బాలానందం

ధర్మో రక్షతి రక్షితః

-ఆదూరి. హైమావతి

అనగనగా పర్తిపల్లి అనే గ్రామంలో గోపయ్య నే ఒక రైతు ఉండేవాడు. అతడి భార్య రావమ్మ అతడికి తగిన ఇల్లాలు. అత్త మామల ను తన స్వంత తల్లి దండ్రుల్లా చూసుకుంటూ ఆదరించేది . వారు కూడా రావమ్మను కూతుర్లా ప్రేమించే వారు . గోపయ్య దంపతు లు పగలనకా రేయనకా కష్ట పడి తమ కున్న ఒకే ఒక ఎకరం పొలంలో కాయా కూరా , నీరు లభించినపుడు వరీ పండించు కుంటూ ఉన్నంతలో సుఖంగా సంతోషంగా జీవించే వారు. గంజిని కూడా పాయసంలా భావించి ఆనందంగా నలుగురూ త్రాగేవారు. . వారికి ఒక నియమం ఉండేది. తమ పొలంలో వచ్చిన ఫలసాయం ఏదైనా కానీ మూడు భాగాలు చేసి ఒక భాగం తినను తిండి కూడా లభించని నిరు పేదలకూ, గ్రామం లోని అవిటి వారికీ , వృధ్ధులకూ ఇచ్చేవారు. దాన్ని ఒక గంపలో ఉంచి ఇంటి ముందు కొచ్చిన వారికి గోపయ్య తల్లీ, తండ్రీ ఇచ్చేవారు. ఒక భాగం దేవాలయంలో భగవంతునికి నివేదనగా సమర్పించుకునే వారు. మిగిలిన భాగా న్ని తమకోసం ఉంచుకునే వారు. పొలంలో ఏది పండినా ఇదే వారి నియమం. ఆ గ్రామంలో ఎంతో మంది యాభై ఎకరాల సాగు బడి ఉన్న ధనవంతు లైన రైతులు ఉండేవారు. ఐతే అంతా వారి కోసమే దాచు కునే వారు తప్ప పిల్లికి సైతం బిచ్చం పెట్టే వారు కాదు. పేదలు , బిచ్చగాళ్ళూ అంతా గోపయ్యను పొగట్టం ఆ ధనవంతు లంతా సహించ లేకపోయే వారు. కొంత కాలానికి గోపయ్యకు ఒక కుమారుడు కలిగాడు.వాడికి వివేకుడని పేరుపెట్టుకుని ,చిన్నతనం నుంచే దాన ధర్మాలపట్ల అవగాహన కలిగించారు. పేదలకు సాయం చేయడం, పెద్దలను గౌరవించడం నేర్పారు. తాతా , అవ్వల వద్దచేరి ఎన్నో ధర్మ సూక్ష్మాలు , తెల్సు కున్నాడు. పురాణ కధలు విన్నాడు.మానవుడు జీవితంలో పాటించాల్సిన నియమాలు నేర్చుకున్నాడు.

ఇలాఉండగా ఒక సంవత్సరం విపరీతమైన దుర్భిక్షం వచ్చింది. వాన బొట్టన్నది కురవలేదు. ఎండలు మండి పోపోసాగాయి , చెఱువుల్లో నీరు ఎండిపోయింది.బావుల్లో నీరు ఇంకిపోసాగింది .గ్రామవాసు లంతా త్రాగు నీటికి సైతం ఇబ్బంది పడసాగారు. ఐతే గోపయ్య ఇంటి నూతిలో మాత్రం నీటి ఊట తగ్గ లేదు.ఊరివారందరి పొలాలన్నీ ఎండి పోసాగాయి. గోపయ్య పొలం సమీపంలోని కొండ మీద నుంచీ ఎక్కడి నుంచో నీటి ఊట కాలువలా ప్రవహించి ప్రతి రాత్రీ గోపయ్య పొలాన్ని తడిప సాగింది.ఊరి వారంతా చిత్రంగా గోపయ్య పొలంలోని వరీ, గట్టు చుట్టూ వేసిన కూరమొక్కలూ ఏపుగా పెరగడం వింతగా చూడసాగారు .గోపయ్య పొలానికి నీరెలా వస్తున్నదో ఎవ్వరికీ అర్ధం కాక గోపయ్యను అడిగారు. దానికి గోపయ్య “అయ్యలారా! అంతా భగవత్ కృప, నాకూ ఏమీ తెలీదు. ” అని చెప్పాడు.

ఊరివారంతాఒకరోజున గోపయ్యను ఎక్కడెక్కడికి వెళుతున్నా డో , ఏం చేస్తున్నాడని కాపు కాశారు. గోపయ్య , రావ మ్మ ఉద యాన్నే లేచి రోజువారీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ,ఇంతన్నం మూట కట్టుకుని పొలానికి వెళ్ళేవారు. అక్కడ మధ్యాహ్నం వరకూ పొలం పని చూసుకుని తాము తెచ్చుకున్న భోజనం లో కొంత ఒక ఎండు టాకులో పక్షుల కోసం ,చీమల వంటి కీటకాల కోసం పెట్టి మిగిలింది తాము తినే వారు. ఒక మూకుడు నిండా నీరు పోసి ఉంచేవారు. కాకులు ,పిచ్చుకలూ వంటి పక్షులు ఆ మెతుకులు తిని నీరుత్రాగి కొండపై నున్న చెట్లపైకి వెళ్ళేవి. మళ్ళీ వారు పొలం పని చూసుకుని కూరలు ఏవైనా పక్వానికి వస్తే కోసుకుని సూర్యాస్త మయ సమయానికి ఇల్లు చేరేవారు. తాము తెచ్చిన కూరలు మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని గోపయ్య ఆలయంలో పూజారికి ఇచ్చి వచ్చే వాడు. ఆ పదార్ధాలతో పూజారి ప్రసాదం తయారు చేసి దేవునికి నివేదించి భక్తులకు ప్రసాదం పంచి , తమ కుటుంబ సభ్యులు కూడా భుజించేవారు. ఒక భాగాన్ని రావమ్మ ఒక గంపలో ఉంచి గుమ్మం దగ్గర పెట్టగా ఆమె అత్త గుమ్మం ముందుకు వచ్చిన వారికి ఇచ్చేది. నీటి కరువు కావటాన త్రాగునీటి కోసం కూడా జనం ఇబ్బంది పడు తుండటంతో గోపయ్య కొత్త బానలు తెచ్చి వాటి నిండా నీరు నింపగా ఆయన తండ్రి దారిన పోయే వారు దాహానికి వస్తే ఇచ్చే వాడు. గోపయ్య కొడుకు రోజంతా బావినీరు తోడి బానలు నింపుతూ ఉండే వాడు. వారి నిత్య కృత్యాలను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యం పడేవారు.

ఒక రోజున ఆ గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు. ఆయనకు ఎవ్వరి ఇంటా పిరికెడు మెతుకులు కానీ , గ్లాసుడు నీరు దాహానికి కానీ దొరక లేదు. ఊరికి చివరగా ఉన్న వీధి లోని గోపయ్య ఇంటివద్ద జనం పోగై ఉండటాన్ని చూసిన ఆ సన్యాసి అక్కడికెళ్ళి చూస్తాడు .అక్కడ బానల్లో నీరు దాహమైన వారికి పోస్తూ, కూరలు, పండ్ల వంటి వాటిని పేదలకు ఇస్తుండటాన్ని గమనించాడా సన్యాసి. అతడిని చూడగానే గోపన్న తల్లి , ఆయన చాలా ఆకలిగానూ, అలసిపోయీ ఉన్నాడని గమనించింది. ” స్వామీ ! లోనికి రండి” అంటూ ఆహ్వానించి ,తాము వండుకున్న జొన్నసంకటి, ఆకు కూరా ఒక కొత్త మూకుడులో పెట్టి భక్తితో ఆయనకు అందిం చింది .కమ్మని చల్లని నీరు మట్టి ముంతలో ఇచ్చింది. వివేకుడు విసన కర్రతో విసర సాగాడు. ఇంతలో గోపన్న , రావమ్మ పొలం నుంచీ వచ్చారు. వారు ఆసన్యాసిని చూసి పాదాలకు నమస్కరించారు. సన్యాసి భుజించి వారిని దీవించి బయటికి వచ్చాడు. అక్కడున్న జన మంతా ” స్వామీ! తమరు ఎన్నోప్రదేశాలు తిరిగి ఉంటారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించి ఉంటారు.ఈ వింత ఏంటి స్వామీ! అందరి పోలాలూ నీరు లేక ఎండి పోయాయి. గోపన్న పొలం మాత్రం సస్యశ్యామలంగా ఉంది. పంట నిస్తున్నది.బావిలో కమ్మని నీటి జల ఉంది, ఎవ్వరి బావిలోనూ గుక్కెడు నీరులేదు.ఇదేం చిత్రం స్వామీ!” అని అడిగారు. దానికి సన్యసి చిరునవ్వుతో ” అతడి ధర్మమే అతడిని కాపాడుతున్నది.మన సంపాదన అంతా మనకొరకే కాదు. ధర్మ బుధ్ధితో మనకు సర్వం ప్రసాదించిన భగవంతునికి తిరిగి మనం కొంత సమర్పించాలి. పని చేసి సంపాదించుకో లేని వారికి కాస్తంత ఇస్తే భగవంతుడు సంతోషించి అట్టి వారిని సర్వదా కాపాడుతుంటాడు. “అని చెప్పి తనదారిన వెళ్ళిపోయాడు.

కనుక ‘ ధర్మో రక్షతి రక్షితః ‘.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked