(పద్య ఖండిక)
స్వాధీనభర్తృక
……………….
మత్తేభము
పతియే దైవమటంచునెంచివ్రతమున్ భక్తిన్ ఘటించున్ పతి
వ్రతగెల్వంగఁవశీకృతుండగు సతీస్వాధీనుడౌభర్తయున్
స్తుతి జేతున్భవదీయకౌశలముఁ విధ్యుక్తంబులౌ నీహొయల్
ద్యుతిసౌందర్యవిలాసముల్ కళలు సత్యోత్కృష్టసౌభాగ్యముల్
వాసక సజ్జిక
……………
మత్తేభము
పడకన్ పద్మదళమ్ములన్ బరచి పుష్పంబుంచి ద్వారంబులన్
పడకింటన్ రమణీలలామకదిలెన్ప్రాణేశునిన్ దల్చి వా
ల్జడకున్ పూవులగూర్చివేచె హృదయోల్లాసంబులన్ గూర్చగా
వడిచేరన్ జనుదెంచు ప్రేమికునికై స్వాలంకృతస్త్రీత్వమై
విరహోత్కంఠిక
…,.,………,.,,
మత్తేభము
క్షణముల్ దీర్ఘములై గతింపగను కక్షంబూనెనేమో యనన్
గణుతింపన్ వ్యథలుండుకోటి విరహోక్కంఠీమనోగీతికన్
తృణమేతానన విస్మరించుటనసంతృప్తిన్ యథాతప్తతన్
వణకంగన్ మృదులాధరద్వయముతాన్ వాపోవుచాంచల్యయై!
విప్రలబ్ద
…………
మత్తేభము
కినుకన్ జెందెను రాత్రివేచియటుసంకేతస్థలిన్ వీడెఁగా
మినివంచించెవిటుండిసీ!రతిసుఖమ్మీయంగనమ్మించియం
చును సర్వాభరణమ్ములన్ విసరుచున్ శోకంబునన్ మున్గుచున్
కనిపించెన్ క్షతనాగమట్లు శయనాగారంబుఁదాన్ జేరుచున్
ఖండిత
……….
మత్తేభము:
స్తనయోనీజఘనోరుసంపదల సౌందర్యంబులన్ మిన్నయౌ
తన మాటెట్లు ప్రియుండు మీరెననినిద్రన్ మాని యోచించుచున్
కనులన్ రక్తపుచారికల్ మెరయ రక్తావృత్తరమ్యాస్యయై
కననన్యాంగనసౌఖ్యలీనుడగుటన్ ఖండించి క్రుంగెన్ మదిన్
కలహాంతరిత
____________
మత్తేభము
కినుకన్ ద్రోసితి
నిందలాడితిఁవిరక్తిన్ ద్వారముల్ మూసితిన్
నను మన్నించునొలేదొకో విసిగి సన్యాసంబు చేపట్టునో
మనసల్లాడగమాయమోహినుల
కామంబందిశుష్కించునో
యనుచున్ వేదన నందునాయికను డాయన్ మేలు సత్ప్రేమికుల్
ప్రోషిత భర్తృక
……………….
మత్తేభము
చెలికాడింటికిఁ జేరలేదనుచు వచ్చెన్ చైత్రమంచున్ గనన్
తలుపుల్ దీయుచుదాటుచున్ గడపఁపాదధ్వానమూహించుచున్
చెలికత్తెల్ మృదుభాషణంబొసగఁగించిచ్ఛాంతి కల్పింపగాన్
విలపించున్ హృదివిచ్చునోయనగ నుద్వేగంబుఁదానందుచున్
అభిసారిక
………….
మత్తేభము
కదలన్ బాములుఁతేళ్ళు మార్గమున
కుక్కల్ నక్కలుంగూసినన్
పొదలున్ దెయ్యములట్లుతోచినను మబ్బుల్ క్రమ్మినన్ మ్రోగినన్
మదిపొంగన్ప్రియసంగమాతురతఁకామాధీనతత్త్వంబునన్
కదలున్ తానభిసారికై వనిత సాక్షాన్మన్మథార్ధాంగియై
రచన:
గాదిరాజు మధుసూదన రాజు