-కట్టా రాంబాబు
ప్రథమ బహుమతి పొందిన కథ
ఆరోజే కాలేజి ‘రివోపెనింగ్ డే’. అందుకే అక్కడి వాతావరణమంతా ఉత్సాహంగాను, ఆహ్లాదకరంగాను వుంది. రంగు రంగుల సీతాకోక చిలుకల్లా అలంకరించుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలాకాలం తర్వాత కలుసుకొన్నారేమో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడంతా ”హాయ్”, ”హల్లో” లతో గందరగోళంగావుంది.
సమయం తొమ్మిదిన్నరే అయింది. క్లాసెస్ కమెన్స్ కావడానికింకా అరగంట టైముంది. చాలామంది అబ్బాయిలుకాంటిన్ ముందు నిలబడి క్రొత్తగా జాయినవ్వడానికి అప్లికేషన్లు తీసుకెళుతున్న అమ్మాయిలకు పోజులిస్తున్నారు. కాలేజిముందున్న గార్డెన్‌లో ఓ చెట్టు క్రింద నీడలో పదిమంది వరకు అమ్మాయిలు కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా ఫస్టియర్ పూర్తిచేసి సెకండియర్ డిగ్రీలో ప్రవేశిస్తున్నారు.
సమయం కావడంతో ప్రిన్సిపాల్‌గారు తమ ‘హోండా సిటీలో’ వచ్చి ఆఫీసులో కూర్చున్నారు, లెక్చరర్లు కూడ ఒక్కొక్కరే వస్తున్నారు.
”ఫ్రండ్స్! చెప్పడం మరచాను, మన ఇంగ్లీషు లెక్చరర్ వినాయకుడు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారట. లాస్టియర్ మన దెబ్బకి తట్టుకోలేక పోయాడు గురుడు. ఎవరో కొత్తాయనయివ్వాళ జాయనవ్వుతున్నాడట.” ఆచెట్టుక్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళలో ఒక విద్యార్థి అన్నాడు. ఆ లెక్చరర్ పేరు వినాయకుడు కాదు. ఆయనికి పెద్దగా బజ్జ వుంటుంది. అందుని ఆయనకాపేరు పెట్టారంతా.
”మన బాయస్ ఆయన్ని భలే ఏడిపించేవారు” తన రెండు కళ్ళను చక్రాల్లాతిప్పుతూ ఓ జీన్స్ అమ్మాయి అంది.
”అంతేకాదు, మనవాళ్ళు చేసే అల్లరికి తట్టుకోలేక తలతిరిగి అలాగే కుర్చీలో కూలబడటమో లేక బయటకుపోవడమో చేస్తుంటే భలే తమాషాగా వుండేది” అంది పంజాబీ డ్రస్‌లోవున్న యింకో అమ్మాయి. వాళ్ళంతా అలా పొగుడుతు ఉంటే అబ్బాయిలంతా గర్వంగా తలలెగరవేసారు.
”ఆ క్రొత్తగా వచ్చినవాడికి కూడా మన తడాఖా మొదటే చూపించాలి. మన జోలికిరాకుండా, లేకపోతే మనం చెప్పినట్లువినడు, అటెండెన్స్ యివ్వడు” అన్నాడో విద్యార్థి అవునన్నారంతా.
వాళ్ళంతా ఆవూళ్ళోని ధనవంతుల బిడ్డలు. వారికి చదువు ఓ హాబీ, అప్పుడప్పుడు క్లాసులకు రావడం, లెక్చరర్లను అల్లరి పెట్టడం వారికి సరదా. అమ్మాయిలు, అబ్బాయిలు కలసి సినిమాలకు, షికార్లకు తిరగటం అలవాటు. ఫస్టు బెల్ గణగణమోగింది.
”మొదటి రోజునే క్లాస్‌కేం వెళతాం, చాలా కాలానికి కలిసాంకదా, సరదాగా మార్నింగ్ షోకి పోదాం” అంటూ కొంతమంది ప్రపోజ్ చేసారు. ఆ ప్రపోజల్‌కి అందరూ ఒప్పుకున్నారు. అంతలో పరుగుపరుగున ఓ విద్యార్థి అక్కడికి వచ్చి ”ఒరేయ్ గుడ్‌న్యూస్! యివ్వాళ ఫస్టవర్ మన క్లాసుకి క్రొత్తగాజాయినయిన ఇంగ్లీష్ లెక్చరర్ వస్తాడట…మా బ్రదర్‌కి అప్లికేషన్ ఫారం తీసుకొందామని వెళితే అక్కడ తెలిసింది. ఆయ నెలావుంటాడో నేను చూడలేదు” అంటూ గబగబ చెప్పాడు.
”అయితే మన పిక్చర్ ప్రోగ్రాం కాన్సిల్, గురుడికి మొదటి క్లాస్‌లోనే మన సత్తా చూపించి హడల్ గొట్టాలి” అన్నాడో విద్యార్థి, అందరు సరే అంటే సరే అన్నారు.
సెకండ్ బెల్ కూడా అయింది, ఒక్కొక్కరే క్లాస్ రూముల్లోకి పోతున్నారు. వీళ్లు కూడా నెమ్మదిగా నడుచకుకుంటూ క్లాసుల్లోకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి థర్డ్ బెల్ కూడా అయింది. తలకచోటా కూర్చున్నారు. బెల్‌కొట్టి అయిదు నిముషాలయినా యింకా లెక్చరర్ రాలేదు. వీళ్ళంతా రాబోయే లెక్చరర్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోబయట ‘టక్…టక్’ అంటూ చప్పుడయింది. అంతా గుమ్మంవంక చూసారు.
రెండు చంకలకిందా రెండు కర్రకాళ్ళను పెట్టుకొని కుంటుకుంటూ ఓ వ్యక్తి లోపలికడుగు పెట్టాడు. అతన్ని చూసి ముందువరుసలో కూర్చున్న అమ్మాయిలంతా ఒక్కసారిగా భయపడి కళ్లు మూసుకున్నారు. అతను లోపలికి రెండు అడుగులు వేసి అలాగే నిలబడిపోయాడు.
అతనికి ఒక కాలులేదు. ముఖం నిండా తెల్లగా పెద్దపెద్ద కాలిన మచ్చలు వికృతంగా కన్పిస్తున్నాయి. వేసుకున్న బట్టలు నలిగి చమటతో తడసిపోయివున్నాయి. గడ్డంకూడా కొద్దిగా పెరిగివుంది. అతడు క్లాసులో కూర్చున్నవాళ్ళవరక చూసాడు. అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు.
”వీడెవడో బెగ్గర్రా, చిల్లర డబ్బులు వేసి పంపండి” అన్నాడో విద్యార్థి గబగబా తన సీట్లోనుంచి లేచి ‘కర్చీపు’ని జోలెలా పట్టి ‘బాబు ధర్మం’ అంటూ అందరి ముందుకు వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అమ్మాయిలంతా ముసిముసిగా నవ్వుతూ తమ హాండ్ బ్యాగ్‌లు తెరచి డబ్బులు ఆ విద్యార్థికర్చీపులో వేశారు.
అంతవరకు అక్కడ నిలబడిన వ్యక్తి తన కర్రకాళ్ళతో నడుస్తూ డయాస్ దగ్గర కొచ్చి టేబుల్‌కి కుర్చీకి మధ్యన నిలబడ్డాడు. ప్యూన్ అటెండెన్స్ రిజిష్టరు డస్టరు, రెండు సుద్దముక్కలు తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఆ విద్యార్థి యింకా డబ్బులు వసూలు చేయడం మానలేదు.
”మిష్టర్! యు ప్లీజ్ సిడౌన్” గట్టిగా అరిచాడతను. అమ్మాయిలంతా జడుసుకున్నారాకేకతో, ఆ విద్యార్థి అలాగే నిలబడిపోయాడు.
”యునో! అయామ్ యువర్ ఇంగ్లీష్ లెక్చరర్” అన్నాడు క్లాసునుద్దేశించి. ”వాట్!!!” అదిరిపడ్డారంతా, వీడేమిటి… లెక్చరర్ నంటున్నాడేమిటి? ఆశ్చర్యంగా అతనివంక చూసారు.
”ఏం ఆశ్చర్యంగావుందా? ఈ అవతారం లెక్చరరేమిటా అని చూస్తున్నారా! అవును నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్నే. ఈరోజునే జాయినయ్యాను. ఈ కాలేజీలో ఇదే నా మొదటిక్లాసు. నన్ను పరిచయం చెయ్యడానికి ప్రిన్సిపాల్‌గారు వస్తానన్నారు. కాని నన్ను నేనే పరిచయం చేసుకోదలచి వారిని వద్దన్నాను” అన్నాడతను. చాలామంది యిరకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. అతని ముఖం వంక చూడలేక పోతున్నారంతా. ముఖంనిండా కాలిన మచ్చలతో, తలమీద కూడ వెంట్రుకలమధ్య మచ్చలతో చాలా వికారంగా భయంకరంగా కన్పిస్తున్నాడతను.
”మైనేమీజ్ శ్యామ్ సుందర్”అన్నాడు మళ్లీ.
”అబ్బ! పేరుకు తగ్గ అందం” అమ్మాయిలబెంచీలోంచి గట్టిగా విన్పించింది.
‘శ్యామ్ సుందరా… ప్రేమ మందిరా’ అంటూ పాటందుకున్నారు వెనకాల బెంచీమీద కూర్చున్నవారు.
”సైలెన్స్” గట్టిగా అరిచాడీసారి.
ఆ క్లాసులో అంతా అల్లరి చేసేవారే కాదు బుద్ధిగా చదువుకునేవారు కూడావున్నారు. వాళ్లకి అల్లరి చేసేవాళ్లని చూస్తేమంట. లెక్చరర్లని పాఠాలు సరిగ్గా చెప్పనివ్వరు బాగా అల్లరిచేసి ఏడ్పించేవారు. కానిఈ లెక్చరరెవరో మొదటి రోజునే అదరగొట్టేస్తున్నాడని వాళ్ళుచూస్తున్నారు.
ఎప్పుడయితే అతనిలా ”సైలెన్స్” అని అరిచాడో అల్లరి బృందము అంతా పైకిలేచారు.
”ఏం లేచారు” అడిగాడు శ్యామ్ సుందర్ వాళ్లని.
”మేమీ క్లాసులో కూర్చోలేం” అన్నారు వాళ్లు.
”ఎందుకని?”
”మీ అందమైన మూఖాన్ని చూడలేక” అన్నాడో విద్యార్థి, మిగిలిన వాళ్లంతా ఫక్కుమని నవ్వారు. అమ్మాయిలు నవ్వుని కర్చీపుల్లో దాచుకుంటున్నారు.
బాధగా ఒకసారి కళ్లు మూసుకున్నాడు శ్యామ్ సుందర్.
”అవును ఇప్పుడు నా ముఖం మీరుచూడలేరని నాకు తెలుసు. కాని…కాని… ఒక్కప్పుడయితే నేను మీ అందరికంటె అందంగా వుండేవాడినేమో! అప్పుడు నారూపాన్ని అందరూ లైక్ చేసేవారు…. కాని యిప్పుడు నా దగ్గర అందం లేదు. అందవికారంగా తయారయ్యాను… అయినా నేనిప్పుడిలా వున్నానని బాధపడటం లేదు”
”ఏం?”
”యిది నాకు నా ప్రియమైనవారు వరప్రసాదంగా యిచ్చారు కాబట్టి”
”ఎవరా ప్రియమైనవారు”
”నా విద్యార్థులు… నేను ప్రేమించే నా విద్యార్థులు… వారునా ముఖంమీద ఆసిడ్ పోసారు, నా కాలు విరుగ గొట్టేరు, అసలు నన్నే చంపాలనుకున్నారుగూడా, కాని నేను చావకుండా యిలాగే మిగిలిపోయాను”
వాళకి చాలా ఆశ్చర్యం వేసింది. స్టూడెంట్స్ యిటువంటి పనులు చేస్తారా? ఏదోసరదాకి అల్లరిచేసి లెక్చరర్లని ఏడిపిస్తారు. తామే లెక్చరర్లను యిలా చెయ్యలేదే. బెదిరించి తమదారికి తెచ్చుకున్నారంతే. ఈయనేం వెధవపనులు చేస్తేయిలా చేసారో అనుకున్నారు అదే అన్నారు కూడా ”ఏవో కానిపనులు చేసుంటాడు” అని.
”నేనేమి కానిపనులు చేయలేదు… ఆ కానిపనులు చేస్తున్నవాళ్లకి అడ్డుతగిలాననే నాకీబహుమతి… లెక్చరర్ స్టూడెంట్స్‌కి మంచినిగురించి చెపుతాడు. చెడు చేస్తున్నప్పుడు మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని చెడుపనులు చేసే స్టూడెంట్స్ వాళ్లని సరిదిద్దాలని ప్రయత్నించే లెక్చరర్లని ఎక్కువగా అపార్థం చేసుకొంటారు. యిది సహజం… ఆ లెక్చరర్ కి తామంటే కోపమని అందుకే తాము చేయబోయే పనులకు అడ్డుతగులుతున్నాడని భావిస్తారు… నిజంగా స్టూడెంట్స్ అక్కడే పొరపాటుపడుతున్నారు.అసలు లెక్చరర్‌కి స్టూడెంట్స్ మీద కోపం ఎందుకు ఉంటుంది? వాళ్లు చెడిపోతున్నారనే బాధ ఉంటుంది. నేను అలాగే బాధపడ్డాను వాళ్లని సరిదిద్దడానికి ప్రయత్నించాను వాళ్లు బాగుపడలేదు. కాని నారూపాన్ని రూపాన్ని మాత్రం మార్చారు. నేనిలా అయ్యానని నేనేం బాధపడటంలేదు. కాని నన్నిలా చెయ్యాలనే దుర్బుద్ధి వారికి ఆ చిన్న వయస్సులో కల్గినందుకే నాకు చాలా బాధగావుంది… చెప్పడం ఆపి బాధగా కళ్ళుమూసుకున్నాడు శ్యామ్ సుందర్.
క్లాసంతా నిశ్శబ్దంగా వుంది.
”అసలేం జరిగింది సార్… మీకీ దుస్థితి ఎందుకు కల్గింది” ముందు బెంచీలో కూర్చున్న ఓ బుద్ధిమంతుడైన విద్యార్థి అడిగాడు.
”సరే చెపుతాను, మీలో బయటకి వెళ్లాలనుకున్నవాళ్లు నేను చెప్పేది విని వెళ్లండి. అంతవరకు దయచేసి కూర్చోండి” అన్నాడు. బయటికి పోతామని లేచినవాళ్లంతా వాళ్ల స్థానాల్లో కూర్చొన్నారు.
”… జీవితంలో అనుకొనేవి జరగటం అందరివిషయంలోను సాధ్యంకాకపోవచ్చును కాని నా విషయంలో అది జరిగింది. నేను ఎమ్మే యూనివర్శిటీలో ఫస్టురాంకులోపాసయి గోల్డ్ మెడల్ సంపాదించాను.ఆ తర్వాత ఉద్యోగాల వేట. నాకు మొదట్నించీ ఉపాధ్యాయవృత్తిమీద గౌరవం ఎక్కువ. ఒక వ్యక్తిని అన్ని విధాలా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుడిమీద వుంటుంది. నేను కూడా అదేవృత్తిని చేపడితే కొంతమందినైనా మంచిగా తీర్చిదిద్దవచ్చుననే ఆశతో..నేనీ ఉద్యోగంలో ప్రవేశించాను. నాకు యితరత్రా కూడా మంచి అవకాశాలచ్చినా నేనిది వదులుకోలేదు. నేను కోరుకున్నట్టుగానే నా దగ్గర చదువుకున్న చాలామంది విద్యార్థుల్ని తయారుచేసాను. నా విద్యార్థులు చాలామంది ఉన్నత పదవుల్లో ఉన్నారు. నేను చెప్పే సబ్జక్టు ఇంగ్లీష్ కాబట్టి ఏ గ్రూపు తీసుకున్న యిది చదువవలసిందే. నాదగ్గర చదువుకున్నవాళ్లు డాక్టర్లయ్యారు, ఇంజనీర్లయ్యారు, కలక్టర్లయ్యారు, డియస్పీలయ్యారు యింకా… యింకా చాలా అయ్యారు. ఇది నేను సంతోషించదగ్గ విషయమేతన దగ్గర చదువుకున్న విద్యార్థి అభివృద్ధిలోకి వచ్చారంటే ఆ ఉపాధ్యాయుడికి అరతకన్నా కావలసిన దేముంది? అందరిలాగా నేనూ గర్వపడ్డాను. అయితే యిక్కడ బాధపడవలసిన విషయంకూడా ఉంది. మాదగ్గర చాలామంది చదువుకొని ఉంటారు. కాని అందరు ఉన్నత పదవుల్లో ప్రవేశించలేరుగా. కొంతమంది చదువురాక, చదవలేకపోవడంతో ఉద్యోగాలు దొరక్క వాళ్లలో రౌడీలు, దొంగలు, బ్రోకర్లు అయివుండివుంటారు.
ఇది బాధపడవలసిన విషయం. కాని ఎవరమూ ఏమీ చేయలేం.
”సరే అసలు విషయానికొద్దాం, నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మా ఉపాధ్యాయులు మీదే వుంది. కాదనను, కాని ఉపాధ్యాయులు ఎంతవరకు చెయ్యగలరు. రేపటి పౌరులుగా తయారవ్వడానికి కావలసిన సాధన సంపత్తిని అందించగలరు. దానిని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత ఆ బాలలమీదే వుంది. కాని అదే యిప్పుడు లేదు. అందుకే విద్యార్థి విద్యార్థిగా ప్రవర్తించడంలేదు.
నేను చాలా ఊళ్ళలో పనిచేసాను. నా వృత్తిని ఎటువంటి లోపం లేకుండా నిర్వహించాను. క్రితం సంవత్సరం నేనొక కాలేజీకి ట్రాన్స్‌ఫరయ్యాను, ఆవూరు పేరు యిక్కడ అప్రస్తుతం. ఆ కాలేజీలోని విద్యార్థులు నాతో ఎంతో బాగావుండేవారు. నేను చెప్పే పాఠాలను బాగా అర్థం చేసుకున్నట్లుగానే కన్పించేవారు. నేనంటే ఎంతో గౌరవం చూపుతుండేవారు. నేను కన్పిస్తే చాలు మెలికలు తిరిగిపోయి విష్ చేస్తుండేవారు, ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తుండేది. ఏమిటి వీళ్ళిలా ప్రవర్తిస్తున్నారని మొత్తంమీద వాళ్ళంతా నాకు ప్రియమైన విద్యార్థులయ్యారు. కాని సంవత్సరాంతానికిగాని వారి నిజస్వరూపం నాకు తెలియలేదు.
”అసలు ప్రతీ లెక్చరరూ సంవత్సరమూ లెసెన్స్ చెప్పేటప్పుడు ఎదుర్కొనే సమస్యల కంటే సంవత్సరాంతము పరీక్షల సమయంలో ”యిన్విజలేషన్స్” లో ఎదుర్కొనే సమస్యలే ఎక్కువ. ఇన్విజలేషన్ అంత నరకంయింకోటి ఉండదు. ప్రస్తుత విధానం ఎలా ఉందంటే విద్యార్థులు ఏవిధంగా చదువుకోవాలి అనేదానికంటే ఏవిధంగా కాపీ కొట్టాలి అనే విషయాన్ని ఒకటో తరగతినుంచి నేర్చుకొని వస్తున్నారు. నేను దేన్నయినా సహిస్తానేమోగాని పరీక్షలో కాపీలు కొట్టడాన్ని సహించలేను. ఆ కాలేజీలోని విద్యార్థులు కాపీలు కొట్టడానికి ప్రయత్నిరచారు. అసలు నాకు వాళ్ళు గౌరవమివ్వటం, నాతో మంచిగా ఉండటం, విష్‌లు చేయడం యివన్నీ ఎక్జామినేషన్స్‌లో లూజ్‌గా వుంటాననే ఉద్దేశ్యంతో చేసినవే. వాళ్ళ నిజస్వరూపం నాకు అప్పుడే తెలిసింది.
”ఆరోజున పరీక్షలు మొదలయ్యాయి, నేను ఎవరయితే మంచివాళ్ళని, నాకు ప్రియమైన విద్యార్థులని అనుకున్నానో వారే కాపీలు వ్రాయడానికి ప్రయత్నించారు. నేను దానికి ఒప్పుకోలేదు. ముందు నన్ను బ్రతిమాలాడారు, నేను వాళ్ళకి నచ్చచెప్పడానికి ప్రయత్నించాను, వాళ్ళు వినలేదు. కాపీలు వ్రాస్తామన్నారు. అలా వ్రాస్తే డిబార్ చేయిస్తానన్నాను. నన్ను బెదిరిరచారు, కొడతామన్నారు,చంపుతామన్నారు. నానా హంగామా చేసారు. దానికి నేనేమీ భయపడలేదు. భయపడితే ఉద్యోగం అసలు చేయలేం. వాళ్ళంతా కాపీలుతీసి వ్రాయడం ప్రారంభించారు. ఫలితంగా వాళ్ళంతా డిబార్ అయ్యారు. వాళ్ళు బయటికి పోతూ ”బయటికిరా నీపనిపడతాం” అంటూ వెళ్ళారు. నాతోటి లెక్చరర్లు కూడ నన్ను కొంచెం జాగ్రత్త పడమన్నారు, నా ప్రాణం పోయినాసరే నేను దేనికి భయపడను. వాళ్లు అన్నట్టుగానే నేను పరీక్ష అయిన తర్వాత ఒంటరిగా వస్తుంటే ఓచోట నిలబడి నా కోసం ఎదురుచూస్తున్నారు. నేను వాళ్ళ ప్రక్కనుంచి పోతుంటే అందరూ నా మీదపడ్డారు, వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి, సైకిలు చైనులున్నాయి, కర్రలున్నాయి, ఆసిడ్ సీసాలున్నాయి. అన్నిటిని నామీద ప్రయోగించారు. నేను చచ్చిపోయాననే ఉద్దేశ్యంతో నన్నక్కడ వదిలి వెళ్ళారు. ఎవరో హాస్పటల్లో చేర్పించారు. నా కాలు ఒకటి పూర్తిగా విరిగిపోయింది. నా ముఖంమీదే కాకుండా ఒంటిమీద కూడా ఆసిడ్ పోసారు. కత్తులతో చేతులమీద పొడిచారు. అయినా నేను బ్రతికాను. పోలీసులు నన్ను వాళ్ళెవరో చెప్పమన్నారు. నాకు వాళ్ళంతా తెలుసు, వాళ్ళు నా విద్యార్థులు. ఏదో మూర్ఖత్వంతో తెలియక నన్నేదో చేసారు. నేను మాత్రం మూర్ఖుణ్ణి కాదల్చుకోలేదు. అందుకే వాళ్ళెవరో తెలియదని, అంతమందిలో గుర్తు పట్టలేకపోయానని చెప్పాను. ఏవ్యక్తికి యితరవ్యక్తులను హింసించే అధికారం లేదు. నేను గనుక వాళ్ళమీద రిపోర్టు యిచ్చివుంటే వారికి శిక్ష పడుతుంది. వాళ్ళు జైల్లో వుంటారు. అది నాకిష్టం లేదు. ఆవిధంగా చేస్తే వాళ్ళలో మార్పు రాదు. రాక్షసత్వం పెరుగుతుంది. వాళ్ళు చేసిన పనికి పశ్చాత్తాపపడినప్పుడు వాళ్ళు మనుషులుగా మారతారు.
”నేను కొంతకాలం హాస్పిటల్లో ఉండి కోలుకున్నాను. రాజకీయం ఉపయోగించి నన్నక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించారు. దానికి కూడ నేను బాధపడటం లేదు. ఎందుకంటే అడుక్కునే వాడికి అరవై ఆరు ఇళ్ళంటారు. అలాగే ఉద్యోగస్తుడు కూడా అన్ని వూర్లు తిరగవలసిందే. అక్కడనుంచి నేనీ వూరు వచ్చి మొట్టమొదట మీ క్లాసు తీసుకొన్నాను” అంటూ ముగిరచాడు శ్యామ్ సుందర్.
క్లాసులో ఎవరూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు.
యింతలో ఫస్టవరు అయిందన్నట్టుగా గంట మోగింది.
”మీకిదంతా చెప్పి బోర్ కొట్టించి వుంటాను… సారి. కానీ ఒక విషయం మాత్రం చెప్పదలచుకొన్నాను. మీరు చిన్న పిల్లలు కాదు. పెద్దవాళ్లయ్యారు. మీరంతా భావిభారత పౌరులు, మీ మీదే దేశ భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది. మీరు మంచి పౌరులుగా తయారవ్వండి. అది మీకు, దేశానికి కూడా మంచిది… క్లాసులో అల్లరి చేసి లెక్చరర్లని, తోటి విద్యార్థినీ విద్యార్థులను ఏడిపించడం, లేకపోతే మారు పేర్లు పెట్టి పిలవడం గొప్పతనమనిపించుకోదు. బాగా చదువుకొని ప్రయోజకులయినప్పుడే గొప్పతనమనిపించు కొంటుంది… రేపట్నుంచీ లెసెన్స్ మొదలు పెడతాను, మీలో పాఠాలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే క్లాసుకు రండి. నన్ను చూడలేనివాళ్ళు, చూసి భయపడేవాళ్ళు రాకండి. కావాలరటే అందరికీ అటెండెన్స్ యిస్తాను… యింకొక విషయం, నన్ను చూసి ఎవరూ జాలిపడకండి, అది నేను భరించలేను. అంతేకాదు నాలా యింకొక వ్యక్తిని తయారుచెయ్యడానికి ప్రయత్నించకండి” అంటూ గబగబ అటెండెన్స్ రిజిస్టరులో అందరికీ అటెండెన్స్ వేసుకొని తన కర్రకాళ్ళతో ”టక్…టక్” శబ్దం చేసుకుంటూ క్లాసు నుంచి బయటికి వెళ్ళిపోయాడు శ్యామ్ సుందర్.
***