చట్టాలకు పదునే కాదు .. కుటుంబాల నుండీ కూడా నైతికతలు పెంచాలి !!
అమరనాథ్ .జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257
మానవ నాగరిక చరిత్రలో “స్త్రీ”కున్న ప్రాశస్త్యం, పవిత్రత పూజా దేవతలుగా పూజించబడే విధానాలు మన సాంప్రదాయాల్లో సంస్కృతిలో భాగమనే విషయం అలాగే భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల్లో “స్త్రీ”ని దేవతామూర్తిగా కొలవబడటం, పూజించబడటం మన ముందున్న సజీవ వాస్తవాలే అయినా కూడా ద్వంద ప్రమాణాలతో “మహిళ” పైనే ఈ దారుణాలు నిత్యకృత్యంగాఎందుకు జరుగుతున్నాయి? శారీకంగా మగవాడు బలవంతుడైన కూడా మహిళే మానసికంగా బలవంతురాలనే ఒక సామాజిక ‘సత్యం’ తెలిసినా కూడా ఇటువంటి ఒత్తిళ్లకు, వివక్షతలకు, అవమానాలకు మరియు అత్యాచారాలకు ఎన్నడూ లేని విధంగా అత్యంత క్రూరంగా ఆడదే ఎందుకు గురి కావాల్సి వస్తుందనేదే నేడు కొన్ని కోట్ల కొట్ల మనస్సులను తొలిచి వేస్తున్న ప్రశ్న!
సమాజంలో తరాలు మారుతున్నా తరగని పురుషాధిక్య భావజాలాలు,కుటుంబ స్థాయిల్లో చిన్నవయసు నుండే ఆడపిల్లలు కంటే మగపిల్లలే ఎక్కువ అనే విచక్షణా విధానాలు కూడా మహిళల ఫై అణచివేతలకు, అఘాయిత్యాలకు కారణాలుగా ఉంటున్నాయి. అదే సందర్భంలో ఇప్పటికీ మగపిల్ల లే “ పున్నామ నరకాన్ని” తప్పిస్తారానే విశ్వాసాలు ఇటు చదువుకున్న వారిలో అటు చదువు లేని వారిలో బలంగా నాటుకోవటం అలాగే ఆడది విలాసాలకో, ఖుషిలకో, పనికి వచ్చే ఒక ప్రాణమున్న ఒక ఆట బొమ్మగా బుల్లి తెరలు పెద్ద తెరలలో చిత్రీకరణలు మహిళలపై దాష్టికాలు పెరగటానికి కారణాలవుతున్నాయి.
ముందుగా మహిళలను కేవలం లైంగిక వస్తువుగా చూసే తప్పుడు అభిప్రాయాలు పోవాలి . మీడియాల్లో, సినిమాలలో కూడా ఇటువంటి కుసంస్కార ప్రవుత్తిని ప్రోది చేసే కార్యక్రమాలకు అడ్డుకట్ట పడాలి . మూలాల నుంచేమార్పు జరగక పోతే నైతికమైన ఆరోగ్య పరిస్థితులు సమాజంలో కనుమరుగై పోతాయి. ఇప్పటికైనా మగపిల్ల తల్లితండ్రులు అప్రమత్తంగా వ్యవహరించి తమ పిల్లల్ని మంచి వాతావరణంలో పెరిగేలా చూసుకోవాలి . బాధ్యతతో జీవిత గమ్యానికి తొలి పాఠశాల కుటుంబమే అలాగే అలాగే తల్లితండ్రులే ఆదిగురువులు .
మానసికంగా “స్త్రీ” పట్ల ఏర్పడిన భావజాలాలలో మార్పులు రానంతవరకు చట్టాల పదును పెరిగినా కూడా మహిళలపై అత్యాచారాలు ,అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం అనేది కష్టసాధ్యమే! అందుకే చట్టాలతో పాటుగా కుటుంబ వ్యవస్థలో కూడా నైతిక విలువల పెరగవలసిన ఆవశ్యకత లు నేడు అత్యవసరమైనాయి.ముఖ్యంగా చిన్నతనం నుండే కుటుంబపరంగా నైతికవిలువల అవగాహన పెరగకపోతే అటువంటి వాతావరణలో పెరుగుతున్న మగపిల్లలు సమాజంలో మహిళలపై అఘాయిత్యాలకు,అత్యాచారాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే సందర్భంలో టీనేజ్ వయస్సులోనే “స్త్రీల” పట్ల గౌరవ పూర్వకంగా వ్యవహరించ వలసిన తీరుతెన్నుల మార్గదర్శకాలను చేసే పరిస్థితులల్లో విద్యావ్యవస్థ లేకపోవడం అనేది కూడా యువత అపసవ్య ఆలోచనలతో తప్పటడుగులు వేసే స్వభావానికి తద్వారా తొందరగా నేర ప్రవుత్తి లోకి జారే పరిస్థితులకు దోహద పడుతున్నాయి.
ముఖ్యంగా ఆర్ధిక అవసరాల కోసం దేశమైన విదేశమైన ఇంటికి సంబంధించిన భార్యాభర్తలు పరుగులు తీసే ఈనాటి పరిస్థితులలో పిల్లల ఆలనా పాలనల విషయంలో కొంత దూరం పెరుగుతోందనే చెప్పవచ్చు. దీని వలన బాల్యం నుండే క్రష్ (పసి పిల్లల సంరక్షణ నిలయాలు) సంస్కృతులు పెరగటం అదే సందర్భంలో స్కూళ్లల్లో చదివే పిల్లలు ఇళ్లకు వచ్చేసరికి తల్లితండ్రులు వృత్తి వ్యాపకాలలో నిమగ్నులై ఉండటం చేత పిల్లలకు కావలసిన పలరింపులు, ఆధరణలు కొరవడి ఆ సమయాలలో మొబైల్ ఫోన్లకు లేదా నెట్స్ సంస్క్రుతులకు అలవాటు పడటం దీని పర్యవసానం మానసిక సమతూల్యతలలో జరుగుతున్న అతి మార్పులు గమనిస్తూనే వున్నాము. దీనివలన పిల్లల భవిష్యత్ జీవితాలలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో వీటి ప్రభావలు అనేకానేక అపసవ్య ప్రవర్తనలకు కారణాలుగా మారుతూ నేరస్వభావ పెరుగుదలకు, నేర ప్రవృత్తికి అలాగే మానసిక దౌర్భల్యాలకు కారణాలుగా మారుతున్నాయి.
అందుకే ఈమధ్యకాలంలో చిన్న పిల్లల్లో పెరుగున్న అతి ప్రవర్తనలు మనం చూస్తున్నాం! వింటుంన్నాం కూడా! ఉమ్మడి కుటుంబాలు గత చరిత్ర అయితే అసలు పిల్లలకు దూరంగా పెద్దలు అనేది నేటి చరిత్ర ఉంటే వృద్దాశ్రమాలు లేదా అలసి సొలసి ఒంటరిగా ముసలి దంపతుల జీవితాలు మన కళ్ళ ముందున్న వాస్తవాలే! అందుకే నైతికతలు, ఆలంబనలు,మర్యాదలు, భరోసాలు పెంపొందించగలిగే లేదా నేర్పించగలిగే పరిస్థితులు లేకపోవటం. దీనికి తగ్గట్టుగానే వివిధ వృత్తులలో ఆర్ధిక అవసరాలలో మునిగిపోయి నేర్పే సమయం లేని తల్లితండ్రులు ఇదీ ఈనాడు మన ముందున్న చరిత్రే! అంతేకాకుండా విద్యా విధానాలలో కూడా మార్కుల అభివృద్ధికే తప్ప మానసిక అభివృద్ధి అవకాశాలు లేకపోవటం. అందుకే ప్రవర్తనా విధానాలలో నైతికతలను నేర్వలేని పిల్లల సంఖ్యలు మరియు నేర్పలేని పెద్దల సంఖ్యలు దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాయి అందుకే కొంతలో కొంతైనా వీటిని అధికమించాల్సిన ఆవశ్యకతలను కూడా ఒకసారి పరిశీలిద్దాము!
కుటుంబ పరంగా పెరగాల్సిన మరియు పెంచాల్సిన అవగాహనలు :
పిల్లల పెంపకాల్లో ఆడపిల్లలు, మగపిల్లనే వివక్షతలు మరియు వ్యత్యాసాలు చిన్నతనం నుండే ఎత్తి చూపటం అనేది ఆడపిల్ల పట్ల అలుసుగా మగపిల్లలు వ్యవహరించే అవకాశం ఉంటుంది కనుక వీటి పట్ల కుటుంబ సభ్యులు పెంపకాల విషయంలో జాగ్రత్తలు వహించాలి.
సామాజికంగా అనేక రంగాలలో గతంలోనూ మరియు వర్తమానంలోనూ పెరుగుతున్న మహిళల ప్రాముఖ్యతలు, ఔన్నత్యాల పట్ల అవగాహన పెంపొందించాలి.
భావోద్రేకాలను రెచ్చకొట్టే కార్యక్రమాల పట్ల విచక్షణతో వ్యవహరించవలసిన తీరు తెన్నులను గురించి చిన్నతనం నుండే మగపిల్లల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు మొదటగా కుటుంబాల నుండే జరగాలి.
క్షణికమైన తొందరపాటుతో ఆడపిల్లల పట్ల చేసే అసభ్య ప్రవర్తనలు, అఘాయిత్య, అత్యాచార నేరాల వలన సామాజంలో సిగ్గుతో నేరానికి పాల్పడే యువకులే కాక వారి కుటుంబ సభ్యులు కూడా పొందే చేదు అనుభవాల గురించిన అవగాహన కలుగ చేయాలి. ఆడపిల్లల పై జరిగే అత్యాచారాల పట్ల చట్టరీత్యా తీసుకొనే చర్యల గురించిన అవగాహనను ఖచ్చితంగా యువకులలో పెంపొందించాలి.
నేర ప్రవర్తన వలన చట్టం వేసే శిక్షలు అనుభవించి బయటకు వచ్చే వారు పొందే అవమానాలు, అపహాస్యాలు అంతేకాక విద్యాపరంగా, వృత్తిపరంగా జీవితం ఎలా దెబ్బతినే ప్రమాదాల గురించి అవగాహన కలుగచేయాలి.
ఎదుగుతున్న వయసులో మగపిల్ల స్నేహాలు, వారి వారి దైనందిక కార్యక్రమాలు, కొత్తగా ఏవైనా అలవాట్లకు దగ్గరౌతున్నారా? తద్వారా ప్రవర్తించే తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ అటువంటి అపసవ్యాలకు తగినట్లుగా అనుమానిస్తున్నట్లు కాకుండా స్నేహపూరితంగా వీటివలన వచ్చే కష్ట,నష్టాలను నిరోధించే ప్రక్రియను ప్రారంభించాలి అవసరమైతే సైకాలజిస్ట్స్ యొక్క సలహాలు కూడా తీసుకోవచ్చు.
అతిగా వాడబడే మొబైల్ ఫోన్స్ వలన జరిగే శారీరక మరియు మానసిక నష్టాల అవగాహన పెంపొందించాలి . అంతేకాక వయసు స్థాయికి తగ్గ విధంగా మొబైల్ వాడకాలపై నియంత్రణ జరగాలి.
ఇది మగపిల్లల పెంపక విషయంలోనే కాదు ఆడపిల్లలున్న తల్లి తండ్రులు కూడా పిల్లల పెంపంకం మరియు సమాజంలో విచక్షణతో వ్యవహరించ వలసిన తీరుతెన్నుల గురించి మరియు స్వీయరక్షణకు సంబంధించిన అవగాహనలు పెంపొందించగలగాలి. ” స్త్రీ ” పట్ల మన ముందున్న తరం యొక్క ప్రవర్తన సభ్య ప్రపంచంలో తల ఎత్తుకొనే విధంగా సంస్కార భావాలను మనసు నిండా పెంపొందుచుకొని “స్త్రీ” ఔన్నత్యాన్ని కాపాడే దిశగా అడుగులు కదపవలసిన అవసరం ఆసన్నమైంది!