బాలానందం

శాంతి చిరునామా?

(బాలల కథ)

-ఆదూరి.హైమవతి

ధర్మపురం అనే ఊర్లో ధర్మన్న అనేఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు.పేరులోనే తప్ప ‘ధర్మ ‘మనేది అతగాడి జీవితం లో లేనేలేదు. ఎంగిలిచేత్తో కాకిని కూడా అదిలించని పరమ పిసినారి. బాగాలాభాలు వచ్చివ్యాపారం ఎదిగినా అతడి బుధ్ధి మాత్రం మారలేదు. తనవద్ద పనిచేసే గుమాస్తాలకు, ఇతర పని వారికీ జీతాలు పెంచడు సరికదా సకాలంలో నెల జీతం ఇవ్వడు. ఐతే అంతా ఉద్యోగ భద్రతవల్ల, మానకుండా అతగాడివద్దే పని చేస్తున్నారు.
ఇంట్లో సైతం సరుకులు సమంగాతెచ్చేవాడుకాదు. భార్యా పిల్లలూ అన్ని అవసరాలకూ అతగాడ్ని దేబిరించి, విసిగిపోయేవారు. కాస్తఅనువైన బట్టలూ కొనడు. అతడి భార్య సీతమ్మ, పిల్లలను సముదాయించు కుంటూ ఓర్పుగా సంసా రాన్ని, నెట్టుకొస్తున్నది. సరైన చీరలైనా లేక సీతమ్మ ఏ ఇంటికీ పేరంటా నికైనా వెళ్ళేదికాదు. అంతా ఆమెను అదోలా చూసేవారు. ధర్మయ్య వ్యాపార వ్యవ హారాలతో, ఇంట్లో భార్యా పిల్లలు వారి అవసరాల కోసం సొమ్ము, వస్తువులు అడుగు తుంటే విసిగిపోయి ఎప్పుడూ అందరినీ తిడుతూ, వ్యాపారం విస్తరించే విషయాలు ఆలోచిస్తూ, లాభాలు లెక్కలు బేరీజు వేసుకుంటూ, కోపదారిగా పేరు పొందాడు. నిరంతరం అశాంతితో ఉండేవాడు. ఏనాడూ భార్యా పిల్లలతో నవ్వుతూ మాట్లాడటం ఎవ్వరూ చూడలేదు.
ధర్మన్న పనివాడు ఆనందు ఆయన అంగడి ముందు చిన్నపాకాలో నివసిస్తూ రాత్రులు అంగడికి కాపలాగా,  పగలు ఆయన అంగట్లో పని చేస్తూ ఉండే వాడు. ఆనందు పేరుకు తగినట్లు ఎప్పుడూ ఆనందంగా అందరితో చిరునవ్వుతో మాట్లాడే వాడు. ఏ పని ఎవరు చెప్పినా చిటికెలో చేసేసే వాడు .
రాత్రి సూర్యాస్తమయం కాగానే ఉన్నదేదో తిని ఆనందూ వాడిభార్య సంతోషీ పదేళ్ళ కొడుకు ప్రశాంతూ హాయిగా కబుర్లాడు కుంటూ పాటలు పాడుకుంటూ, నవ్వుకుంటూ గడిపే వారు. అంగడి ముందుండే దీపం వెలుగులో ప్రశాంతు బళ్ళో పంతుళ్ళు చెప్పిన పాఠాలు చదువుకునేవాడు.
ఒకరోజున ధర్మన్న తన మేడకిటికీలోంచీ గుడిసెముందు నవ్వుకుంటూ మాట్లాడు కుంటున్న ఆముగ్గుర్నీ చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఆయనకు ఎంతో కాలంగా పెద్ద సందేహం మనస్సును తొలుస్తున్నది. అంత చిన్న గుడిసెలో గంజి త్రాగి బ్రతుకుతూ వారెలా నవ్వుకుంటున్నారో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కాలేదు ఆయనకు. ఇహ ఆగలేక మేడమీది తన గదిలోంచీ దిగివచ్చి గుడిసె ముందు నిల్చుని “ఆనందూ !” అనిపిలిచాడు.
వాడుఈసమయం లో యజమాని ఎందుకు పిలుస్తున్నాడోని కంగారుగా గుడిసెలోంచీ బయటికి వచ్చాడు.”ఏంది బాబుగారూ ఈ వేలప్పుడు వచ్చారు? ఏదైనా జరూరు పనుంటే చెప్పండి ఇట్టే చేసేస్తాను. ” అంటూ చేతులు కట్టుకుని నిల్చున్నాడు.

“పనేం లేదు కానీ ఆనందూ ! నీ సంపాదన చాలా తక్కువ కదా! నీవు భార్యా పిల్లాడితో కాళ్ళుకూడా పూర్తిగా చాపుకోను చాలని ఈగుడిసెలో ఎలా నవ్వుతూ హాయిగా జీవిస్తున్నావురా!ఎప్పుడూ విచారంగా వున్నట్లు ఎన్నడూ మీ ముగ్గు ర్నీ చూడలేదు? ఎలా ఆనందంగా వుంటున్నావురా!” అని అడిగాడు.
దానికి ఆనందు “బాబుగారూ ! మీరేం అనుకోనంటే ఒకమాట చెప్తాను. మేము మాకున్న దాంతో కలో గంజోత్రాగి కడుపు నింపు కుని తృప్తి పడతాం. మీ మేడ ముందు ఈగుడిసెలో వుంటూన్నా, ఏనాడూ మీ మేడలోని సుఖాలను గురించీ మా మనస్సుల్లో ఆలోచన రానివ్వ లేదు. మా తృప్తే మా ఆనందానికి కారణం. మాకు మరీ ఎక్కువ సంపాదించాలనే కోరిక లేదు. కాలేమా కడుపులకు కాస్తంత గంజి చాలని భావిస్తాం. అంతే బాబూ !మరేం లేదు. మీరు మీ వ్యాపారాలు పెంచు కోను, లాభాలు మరీ ఎక్కువగా ఆర్జించే మార్గాల గురించీ ఆలోచిస్తూ, సంపాదిం చిన డబ్బు ఎట్లా దాచాలో వ్యసన పడుతూ, మీ కున్న దానితో సంతోషంగా వుండ లేక పోతున్నారు. మీ ఇంట్లో వారితో మాట్లాడను వారి అవసరాలు తీర్చనూ మీకు సమయం లేదు. ఏమీ అనుకోకండి బాబూ !ఉన్నమాట చెప్పాను.” అన్నాడు .
ఆనందు మాటలు ధర్మన్న మనస్సులో బాగా నాటుకున్నాయ్. తన పొర పాట్లు తెల్సివచ్చాయి. తన జీవన పంధా మార్చుకుని సంతోషంగా జీవించ సాగాడు.
నీతి:- తృప్తిలోనే ఆనందం ఉందని తెల్సుకోండి బాలలూ! తనకు లేదని ఏడిస్తే ఒక కన్నుపోయింది, ఇతరులకు ఉన్నది చూసి ఏడిస్తే రెండో కన్నూపోయిందనే సామెత గుర్తుంచు కుని ఉన్నదాంతో తృప్తిగా జీవించడ ఉత్తమం.

*************************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked