రచయిత్రి : ఇందిరామూర్తి
ఏమండీ, ఏం? ఏం ఆలోచిస్తున్నారింకా? లేవండి, లేచి బట్టలు మార్చుకొని మీ తమ్ముడింటి కెళ్ళండి. ఆయనో పెద్ద ఉద్యోగస్థుడుగా! ఆమాత్రం సాయం చేయడని, నేననుకోను.
అదికాదు లలితా! నేను పెద్దవాణ్ణి. వాడి అవసరాలకు నేను నిలబడాలి గానీ వాడిముందు చేయిచాపడం న్యాయంకాదు.
అబ్బా! అవన్నీ చింతకాయ సిద్ధాంతాలు. వాటిని పట్టుకు కూర్చుంటే జరిగేదేమీ వుండదు. న్యాయాలు, ధర్మాలు నడిచినన్నాళ్ళే. సోది ఆపి బయలుదేరండి. మీరిట్లా తెమల్చకపోతే అవతల పాడైపోయేది పిల్లాడి జీవితం. ఇదుగో ఒకటే చెప్తున్నా
నా మనసంగీకరించడం లేదే. అమ్మానాన్న లేకున్నా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం అందరం. ఇప్పుడీ అప్పు ప్రస్థాపన తెచ్చి, వాడిచ్చ్జ్హినా నాకు అవమానంగానే ఉంటుంది. చిన్నవాడి దగ్గర అడిగానేనని. లేదన్నాడా, అది మరీ బాధ, మనస్ఫర్థలకు బీజం పడినట్లవుతుందే కుటుంబాల మధ్య ఆలోచించు.
ఆలోచించి చేసేది ఏమీలేదు. ఏమన్నా కానీ, నాకొడుకు అమెరికాకు వెళ్ళవలసిందే. తర్వాత తీర్చేద్దాం. దానం కాదు కదా మనమడిగేది. పిల్లాడు సంపాదించి డాలర్లు పంపితే ఎంతలో తీరుతుంది? ఈ ష్యూరిటీ డబ్బు లేదా, ఏ దొంగతనమో, లంచాలో పుచ్చుకోండి. ఆ డబ్బు నా చేతిలో పోసి జైలుకి వెళ్ళండి, నాకిష్టమే. వాడొచ్చి విడిపిస్తాడు. వాడి బంగారు భవిష్యత్తును మీనమేషాలెంచి పాడుచేయడం నేనొప్పుకోను. సాటి స్నేహితులు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి పార్టీలు చేసుకుంటుంటే మన పిచ్చివెధవ దారీ తెన్నూ కనబడక దిగాలుపడి కూర్చోనున్నాడు. ఈరోజు కష్టపడ్తాం, రేపు వాడున్నాడు. మొదట్నించి మంచిమార్కులు తెచ్చుకుంటూ తెలివిగా పైకొచ్చాడు. నాల్గురోజులు డబ్బు సర్దుబాటేగా! పిల్లాడి కోసం కాకపొతే ఇంకెవరికోసం చేస్తాం.
నిజమేనే. కానీ, పదులు, పాతికలు కాదే. అంత మొత్తం తమ్ముడైనా ఏమని అడగను!
కాఫీ కోసం వంటింట్లో లలితమ్మ …. కాఫీగ్లాసుతో వచ్చి భర్తకిచ్చి పురమాయించింది.
ఇదిగో కాఫీ. తాగి బయలుదేరండి. తప్పదు. ఊ ….
అన్ని ప్రయత్నాలు సాగాయి.అనుకూలించాయి. ఎంత తొందరగా వీలయితే అంతతొందరగా ఇచ్చేయమని, తనకు పిల్లలెక్కివస్తున్నారని, అన్న మీద గౌరవంతో డబ్బిచ్చి గట్తెక్కిచ్చాడు తమ్ముడు. అప్పుడే అమెరికా చేరి మూడు సంవత్సరాలు కావస్తున్నది శ్రీకాంత్ కు.
ఒక శుభోదయాన H-1visaలోని వారంతా వెనక్కి వెళ్ళిపోవలసిరావచ్చు అన్న అనుమానం ఆనోటా ఈనోటా అలజడి రేపింది అమెరికాలో. అందరూ బిక్కమోహాలేశారు. ఏ క్షణం ఏం వింటామోనన్న భయం పట్టుకుంది. సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికి వస్తూ ఇండియన్ స్టోర్ కెళ్ళిన శ్రీకాంత్ కు తన స్నేహితులిద్దరు కనబడి ఇదే విషయం చాలా కంగారుగా, దిగులుగా చర్చించారు.
ఎంతో కష్టపడి, అమ్మానాన్నలు పంపించారురా. ఏందో ఇలా అంటే వాళ్లకి మనమొహమెలా చూపించగలం. ఇలాంటి గడ్డుకాలం వస్తుందనుకోలేదు అని వాపోయారు.
ఇంటికొచ్చిన శ్రీకాంత్ కు ఏ పనీ చేయబుద్ధి కాలేదు అమెరికా అనుకున్న రోజునుండి, అన్యోన్యంగా ఉండే అమ్మానాన్నలు ఎలా తర్జనబర్జన పడ్డారో, ఎన్నిసార్లు ఆత్మచంపుకుని తనకోసం ఎన్ని చేశారో అన్నీ కళ్ళముందుకు రాసాగాయి. మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ నిద్రపట్టక సతమతమౌతున్నాడు. ఏ మూడింటికో కునుకుపట్టింది.
తన బాబాయి ఇంటికొచ్చి, ఏం అన్నయ్యా! కాంత్ ఇంటికొచ్చేశాడటగా. నా సంగతేం చేశావ్. కొంతకొంత ఇచ్చావు సరే, మిగతాది ఎలా ఇస్తావు నాకూ అవసరాలున్నాయి, ఆలోచించు అంటూ నిష్టూరంగా వెళ్ళిపోయాడు.
అమ్మ గుండెలు బాదుకొని ఏడుస్తున్నది. ఎట్లారా శ్రీ … అక్కడే ఏదో ఒకటి చూసుకొని సంపాదించుకొనే వీలులేకుండా పోయింది కదా! అసలే అప్పు చేశానని బిక్కచచ్చి తిరిగే మీనాన్న ఏమైపోతారురా? ఇంట్లో సంతోషం కరువైంది, నాన్న ఎవ్వరితోనూ మాట్లాడడం, తిరగడం మానేశారు. శూన్యంలోకి చూస్తూ ఆలోచనల సుడిగుండంలో వుండిపోయారు. తనకు దిక్కుతోచక వాళ్ళని ఓదార్చడానికి ఏదో చేస్తామన్నా, ఏ ఆధారం దొరకడంలేదు. అమ్మా అంటూ పిలిచేసరికి మెలకువ వచ్చింది. ఇదంతా కల.
అబ్బ, కలే ఇంత దారుణంగా వుంటే నిజంగా వెళ్ళిపోవలసి వస్తే అనేసరికి కాళ్ళు వణకసాగాయి. వెంటనే అమ్మానాన్నలతో మాట్లాడాలనిపించింది. టైము చూశాడు. ఇండియాలో సాయంత్రం చీకటి పడుబోతూ వుంటుంది. అనుకోని ఫోన్ చేశాడు శ్రీకాంత్.
నాన్న ఫోన్ తీసుకున్నాడు.
ఏరా ఎట్లున్నావ్? అప్పుడే లేచేశావా? ఇంకా నాలుగు కూడా కాలేదేమో?
అవును నాన్నా, మెలకువ వచ్చేసింది. మీతో మాట్లాడాలనిపించి చేశా. ఎట్లున్నారు?
ఇదుగో ఇప్పుడే. నేను మీ అమ్మ గుడికి వెళ్ళివస్తున్నామురా. ఏమీ తోచలేదు. గుడికెళ్ళి వచ్చాం.
అమ్మ ఉందా అక్కడ?
ఆ, ఇదుగో ఇస్తున్నా … మాట్లాడు.
ఏమ్మా, ఏమన్నాడు దేవుడు?
ఆయనేమంటాడు? అందరినీ చల్లగా చూసే పనిలో వున్నాడు. నువ్వెట్లున్నావ్? తింటున్నావా? లేకుంటే రాత్రీపగలూ పనేనా. ఏందీ విశేషాలు?
ఏముంది. ఒక చిన్న వార్త. ఇక్కడినుండి చాలామందిని పంపించేస్తారు అంటున్నారు.
నిజం కాదులే ఏదో పుకారు.
పుకారు కాదులే. ఇక్కడ పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం. వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టం. కదు నాన్నా.
నా ఫ్రెండ్స్ అందరూ దిగులుపడి ఉన్నారమ్మా.
నువ్వూ దిగులు పడుతున్నావా? అందుకేనా వేళకాని వేళ లేచి చేశావు.
దిగులే కాదమ్మా. అక్కడికొచ్చి ఏం చెయ్యాలో అని.
ఓరి పిచ్చివాడా! నీకో సంగతి చెప్తా విను. టైం ఉందా? పదినిముషాలు నీకో సంగతి చెప్పాలి. వినగలవా?
ఆ, ఆ, చెప్పమ్మా, చెప్పు వింటా…
నాన్నా, వెళ్ళిపొమ్మంటే బాధ నిజమే. కాదు అని అనడం లేడు. కాని ఎంతైనా అది వాళ్ళ దేశం. వాళ్ళ రూల్సులు, వాళ్ళ వెసులుబాట్లు, వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. అప్పుసొప్పు చేసి అక్కడికి పంపి, మాబిడ్డ విదేశాల్లో ఉన్నాడని సగర్వంగా చెప్పుకునే పెద్దవాళ్ళు ఇప్పుడు ఇండియాలో ప్రతి ఇంట్లో ఉన్నారు. మన ఒక్కరి సమస్యకాదు కదా!సంపాదించి డబ్బు పంపితే గాని అప్పులు తీరని కుటుంబాలు, భారీబాధ్యతలున్న కుటుంబాలు కుదేలయిపోవడం ఖాయం కానీ నేను చెప్పేదొక్కటే … బాగా విను, అర్థం చేసుకో. ఇండియా మునపటిలాగా లేదురా! చాలా మారింది. అన్ని కోణాల్లో సాంకేతికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఒకటేమిటి పది పదిహేను సంవత్సరాల్లో వందేళ్ళ ప్రగతి సాధించింది. మొన్న రాకెట్ లాంచింగ్ వినే ఉంటావుగా! అదొక్కటి చాలదా ఇండియా పొజీషన్ కనుక్కోడానికి. అమెరికాలో ఉన్నది ఇక్కడ లేనిది ఏమీలేదు. ప్రతివారి చేతిలో స్మార్ట్ ఫోను, లాప్ టాప్, ఇటీవల డబ్బులు తగ్గిపోతున్నాయి, అన్నీ కార్దులే. ఇది ప్రగతి కాదా.
అక్కడి IT కంపెనీలన్నీ మనదగ్గరా ఉన్నాయి. ఆ కంపెనీలలో అక్కడికన్నా ఇక్కడే ఎక్కువమంది పనిచేస్తున్నారు. ఆ ఫెసిలిటీస్, ఆ డెవలప్ మెంట్ నీకు తెలియనిది కాదు. ఇక్కడ చాలా ఆపర్చ్యూనిటీస్ వున్నాయి. మీ యువతరం మీ తెలివితో పొరుగుదేశాలను అభివృద్ధి చేసి సెకెండ్ సిటిజన్స్ గా ఉండేకన్నా రండిరా, రండి మీ తెలివితో మీ దేశాన్ని అగ్రస్థానంలో నిలపండి. ఇక్కడ కెరీర్ గ్రోత్ కి అవకాశాలెక్కువ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవరాల్ గా బాగా పెరిగింది. నా భాషలో చెపితే నీకు ధైర్యం రాదనీ ఇంగ్లీషులో చెప్తున్నా …
ఒరేయ్ … మీ అమ్మకు కూడా కంప్యూటర్ తెలుసురా, ఏమనుకున్నావో? మనుషులు వేషభాషల్లో కూడా చాలా మార్పులొచ్చాయి. రోడ్లమీద షార్ట్స్ వేసుకొని తిరిగేవారిని చూశావా ఇంతకుముందు. ఆడపిల్లలు ఫ్యాంట్లు, షర్ట్లు, జుట్టు సన్నగా దువ్వి జడవేయడం చూడాలన్నా కనబడదు. అంతా విరబోసుకోవడమే. మాకు కేరీరే ముఖ్యం, పెండ్లిండ్లు ముఖ్యంకాదు అంటున్నారు నేటి కుర్రకారు.
ఇలా చాలా విషయాల్లో మార్పులొచ్చాయి. ప్రపంచంలో మార్పు సాధారణం అవశ్యం కూడా, లేకపోతే మనం పురాతనంగా వుండి చెకుముకిరాళ్ళతో నిప్పు పుట్టించుకుంటూ ఉండేవాళ్ళం మార్పు అనేది లేకపోతే. ఇవన్నీ ఒకవైపు, ఈ నాణానికి ఇంకో కోణం కూడా ఉందిరా. ఏం నీకు టైం ఉందా వినడానికి. ఏదో చెప్తున్నది అమ్మకేం పని లేదనుకుంటున్నావా?
లేదమ్మా, చెప్పు నాకు చాలా ఆశ్చర్యంగా ఫుంది. నాన్నతో వాదించి ఇక్కడికి పంపిన నువ్వేనా ఇట్లా మాట్లాడడం. మా ఫ్రెండ్స్ తల్లిదండ్రులంతా దిగులుపడ్తున్నారట. నువ్వేమో పొమ్మంటే వచ్చేయమని స్వాగాతిస్తున్నావ్. చెప్పు, చెప్పు, నాకూ వినాలని వుంది. ఆఫీసుకు వెళ్ళడానికి చాలా టైం ఉందిలే.
అది కాదు నాయనా, మనకు లేనిది అక్కడేమీ లేదురా. జన్మభూమిని, కన్నతల్లిని మర్చిపోవడం తప్పని మన శాస్త్రాలు చెప్తాయి. ఏదో అభివృద్ధిలోకి రావాలని అక్కడ జీవితం బాగుంటుందని, విలాసవంతంగా బ్రతకవచ్చని అభిప్రాయంలో అమెరికా అంటే ఎట్లుంటుందో చూడాలని ఉండి వెళ్ళడం సబబే. అదో గొర్రె దాటు. ప్రతివాళ్ళకి అమెరికా వెళ్ళాలనే ఉబలాటం ఉండేది. అక్కడికి పిల్లలను పంపితేగాని పిల్లలపట్ల తమ బాధ్యత సరిగా నిర్వర్తించినట్లుకాదు, అన్నట్లుగా ఉండేది. వాళ్ళు వెళ్ళమన్నది ఇప్పుడు జైలుకు కాదుగా దిగాలుపడకు. మీ జన్మభూమికి వాళ్ళ కారణాలు వాళ్ళ సమస్యలు మనకెందుకుగాని మీకోసం ఎన్ని ప్రాణాలు వేయికండ్లతో ఎదురుచూస్తుంటే పరుగెత్తిరాక, అక్కడేముందని? ఆ సంపాదన ఇప్పుడు ఇక్కడా వుంది. ఆత్మీయతలు మీకోసం ఇక్కడ అల్లాడుతుంటే, మర్యాదపురస్కారంగా పలకరించే పలకరింపులు, ప్లాస్టిక్ నవ్వులకే తృప్తిపడ్తానంటారెందుకు? మనకు భగవంతుడిచ్చిన ఈ జీవితం అయినవారి ఆప్యాయతల మధ్య గడిపితే వున్న తృప్తి ఎక్కడో వేలమైళ్ళ దూరాన ఉంటూ, సినిమా చూసినట్లు స్కైపుల్లో, ఫేస్ బుక్కుల్లో చూసి తృప్తిపడడం ఎంతవరకు సబబు. మన దేశం, నేను పుట్టిన నేల, నావాళ్ళు, వీటిల్లో ఉన్న ఆనందం చెప్తే కాదు అనుభవిస్తే తెలిసేది. అన్ని సైన్సులు, అన్ని అధునాతన రీసెర్చీలన్నీ మన వేదాల్లో ఉన్నవే. ఇటీవల సూర్యుని దగ్గర ఓంకార శబ్దం వినబడుతుందని నాసా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఓంకారం ఎక్కడిది? మన వేదాల్లో, పురాణాల్లో ఎప్పుడో తెలిపిన విషయం. ఎందుకు చెప్తున్నానంటే వెనక్కి రావడానికి దిగులుగా ఉందని నువ్వంటుంటే, ఎందుకు? ఇది ఎడారి కాదు, పుణ్యభూమి. నిన్ను కన్నభూమి అని గుర్తు చేయడానికే.
అవునమ్మా నిజమే. నీ మాటలు వింటూంటే ఇప్పుడే వచ్చేయాలని వుంది. అందరికీ చెప్తా. అమ్మా ఇంకొకటి చెప్పు … దేశం శుభ్రంగా ఉండాలని మన ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టిందట నిజమేనా?
ఆ… నిజమే. శుభ్రత తెలియకకాదు, ఇష్టంలేక కాదు, మనుషులెక్కువ వల్ల కంట్రోల్ చెయ్యడం అసాధ్యమయి. నీకో సామెత గుర్తుందా? “మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన” అని అన్నింటికీ అదేరా సమాధానం. జనాభా చాలావాటికి కారణం. చూడు కొద్దిరోజుల్లో ఇండియా శుభ్రంగా, అందంగా ఎలా తయారవుతుందో.
ఇందాక ఇంకో కోణం అన్నానే అదేందంటే … పిల్లలో అని వారి బాగోగుల కోసం తల్లిదండ్రులు నానాయాతనా పడి విదేశాలకు పంపి చదివించేదాకా విశ్రమించక పంపేస్తున్నారు. కానీ వయసు పైబడ్డకొద్దీ అందివచ్చిన పిల్లలు అందనంత దూరంలో ఉంటే అనాథాశ్రమాలకు వెళ్ళక తప్పడంలేదు. అయినా సంతోషమే. తమ పిల్లలు గొప్ప స్థితిలో ఉన్నారని. కానీ బాబూ! నిజమేమిటంటే ఏ తండ్రీకోడుకైనా బైక్ మీద వెళ్తుంటే, ఆ తండ్రి, కొడుకు భుజం మీద చెయ్యివేసి చెప్పే కబుర్లు, ఆ సీన్ చూడగానే దూరానున్న తమ పిల్లలు గుర్తొచ్చి కండ్లు చెమర్చే తండ్రులు కోకొల్లలు. అలసిపోయి ఆఫీసునుండి ఇంటికొచ్చిన బిడ్డతో అలసిపోయావా బాబూ! అంటూ ప్రక్కన కూర్చుని వీపునిమిరి, అతనికి ఇష్టమైనవి వండిపెట్టి పరమానందం పొందలేకపోతున్నామే, ఆ అదృష్టానికి ఆమడదూరంలో ఉన్నామే అని ఏడవని తల్లిలేదు. అక్కడికి వచ్చి కొత్తదేశంలో, కొత్త భాష, కొత్త సంస్కృతి, కొత్తప్రదేశంలో అడ్జస్టు కాలేక పిల్లలను చూసి తృప్తిపడి వెనుదిరిగే వారు నీకు తెలీదా? ఆ పరిస్థితులకు మీరు మౌనంగా బాధపడడం లేదా? ఎక్కడుండేవారు అక్కడుండాలిరా? ఎన్ని మిస్ అవుతున్నారో చూడు. చదువు, సంపాదన తప్పనిసరి. ఎక్కడికక్కడ సర్దుబాటు అలవాటు చేసుకోవాలి. డాలరు తప్ప ఇంకేమీ లేదక్కడ. మనిషికి కావలసిన తన వారు, ప్రేమాభిమానాలు అన్నీ ఇక్కడే వున్నాయి. ఇంకో తమాషా వుందిరోయ్. అక్కడినుండి నువ్వు ఒక్క డాలరు తెస్తే డెబ్బైరూపాయలు ఇక్కడ. నీ చేతినిండా డబ్బే. అలా ఆలోచించు.
అమ్మా! భలే చెప్పావు. మైనస్ లన్నీ, ప్లస్సులుగా ఎంత బాగా చెప్తున్నావమ్మా అని నవ్వు ఆగకుండా నవ్వుతున్నాడు శ్రీకాంత్.
నవ్వకురా, నిజమా? కాదా? మానవుడి జీవితం అంటే అడ్జస్ట్ మెంట్ అది నేర్చుకోవాలి మీ తరం. ప్రేమలను, ఆత్మీయతలని ఫణంగా పెట్టి సంపాదనే ముఖమనుకొని దూరంగా ఉండటంలో ఎంత ఆర్ద్రత వుందో ఆలోచించండి. మీ తెలివిని మాతృభూమికి ఉపయోగించి నెంబర్ వన్ గా నిలబెట్టండి. సమస్య తీవ్రమై వచ్చేయవలసి వస్తే వరంగా భావించి పరుగుపెట్టండి. ఆత్మీయంగా ఆదరించును అన్ని హంగులతో భరతమాత ఎదిగి ఎదురుచూస్తున్నది మీరాకకు. లేదా సమస్య లేదా! ఇష్టపడి వెళ్ళారు గనుక అక్కడే ఒదిగి పనిచేయండి. ఇంతకన్నా ఎవరు చెప్పినా ఇంతే.
సరేనా! ఎంతకీ నా లెక్చరు పూర్తికాకపోయేసరికి మీ నాన్నగారు టీవీ ముందు సెటిల్ అయిపోయారు. అమెరికా విశేషాల కోసం,
దిగులుమాని ఆలోచించి, అడుగులు వేసి ఆనందంగా ఉండండి. ఇక వుంటాను. నీకు ఆఫీసుకు టైం అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. బై … బై.
ఫోను ఆగింది. ధైర్యం కట్టలు తెంచుకొని మునపటి దిగులును తరిమికోట్టింది. రెట్టించిన ఉత్సాహంతో తన స్నేహితులకందరికీ ఈ ప్రేరణను అందించడానికి త్వరత్వరగా బయలుదేరాడు.