కవితా స్రవంతి

విశ్వ విలేజ్!

– సముద్రాల హరికృష్ణ

ఉత్తరాల రోజుల్లో ఉత్తర దక్షిణ ధృవాలు
ఉత్త భూభాగపు టంచులు,పాఠ్యాంశాలు!

మరి ఇప్పుడో, పిల్లలకవి ఆన్ సైట్ లొకేషన్లు
త్వరత్వరగ లోకం చుట్టే వీరులకు,మజిలీలు!!
*****
పొగలు గ్రక్కే ప్యాసింజర్ లాగుడు రైళ్ళవి!!
సిగ నలగక ఖండాంతరాలు వెళ్లే స్ప్పీడులివి

కారుంటే కుబేరుడపుడు,విమానమెక్కితే విష్ణువే!
కారిప్పుడు పిల్లలాట,విమానమంటే జెట్లాగ్ విసుగు!
*****

ట్రంక్ కాలప్పుడు భగీరథ వారస ప్రయత్నమే
లక్కుంటే, లైన్ దొరికితే,కేకలో సింహనాదాలో!!

ఊపిరి వినిపించే మెత్తని మొబైల్ టాకథాన్లిప్పుడు
ఏపనీ లేకున్నా,గంటలు మింగేసే మాటకచ్చేరీలు!
*****

ప్రపంచం ఒక్కటైంది,విశ్వమే విలేజ్ అయిపోయింది
తల వాడిది,నెప్పి నీది,ముక్కు నీది,పడిసెం వాడికి!

వాడిది నీదైనపుడు,నీదివాడిదైంది ఒక్కరిదేదీ లేదు
సామూహికపయనంజయమోస్వర్గమోఅంతా ఒక్కటే!
*****

చేయీ చేయీ కలిపి కాదు,దణ్ణాలంటే దణ్ణాలంటూ
కోటి గుండెల ఆర్తి, కోటి గొంతుల శక్తి, నినదిస్తోంది!

అందరం గెలవాలని,ఈ పోరాటం ఏ ఒక్కరిదీ కాదని
ఇదొక అంతర్యుధ్దం,మనిషిగ బతకాలని,బతికించాలని

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked