ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి
ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడే వదనం….ప్రశాంతత నిండిన చూపులు….సంభాషణల్లో అలవోకగా అమరి కురిసే చమత్కారాలు ….అమ్మలా ప్రతిఒక్కరితో అతిమృదువుగా పలకరింపులు…..అవును ఆవిడే అబ్బూరి ఛాయాదేవి.
1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు.
ఆరోజుల్నిబట్టి ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పించడం ముఖ్యం కాదు పెళ్ళి తొందరగా చేసెయ్యాలి అన్న పద్ధతి పాటించారు ఆమె తరఫు పెద్దలు.
ప్రసిద్ధ సాహితీవేత్త అబ్బూరి రామకృష్ణరావుగారి కోడలిగా ప్రసిద్ధ రచయిత విమర్శకులు అయిన అబ్బూరి వరద రాజేశ్వరరావుగారి సతీమణిగా సంసారజీవితంలో అడుగు పెట్టారు ఛాయాదేవిగారు.
రాజేశ్వరరావుగారితో సాహితీచర్చలు జరిపేందుకు ప్రముఖ కవులు రచయితలు వారి ఇంటికి వచ్చేవారుట. స్వతహాగా ఆమెకు కూడా సాహిత్యం పట్ల చాలా ఆసక్తి ఉండడం వలన ఆమెకూడా ఆచర్చల్లో పాల్గొనేవారుట. ఆవిధంగా ప్రముఖ కవులు రచయితలు తనకు పరిచయమయ్యారని స్వయంగా ఆవిడ మాటల్లో నాతో చెప్పారు.
1953 లో నిజాంకళాశాలలో ఎం.ఏ. డిగ్రీ పొందిన ఛాయాదేవిగారు కళాశాల మేగజైన్లో మొట్టమొదటి కధ రాశారు.కధ పేరు అనుభూతి. పురుషాధిక్యత వలన స్త్రీలు పడే కష్టనష్టాల గురించి అనేక కధలు రాసిన ఛాయాదేవిగారు స్ర్తీవాద రచయిత్రిగా మంచి పేరు పొందారు. పెంపకం విషయంలో ఆడపిల్లలకూ మగపిల్లలకూ కన్నవారు భేదభావం చూపిస్తున్నారని బాధపడేవారు ఆమె. వ్యక్తిగతంగా ఎదగనివ్వకుండా ఆడపిల్లల్నిబోన్సాయ్ చెట్టులా ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారనే అంశంపై ఛాయాదేవిగారు రాసిన బోన్సాయ్ బతుకులు కధ సాహిత్య ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయే కధ. 2000 సం.లో ఏ.పీ. ప్రభుత్వం మరియు కర్నాటక ప్రభుత్వం వారు పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చుకున్నారు. ఎంతో అభినందించదగిన విషయం ఇది.
ప్రపంచదేశాల బాలబాలికల కధలు అనువాదం చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు ఆమె. 1991 లో అబ్బూరి ఛాయదేవి కధలు , 2002లో తనమార్గం కధల సంపుటి ,మృత్యుంజయ రచనలు పాఠకుల మన్ననలు పొందాయి. తనమార్గం కధాసంపుటికి సాహిత్య్డ అకాడమీ పురస్కారం అందుకున్నారు ఛాయాదేవిగారు. గొప్పలకోసం కాదుగానీ ఇక్కడొక చిన్నవిషయం నేను చెప్పాలి. “ నాపుస్తకం తనమార్గం కధా సంపుటిని వేదికమీద నువ్వే సమీక్ష చెయ్యాలి జానకీ” అంటూ కరోజు ఫోన్ చేశారు నాకు. సభ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందన్నది వివరాలు చెప్పారు. ఆ వెంటనే పుస్తకాన్ని ఒకరి చేత మాఇం టికి పంపించారు. ఆరోజు వేదికపై నా సమీక్ష ఆవిడకు చాలా నచ్చిందని మనస్ఫూర్తిగా చెప్పారు. నేనెప్పటికీ మర్చిపోలేను ఆవిడ ప్రశంసని. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవారు. వారి ఇంటికి రమ్మని పిలుస్తుండేవారు. వెళ్ళేదాన్ని. పిల్లి పిల్లలు ముద్దుముద్దుగా తిరుగుతుండేవి ఇంట్లో. రకరకాల బొమ్మలు తయారు చేసేవారు. వృధాగా పారేసే వస్తువులంటూ ఆవిడ దృష్టిలో లేవు. వాటిల్తో అందమైన బొమ్మలు చేసి అలంకరించేవారు. అడిగినవారికి సంతోషంగా నేర్పించేవారు.
సీ.ఆర్.ఫౌండేషన్ ఆశ్రమంలో చేరబోయేముందు ఆసంగతి కూడా ఫోన్ చేసి చెప్పి చాలా సేపు మాట్లాడారు. వీలు కుదిరితే ఎప్పుడైనా వస్తుండు జానకీ అన్నారు. మా ఇద్దరికీ సాహిత్య బంధుత్వమే కాక నర్సాపురం అనుబంధం కూడా ఉంది. నువ్వెప్పుడైనా నర్సాపురం వెళ్తే మాఅక్కయ్యని చూసి వస్తుండు జానకీ. నేను ప్రయాణం చెయ్యలేను. నువ్వు చూసి వచ్చి చెప్తే చాలు అనేవారు. మాట ఎంత మృదువో ఆవిడ మనసూ అంత మదువైనది.
తన 86 వ ఏట 28-6-2019 వతేదీన భౌతికంగా మనలకు దూరమైనా మన మనసుల్లోనూ సాహితీలోకంలోనూ అబ్బూరి ఛాయాదేవిగారు చిరస్థాయిగా నిలిచే ఉంటారన్నది వాస్తవం. ఆవిడకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.
రచయిత్రి
తమిరిశ జానకి
హైదరాబాద్