-ఆర్. శర్మ దంతుర్తి
నలభై ఐదేళ్ళ సుబ్బారావు ఇంట్లో పెళ్ళాంతో గొడవపడి పార్కులోకి వచ్చాడు ప్రశాంతంగా కూర్చోవడానికి. దూరంగా ఎవరికీ కనబడకుండా కూర్చోవడంలో ఉన్న ఆనందం వేరు. తెలుసున్నవాళ్ళెవరైనా కనబడితే తాను ఒక్కడూ పార్కుకి వచ్చాడంటే ఇంట్లో గొడవ జరిగి ఉంటుందని కనిపెట్టగలిగే ప్రబుధ్ధులు బోల్డుమంది ఉండడం ఒకటైతే, అలా కనిపెట్టకపోయినా ఏవో కబుర్లలో పెట్టి చంపుతారు. కదలకుండా చీకటిపడే దాకా మహా సీరియస్సుగా ఆలోచించేడు సుబ్బారావు ఏం చేయాలో. మర్నాడు పొద్దున్నే ఊరికి వంద మైళ్ళ దూరంగా ఉన్న అడవుల్లో ఈ మధ్యనే తెరిచిన మోడర్న్ యోగా సెంటర్ లో తేలాడు – ఆఫీసుకు శెలవు పెట్టి మరీను. ఈ యోగా సెంటర్లో జేరితే ఆరునెలల్లో దేవుడు కనబడ్డం గేరంటీ. మొదటి అయిదు నెలలూ సెంటర్లో ఉండక్కర్లేదు కానీ ఆరోనెలలో దేవుడు కనబడ్డానికి ముప్పై రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రాముకి తప్పనిసరిగా ఒక్కరే రావాలి, పెళ్ళాం పిల్లలూ, అందర్నీ వెంటబెట్టుకుని వస్తానంటే కుదర్దు.
యోగాలో చేరిన సుబ్బారావు ఆ పైవారంనుంచీ ఇంట్లోనే సాధన మొదలుపెట్టాడు. మొదటగా నేర్చుకున్నది తన నోరు అదుపులో పెట్టుకోవడం. అమ్మగారు ఏమన్నా, మాట్లాడరాదు. మొదటిరోజుల్లో కాస్త కష్టమైనా మూడోనెలకి బాగానే వంటబట్టింది. ‘ఎవరెలా పోతేనేం’ అనుకుంటూ సుబ్బారావు సాధన చేస్తూ ఆరోనెలలోకి ప్రవేశించాక ఆఫీసులో ఏవో వంకలు చూపెట్టి, డాక్టర్ సర్టిఫికెట్ పెట్టీ వంట్లో బాగోలేదనీ, మరోటనీ చెప్పి మొత్తానికి ఒక నెల శెలవు సంపాదించాడు. ఈ అయిదునెలల్లో తనతో మాట్లాడ్డం తగ్గించాడు కనక అమ్మగారు కూడా నోరు అదుపులో పెట్టుకుంది. సింపుల్ గా తన బట్టలూ అవీ సర్దుకుని రేపు బయల్దేరుతాడనగా చెప్పాడు భార్యతో – ఇలా యోగాసెంటర్ లో ఒక నాలుగు వారాలు ఉండడానికి వెళ్తున్నాడని. ఆవిడేం మాట్లాళ్ళేదు.
ఆరోనెలలో మూడువారాలు మామూలుగా గడిచిపోయాక యోగా సెంటర్ ఆఫీసులో చెప్పారు వచ్చేవారంలోనే దేవుడు కనబడేది – ఏమి అడగాలో జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే మీరడిగేడి అనుగ్రహింపబడవచ్చు. అది మంచిదో కాదో మన మొహాలకి తెలియదు. ‘తాను ఏది ముట్టుకున్నా బంగారం అయిపోవా’లనే మిడాస్ టచ్ లాంటిది, అడిగితే ఏమౌతుందో ముందే తెలుసుకుని మరీ అడగాలి, లేకపోతే పీకలమీదకి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
జీవితంమీద విరక్తితో యోగా సెంటర్లో చేరిన సుబ్బారావు తనకి ఏం కావాలో ఆరునెలల కిందటే నిర్ణయించుకున్నాడు కనక ఈ జాగ్రత్త సంగతి పట్టించుకోలేదు.
ఆరోవారం మధ్యలో ఓ మధ్యాహ్నం సుబ్బారావు ధ్యానం చేస్తుంటే నిజంగానే విష్ణుమూర్తి కనిపించాడు నవ్వుతూ. ఆ తర్వాత “ఏమి నీ కోరిక భక్తా?” అని కావాల్సింది కోరుకోమన్నట్టూ అడిగాడు కూడా.
“నేను చచ్చిపోవాలి, ఈ సంసారం ఈవిడతో ఈదడం అసంభవంలా కనిపిస్తోంది,” చెప్పాడు సుబ్బారావు.
“నువ్వు చచ్చిపోతే ఏం సాధిస్తావు?” శ్రీహరి అడిగాడు.
“మొదటగా ఈవిడ గోల వదుల్తుంది. మరో జన్మ ఎత్తితే అందులోనైనా నేను కాలేజీలో ప్రేమించిన అమ్మాయి నాకు భార్యగా వస్తుంది.”
“ఎవరా అమ్మాయి? ఏమా కధ?”
“నేను కాలేజీలో ఉన్నప్పుడు సుస్మిత అనే అమ్మాయిని ప్రేమించాను, ఆవిడకి చెప్పడానికి అప్పటికి నాకు ఉద్యోగంలేక వాళ్ల నాన్న మొహం చూసే ధైర్యం చాలలేదు. నాకు ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక వెళ్ళి అడుగుదామనుకుంటే అప్పటికే ఆవిడకు పెళ్ళైపోయి పిల్లలున్నారు.”
“సుస్మితతో పెళ్ళైతే ఆవిడ సాధించదని ఏవిటి నమ్మకం?”
“ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాళ్ళు సాధించుకుంటారా స్వామీ?”
“ఎందుకు సాధించుకోరు? మూడేళ్ళబట్టీ డేటింగ్ చేసి ‘నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వుండకూడదూ’ అని పాటలు పాడుకున్నవాళ్ళు పెళ్ళి అయ్యాక ఐదేళ్లలో విడిపోవడం చూస్తున్నావు కదా?”
“ప్రేమించినావిడతో సాధింపు తక్కువ అనీ…” నాన్చేడు సుబ్బారావు.
“అవునా మరి సుస్మితని చేసుకుంటే ఇంకేమిటి లాభం?”
“ఒకరి కొకరు నచ్చుతాం కనక రోజూ మాట్లాడుకునేవి స్వీట్ నథింగ్సే. బాగుంటుంది కదా?”
“మొదట్లో ఇప్పుడున్న భార్యతో స్వీట్ నథింగ్సే మాట్లాడినట్టున్నావు, అవే ఇప్పుడు మళ్ళీ మాట్లాడొచ్చుగా? చచ్చిపోవడం, మరో జన్మ ఎత్తడం అన్నీ కష్టం కదా?”
“ఈవిడతో స్వీట్ నథింగ్సా? భలే చెప్పావులే. ఇరవై ఏళ్ళు రోజూ చూసి చూసి అసలు ఈవిడకి ఇప్పుడు నా మొహం కేసి చూడ్డానికే పరమ అసహ్యం. నేను వంటింట్లోకి వస్తే ఏదో పనున్నట్టూ వేరే గదిలోకి పోవడం. లేకపోతే ఏదో పనిగట్టుకుని వచ్చి ఫలానా ఫలానా సంవత్సరంలో జూలై ఆరోతేదీ సాయంత్రం నన్ను నువ్వు సినిమాకి తీసుకెళ్తానన్నావు, నీ మొహానికి సినిమా ఒకటా, అని మొదలుపెట్టి నేను చచ్చినా సరే అలా వాగుతూనే ఉంటుంది….”
“మరి ప్రామిస్ చేసిన ఆ రోజున సినిమాకి ఎందుకు తీసుకెళ్ళలేదు ఆవిణ్ణి?”
“టివిలో అదిరిపోయే ఐపిఎల్ క్రికెట్ మాచ్ లు వస్తుంటే, ఎవరికండీ ఆ చెత్తంతా గుర్తుపెట్టుకునే సమయం తీరికా, ఓపికాను? ఏదో మాటవరసకి అంటాం, వెళ్దాంలే అని. అది పట్టుకుని చంపుతే ఎలా? వీలున్నప్పుడు వెళ్తాం. సినిమా చూడకపోతే పుట్టి మునిగిపోతుందా ఏవిటి?”
“ఐపిఎల్ క్రికెట్ చూడకపోతే పుట్టి మునిగిపోతుందా ఏవిటి?”
“భలేవారే, లైవ్ క్రికెట్ చూడ్డం వేరూ, తర్వాత ఎప్పుడో చివరకి ఏమౌతుందో తెల్సిపోయిన మాచ్ చూడ్డం వేరూ. అయినా చివరకేమౌతుందో సులభంగా తెలిసే తెలుగు సినిమాకీ లైవ్ ఐపిఎల్ క్రికెట్ మేచ్ కి ఎక్కడి పోలిక పెట్టారు?”
“పోనీ తర్వాత తీసుకెళ్ళావా సినిమాకి?”
“మూడునెలలు పోయాక వెళ్ళాం కదా?”
“అయితే ఏవిటీ గొడవ ఇప్పుడు?”
“తన స్నేహితులందరూ మొదటివారంలో చూస్సేర్ట. తన మొగుడు – అంటే నేను, మాత్రం టికెట్ ధరలు తగ్గేదాకా మూణ్ణెల్లు ఆగాడు. ఇంత పిసినారికి పెళ్ళెందుకో అని పీకుతోంది. అలా ఆగిందా పోనీ, మరోసారి కొత్త సినిమా వచ్చినప్పుడల్లా ఇదే సోది. అదీ పోనీయ్ అనుకుంటే స్నేహితులు అందరితో ఫోనుమీద చెప్పుకుని ఏడుపు. వాళ్లందరూ నాకేసి అదోలా చూడ్డం కనిపించినప్పుడల్లా, ఏం చెప్పమంటారు జీవితం?”
“ఈ సాధింపు తగ్గడానికేదో చేయొచ్చులేగానీ ఇంకేమిటి గొడవలు?”
“ఈవిడ చేసే ఉద్యోగం వల్ల తీరికలేదుట, ఇంట్లో వంట చేయదు. ఎప్పుడైనా చేస్తే రాత్రి ఎనిమిదింటికి వంట మొదలుపెడుతుంది. అదయ్యేసరికి ఏ పదో, పదకొండో. వంట రాదూ నేర్చుకోదూ. ప్రతీదాంట్లో ఉప్పు ఎక్కువ. కారం ఎక్కువ. అసలు వంట చేయడం కూడా ఓ చేత్తో ఫోన్ పట్టుకుని దానిమీద మాట్లాడుతూ రెండో చేత్తో ఏదో చేయడం.”
“నువ్వే చేయొచ్చుగా వంట?”
“చిత్తం ఈవిడ సంగతి గత మూడేళ్ళుగా చూసాక ఇప్పుడు వంట చేసేది నేనేనండి. ఈవిడ నిమిత్త మాత్రురాలు. గత అయిదు నెలలుగా మాత్రం నేను యోగాలో జేరాను కనక ఆవిడ గరిటె కదుపుతోంది.”
“పాపం ఆవిడ ఉద్యోగం చేసి సంపాదిస్తోంది కదయ్యా, ఆ మాత్రం ఊరుకోలేవూ?”
“మరి నా సంగతో, నేను చేయట్లేదా ఉద్యోగం?”
“నువ్వు మంచివాడివి. బాగా సహాయం చేస్తావని కాబోలు ఆవిడ ఉద్దేశ్యం.”
“అనక అనక నువ్వూ అదే మాట అన్నావూ? ఆవిడ జీతంలో పైసా ఖర్చుకు ఇవ్వదు కూడా.”
“ఎంత దౌర్భాగ్యం, స్త్రీ ధనం ఆశించవచ్చా అలాగ? తప్పు కాదూ? నేను కృష్ణుడిగా పుట్టాక సత్యభామ నాన్న సత్రాజిత్తు నాకు శ్యమంతక మణి – రోజుకి ఇన్ని బారువుల బంగారం ఇచ్చేది, ఇస్తానన్నాడు. స్త్రీధనం పుచ్చుకోకూడదని వద్దనేసాను తెలుసా?”
“త్రేతాయుగంలో రాముళ్ళాగ, ద్వాపరయుగంలో కృష్ణుల్లాగా బతకాలంటావా ఈ కలికాలంలో? ఇంత అమాయకుడివేంటి స్వామీ, ఓ సారి షాపుల్లోకి వెళ్ళి చూడు ధరవరలు ఎలా మండుతున్నాయో? ఇంటద్దె, పాలూ, నీళ్ళూ, దగ్గిర్నుంచి లెక్కపెట్టుకుంటే నెలాఖరికి మిగిలేది చేతికి చిప్పే. ఇద్దరూ ఉద్యోగాలు చేయకపోతే ఈ కలికాలంలో రెండుపూట్లా చేయి నోట్లోకి వెళ్లదు పల్లెటూర్లో కూడా. ఇంక హైద్రాబాద్ లాంటీ సిటీ సంగతి చెప్పేదేవుంది?”
“మరో జన్మ ఎత్తితే కూడా ఇవన్నీ తప్పకపోవచ్చు కదా? ఇక్కడే ఇవన్నీ సర్దుకునే మార్గం ఉంటే?”
“ఇన్నేళ్ళు ఈవిడతో సంసారం చేసాక అన్ని టెక్నిక్కులూ ప్రయోగించి నీ కోసం తపం చేస్తే ఇదా నువ్వు ఇచ్చే సలహా?”
“చూడు సుబ్బారావు, నువ్వు చచ్చిపోతే ఇంకో జన్మ ఎత్తి సుస్మితని చేసుకోవాలంటే ఆవిడ కూడా చచ్చిపోయి మరో జన్మ ఎత్తాలా వద్దా?”
“అవును ఎత్తాలి.”
“మరి ఆవిడకి చావాలని లేదే? ఆవిడ మొగుణ్ణి సాధిస్తూ సంతోషంగానే ఉంది. ఇప్పుడే ఆవిడ మొగుణ్ణి చూసి వస్తున్నాను. సుస్మిత సాధిస్తున్నా ఆయనకీ చావాలని లేదు. ఆయన సుస్మిత కోరికలు తీర్చడానికేదో అడిగాడు. ఆయన బాధ్యతగా ఆవిడనీ, పిల్లలని చూసుకోవాలి. మరేం చేద్దాం?”
“మీరు చెప్పిన సర్దుకునే మార్గం ఏవిటో చెప్పండి ఆలోచిస్తా.”
“ఎప్పుడైనా మీ ఆవిడ వంట బాగోలేకపోతే నువ్వేమంటావు?”
“ఉప్పెక్కువైతే అదీ, కారం తక్కువైతే అదీ, చెప్తాను. ఎలా చేయొచ్చో మరోసారి.”
“అదే అసలు గొడవ. ‘వంట అద్భుతంగా ఉందోయ్ కానీ ఈ సారి పప్పులో ఉప్పేసేటపుడు నన్ను పిలు. నేను చూస్తా’ అని చూడు.”
“మరి సినిమా సంగతో?”
“అదీ అంతే, ‘అసలు టికెట్లు కొన్నాను. కానీ మా బాసు పని రాక్షసుడని తెల్సు కదా, వాడు ఆఖరి నిముషంలో పని చెప్పాడు. ఈ టికెట్లు మారుద్దామంటే మరో మూణ్ణెల్లకి కానీ దొరకలేదు, సారీ హనీ’ అనేయడమే. ఈ హనీ అనే పదాన్ని లవ్ అనీ, లవ్లీ పీచ్ అనీ డార్లింగ్ అనీ అనేక రకాలుగా మారుస్తూ ఉండు.”
“కానీ మా బాసు అలాటి వాడు కాదే?”
“ఓరి సుబ్బారావు, ఆ మాత్రం లౌక్యం గా మాట్లాడలేవా?”
“మరి తనకి కొనని చీరల సంగతీ, తన జీతం సంగతో?”
“లౌక్యం మిస్టర్ సుబ్బారావు, లౌక్యం అలవర్చుకోవాలి. చీర జీతం వచ్చిననాడే నువ్వు కొందామనుకుని షాపుకి వెళ్ళావు కానీ ఆవిణ్ణి కూడా తీసుకెళ్తే సంతోషపడుతుందని ఆఖరి క్షణంలో గుర్తొచ్చి వెనక్కొచ్చేసావు. కానీ ఇంటికొచ్చేసరికి కట్టాల్సిన బిల్లులన్నీ సిధ్ధంగా ఉన్నాయ్. అవన్నీ కడితే పైస మిగల్దు జీతంలో. ఈ నెల అమ్మగారు గానీ ఓ పదివేలు సర్దితే త్వరలో ఇచ్చేస్తావు. చీర కొన్నాక ఆట్నుంచటే హొటల్లో బోయనాలు అయ్యాక అమ్మగారు నీ కేసి ఎంత ప్రేమగా చూస్తారో తెల్సుకదా?”
“ఇలా అబధ్ధాలు ఆడమంటావా అయితే అడుగడుగునా?”
“అబ్బెబ్బే అబద్ధం వేరు. లౌక్యం వేరు. “అశ్వథ్థామ హతః అని మాత్రమే అనడం అబద్ధం. కాసేపు ఆగి కుంజరః” అని కలపడం లౌక్యం. నువ్వు నేను చెప్పినట్టూ చేస్తానంటే ఈ జీవితం హాయిగా ఉంటుంది. నిన్ను చంపడం అంత పెద్ద పనికాదు కానీ నీ మూలాన సుస్మితని చంపడం వాళ్ల సంసారం పాడు చేయడం కుదర్దు. అదీగాక నిన్ను ఆ జన్మలో సుస్మిత ప్రేమిస్తుందో, దోమిస్తుందో తెలియదు. ఆవిడ నిన్ను ప్రేమించేలా చేయడం మరో కష్టం. ఇంత చేసినా సుస్మిత నిన్ను సాధించదని ఏమీ గారంటీ లేదు.”
“మా ఆవిడ నన్ను సాధించకుండా చేయొచ్చుకదా స్వామీ? అది సులువేమో?”
“అబ్బే, అలా ఆడవారి జన్మహక్కు పీకమనడం అస్సలు కుదరదు. దానివల్ల కోర్ట్ లో కేసులు పడతాయ్. వాటిల్లోంచి బయటపడ్డం అంటే ఇంకో అవతారం ఎత్తడమే”
“కోర్ట్ కేసులేంటి స్వామీ?”
“ఖర్మ! ఆ మాత్రం తెలియదా, కేరళాలో అయ్యప్పని దర్శించుకోవడానికి మగాళ్లకి మాత్రమే హక్కు అని రూల్సూ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు మీకు మీరే. ఆ రూల్ పెట్టుకునేటపుడు పోనీ ఆ అయ్యప్పని అడిగారా అంటే దానికెవరి దగ్గిరా సమాధానంలేదు. ఇప్పుడేమో ఆడవారి మనోభావాలు దెబ్బతింటున్నాయని కోర్ట్ లో కేసులేసి తిరగడం చూసావా?”
“నిజమే అయితే ఇప్పుడేం చేయమంటావ్?”
“కర్మ అనుభవించడమే. నేను చెప్పినట్టూ చేస్తానంటే కర్మ ఫలితం తట్టుకోవచ్చుగానీ కర్మ తప్పించమంటే కుదర్దు.”
“సరే శెలవీయండి.”
“వంట మెచ్చుకుంటూ, ‘పప్పు బాగుంది, కూర కూడా అద్భుతం కానీ దేరీజ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్ మెంట్ ఈ సారి నుంచి నన్ను పిలు వంట చేసేటప్పుడు, నేను కూడా ఓ చేయి వేస్తూ ఉంటా’ అంటూ ఉండు. చీరల సంగతి చెప్పానుగా? ఆవిడ జీతం మేనేజ్ చేయడానికి నీకు జీతం వచ్చిన రోజుకే నువ్వు కట్టవల్సిన బిల్లులన్నీ ఇంటికి వచ్చేలా నేను చూస్తా. ఇది సులభం. ఇంతకీ…”
“దీనికెంతకాలం పడుతుందో? ఏదో చెప్పబోతూ ఆగినట్టున్నారు, కానివ్వండి.”
“దేనికైనా సమయం పడుతుంది సుబ్బారావు. నువ్వు చావాలన్నా మళ్ళీ పుట్టి సుస్మితని చేసుకోవాలన్నా సమయం పట్టదూ? వాటి అన్నింటికంటే ఇది సులువు. ఇంతకీ నేను చెప్పినది పూర్తిగా అర్ధమైందా?”
“ఆ అర్ధమైంది, ఆవిడ చేసే ప్రతీపనికీ తందాన తాన అనడం. అంతేనా?” సుబ్బారావు నిష్టూరమాడేడు.
“రామాయణం అంతా విని రాముడికి సీత ఏమౌతుంది అని అడిగాట్ట వెనకటికి ఎవరో. ఇదా నీకు అర్ధమైంది నేను ఇంత సేపు మాట్లాడాక? కాదు సుబ్బారావు, ప్రపంచం నీకోసం ఎన్నడూ మారదు. మారాల్సింది నువ్వే” చిరునవ్వుతో విష్ణుమూర్తి మాయమైపోయేడు సుబ్బరావు నోరువెళ్ళబెట్టుకుని చూస్తూండగా.