శీర్షికలు

‘అనగనగా ఆనాటి కథ’

-సత్యం మందపాటి

నేపధ్యంః
క్రికెట్ టెస్ట్ మేచిలోలాగానే నా సాహిత్య ప్రస్థానంలో కూడా రెండు ఇన్నింగ్సులు వున్నాయి. భారతదేశంలో 1950 దశకంలో చిన్న కథల రచనలతో మొదలయి, 1960 దశకం మధ్యలోనే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన ప్రముఖ వారపత్రికల్లోనూ, జ్యోతి, యువ మొదలైన ప్రముఖ మాసపత్రికల్లోనే కాక, ఆనాటి ఎన్నో పత్రికల్లో నా కథలు వచ్చేవి. 1970 దశకం వచ్చేసరికీ నేను సాహితీ పాఠాశాలలో కొంచెం చోటు సంపాదించాను. 1980 దశకం మొదట్లో అమెరికాకి వచ్చాక, ఇక్కడ ఉద్యోగంలోనూ, జీవితంలోనూ స్థిరపడటానికి చాల సమయం పట్టింది. దాదాపు పదేళ్ళ పైన ఒక్క కథ కూడా వ్రాయలేదు. కొంతమంది సంపాదక మిత్రులు, నాకు ఉత్తరాలు వ్రాసి, అమెరికా జీవితం గురించి కథలు వ్రాయండి అని అడిగేవారు కూడాను. చివరికి నాకు బోధివృక్షం క్రింద కూర్చోకుండానే, ‘టైము లేదు అనేది పెద్ద కుంటిసాకు అనీ, రోజుకి ఒక గంట మిగుల్చుకుంటే సంవత్సరానికి 364 గంటలు మిగులుతాయనీ, అంత సమయంలో ఎన్నో పుస్తకాలు చదవవచ్చనీ, మరెన్నో కథలు వ్రాయవచ్చనీ’ జ్ఞానోదయమయింది. దానితో 1990 మొదటినించీ ‘అమెరికా బేతాళుడి కథలు’ శీర్షికతో అమెరికా తెలుగు డయోస్పొరా కథలు వ్రాసి, మళ్ళీ నా రెండవ ఇన్నింగ్సు మొదలుపెట్టాను. ఇప్పటి దాకా ఇంకా సాగుతూనే వుంది. అదన్నమాట నా కథల గురించి జరిగిన కథ.


స్పందనః
నాకెప్పుడూ నా చుట్టూ జరుగుతున్న నిజ జీవిత కథలు వ్రాయటమే ఎంతో ఇష్టం కనుక, భారతదేశంలో వున్నప్పుడు అక్కడ జరిగే విషయాల మీద వ్రాసేవాడిని. ముఖ్యంగా ఆరోజుల్లో ప్రభుత్వంలోనూ, ప్రజల్లోనూ వున్న అవినీతి, సమాజంలో అట్టడుగున వున్నవారి వ్యధలూ, మధ్యతరగతి మందహాసాలు, సంసారాలలో సరిగమలు, మూఢనమ్మకాలు మొదలైన వాటితో ఎన్నో జరిగిన సంఘటనల ఆధారంగా కథలు వ్రాసేవాడిని. ఆ కథలు మళ్లీ ఈమధ్య చదువుతుంటే, విషయపరంగా ఆనాటికీ, ఈనాటికీ వాతావరణంలో పెద్ద మార్పు రాలేదనిపించింది. అందుకే ఈ తరంవారికి ఆనాటి సాంస్కృతిక వాతావరణం, కొన్ని సమస్యలు చూపిద్దామనీ, అప్పటినించీ ఇప్పటిదాకా వాటిలో ఎన్ని మార్పులు వచ్చాయో, రాలేదో మీరే చూస్తారనీ ఇవి మీ ముందు వుంచుతున్నాను. చిత్తగించండి.

0 0 0

త్వమేవాహం!
(ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రిక ఫిబ్రవరి 18, 1981 సంచికలో ప్రచురింపబడింది)

నాయకుడుగారు ఎక్కిన కారు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అడుగుపెట్టింది.
మెయిన్ పోర్టికోలో కారు ఆగగానే, డి.ఐ.జి., హాస్పిటల్ సూపరెంటెండెంట్ ఎదురు వచ్చారు.
నాయకుడుగారు కారు దిగుతూనే ఆదుర్దాగా అడిగారు, “అసలేం జరిగింది” అని.
“పదండి సార్! ఇంటెన్సివ్ కేర్ యూనిటుకి వెడుతూ మాట్లాడుకుందాం”, దారి చూపాడు హాస్పిటల్ సూపరెంటెండెంట్.
నడుస్తుండగా ఆయనే అన్నాడు, “మన అమ్మగారు (అంటే నాయకుడుగారి భార్య), మన పిల్లలు (అంటే నాయకుడుగారి పిల్లలు), మన కారులో (అంటే నాయకుడిగారి కారులో) వెడుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందిట సార్”
నాయకుడుగారు నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ అడిగారు, “ఎలా అయింది” అని.
డి.ఐ.జి. అన్నాడు, “అమ్మగారూ, పిల్లలూ షాపింగ్ కోసమని బయలుదేరారుట సార్. మన కారు మార్కెట్ రోడ్డులో వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందిట. అసలే ఆ మార్కెట్ రోడ్డు చాల ఇరుకు!”
నాయకుడిగారి మనసులో మార్కెట్ రోడ్డు విషయం మెదిలింది. కార్పొరేషన్ స్పెషలాఫీసర్ ఆ రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువ కనుక, ఆ ఇరుకు రోడ్డుని వెడల్పు చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే, అడ్డం వచ్చిన రెండు సినిమా హాళ్ళూ, ఒక త్రీ స్టార్ హోటలూ, రెండు బట్టల షోరూములూ పగలగొట్టి రోడ్దుని వెడల్పు చేయాలన్నమాట. స్పెషలాఫీసర్ ఆ పని ప్రారంభించబోయే ముందు, సదరు వ్యాపారవేత్తలందరూ నాయకుడిగారి సహాయం కోరారు. ఆయన ఏనాడూ ఎవరినీ కాదనలేడు కనుక, మొత్తం అందరి దగ్గరా తలా ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి, వాళ్ళకు ఏమీ ఇబ్బంది లేకుండా సహాయం చేశాడు. అందుకే ఆ రోడ్డు అలా ఇరుకుగానే వుండిపోయింది. ఆ రోడ్డు విశాలంగా వుంటే ఈ ప్రమాదం జరిగేదింకాదేమో?
“పదండి సార్, ఇటు” సూపరెంటెండెంట్ గబగబా నడుస్తూ దారి చూపిస్తున్నాడు.
డి.ఐ.జి. అంటున్నాడు, “మన భూపతిగారి టూరిష్టు బస్సు ఎదురుగా వస్తున్నదిట సార్. మన కారుని చూసి ఆ బస్సు డ్రైవర్ బ్రేక్ నొక్కాడుట కానీ, బ్రేక్ సరిగ్గా పని చేయక ఆ బస్సు వచ్చి మన కారుని గుద్దేసిందిట!”
అవును, భూపతి! అతని బస్సులన్నీ పాడయిపోయిన డొక్కు బస్సులే! ఒక్క బస్సుకీ రోడ్డు మీద నడిచే అర్హత లేదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వనన్నాడని తన దగ్గరకు వచ్చి ఏడ్చాడు భూపతి. అవన్నీ రిపేర్ చేయటానికి కొన్ని లక్షలు అవుతాయనీ, అలా చేస్తే తనకి నష్టం వస్తుందనీ మొరపెట్టుకున్నాడు. తను కాదనలేక అతని బస్సులన్నిటికీ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇప్పించాడు. అఫ్కోర్స్! భూపతి కూడా ఆ సహాయాన్ని వూరికే తీసుకోలేదు. పది బస్సులకీ కలిపి లక్షరూపాయలు ఇచ్చాడు. ఆ బస్సులను ఆనాడే ఆపేసి వుంటే ఈ ప్రమాదం జరిగేది కాదేమో!
“రండి సార్! రండి” అంటూ సూపరెంటెండెంట్ నాయకుడుగారిని ముందుకు తీసుకు వెళ్ళాడు.
అబ్జర్వేషన్ రూమ్ ముందర అందరూ ఆగారు. ఆ గది తలుపు వేసివుంది.
“ఈరూములోనే అమ్మగారూ, బాబూ, పాపా వున్నారు సార్. మన స్పెషలిష్టు డాక్టరుగారు ఆక్సిజన్ ఇచ్చి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు” అన్నాడు అక్కడే నుంచున్న కుర్ర డాక్టర్ నాయకుడుగారికి నమస్కారం పెడుతూ.
“అందరికీ స్పృహ వచ్చిందా? కళ్ళు తెరిచి చూస్తున్నారా?” అడిగారు నాయకుడుగారు.
“…అనుకుంటాను సార్! మన డాక్టర్ నరసింహంగారు లోపలే వున్నారు. అంతా ఆయనే స్వయంగా చూస్తున్నారు” అన్నాడు హాస్పిటల్ సూపరెంటెండెంట్.
“ఎవరు? డాక్టర్ నరసింహం అంటే.. ఆ నల్లటి.. “
“అవును సార్! మన సుబ్బయ్యగారి రెండవ బామ్మరిది కొడుకు…”
నాయకుడిగారి ముఖంలో రంగులు మారాయి. అవును. తనకు బాగానే గుర్తున్నాడు. అతనికి తను అడుగడుగునా సహాయపడ్డాడు. మెరిట్ కాండిడేట్సును కూడా పక్కకి పెట్టి, అతనికి ఎం.బీ.బీ.ఎస్.లో సీటు ఇప్పించాడు. సుబ్బయ్యగారు వచ్చి తన కాళ్ళమీద పడితే, అతనికి మార్కులు వేయించి ఫస్ట్ క్లాసులో పాస్ చేయించాడు. తర్వాత ఈ హాస్పిటల్లో ఉద్యోగం ఇప్పించటమే కాక, ఈమధ్య ప్రమోషన్ కూడా ఇప్పించాడు. ఎదుటివాడి కష్టాలన్నీ తన కష్టాలుగా భావించే తను, ఎవరు ఏ సహాయం అడిగినా కాదనలేడు మరి! అందుకే సుబ్బయ్యగారి కాండిడేటుని ప్రత్యేకమైన శ్రద్ధతో పైకి తీసుకువచ్చాడు. సుబ్బయ్యగారు కూడా తన సహాయాన్ని మరచిపోలేదు. చాల బాగా ముట్టచెప్పి, ఈ జన్మలోనే ఋణ విముక్తి చేసుకున్నాడు. అయితే.. ఇప్పుడు ఆ నరసింహమే తన పెళ్ళాం, పిల్లల్ని ట్రీట్ చేస్తున్నాడన్నమాట. అయ్యో.. అదెలాగ? అతనికి వైద్యం గురించి ఏం తెలుసు? వెంటనే అతన్ని బయటికి పంపించి, ఇంకో మంచి డాక్టర్ని తీసుకురావాలి. అలా అయితేనే తన భార్యా, ముద్దుల పిల్లలూ బ్రతికేది.
నాయకుడుగారు ఎండిపోయిన గొంతు తడి చేసుకున్నాడు.
ఇంతలో అబ్జర్వేషన్ రూము తలుపు తెరుచుకుంది.
డాక్టర్ నరసింహం చెమట తుడుచుకుంటూ బయటికి వచ్చాడు.
“ఏమయింది?” అడిగారు నాయకుడుగారు ఆదుర్దాగా.
డాక్టర్ నరసింహం అటెంషన్లోకి వచ్చి, నిటారుగా నిలబడి, తల వంచుకున్నాడు.

౦ ౦ ౦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked