తయారుగా ఉండండి.

మిథునం

(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. “కా, కి, కూ, ఖం, ఙ, చ్చ, కే, కో, హా” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 12 వ్యయం – 04 రాజపూజ్యం – 05 అవమానం – 08
మిధున రాశివారు ఉభయ సదృసులు.  చూడగానే ఆడా, మగా తేల్చుకోలేనట్టే వీరి స్వభావం కూడా ఉంటుంది. ఒక సమస్యనీ దానికి రెండు పరిష్కారాలనీ చూపిస్తే వీరు ఆ రెండింటినీ పట్టుకుని జీవితాంతం అటువైపా, ఇటువైపా అనుకుంటూ వృధాగా గడుపుతూ ఎప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేరు. ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు, ప్రతిదీ అనుకూలంగానే అనిపిస్తుంది. మోసం చేసేవారున్నారు, అలాగే సహాయం చేసేవారున్నారు.  అప్రమత్తంగా వ్యవహరించండి. విశ్వాసంతో ముందుకుసాగితే ఎప్పుడూ రెండు దారుల్లో ఉంటారు కనక రెండింటిలోనూ శత్రువులపై తిరుగులేని విజయం సాధిస్తారు. ఈ రాశివారు పురుషులైతే స్త్రీలతోనూ, స్త్రీలైతే పురుషులతోనూ స్నేహం చేస్తారు. పెళ్ళయ్యాక కూడా జీవిత భాగస్వామ్యులతో కంటే ఈ స్నేహాలకే ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల అపార్ధాలకి తావు ఇవ్వడం జరుగుతుంది.  తులారాశి వారు ఈ రాశివారికి సరైన జోడీ, తమ పరస్పర విరుద్ధ భావాలు రెండూ తక్కెడలో వేసి సమానంగా చూసుకున్నట్టు వీరు, తులారాశివారు జీవితంలో ఇమిడిపోతారు.  ఈ రాశి పేరు సూచిస్తున్నట్టే వీరికి కుటుంబంలో, జీవితంలో అసమాన్యమైన సుఖం లభిస్తుంది. ఎన్నేళ్ళు వచ్చినా యువకుల్లాగే ఉత్సాహంతో ఉరకలేయాలని కోరుకోవడమే కాదు, అలాగే ఉంటారు. యువ ప్రేమికుల్లాగా వీరు, వీరి భాగస్వాములు చివరి వరకూ ఆనందంగా గడుపుతారు. అయితే ఇంతటి ఆనందంలోనూ వీరికి పైన చెప్పిన మరో స్నేహితున్నాడని మరవకూడదు. ఆధ్యాత్మిక మార్గం ప్రశాంతత, శ్రేయస్సులనిస్తుంది.  కర్కాటకం, వృశ్చికం రాసుల బారి పడకండి. వారితో మీరు విరోధంతో పాటు శారీరక బాధలు తగులుకుంటాయి.  స్త్రీలకు – మీది మిధున రాశి అవడం వల్ల మీ భర్త మీకు – రెండు నెక్లెస్ లు, రెండు ముక్కుపుడకలు, రెండు ఉంగరాలు – అలా అన్నీ రెండేసి కొనాలని ఆశిస్తారు. అలాగే కొనిపించుకుంటారు కూడా. అయితే ఈ ప్రయత్నంలో ఆయన కోపానికి గురై, కొన్నదంతా అనవసరపు ధన వ్యయం అనిపించి కొన్నవి దుకాణంలో వెనక్కి ఇచ్చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తే పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటిగా రెండు ఉద్యోగాలు చేసుకోవచ్చు. అయితే ఎంత ధనం గడించినా, మీ డబ్బు సగం మాత్రమే ఖర్చుపెడతారు. ఆ రెండో భాగం ఎప్పుడూ మీ భర్త/భార్య ఇవ్వాలని మీరు కోరుకుంటారు. అలా ఆయన/ఆవిడ దగ్గిర ధనం సాధించుకోవడం కూడా మీకు వెన్నతో పెట్టిన విద్య.   విద్యార్ధులకి – మీకు పరీక్షల్లో ప్రశ్నలకి ప్రతీదానికీ రెండేసి సమాధానాలు తడతాయి. రెండు సమాధానాలూ రాస్తే ఎక్కువ మార్కులొస్తాయనుకుని రెండూ రాయడం మొదలుపెడతారు. అందువల్ల అయిదు ప్రశ్నలకి పది సమాధానాలు రాసే ప్రయత్నంలో సమయం పోగొట్టుకొని సగం మార్కులు మాత్రమే తెచ్చుకుంటారు. అలాగే మార్చా, సెప్టెంబరా అనుకుంటూ సమయ వృధా చేసుకుని రెండింటికీ ఫీజు కట్టేలోపున సమయం గడిచిపోతుంది. ఎంత కష్టపడినా మీకు సగం మార్కులే వస్తాయి కనక మీకు మార్చ్ లోనైనా సెప్టెంబర్లోనైనా మంచిదే.

కర్కాటకం

(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష.  “హీ, హూ, హే, హో, డా, దీ, డూ, డే, డో” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 04 వ్యయం – 11 రాజపూజ్యం – 02 అవమానం – 01
నాలుగు కాళ్ళు ఉన్న పీత వలే వీరు అన్ని పనులకీ రెండు చేతులూ రెండు కాళ్ళూ కలిపి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారు. అయితే ఎంతో కష్టపడితేగానీ వీరికి ఏ పనీ పూర్తి అవదు.  చాలామటుకు వీరు అసూర్యం పశ్యలు; ఎప్పుడు నీడ తట్టునో, చల్లని ప్రదేశంలోనో కూర్చుని ఉండి పనిచేయడానికి ఇష్టపడతారు.అందువల్ల రెండు చేతులతో పనిచేసే కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అవడానికి ఛాన్సు ఉంది.  అయితే ప్రతీపనిలోనూ ధర్మసంకటం ఏర్పడుతుంది. తలపెట్టిన కార్యాలు – పీతలు మెల్లిగా కదిలినట్టే – నిదానంగా, మొత్తంమీద ఉపద్రవాలను అధిగమించి పూర్తి చేస్తారు.  వీరు జీవితంలో ముక్కు సూటిగా వెళ్తున్నామని అనుకుంటారు కానీ రాశి పేరు సూచించినట్టు పక్క దారుల వెంట మాత్రమే నడుస్తారు. అది వీరి బలహీనత.  వీరికి అతికోపం వస్తే రెండు చేతులతోనూ పీక నొక్కేసి శతృవును నాశనం చేయగల సమర్ధులు.  మీన రాశివారు వీరికి కొంత కలిసి వచ్చినా ఏదో ఒక సందర్భంలో ఒకరిమీద ఒకరు కత్తులు నూరుకుంటారు.  ప్రయాణాలు కూడా నిదానంగా చేద్దామని చూస్తారు. దీనివల్ల ఎక్స్ ప్రెస్ బండి బదులు పాసెంజరు బండి ఎక్కడం; ప్రతీ పనికీ ఆఖరికి ఎవరైనా పెళ్ళికి పిలిచినా సరే – ఆలశ్యంగా వెళ్ళడం జరుగుతుంది. దీని వల్ల హితులదగ్గిర్నుంచి నిందలు ఎదురౌతాయి. అయినా వీరి వరస మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. వచ్చిన అవకాశాన్ని విజయంగా మలచడానికి ఒత్తిడికి లోనవకుండా ఆగిన పనులను పునఃప్రారంభించండి. వీరి నిదానం కొంపలు ముంచకుండా ఉండడానికీ, వెనక నుంచుని వీరిని ఎప్పటికప్పుడు ముందుకు తోయడానికి కుటుంబసభ్యుల తోడ్పాటు అవసరం. వీరు మీన రాశులకి దగ్గిరవడం వల్లా, మహావిష్ణువు మొదట్లోనే మత్స్యావతారుడవడం మూలంగా, విష్ణు సహస్రనానం, లక్ష్మీ ఆరాధన శక్తి నిస్తుంది. కుంభ, మీన రాసులవారు వీరికి జీవితంలో కలిసి వస్తారు.  వీరికి అనేక రంగులు – ముఖ్యంగా నలుపు, నారింజ, పసుపు, గచ్చకాయ రంగు – నప్పుతాయి. మకర రాశి వారితో పెట్టుకోవద్దు. కలహాలు వచ్చే అవకాశం ఉంది.. కోండొకచో మకరరాశి వల్ల వీరికి ప్రాణాంతకం అవుతుంది. జాగ్రత్త వహించాలి. స్త్రీలకు – అనేక రంగుల బట్టలన్నా, చీరలన్నా ప్రీతి. దానివల్ల వీరి ఆదాయంలో దాదాపు సగం బట్టల మీదే పోతుంది. ఈ దుబారా వ్యయం వల్ల పాత బట్టలూ, తద్వారా వచ్చే స్టీలు సామాను ఇంట్లో ఎక్కువగా గోచరిస్తాయి. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా వీరు ఈ అలవాట్లనుండి తప్పించుకోలేరు. విద్యార్ధులకి – పరీక్షా కాలంగా కొన్ని అంశాలు గోచరిస్తాయి.  ప్రతీ పని జాగ్రత్తగా పూర్తి చేయాలని ప్రయత్నం చేసినా నిదానంగా చేస్తారు కనక ఇచ్చిన అన్ని ప్రశ్నలకి పరీక్షల్లో సమాధానం రాయలేరు. అందువల్ల ఫస్ట్ క్లాసు వస్తుందనుకుంటే సెకండ్ క్లాసూ, సెకండ్ క్లాసు అనుకుంటే పాసు క్లాసు వస్తాయి. అలాగే మార్చ్ లో పరీక్ష రాసేద్దాం అనుకుంటారు కానీ నిదానమే ప్రధానం అనుకోవడం వల్ల సెప్టెంబర్ దాకా అసలు పరీక్షకే కూర్చోకపోవడం వీరి విశేష ప్రత్యేకత. ఆ బద్ధకం వదిలించుకుంటే సరస్వతీ అనుగ్రహం కలిగి వృద్ధిలోకి వస్తారు.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. “మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 03 వ్యయం – 11 రాజపూజ్యం – 03 అవమానం – 05

నిజ జీవితంలో జూలు ఉన్న మగ సింహంలాగానే వీరిలో పురుషులు ఏ పని చేయడానికీ ఇష్టపడరు. వారి భార్యలు వండిపెడితే తినడానికి మాత్రం ముందు వరసలో ఉంటారు. తమ భార్యలు పతివ్రతలై ఉండాలనీ, తమని జీవితాంతం పోషించాలనీ, తాము తిన్నాక మిగిలిన అవశేషాన్ని తమ భార్యలు భుజించాలనీ వీరు అభిలషిస్తారు. ఆశ్చర్యంగా ఈ రాశి పురుషులకి శారీరక కష్టం చేసి, ఆ కష్టంతోటే వండి వడ్డించే భార్యలు లభిస్తారు.  అందువల్ల తిండికీ నిద్రకీ లోటులేకుండా హాయిగా గడిచిపోతుంది.  వీరికి అసూయ ఎక్కువ.  తమలాంటి సింహ రాశి వారు మరొకరు కనిపిస్తే, తమ భార్యతో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంటారేమో అని వారిని నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. ఇటువంటి సందర్భాలలో కంగారుగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించాలి. జీవిత భాగస్వామితో విభేదించవద్దు. అవగాహనతో ముందుకు సాగితే ఏ ప్రమాదమూ రాదు. ద్వేషభావంతో కొందరు మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తారు. వీరికి పెద్దగా అరవడం తప్ప సాధారణంగా కోపం రాదు. కోపం వస్తే – జన్మానికో శివరాత్రిలా మగ సింహం దుమ్ములగొండిని వేటాడి తరిమి చంపినట్టూ- అవతల వాళ్ల అంతు చూసేవరకూ ఊరుకోరు. ఆయా రోజుల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది, తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి, బహుముఖ ప్రజ్ఞతో విజయం చేకూరుతుంది, ఆశయం సిద్ధిస్తుంది.  ధనూరాశివారిని దరిజేరనివ్వకండి. వారినుంచి మీకు ప్రమాదం పొంచి ఉంది. వీరికి నచ్చే రంగు ముదురు పసుపు, ముదురు గోధుమ రంగులు. మరేవిధమైన రంగులూ వీరికి సరిపదవు.  ఈ రాశి పురుషులకి బహు భార్యాతత్వం ఉండడానికి అవకాశం ఎక్కువ. కొంతమంది పెద్దిల్లు-చిన్నిల్లు లా ఇద్దరు భార్లతో రెండు కుటుంబాలనీ చుసుకుంటారు జీవితంలో.  సింహరాశి వారు మహిషాసురమర్దిని వాహకుల సంతతి అవడం వల్ల, వీరికి సెప్టెంబర్ లగాయతు అక్టోబర్ వరకూ నవరాత్రులలో దేవీ ఉపాసన ఉత్తమం. స్త్రీలకు – మీరు సింహరాశి స్త్రీలైతే జీవితాంతం మీ భర్తకి అణుకువగా ఉండి మీ సంపాదనతోటే అయన్ని పోషించాల్సి ఉంటుంది. దానికి మీరు ఏమీ సిగ్గుపడరు సరిగదా మిగతా సింహరాశి స్త్రీలతో ఆ విషయం చెప్పుకుని ఆనందపడతారు. ఆ మిగతా సింహరాశి స్త్రీలూ, మీరు కలిసి ఏదో వ్యాపకంతోనో బిజినెస్ తోనో ధన సంపాదన మార్గం వెతుక్కుంటారు కానీ మీ భర్తని మాత్రం ఏమీ అనలేని అశక్తత మీది.  విద్యార్ధులకి – మీ కేకలు చేతలు కన్నా పెద్దవి. కాలేజీలోనూ, యూనియన్ లోనూ చేతులు పెట్టి నాయకులవ్వాలనుకుంటారు. మీరు పరీక్షలు పాసు అయినా అవకపోయినా ఈ యూనియన్ల ప్రోద్బలంతో ఏదో ఉద్యోగం దొరుకుతుంది. అయితే పైన చెప్పినట్టూ మీరు మీ సంపాదనతో కాక మీ భాగస్వామి తెచ్చే సంపాదనతో కడుపు నింపుకుంటారు. అందుల్ల మార్చ్, సెప్టెంబర్ అనే ఆలోచనకు తావు ఇవ్వకండి. ఎలాగైనా మీకు జీవితంలో ఇబ్బంది లేదు.

కన్య

(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు.  “టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 12 వ్యయం – 01 రాజపూజ్యం – 02 అవమానం – 02
​కన్యా రాశివారు జీవితాంతం యువకులలాగే ఉందామని ఉబలాట పడుతూ ఉంటారు. దీనికోసం వీరు మొహానికి పౌడర్లూ, క్రీములూ వాడడానికీ దానికోసం ఎంతటి ఖర్చైనా పెట్టడానికీ వెనుకాడరు.  అయితే ఈ ఖర్చులవల్ల కొన్ని విజయావకాశాలున్నా కుటుంబ సభ్యులకి మొహంమొత్తి వీరితో అపార్థాలకి తావు ఇచ్చే పరిస్థితులు వస్తాయి.  ఈ రాశి వారికి ఇంటిపనుల్లో నేర్పు ఎక్కువ. ఎవరైనా తమ గురించి చెడ్డగా మాట్లాడితే కస్సుమని కోపగించుగోలరు. ఆ కస్సుబుస్సుమనే స్వభావం అదుపులో ఉంచుకుంటే సంకల్పం సిద్ధిస్తుంది. వీరికి సరిపోయే ఇతర రాసులు – ఎవరైనా తిండి పెడితే తిని హాయిగా పడుకునే సింహ రాశివారూ, ఈ రాశి వారు మచ్చిక చేసుకోగలిగిన వృషభ రాశివారూ, వీరు తన అదుపులో పెట్టుకోగల కుంభరాశులవారూను.  మిధున రాశివారితో – ఇద్దరు మొగవాళ్లకి స్నేహం కుదరవచ్చేమో గానీ ఇద్దరు ఆడవారికి ఏనాటికీ సఖ్యం కుదరపోవచ్చనే అందరికీ తెలిసిన జ్ఞానం చేత – వీరికి దెబ్బలాటలు రావొచ్చు. అయితే వారితో పని పడినప్పుడు లౌక్యంగా వ్యవహరిస్తే దైవబలం వల్ల చేసే పని లాభాన్ని చేకూరుస్తుంది. ఆటంకాలు కలిగినా  పట్టించుకోకుండా కార్యసిద్ధి కోసం ప్రయత్నించండి. పని జరగడమే ముఖ్యం అయినప్పుడు వారిచేత పడే అవమానాలను అధిగమించి ముందుకు సాగండి.  కుంతీదేవికి పెళ్లి అవకుండానే కర్ణుడు పుట్టినప్పుడు ఆదిత్యుడి కృప వల్ల తన కన్యాత్వం చెడిపోనట్టే వీరికి  సూర్యధ్యానం, ఆదిత్య హృదయం శుభాలనిచ్చి సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. మీరాశి పేరూ అమ్మవారి పేరూ ఒక్కటే అవటం చేత కన్యకా పరమేశ్వరీ అమ్మవారిని ధ్యానించండి. గందరగోళ పరిస్థితుల నుంచి శీఘ్రంగా బయటపడి వివేకం పురి విప్పుకుని బయటకి వస్తుంది. అలా విజయానికి బాటలు పడి జీవితంలో ఆనందం పొందుతారు.  స్త్రీలకు: వీరు ఎల్లకాలం యువతీయువకులలా ఉండడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కనకా, తమ సౌందర్యంపై ఎక్కువ మక్కువ చూపించడం వల్లా, జేబులోనో, పర్సులోనో తమ కూడా ఓ చిన్న అద్దం – మొహం మాటి మాటికీ చూసుకోవడానికి – ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అలాగే వీరి దగ్గిర ఏ సమయంలోనైనా ఓ చిన్నపాటి సంచీ అందులో సౌందర్యారాధనికి తగిన వస్తువులు (మొహానికి పౌడర్, ఫైర్ అండ్ లవ్లీ క్రీము, దువ్వెన మొదలైనవి) ఉంటాయి. అందువల్ల వీరికి మిగతాపనుల్లో అంత శ్రద్ధ ఉండదు. అయితే వీరు ఈ సౌందర్యోపాసనలో శ్రద్ధ పెడితే బ్యూటిషియన్, హెయిర్ డ్రెసర్, నెయిల్ పాలిషింగ్ వంటి వృత్తుల్లో రాణిస్తారు. విదేశాలలలో వీరికి భారతంలో కంటే ఎక్కువ విలువ ఉండి అధిక సంపాదన అవకాశం ఉంది.  విద్యార్ధులకి: సౌందర్యోపాసన వల్ల మీరు చదువుమీద శ్రద్ధ పెట్టలేరు. సేల్స్ మేన్ లాగా, సర్వీసు పనులూ, వృత్తి చేయడానికి పనికొచ్చే బ్యూటీషియన్ లాంటి చిన్న పాటి చదువులు వీరికి మంచివి. ఎంత చదివినా మనసు సౌందర్యోపాసన మీద ఉండడం వల్ల వీరికి చదువు తలకి ఎక్కదు కనక పరీక్షలు మార్చిలోరాశినా సెప్టెంబర్ లో రాశినా ఫెయిల్ అవుతారు. అయితే సరస్వతీదేవి అనుగ్రహంతో అత్తెసరు మార్కులు సంపాదించి గట్టెక్కవచ్చు. వృత్తి విద్యలో మాత్రం మార్కులు బాగానే వస్తాయి. వాటికి మార్చ్ సెప్టెంబర్ అనే పరీక్షలు ఉండవు కనక అవి ప్రయత్నించండి.

​ తుల

(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.  “రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 08 వ్యయం – 12 రాజపూజ్యం – 07 అవమానం – 08
త్రాసులో తూచినట్టే వీరు ప్రతీదీ సమపాళ్ళలో ఉండాలని అభిలషిస్తారు – అంటే గోంగూర పచ్చడిలో నంచుకోవడానికి ఉల్లిపాయా, ఆవకాయ తిన్నప్పుడు తాగడానికి తగినంత మజ్జిగ ఉండి తీరాలి. భోళాతనం ఎక్కువ. బరువైన విషయాలు వస్తువులు ఎక్కువ కాలం తమలో ఉంచుకోలేరు. న్యాయాన్యాయాలని రెండీంటినీ సమర్ధిస్తూ నోరు ధాటీగా పెట్టుకుని బతికేయగలరు.  రోజూ త్రాసువాడే చిల్లర వ్యాపారులూ, రెండువేపులా న్యాయం ఉందా లేదా అని చూసే జడ్జీలు తులారాశి వారికి అచ్చి వచ్చే కొన్ని వృత్తులు. అయితే అస్తమామూ త్రాసు సరిచేసుకుంటూ గల్లా పెట్టె దగ్గిర కూర్చుంటే బొజ్జ పెరుగుతుంది కనక వీరికి తగినంత శారీరక శ్రమ అవసరం; లేకపోతే గుండె జబ్బూ అధిక కొలెస్టెరాల్ వంటివి అంటుకుంటాయి.  వీరిలో ఉన్న ఒక సుగుణం ఏమిటంటే త్రాసులో పూర్తిగా తూచినట్టే   మొదలుపెట్టిన ప్రతి పనినీ దిగ్విజయంగా పూర్తిచేస్తారు. వాటివల్ల కీర్తి ప్రతిష్టలు పెరిగి అధికారుల సహకారం లభిస్తుంది, ప్రశంసలు అందుకుంటారు. గౌరవప్రదంగా కాలం గడిచి సంకల్పం నెరవేరుతుంది.  రాముడు వనవాసంలో ఉన్నప్పుడు అయోధ్యా ప్రజలు భరతుడు నందిగామంలో ఉండడం చూసి పధ్నాలుగేళ్ళూ పన్నులు ఎగ్గొట్టారు.  రాముడు వచ్చాక ఆ ఎగ్గొట్టిన పన్నులన్నింటినీ త్రాసు మీద అదృశ్యంగా నించుని హనుమంతుడు, పక్కనే నుంచుని లక్ష్మణుడూ ముక్కుపిండి వసూలు చేసారు. అందువల్ల తులా రాశివారు హనుమన్ చాలీసా చదివితే మంచి జరుగుతుంది. రామకోటి రాశినా  ఆంజనేయస్వామిని ధ్యానించడం మానవద్దు.  మీరు శివుడినీ విష్ణువునీ ఒకే దృష్టితో త్రాసులో సమానంగా తూచినట్టే చూస్తారు కాబట్టి శివ విష్ణు సహస్రనామాల్లో ఏది చదివినా మంచిదే. కుంభ రాశివారు తమ బరువు మొత్తం వేరే వారి మీద వేసే టైపు కాబట్టీ, తులా రాశివారు బరువు తూచగానే మిగతావారిని వదిలించుకోవడానికి ఉబలాట పడతారు కాబట్టీ కుంభ రాశివారు వీరికి సరిపడరు.  ఈ రాశివారు ప్రతీ పనీ తూకం వేసినట్టూ చేస్తారు కాబట్టి అవతలి వారు ఎవరైనా ఈసడిస్తే బహు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవాలని గమనించండి.   స్త్రీలకు: తులారాశి స్త్రీలు ప్రతీదీ గుర్తుపెట్టుకుని జీవిత భాగస్వాములని సాధించగల సమర్ధులు. నోరు పెట్టుకుని ఎంతటి మాటైనా అనేస్తారు. పోనీ తర్వాత చింతిస్తారా అంటే అదీలేదు. అందువల్ల వీరికి స్నేహితులు తక్కువగా ఉండొచ్చు. వీరికి నప్పే రంగులు నలుపు, గచ్చకాయ రంగులు. కోండొకచో బంగారం దుకాణంలో తూచే చిన్న త్రాసులాగా పసుపు రంగు నప్పుతుంది. అయితే నూనె ఓడుతున్న త్రాసుల్లాగే కాస్త అశుభ్రత వీరి సొంతం. అది వదుల్చుకుని కాస్త శారీరక శుభ్రత పాటిస్తే ఆరోగ్యానికి మంచిది.  విద్యార్ధులకి: వీరు మార్చా, సెప్టెంబరా అనుకుంటూ రెండూ త్రాసులో వేసి ఎప్పుడు పరీక్ష రాశినా తమకి ఎలాగా ఒకే మార్కులొస్తాయి అనుకుని ఏదో ఒకటి నిర్ణయం చేసుకుంటారు. అందువల్ల ఎంత కష్టపడి చదివినా, పరీక్షలు ఎప్పుడు రాశినా అవే మార్కులు వస్తాయి. ప్రతీదీ త్రాసులో తూకం వేసినట్టు ఆలోచించడం మానుకుని బాగా చదివి పరీక్షలు శ్రద్ధగా రాయండి; అప్పుడు సరస్వతీదేవి కటాక్షం కలుగుతుంది.

వృశ్చికం

(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ “తో, నా, నీ, నూ, నే, నో, య, యా, యూ” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 10 వ్యయం – 04 రాజపూజ్యం – 01అవమానం – 04
వృశ్చిక రాశి వారు నెమ్మదస్తులలా కనిపిస్తారు కానీ అవసరం వచ్చినప్పుడు అవతవారికి తెలియకుండా చటుక్కున కాటు వేయగల సమర్ధులు. అయితే వీరి కాటు మరణాంతక కాకపోయినా జీవితంలో చాలా భాదిస్తుంది. వీరికున్న ఈ కాటువేయడం అనే దుర్గుణం వల్ల వీరిని అందరూ భయపడడమో అసహ్యించుకోవడమో చేస్తారు. దీనికి తోడు కాటు భయం వల్ల ఈ రాశివారికి దాదాపు ఎవరితోనూ పడదు. మీకున్న ఈ అలవాటుని ఎంత దాచడానికి ప్రయత్నం చెసినా లాభం ఉండదు. మీకు ఆయుర్దాయం కూడా తక్కువే. మీరు ఇతరులకి అపాయం చేయకపోయినా మీకు అవతలి వారు అపాయం చేసి తీరుతారు. ఆ అపాయంవల్ల దాదాపు ముప్పాతికి మూడొంతులు మీకు ప్రాణాంతకం కావొచ్చు. అతి జాత్రగ్గ అవసరం. ఈ విషయంలో మీరు ఎవరినీ మార్చలేరు కనక మీ ఆరోగ్యం మీదే దృష్టి సారించండి. సకాలంలో ఆహారం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. నా బతుకు ఇంతేనా అనే నిరాశతో పనులు మొదలుపెట్టవద్దు. యమ మహిష ఘంఠికలు వినపడే వరకూ మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని మీరు నమ్మిన సిద్ధాంతంలోనే విజయముంది. దీర్ఘంగా ఆలోచించి, అవతలి వాళ్ళు చేసే పనుల గురించి బుర్ర పాడుచేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.   మీకు కావాల్సినప్పుడు దైవ ప్రేరణ వల్ల అవసరాలకు ఆర్థిక సాయం అందుతుంది.  ఆందోళన వద్దు.  సాలీడు అంతటి చిన్న ప్రాణి కాళహస్తిలో శివైక్యం పొందిందని గుర్తు పెట్టుకుని మీకు కూడా అటువంటిది ప్రాప్తించడానికి శివారాధన చేయండి.  ఏది ఏమైనా మీకు ఈ ప్రపంచంలో కలిగే సుఖం తక్కువ. మీరు ప్రపంచం నుంచి ఎంత దూరంగా ఉన్నా మీ కాటు గురించి అందరికీ ముందే తెలియడంవల్ల ప్రతి ఒక్కర్నుంచీ మీకు ప్రమాదం పొంచి ఉంది. ఈ రాశి వారి దురదృష్టం ఏమిటంటే ఈ కాటు లేకుండా వీరు బతకలేరు. ఆ విషపు కాటువల్లే మీకు ప్రపంచం హాని చేస్తుందని గ్రహించాలి. ప్రతీ ఏకాదశికీ శివాభిషేకం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.  మీకు నప్పేరాసులు మకర, మీన, కుంభ, తులా రాసులవారు. వారి వల్ల మీకు అంత కీడు జరగదు. సింహ, మిధున, కన్యా ధనూరాసులతో పొత్తు మీకు ప్రాణాంతకం అని గ్రహించాలి. కుంభ, తులారాసుల వారితో మీకు ఎటువంటి జగడమూ రాదు. ఈ రాసులవారితో కూడితే మీ జీవితం బాగా గడిచిపోతుంది. అయితే ఈ తులా, కుంభరాసులవారు కానీ మిధున, కన్యా రాశివారితో కలిస్తే వాళ్ళిద్దరూ కుమ్మక్కైనప్పుడు మీకు ప్రమాదం సంభవిస్తుంది.   స్త్రీలకు:  మీ కుటుంబ సభ్యులతో, భాగస్వామితో సౌమ్యంగా మాట్లాడండి. కోపం వద్దు. ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఈ సృష్టిలో భగవంతుడి అనుగ్రహం లేకుండా ఆకు కూడా కదలదని గుర్తించాలి. అప్పుడు మనఃశ్శాంతి లభిస్తుంది. జీవితంలో స్థబ్దుగా ఉన్నంతకాలం మీకు ఏ ఆపదా రాదు. విద్యార్ధులకి: మీరు జీవితంలో పరీక్షలు అన్నీ ఒకేసారి పాసు అవుతారు, తేలు తనకోండితో ఒకేసారి కుట్టినట్టూ. ఆ పాసు అవడం ఫస్టు క్లాసూ అవీ రాక బాగా ఉండకపోయినా మీరు ఏమీ అనుకోరు ఎందుకంటే మీ స్వభావం ప్రకారం మీరు పరీక్ష రాయడమే ముఖ్యం అనుకుంటారు. అందువల్ల మీకు సెప్టెంబర్ అనే ప్రశ్నే ఉదయించదు. ఎప్పటికప్పుడు మామూలుగా పాసు అవుతూ జీవతంలో స్థిరపడగలరు. అయితే మంచి క్లాసు రావాలంటే కష్టపడక తప్పదు. “నాకు అన్నీ వచ్చు” అనే అహంకారంతో అవతలవాళ్లని కాటువేయకుండా వారితో కలిసి గ్రూప్ స్టడీ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మరిన్ని విషయాలు నేర్చుకుని క్లాసు సంపాదించగల్గుతారు.

ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం “యే, యో, బా, బి, భూ, ధా, భా, డ, భే”  అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 02 వ్యయం – 11 రాజపూజ్యం – 08 అవమానం – 07

ధనూరాశి వారికి ముఖ్యంగా చెప్పవల్సినది – ధనుస్సు మాదిరిగానే ఎవరైనా కదిలిస్తే తప్ప ఏపనీ చేయలేరు. వీరిలో ఉన్న సుగుణాలూ, దుర్గుణాలూ ఎవరో ఒకరు వాళ్ళని చేతితో తట్టి బయటకి లాగవల్సిందే. ఓ సారి తట్టిలేపినా నిముషానికో సారి వీళ్ళని జాగృతం చేస్తూ పనులు చేయించుకోవాలి. లేకపోతే వీరు ఎప్పటిలాగానే నిద్రావస్థలోకి జారుకుంటారు.  అయితే వీరితో మామూలు పనుల దగ్గర్నుంచి బ్రహాస్త్రం వంటి పనులు కూడా సులభంగా చేయించుకోవచ్చు. వీరు కొండకచో వజ్రశరీరులై ఉంటారు. మనసు మాత్రం వెన్న కాకపోయినా అంత కఠినంగా ఉండకపోవచ్చు. దెబ్బలాటలూ, కొట్టుకునే విషయాల్లో తలదూర్చకండి ఎందుకంటే మీరు కోపంలో ఎవరికైనా అపాయం చేసి వార్ని హతమార్చే ఛాన్సు ఉంది. ఆ తర్వాత పోలీసులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మిమ్మల్ని భుజబలంతో వాడుకునే అర్జునులవంటివారుంటారు జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఏ చిన్నపాటి వ్యాధి వచ్చినా మీరు పనికిరాకుండా పోతారు. అటువంటి సమయంలో మిమ్మల్ని వాడుకునే వారు మిమ్మల్ని పట్టించుకోక చారులో కరివేపాకులా మిమ్మల్ని వదిలేశి మరొక ధనూరాశి వార్ని చూసుకోవడం మీకు కష్టం, ఆశ్చర్యం కలిగిస్తుంది. కుంభ, సింహ, మీన, మకరరాసులవారికి దూరంగా ఉండండి. ఈ రాశులవల్ల మీకు జగడాలు వస్తాయి. వీరిమీద మీదే పైచేయి అయినా మీరు చేసే పనులవల్ల వారికి నష్టం ప్రాప్తించి మీతో జగడాలకి దిగుతారు. మిధున కన్యా రాసులు మిమ్మల్ని జాగృతం చేసి తమ చేతిలో ఉంచుకోగలరు. వారితో పొత్తు పెట్టుకుంటే  విఘ్నాలు తొలిగి విశేషమైన ఖ్యాతి లభిస్తుంది. ఏది ఏమైనా ఆర్థిక వ్యయం పెరగకుండా జాగ్రత్తపడితే రుణ సమస్యలు తగ్గుతాయి.  మొహమాటం వల్ల మీకే నష్టం అని గ్రహింపుకి వస్తుంది జీవితంలో. సున్నితంగా వ్యవహరించడంమీకు సాధ్యం కాకపోయినప్పటికీ ప్రయత్నం లోపం లేకుండా చూసుకోండి.  కుటుంబపరమైన సమస్యలున్నప్పటికీ మీరు బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా – వీలైతే మీకు సరిపడే రాశివారితో పనులు పూర్తిచేయండి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవద్దు .  “ధనుర్దరో ధనుర్వేదో దండో దమయతామస్మి” అనే విష్ణుసహస్రనామ స్లోకం పఠించడం వల్లా, ఆ ధనుర్వేత్తలైన రామ, మహావిష్ణు దర్శన, ధ్యానాల వల్లా మంచి జరుగుతుంది.  స్త్రీలకు: ములుకుల్లాంటి బాణ ప్రయోగం చేసినట్టు మీరు కరుగ్గా మాట్లాడడం వల్ల ఇతరులతో, కుటుంబ సభ్యులతో జగడాలు వస్తాయి. అలా ఇతరులని ఎంతటి మాట అన్నా మీరు వెనక్కి తగ్గి క్షమాపణ కోరుకోరు. నేనంతే అనే స్వభావం మీది. అందువల్ల అందరూ మిమ్మల్ని – మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే – అవసరానికి వాడుకుని వదిలేస్తారు. తప్పుమీదే అని గ్రహింపుకి వచ్చేసరికి కాలాయాపన జరిపోతుంది. జాగ్రత్తగా ఉండండి.   అర్జునుడు గాండీవంతో మత్యయంత్రం కొట్టి ద్రౌపదిని సంపాదించుకున్నట్టూ, అదే ధనస్సుతో కౌరవ నిర్మూలనం చేసినట్టూ మిమ్మల్ని వాడుకునేవార్ని బట్టి జీవితంలో మీ విలువ పెరగడం, తగ్గడం జరుగుతుంది. అందువల్ల ఆందోళన వద్దు. మీతో సఖ్యం ఆశించే మిధున, కన్యారాశివారితో మీరూ సౌఖ్యంగా ఉండండి. విద్యార్ధులకి: మీరు ఏదో విధంగా బాణం తనచేతిలోంచి వెళ్ళడమే ముఖ్యంగానీ అది లక్ష్యానికి తగిలిందా లేదా అనేది చూసుకోరు కనక పరీక్షలకి ఫీజు కట్టేసి చదివినా చదవకపోయినా పరీక్ష రాసేస్తారు. అందువల్ల మీరు పరీక్ష పాసవడం అనేది మీ చేతిలో లేదు. పాస్ అయ్యేవరకూ మీ విధానాలు మార్చుకోకుండా “నాలో ఏమీ ప్రయత్న లోపం లేదు” అని తృప్తి పడుతూ మీరు పరీక్షలు రాస్తూనే ఉంటారు. ఈ పద్ధతి మార్చుకుని సరిగ్గా గురి చూసుకుంటే ఒకేసారి పరీక్ష రాసి పాస్ అవ్వగల సమర్ధులని గ్రహించండి. గురి బాగా కుదరడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. ఆ ధ్యానం అనేది మీ ఇష్ట దేవతమీద అయితే మరీ మంచిది.

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. “జో, జా, జీ, జూ, జే, ఖా, గా, గీ” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.
ఆదాయం – 11 వ్యయం – 04 రాజపూజ్యం – 12 అవమానం – 03

జ్యోతిషం పన్నెండు రాశులలో మీ రాశికున్నంత స్థానబలం మరొక రాశికి లేదు. మీ స్థానంలో మీరున్నప్పుడు మిమ్మల్ని ఏ పెద్ద శక్తులూ ఏమీ చేయలేవు. అయితే ఆ పెద్ద శక్తులు ఏమీ చేయలేవని గర్వ పడకండి. వాటికి దైవ శక్తులు తోడైతే వారు ప్రయోగించే సుదర్శన చక్రంవంటి ఆయుధాలవల్ల మీకు ప్రాణాంతకం అవుతుంది.  మీరు చేయవల్సిందల్లా మీ స్థానంలో కుదురుగా కూర్చుని “పాద ద్వందము నేలమోపి పవనున్ బంధించి ..” అనేటట్టుగా గర్వాన్ని దగ్గిరకి రానీయకుండా ఉండడమే. మీకెంత స్థానబలం ఉన్నా ఒక్కసారి మీ స్థానంలోంచి బయటకి వస్తే మిమ్మల్ని ఒక ఆట ఆడించి వినోదించే వారు చాలామంది ఉన్నారని గురుపెట్టుకోండి. మీది సంపాదన కోసం కష్టించి పనిచేయక్కర్లేని జీవితం. ఈ రాశిలో కొంతమందికి జీవితం వడ్డించిన విస్తరి, తిండి నోటి దగ్గిరకి వస్తుంది దైవ ప్రేరణ చేత.  అయితే తిండి నోటికి వస్తోంది కదా అని బద్ధకంగా తయారౌతారు.  ఆ బద్ధకం వదుల్చుకుంటే మీకు మీరే సాటి అయ్యి సృజనాత్మక శక్తితో పనిచేసి, విజయం సాధిస్తారు. మీ నిజాయతీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది.  మీ కుటుంబం నుంచి మీకు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ధర్మమార్గంలో పయనించడం మొదలుపెట్టి ఆర్థికపరమైన అభివృద్ధిని సాధించండి.  ఒక్కొక్కప్పుడు మీరు మీ స్వంత స్థానం లోనే ఉన్నా బయటనుంచి వచ్చే ఏనుగుల లాంటి పెద్ద శరీరం ఉన్న శత్రువుల నుంచి పీడ పొంచి ఉంది.  ఆ శతృవులమీద మీరు దెబ్బలాటకు వెళ్తే  నిందారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, గమనించండి.  ఈ రాశి వారికి మామూలు కంటే పెద్ద దంతాలూ, ఉండవాల్సిన వాటికంటే ఎక్కువ దంత సిరి కద్దు.  అందువల్ల వీరికి తరచూ నోటిలో బాధలు కలుగుతాయి.  ఈ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ఎవరి వద్దా ప్రస్తావించవద్దు. వీరికి ఏరాశి వారితోనూ అంత శుభప్రదంగా ఉండదు.  అయినప్పటికీ కుంభ, మీన, తులా రాసుల వారు కాస్త ఫర్వాలేదు. దూరదేశ ప్రయాణాలు మంచివి కావు. వాతావరణ మార్పులవల్ల ఆరోగ్య భంగం కలగవచ్చు.   వీరికి అనువైన ప్రదేశాలు వేడి ప్రదేశాలు, నదీ నదాలు, సరస్సుల దగ్గిరాను. ఈ ప్రదేశాల్లో మీకు నివాసం మంచిది. అతి చలి దేశాలు వీరికి సరిపడవు అని గ్రహించాలి.  మీకు సుదర్శన చక్రం వంటి ఆయుధాలవల్ల ప్రమాదం పొంచి ఉంది కనక శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీసూక్త పురుష సూక్తాలూ పఠించండి. ఆదిత్య హృదయం, వరుణోపాసన చేస్తే సకాలానికి వర్షాలు కురిసి ఆయురారోగ్యాలు సిద్ధించి మీ స్థానబలిమి మరింత బలపడుతుంది. స్త్రీలకు: మీరు ఎవరినైనా ఒక పట్టుపడితే అంత సులభంగా వదలరు. మీ ఇల్లే మీ స్థానబలం. మీకు నప్పే రంగులు లేత ఆకుపచ్చ, బూడిద కొండొకచో లేత పసుపు. మీరు పొడగరులు అయి బలంగా ఉండి మంద గమనులై ఉంటారు. వీరికున్న భోజన ప్రీతి వల్ల కొంచెం లావుగానే ఉంటారు. ప్రతీ పని నెమ్మదిగా చేద్దామనుకునే నెమ్మదస్తులు. అందువల్ల ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణం కంటే పాసెంజర్లోనే వెళ్ళడానికి ఇష్టపడతారు. స్థాన బలిమి కాపాడుకోవడానికి మీరూ, మీ కుటుంబ సభ్యులూ ఒకేచోట కలిసి ఉండడానికి ఆస్కారం ఉంది. అది మీకు భగంతుడిచ్చిన వరప్రసాదం. దాన్ని సద్వినియోగం చేసుకోండి.  విద్యార్ధులకి: మీకున్న స్థానబలిమి వల్ల మీరు మీస్వంత ఊరిలో ఎంతవరకూ చదువుకోగలరో అదే మీకు అబ్బుతుంది. ఆ తర్వాత మీరింక పైకి చదువుకోలేరు. దీనికి మీరు ప్రయత్నించరు కూడా. అందువల్ల ప్రవాహంలో ఈ ఒడ్డునుంచి ఓ ఓడ్డుకు, మళ్ళీ వెనక్కీ ఈదుతున్నట్టూ మీరు మార్చ్ సెప్టెంబర్ అంటూ అలా పరీక్షలు రాస్తూనే ఉంటారు. ఎప్పుడూ పాసవుతారో మాత్రం చెప్పడం ఆ భగవంతుడిక్కూడా సాధ్యం కాదు. మీ మానవ ప్రయత్నం మీరు చేయండి.

కుంభం

(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు “గు, గే, గో, సా, సీ, సు, సే, సో, దా”  అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)

ఆదాయం – 06 వ్యయం – 11 రాజపూజ్యం – 12 అవమానం – 09
ఈ రాశివారు నిండు కుండ వంటివారు. అయితే ఆ కుండలో నీళ్లు ఉన్నాయా లేవా అనేది వీరి జీవితంలో పూర్తిగా తొంగి చూస్తేనే కానీ తెలియదు. వీరి జీవితం నీళ్ళు లేని కుంభం వలే బోలుగానైనా, నిండు కుండవలే పూర్తి ఐశ్వర్యాలతోనైనా, చివరకి అర్ధ కుంభంలో వలె మధ్య తరగతిగానైనా ఉంటుంది. వీరు అన్నీ తనలో దాచుకుంటారు కానీ పైకి చెప్ప(లే)రు.  అయితే ధనూరాశివంటివారితో స్నేహం చేసినప్పుడూ, వారూ వీరూ ఒకటైనప్పుడు కుంభరాశివారు ధనూరాశివారివల్ల పూర్తిగా బయటపడతారు. అందువల్ల ధనూరాశి తో వీరికి అత్యంత ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు బయటపడాలి ఎప్పుడు కాదు అనే అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి. మాట్లాడని నిండు కుండ ఎప్పుడు మాట్లాడినా అందరూ ఆసక్తిగా వింటారు కనక వీరు నోరు తెరిస్తే మాటకు విలువ పెరుగుతుంది; తగిన ప్రశంసలు అందుకుంటారు.  మీకు శరీర పైభాగంలో దెబ్బలు తగిలినా ఏమీ అవదు కానీ మధ్యభాగంనుంచి – అంటే మెడ కిందనుంచి కాళ్ళవరకూ ఏ చిన్న ప్రమాదం జరిగినా అతి జాగ్రత్త అవసరం. లేకపోతే ప్రాణాంతకం కావొచ్చు. మీనం, మకరం, కర్కాటక రాసులవారు మీకు అత్యంత ఆప్తులు. వారితో మీకు లాభం కలుగుతుంది. అయితే మీరు బయటపడి వాళ్లని మోసం చేస్తే మీతోబాటు వారు కూడా పూర్తిగా నాశనం అవుతారు. ఇది దృష్టిలో పెట్టుకుని మీ జీవిత భాగస్వాములని సరిగ్గా ఎంచుకోండి.  మేష, వృషభ, సింహ రాసులవారు మిమ్మల్ని పూర్తిగా వినియోగించుకుంటారు. వారివల్ల మీకేమీ ఉపయోగం లేదు సరికదా మిమ్మల్ని వాడుకున్నాక మిమ్మల్నీ తెలిసో తెలియకో కాళ్లతో తన్నినట్టు మీకు అపాయం తలపెట్టే సూచనలు ఉన్నాయి. అందువల్ల ఈ రాసులతో మీకు అదృష్టం కంటే నష్టమే ఎక్కువ అని గ్రహిస్తే మీకే మంచిది; కలహాలకు తావివ్వకండి; ఆరోగ్యం కాపాడుకోవాలి.  వీరికి నప్పే రంగులు ముఖ్యంగా నలుపు, జేగురు రంగులు.  మిధున రాశివారు మిమ్మల్ని వినియోగించుకున్నా మిమ్మల్ని తమకూడా ఉంచుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి వారు మీకు జీవితంలో సరైన భాగస్వాములు అవుతారు. వారిని పెళ్ళిచేసుకోవడం ఉభయతారకం. గంగాభవానిని తన శిరస్సుమీద ధరించి, చంద్రుడితో ప్రపంచానికి చల్లదనాన్నిచ్చే శివుడికి మీరు సాధారణంగా భక్తులై ఉంటారు. మహా మృత్యుంజయ మంత్రం, శివ పంచాక్షరీ జపించండి.  స్త్రీలకు: మీరు నిండుకుండవంటివారే కానీ ఏ చిన్న ఆపదవచ్చినా ఆ కుంభంలోంచి నీరు ధారాపాతంగా కారినట్టూ ఏడుస్తూ ఎప్పటికీ కోలుకోలేరు.  మీరు అవతలి వారు ఎండలో ఉన్నంత వేడిమి మీ మీద చూపించినా మీరు మాత్రం వారికి చల్లదనాన్ని ఇవ్వాలనుకుంటారు. అది మీకు స్వతహాగా వచ్చిన స్వభావం. అయితే ఇటువంటి వాటి వల్ల మీకు ఆపద కలగకుండా మిధున, కన్యా రాశివారలను పెళ్ళిచేసుకుంటే మిమ్మల్ని వారు బాగా చూసుకుంటారు. ఆవిధంగా అధికారయోగం ఉంది; ఆపదలు దూరమవుతాయి. దైవబలం రక్షిస్తుంది, అవసరాలకు ధనం అందుతుంది. మంచి మాటలు వింటారు.  విద్యార్ధులకి: మీరు అన్ని విషయాలూ జాగ్రత్తగా చదివి మీలోనే దాచుకుంటారు. అయితే ఆ విషయాలు బయటకి చెప్పడానికి ఇష్టపడరు. అందువల్ల పరీక్షల్లో సరిగ్గా రాయలేరు. ధనూరాశి వారివల్ల మీరు మీ వ్యక్తిత్వంలోంచి భళ్ళున పగిలి బయటకొచ్చి అన్ని విషయాలూ ఒకేసారి ధారాళంగా చెప్పేస్తారు. అందువల్ల ధనూరాశివారిని గురువుగా తీసుకుని పరీక్షలు రాయడానికి ఉద్యమించండి. ఓ సారి రాయడం మొదలు పెట్టగానే కలం అదే సాగిపోతుంది మీలో ఉన్న సంపద అంతా బయటకి రావడానికి. అలా మంచి మార్కులు తెచ్చుకుని పై చదువులకి వెళ్తారు. మార్చ్, సెప్టెంబర్ అనే విషయాల జోలికి వెళ్లకుండా అసలు పరీక్షల్లో మీ ఐడియాలని ఎలా వ్యక్తపరచడం అనే ఆలోచించండి. ఒకసారి ఆ వ్యక్తీకరణ మొదలవ్వగానే ప్రవాహం లా అన్నీ బయటకి వస్తాయి. అప్పుడు మీరు సాక్షాత్తూ సరస్వతీ పుతృలని గ్రహింపుకి వస్తుంది. సరస్వతీ ధ్యానం కూడా ఉత్తమం.

మీనం

(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి    “ది, దు, శ్యం, ఝూ, దా, దే, చా, చి” అనే అక్షరాలతో తమ పేరు మొదలైన వారు.)
ఆదాయం – 11 వ్యయం – 06 రాజపూజ్యం – 05 అవమానం – 07

మీన రాశివారు నీటిలో చేప ఈదగలిగినంత సులువుగా ఏ పనైనా చేయగల సమర్ధులు. వీరిని క్రికెట్ ఆటలో ఆల్ రౌండర్లుగా చెప్పవచ్చు. అవసరం అయినప్పుడు బేటింగ్, టీముకి కావాల్సినప్పుడు బౌలింగూ ఆఖరికి వికెట్ కీపర్ గాయపడితే వికెట్ కీపింగూ చేయగల సమర్ధులు. అయితే వీరితో వచ్చిన చిక్కేమిటంటే త్వరగా అలిసిపోతారు. అంటే అయిదురోజుల టెస్టు క్రికెట్టు కంటే వన్ డే లలోనూ 20/20 లలోనూ విశేషంగా రాణీంచగలరు. ఆ టైపు ఆటల్లో ఎంతటి విఘ్నాలు ఎదురైనా, ఏకాగ్రతతో వాటిని అధిగమించి విజయంపై పట్టు సాధిస్తారు.   వీరు సన్నగా ఉంటారు కానీ మహా విష్ణువు మత్స్యావతారంలో ప్రకటితమైనట్టూ పెద్ద పెద్ద శరీరంతోనూ ఉండడం గమనించవచ్చు. వీరు ఏ పనీ చేయకుండా ఓ చోట కూర్చోలేరు. పనిలేకపోయినా అలా తిరుగుతూ ఉండడం వీరికున్న అలవాటు. దీనివల్ల ఒకోసారి గాయమో అకస్మిక మరణమో సూచన ఉంది. ప్రమాదం పొంచి ఉంది కదా అని మానేయక దైవం మీద భారంవేసి ప్రశాంతంగా పనిచేయండి.  వీరికి మేష, కుంభరాశి వారు సరైన జోడీ. కుంభరాశి వారు వీరిని తమలో ఇముడ్చుకుని జాగ్రత్తగా కాపాడుకుంటారు. మకర, మిధున, కన్యా రాశివారితో ఏ విధంగాను పొత్తు పెట్టుకోకండి. వారితో మీకు ప్రాణగండం ఉంది. వీరు ఏ వృత్తిలోనైనా రాణిస్తారు. కానీ ఆరంభ శూరత్వం అన్నట్టూ ఏ వృత్తిలోనైనా మొదట్లో దూసుకుపోయినా తుస్సుమనే సిసింద్రీలాగా కొన్నిరోజులు పోయాక ఆ దూకుడు తగ్గుతుంది. అందువల్ల అనేక వృత్తులు నేర్చుకుంటారు కానీ దేనిలోనూ ఉద్ధండులుగా మారలేరు. ఇది తెలుసుకుని అనేక చోట్ల చేతులు కాల్చుకోకుండా ఒకే వృత్తిలో రాణించడానికి ప్రయత్నం చేస్తే విజయం స్వంతం అవుతుంది. మత్స్యావతారుడైన మహావిష్ణువు ధ్యానం ఆటంకాలను తొలగిస్తుంది.   స్తబ్దుగా ఉండే సాఫ్ట్ వేర్, బేంకు క్లర్క్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంటులో ఉండే క్లర్క్ వంటి ఉద్యోగాలు ఎంచుకోండి. అటువంటి ఉద్యోగాల్లో రాణిస్తారు. నీళ్ళలో చులాగ్గా తిరిగే చేపలా ఎక్కువ తిరుగుడు ఉండే సేల్స్ మేన్, మెడికల్ రిప్రజంటేటివ్ లాంటి ఉద్యోగాలు మీకు సరిపోవచ్చు. స్త్రీలకు: మీరు ఇంటిపనులో వంట పనులు ఏదైనా కానీయండి, వాటినన్నింటినీ సులభంగా నేర్చుకోగల సమర్ధులు. కార్యేషు మంత్రీ, శయనేషు రంభా అన్నట్టుగా మీరు మీ కుటుంబానికీ ప్రతీ పనిలోనూ మూలస్థంభంలాగా నిలబడగలరు. కుంభరాశివారిని భాగస్వామ్యులుగా ఎంచుకోండి. అది మీ ఇద్దరికీ శుభప్రదం. మకర రాశి వారు మీతో స్నేహంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ అవసరం అయినప్పుడు మీకు హాని చేయగలరని గ్రహించాలి. మీరు సాధారణంగా అసూర్యం పశ్యలు అయి ఉంటారు. ఎండలో, వేడి ఉన్న ప్రదేశాల్లో తిరగకండా నీడ పట్టున ఉంటూ ఆరోగ్యం కాపాడుకోండి.  విద్యార్ధులకి: ప్రతీ పరీక్షకీ ఉత్సాహంగా తయాయవడం వీరి ప్రత్యేకత మీరు అసలు పరీక్ష అనగానే చదవడం మొదలుపెడతారు సరే, కానీ ఆ ఉత్సాహం పది రోజుల్లో నీరుకార్చుకుంటారు తెగ చదివేసి. ఆ తర్వాత నీరసంగా చదువుతూ పరీక్ష మొదలు పెట్టేరోజుకి కాళ్ళీడ్చుకుంటూ వస్తారు.. అందువల్ల ఏమి రాసారో మీకే గుర్తు ఉండదు. పాసు అవుతారా అంటే చెప్పడం కష్టమే. అందువల్ల అన్ని పరీక్షలూ మొదటి సారి మార్చ్ లో పాసవలేరు. ఒక్కో సారి సెప్టెంబర్ తప్పని సరి అవుతుంది. నిరుత్సాహం వద్దు. చివరికి ఎన్ని సార్లు రాసారన్నది ముఖ్యంకాదు ఓ సారి పాస్ అవగానే అని గ్రహింపుకి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked