-నండూరి సుందరీ నాగమణి
ద్వితీయ బహుమతి పొందిన కథ
“పిల్లాడు ఫోన్ చేసాడండి, అక్కడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాడట!” దీనంగా చెప్పింది రాజేశ్వరి భర్తకు కాఫీ కప్పు అందిస్తూ.
“చూడు రాజీ, ఇది పోటీ ప్రపంచం… ఇక్కడ మనమూ పోటీ పడకపోతే తప్పదు… వాడికి ఇంటిమీద బెంగ ఉండటం సహజం. కానీ… నిజానికి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అసలలాంటి కార్పొరేట్ కాలేజీ అయితేనే వీడిలాంటి బద్దకిష్టులకి సరియైన చోటు… నువ్వేం బెంగపడకు, వాడలాగే అంటాడు.” తాపీగా టీవీ ఛానల్ మార్చుతూ, కాఫీ సిప్ చేయసాగాడు గరళకంఠం.
“అయ్యో, మీకెలా చెప్పాలి? మొదట్లో టాప్ టెన్ లో ఉండేవాడు కనుక బాగానే ఉండేది. ఇప్పుడు వాడి రాంక్ తగ్గిపోవటంతో సెక్షన్ మార్చేసారట. వీడిని… వీడిననే కాదు వీడి క్లాసుమేట్స్ అందరినీ ఎంతో హీనంగా చూస్తారట. ఎన్నో మాటలు, సాధింపులనట… ఛ! ఏం మాస్టర్లండీ? ఎగతాళిగా మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి అడల్ట్ జోక్స్ కూడా వీడిమీద వేస్తారట! ముడుకుల మీదా, చేతివేళ్ళ వెనుకా కర్రతో చాలా గట్టిగా కొడుతున్నారట. విలవిలలాడిపోతున్నాడు బిడ్డ. ఇలాంటి దరిద్రపు శాడిజం పనుల వలన స్వతహాగా తెలివైన పిల్లాడే అయినా, అనుక్షణం భయంతో చచ్చిపోతూ, ఆత్మ స్థైర్యాన్ని కోల్పోతున్నాడు. చదివింది గుర్తు ఉండటం లేదు… మర్చిపోతానేమో అన్న భయంతోనే మరచిపోతున్నాడు… డైలీ టెస్ట్స్ లో ఫెయిల్ అవుతున్నాడు… మన ఒక్కగానొక్క పిల్లవాడు! నా మాట వినండి, ప్రవీణ్ గాడిని ఇంటికి తెచ్చేసుకుందాం. ప్లీజ్…” రెండు చేతులూ జోడించి కన్నీటితో అన్నది రాజేశ్వరి.
“వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్… ప్రపంచంలో నువ్వొక్కదానివేనా తల్లివి? వాడొక్కడే స్టూడెంటా? వేలుపోసి అక్కడ సీటు కొన్నది, ఇలా మధ్యలోనే అర్థంతరంగా ఇంటికి తెచ్చేసుకోవటానికి కాదు… అర్థమైందా? నువ్వూ, వాడూ వేషాలు మానండి… అయినా వాడు అంత ధైర్యంగా ఫోన్ ఎలా చేసాడు నీకు? అంతంత సేపు మాట్లాడనివ్వరే అక్కడ? రేపే కాలేజీ వాళ్లకి ఫోన్ చేసి గట్టిగా చెప్తాను… పిల్లలను దొంగతనంగా ఫోన్ లు చేయనీయవద్దని…” కటువుగా చెప్పాడు గరళకంఠం.
“అసలు మీరు మనిషేనా? దయచేసి వాడి కన్న తండ్రిలా ఆలోచించండి …”
“వాడు బాగు పడాలనే రాజీ నా తపనంతా… తండ్రిగా నేను కఠినంగా ఉండక తప్పదు… పరీక్షలయ్యే వరకూ మరి మాట్లాడకు…”
కొంగు నోట్లో కుక్కుకుంటూ, భోరుమని ఏడుస్తూ, అక్కడినుండి వెళ్ళిపోయింది రాజేశ్వరి. తనకు పట్టనట్టే ముఖం తిప్పుకున్నాడు గరళకంఠం… అతని కళ్ళ ముందు ప్రవీణ్ ఇంజనీరయి, కార్పొరేట్ రంగంలో పెద్ద ఉద్యోగి అయి సంపాదించబోయే లక్షల రూపాయలు నాట్యం చేస్తున్నాయి.
పదిరోజుల తరువాత –
“నీకసలు బుద్ధి అన్నది ఉందా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పిల్లాడిని కాలేజీ నుంచి ఎక్కడికి తీసుకుపోయావు? ఎల్లుండి నుంచీ పరీక్షలని తెలుసా నీకు? వాడేం కావాలని అనుకున్నావు?” ఫోన్ లో గట్టిగా అరిచాడు గరళకంఠం.
“ప్రవీణ్ కి హై ఫీవర్. మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు. సాయి నర్సింగ్ హోమ్ లో ఉన్నామని మా అన్నయ్య మీకు చెప్పలేదా?” తీక్ష్ణమైన కంఠంతో అడిగింది రాజేశ్వరి.
“చెప్పాడులే, కాలేజీ వాళ్ళు కేర్ తీసుకుంటాం అని ఎంత చెప్పినా వినకుండా తీసుకుపోయారటగా ప్రవీణ్ గాడిని?”
“అవును…చేతులారా యమదూతల చేతుల్లో పడేసాం కదా, రక్షించుకుందామని వెళ్ళాము. మీకో విషయం తెలుసా, నిన్న గాక మొన్ననే వీడి రూమ్ మేట్ ఒకడు మేడ మీదనుంచి దూకి పారిపోవాలని ప్రయత్నించి, రక్తసిక్తమైన గాయాల పాలై, ఇప్పుడు మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు. వాడిని ఆస్పత్రికి తరలించేటప్పుడు కళ్ళారా చూసి వీడు భయపడిపోయి, ఇంత జ్వరం తెచ్చుకున్నాడు. మేము సమయానికి వెళ్ళి బయటకు తేకపోతే వీడు ఏమైపోయి ఉండేవాడో తెలియదు… అక్కడ సిక్ రూమ్ లో పడుకోబెట్టి మందులు వేయటమే తప్ప ఒక చల్లని మాట కానీ, సాంత్వన కానీ ఉండవు. ప్రాణాపాయస్థితి వస్తే తప్ప ఆస్పత్రికి తీసుకువెళ్ళరు. నిలయవిద్వాంసులైన వైద్యులే యాంత్రికంగా వైద్యం చేస్తారు.
అసలు వాళ్ళు ఎవ్వరూ ఏ విద్యార్థినీ వదిలిపెట్టరు. బంగారు గుడ్లు పెట్టే బాతులు కదా వీళ్ళు? వాళ్ళకు ర్యాంకుల పంట పండిస్తే చాలు. వీళ్ళ బాధలూ, బెంగలూ అవసరం లేదు. ఎప్పుడు చూసినా చదువు, చదువు, చదువు తప్ప వేరే ఏ మాటా లేదు. వాళ్ళలో వాళ్ళు కూడా మాట్లాడుకోకూడదు. ఉదయం ఐదు గంటల నుంచీ, రాత్రి పదిన్నర వరకూ ఏకధాటిగా చదువుతూనే ఉండాలి. కాలేజీలోనూ, హాస్టల్లోనూ కూడా కాపలా! తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడాలంటే కాపలా… విజిటింగ్ డే నాడు పిల్లలతో మనసారా మాటాడనీయకుండా మనకూ కాపలా… ఇక వాళ్ళ భయాలను ఎవరికి చెప్పుకుంటారు వీళ్ళు? యావజ్జీవకారాగార శిక్ష అనుభవించే ఖైదీలు సైతం వీళ్ళకన్నా సంతోషంగానే ఉంటారు.
చదువేమన్నా గొప్పగా చెప్పేస్తున్నారా అంటే, భట్టీయం వేయిస్తున్నారు. గంటలు గంటలు చదివి చదివి పిల్లలు పిచ్చి ఎక్కిపోతున్నా వీళ్ళకేమీ పట్టదు. అసలు సరస్వతీ నిలయాలుగా ఉండాల్సిన విద్యాలయాలు, ధన రక్తదాహంతో అల్లాడిపోయే క్షుద్రదేవతల నెలవులుగా తయారయ్యాయి.
ఇక ఆ కాలేజీ అవసరం లేదు మాకు… నా కొడుకును మళ్ళీ ఆ కసాయి వాళ్ళ చేతుల్లో పెట్టను గాక పెట్టను…” గట్టిగా అన్నది రాజేశ్వరి…
“ఏమిటే నోరు లేస్తోంది? పిల్లాడి భవిష్యత్తును నాశనం చేసేస్తావా? అసలు నీ దన్ను చూసుకునే కదా వాడికి అంత అలుసు? వాడిని కాదు, నిన్ను అనాలి…ఆఫ్టరాల్ కొంచెం జ్వరం వస్తే వాడిని పరీక్షలు రాయనీకుండా హాస్పిటల్లో చేర్చి నాటకాలు ఆడతావా ?” రెండేళ్ళ ఫీజూ వృధా అయిపోతుంది అన్న బెంగతో గరళకంఠం వణికింది.
“ఏదమ్మా రాజీ, ఫోన్ ఇటివ్వు…” అందుకున్నాడు రాఘవ.
“బావగారూ, నేను రాఘవను… మీకు ప్రవీణ్ ఎలా ఉన్నాడో అన్న గాభరా లేకపోగా, డబ్బు వృథా అయిపోయింది అన్న చింత ఎక్కువగా ఉంది… మీ ప్రవర్తన చాలా చిత్రం గా ఉంది… వెంటనే పరుగున హాస్పిటల్ కి వస్తారని అనుకున్నాను… సమయానికి మేము హాస్పిటల్ కి తీసుకురాకపోయి ఉంటే, మన ప్రవీణ్ మనకు దక్కి ఉండేవాడు కాదండి…”
“రాఘవా… ఇవన్నీ నాకు చెప్పకు… ఎల్లుండి వాడు పరీక్షకు వెళ్ళి తీరాలి…”
“వెళ్ళడు. వచ్చే ఏడు రాసుకుంటాడు. అదీ ఇంట్లోనే ఉండి ప్రైవేట్ గా చదువుకుంటాడు. మళ్ళీ ఆ కాలేజీకి పంపించం మనం!” దృఢంగా అన్నాడు రాఘవ.
“ఇంకేం, ఎప్పటికీ నీ చెల్లెల్ల్నీ, మేనల్లుడినీ నీ దగ్గరే ఉంచుకో…” కోపంగా ఫోన్ పెట్టేసాడు గరళకంఠం.
ఒక నిట్టూర్పు విడిచి, ఇంకా స్పృహ లోనికి రాని మేనల్లుడి తల నిమిరి, కన్నీరు కారుస్తున్న రాజేశ్వరిని వీపు తట్టాడు…
“ఇంకేం భయం లేదని డాక్టర్ చెప్పాడు కదా రాజీ… ఏడవకమ్మా.”
“థాంక్స్ రా, నువ్వే లేకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళమో…”
“కాదు చెల్లాయ్, నీలాంటి అమ్మ కడుపున పుట్టటం ప్రవీణ్ అదృష్టం… అంతే… లే, లేచి ముఖం కడుక్కుని రా… కాస్త కాఫీ తాగుదాం…” అన్నాడు చెల్లెలి వైపు వాత్సల్యంగా చూస్తూ…
అలాగేనన్నట్టు తలూపి, వాష్ రూమ్ వైపు నడిచింది, రాజేశ్వరి నిశ్చింతగా.
***
(సమాప్తం)