ఉమాదేవి అద్దేపల్లి
అసలు శివుడు అంటేనే గొప్ప ధన్వంతరి .ఆయుర్వేదానికి మారుపేరు .ఆయువును వృద్ది చెందించేది ఆయుర్వేదం .అందుకే అతను మృత్యుంజయుడు.హిమాలయ పర్వతాలు అతని ఆవాసాలు.అక్కడ ప్రవహించే నదీనదాలే కాదు ,ప్రతి చెట్టు ,ప్రతి వేరు ఔషదీ గుణాలను కలిగి ఉంటాయన్నది జగద్విదితమే.అంతటి మహిమాన్విత ప్రదేశాలలో నివశించే తపోధనులే కాదు సామాన్యవ్యక్తులు కూడా దీర్ఘాయురారోగ్యాలు కలిగి ఉంటారన్నది ప్రత్యక్ష ప్రమాణంగా చూచిన వారెందరో . హనుమంతుడు కూడా నేటికీ హిమవత్పర్వతాలలో జీవించే ఉన్నాడన్న నమ్మకం చాలామందికి వుంది.అక్కడ గాలి ,నీరు , హరిత సంపదతో అలరారే పరిశుద్ద వాతావరణంలో అడుగుపెట్టిన ఏ వ్యక్తీ అయినా తమకున్న రుగ్మతలన్నీ మందు మాకు అవసరం లేకుండానే పోగొట్టుకొని సంపూర్ణ స్వస్థతతో తిరిగి వస్తాడు.
అంతటి దివ్య శక్తి సంపన్నమయిన హిమగిరులలో నెలకొన్న కైలాసపతి ఎక్కడ వుంటే అక్కడే ఆరోగ్యమనే మహాభాగ్యంతో తులతూగుతుంది ఆ పరమ శివుడు కొలువుతీరిన ప్రతి తీర్థ స్థలి…
అకార ఉకార మకారములు కలసిన అర్ధ నారీశ్వరుడు, ఓంకార స్వరూపుడయిన మహాదేవుని రూపకాలంకార చిత్రణలోనే అద్వైత సిద్ది,అమరత్వలబ్ది ప్రస్పుట మవుతుంటాయి.
జంతువులనుండి లభించిన ఉన్ని(wool),చర్మ ( Leather) దుస్తులు మంచు ప్రాంతాలలో నివసించేవారికి చలినుండి రక్షణ నిస్తాయని సృష్ట్యాదిలోనే తన వస్త్రధారణ ద్వారా నిరూపించాడు శివుడు .అందుకే అతను కరి చర్మాంబరధారి,కృత్తి వాసుడుగా వాసికెక్కాడు.నిశ్చల యోగ,ధ్యాన ముద్రలోనున్న ఆ ఆదియోగి ధ్యానం ద్వారా కలిగే ఉపలబ్ధిని చెప్పక చెప్తున్నాడు.ముక్కంటి,ముక్కోపి ఒక్కోసారి తనని తాను కంట్రోల్ చేసుకొనేందుకు తాండవ నృత్యం చేసేవాడట .అదే నేడు ఎక్సర్సైజ్ గా రూపాంతరం చెందించారు. అచంచల యోగముద్రలో ఉన్నవారిని పాములు కూడా ఏమీ చెయ్యవు ,పైగా అతని శరీరాన్ని అధిరోహించి అలంకారాలుగా భాసిల్లుతాయి.ఇటీవల జరిగిన ఒక సర్వేలో పాములు శరీరంపై పాకినపుడు వెన్ను నొప్పి ,కీళ్ళ నొప్పులు ,వాత నొప్పులు లాటివి మందులు లేకుండా నయమవుతాయని నిర్దారించారట..ఈ నిజాన్ని మన ఆది ధన్వంతరి శివయ్య మాటలతో కాక చేతలతో ఎప్పుడో నిరూపించాడు.
ఇన్ని దివ్య గుణ సంపన్నుడయిన ఆది శివుని దర్శించి ,స్పర్శించడం కూడా అదృష్టమే .స్పర్శామాత్రాన ఎన్నో భవరోగాలను నిర్మూలించే ఆ భక్త సులభుడి గురించి ఎంతచెప్పినా కొంతే అవుతుంది.మంచుకొండల మద్య మానస సరోవరం వద్ద కైలాసగిరిపై ధ్యానముద్రలో కూర్చున్నా,మండుటెండల్లో మండించే దక్షిణాదిని రామేశ్వరుడిగా సైకత లింగమై వెలసినా, రహదారి మధ్యలో ,నిత్యం రగిలే శవాదహనాల ధూపాలుఆస్వాదిస్తూ కాశీ విశ్వనాదుడిగా విరాజమానుడయినా,దట్టమయిన నల్లమల అడవుల్లో,ఎత్తయిన శ్రీశైల శిఖరాగ్రాన అందమైన ప్రకృతిసోయగాలను తిలకిస్తూ శ్రీ భ్రమరాంబాదేవి సమేత మల్లిఖార్జునుడై కొలువుతీరినా,ఆ ‘జ్యోతీర్లింగ స్వరూపుడు సదా శివుడు ( శివుడు అంటేనే మంగళ స్వరూపుడు) ఒకే స్థాయిలో ,ఒకే స్థితిలో ,ఒకే రీతిలో ఒకే కృపారస వీక్షణతో తన భక్తకోటినిఆదరించి ,అక్కున చేర్చుకొని ,కోర్కెలు తీర్చే కొంగుబంగారమై విలసిల్లుతున్నాడు.
ఒకప్పుడు వయో పరిమితి ,మానసిక పరిణితి తక్కువగా వున్న సమయంలో అనేక జ్యోతిర్లింగా లను దర్శించాను .అప్పట్లో వాటి ప్రభావాన్ని గుర్తించలేకపోయాను.తరువాత విన్న ఆ క్షేత్ర మహిమలు ,కొన్ని నాకు తెలియకుండానే అనుభవేకవేద్యమయిన అలౌకిక సంఘటనలు తలుచుకొని నాటి నా అజ్ఞానానికి నేడు నేనే భాదపడుతుంటాను..
ఇప్పుడు మానసిక ,వయో పరిపక్వత వచ్చాక దర్శించినది శ్రీ శ్రీశైల మల్లిఖార్జున స్వామి పేరున వెలసిన ‘జ్యోతిర్లింగం’…2018,అక్టోబర్ లో అనుకోకుండా కలిగిన సువర్ణావకాశం మా శ్రీశైల క్షేత్ర దర్శనం.
మా కుటుంబ సన్నిహిత మిత్రులు శ్రీమతి K.నాగమణి గారు శ్రీ శైలం టూర్ ఏర్పాటు చేస్తున్నామని వారితో పాటు నన్ను ,నాతొ పాటు అమెరికా నుండి వచ్చిన మా చిన్నబ్బాయి శ్రీధర్ ని తప్పక బయలుదేరి రమ్మని ఆహ్వానించినపుడు మా అబ్బాయి ఎగిరి గంతేసాడు.కానీ అప్పటికే మూడునెలలు యూరప్ ట్రిప్ తో శారీరకంగా ,మానసికంగా అలసివున్న నేను వెనకంజ వేసాను.. మరొక వారం లో అమెరికా తిరుగు ప్రయాణం .అందుకే ,
”
”నేను రాలేనురా బాబూ! నువ్వొక్కడివే వెళ్ళు .నాకు విశ్రాంతి అవసరం.అంత దూర ప్రయాణం చెయ్యలేను ”అన్నాను.
”ఇప్పుడు మన పాండిచ్చేరీ లో డైరెక్ట్ హైదరాబాద్ ఫ్లైట్ వేసారు .మన గుమ్మం లో కూర్చుంటే గంటలో హైదరాబాద్ చేరిపోతాము”నచ్చచెప్పే ధోరణిలో అన్నాడుశ్రీధర్ .అనడమే కాదు నేను సరే అనేలోపల మా ఇద్దరికీ టిక్కెట్లు కూడా బుక్ చేసేసాడు .ఆ టిక్కెట్లు నాకు ఇక్కట్లు తెస్తాయేమో అనిపించింది
ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే మా పాండిచ్చేరీ వాసులకి ఒక యజ్ఞమే.పాండీ నుండి నాలుగు గంటలు చెన్నై కారులో ,అక్కడ నుండి పదమూడు గంటలు రైల్లో ప్రయాణించవలసి వచ్చేది.కనుక అప్పుడు ఆ సాకు చెప్పి తప్పించుకొనే అవకాశం చిక్కేది ,ఇప్పుడు నా పీకల మీదకి ముంగిట పుష్పక విమానం దింపినట్టు శివయ్య ఈ ఫ్లైట్ ఏర్పాటు ఒకటి చేసాడు .అనుకున్నా విసుగ్గా . ఆరవ తేదీ మా ప్రయాణం అంతలోనే అన్నివైపుల నుండి వాతావరణ హెచ్చరికలు. అక్టోబర్ 6,7 తేదీల్లో భయంకరమయిన తుపాను సముద్ర తీరప్రాంతాలను తాకబోతోందని,ముఖ్యంగా పుదుచ్చేరీ ,చెన్నైలపై దాని ప్రభావం అధికంగా ఉంటుందని ,కనుక ఈ రెండు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని,ప్రయాణాలు చెయ్యొద్దని టీవీలు ,రేడియో లు ,వాట్సాప్ మెసేజులు హోరెత్తించాయి.ఫ్లైట్ రద్దయ్యే అవకాశం వుందని కుడా వార్తలు ..బతుకు జీవుడా ! అనుకున్నా,శివుడు నా కన్నా మొండిఘటం కదా !
మేము రావడం లేదు .అని హైదరాబాద్ ఫోన్ చేసి చెప్పేసి,బయట హోరున వర్షం కురుస్తుంటే చల్లదనానికి ,హాయిగా నిద్రపోయా ..హాశ్చర్యం.!.ఉదయాన్నే వెచ్చని సూర్యుని కరకిరణాలు మృదువుగా తాకుతూ మేల్కొలిపాయి.ఎర్రని ఎండ బయట ఆరుగంటలకే .
”ఇదేమిటీ ? తుఫాన్ అన్నారు కదా ! ఏమయిందబ్బా!” అనుకుంటుండగా
”అమ్మా !త్వరగా లేచి తెములు .ఫ్లైట్ రద్దు చెయ్యలేదు .”ఉత్షాహంగా అన్నాడు శ్రీధర్ .
తప్పుతుందా..! నా మందులు ,మాకులు కూడా బేగు లో పడేసుకొని ప్రయాణానికి సిద్దమయ్యాను..శివుని ఆజ్ఞ లేకుండా చీమయినా కదలదు .అతని ఆజ్ఞ ని కాదనగలనా !
అనుకున్నట్టుగా అక్టోబర్ ఏడవతేదీ ఉదయం ఎనిమిది గంటలకి నాగమణి గారి ఫ్యామిలీ తో కలిసి మేము శ్రీశైలం బయలుదేరాము.అచ్చం పేట రాగానే తనబాల్యమంతా అక్కడే గడిచిందని నాగమణి చెప్తూ అక్కడకి దగ్గరలో ఉమా మహేశ్వరం అతి ముఖ్యమయిన దార్శనిక స్థలమని కారుని అటు మరల్చమన్నారు .
అచ్చం పేటకి ముప్పై మైళ్ళ దూరంలో ఎత్తయిన కొండల్లో నెలకొన్న అత్యంత ప్రాచీన ,ప్రసిద్ద ,శైవ క్షేత్రం ‘శ్రీ ఉమా మహేశ్వరం ”. శ్రీ ఉమాదేవి సమేత మహేశ్వరులు స్వయంభువులని త్రేతాయుగంలో శ్రీ సీతారాముల చేత అర్చింపబడేవారని అక్కడి స్థల పురాణం, ఆ క్షేత్రాన్ని శ్రీశైల ఉత్తర ద్వారమని పేర్కొంటారని చెప్పారు అర్చకులు.
అక్కడి ప్రకృతి శోభ వర్ణనాతీతం .చుట్టూ దట్టమయిన నల్లమల అడవుల మధ్య ఎత్తయిన కొండల నడుమ వెలసిన క్షేత్రం ఉమామహేశ్వరం.ఇక్ష్వాకుల కాలంలో కట్టినట్టు చూడగానే అర్ధమవుతున్నయి కొండను దొలిచి కట్టిన సోఫానాలుచూస్తే.రహదారినుండికొండమీదికి వాహనాలు ( కార్లు ,బైకులు మాత్రమె ) వెళ్ళడానికి సంకీర్ణమయిన బాట వుంది .కారు దిగీదిగడంతోనే మా కోసం ఏమి తెచ్చారు అన్నట్టు ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టి మా వైపు మా చేతుల వైపు చూస్తూ చూపులతోనే ప్రశ్నించారు అక్కడదిగగానే ఎదురయిన మన పూర్వీకులు ( కోతుల మంద ) ఏ మాత్రం అప్రమత్తంగా వున్నా చేతిలో హ్యాండ్ బాగ్ కొట్టెయ్యడానికి సిద్దంగా వున్నాయి.
వాటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ,శ్రీ ఉమాదేవి మహేశ్వరులను దర్శించి ,తీర్ధ ప్రసాదాలు అందుకొని ,చుట్టుపక్కల రమణీయ ప్రకృతి సొబగులను చూస్తూ ,తెలియకుండానే చాలాసేపు ఆ ఎత్తయిన కొండల్లో తిరుగాడాము.రహదారి నిర్మించడం కోసం దొలచిన కొండల బండల మధ్యనుండి ఉడలు తన్నుకుంటూ పెరిగిన పెద్ద పెద్ద వృక్షాలను చూస్తే ఆశ్చర్యం అనిపించింది.మట్టిలో నిలదొక్కుకొని పెరిగిన మహా వృక్షాలను చూస్తున్నాము,కానీ రాతిలో పుట్టి ,రాతిలో పెరిగి రాతిని ఆధారంగా చేసుకొని విస్తరించిన వృక్షాలను చూడడం నాకు అదే మొదటిసారి .బహుశా హిమాలయాల్లో కూడా ఇలా రాలలో పెరిగిన వృక్షాలే అదికంగా ఉండొచ్చు ,కానీ అప్పట్లో నాకంత పరిశీలనాత్మక దృష్టి లేదు .
”రాలలో వున్ననీరు కళ్ళకెలా తెలుసు ..? అన్న ఒక సినీకవి వాక్యం గుర్తొచ్చింది. ఆ రాతి బండలలోవున్న ఆర్ద్రత అడవిలో చలువ పందిరి వెయ్యగలదని ఎవరూహించెదరు..?
పాదం సగంవరకూ మాత్రమె మోపగలిగే మెట్లతో నిర్మింపబడిన ఆ ఎత్తయిన ప్రదేశంలో కాస్త వయోభారం పై బడ్డవారు మాత్రం ఒక ఆసరా లేకుండా పైకి ఎక్కలేరు.బాటకిఒకవైపు ఎత్తయిన కొండలు ,మరొక వైపు చిన్నరాతి పిట్ట గోడ .ఆ గట్టుపై కూర్చొని చూస్తేఒక వైపు ఎత్తయిన గిరి సమూహాలు ,మరొక వైపు అగాధంలాటి లోయలు హరిత వర్ణశోభిత నల్లమల అడవుల ప్రకృతి సౌందర్యానికి దర్పణం పడుతూ మనసుకి ,శరీరానికి సేదతీరుస్తున్నట్టు అనిపిస్తుంది .అలా ఆ అందాలను ఆస్వాదిస్తూ కాలానికి కళ్ళాలు వెయ్యలేముగా,తప్పనిసరిగా బయలుదేరాలి
అక్కడ నుండి నేరుగా భారత తోలి ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రు గారిచే ‘ఆధునుక దేవాలయం ‘గా అభివర్ణింపబడిన శ్రీ శైలం ప్రాజెక్ట్ సందర్శించాము.
”కడుపు ఆకలితో రగులుతుంటే ,పెద్దల సుద్దులు ,ధర్మపన్నాలు చెవికేక్కుతాయా!”అన్నారు స్వామీ వివేకానంద.
శివుడు నిరాకార నిర్గుణుడు,పంచ భూతాలనేధారణగావించిన చిదంబరేశ్వరుడు,అతనికి ఆకలి దప్పులు వుండవు కానీ జీవుడికి అన్నపానాదులు అనివార్యం కదా జీవనయానం సాగించడానికి .అందుకే కోట్లాది మందికి కడుపునింపేఆ ఆనకట్టని ఆధునిక దేవాలయంగా పేర్కొన్నారు నెహ్రు గారు .
శ్రీశైలం పాతాళగంగ జలాశయం అడుగునుండి తవ్వబడిన సొరంగ మార్గం ద్వారా ,నీటికింద నిర్మించిన పవర్ ప్రాజెక్ట్ నిజంగా అత్యద్భుతం..ప్రకృతిగర్భాన్ని దోలుచుకుంటూ ,ఆమె గర్భాకుహరంలో దాగిన అనంత సంపదను వెలికి తీసి ,తనకి సౌలభ్యం కలిగించేరీతిలో అనుకూలంగా మలచుకుంటున్నమానవ మేధకి గీటురాయి ఈ ప్రాజెక్ట్ అన్నది నిర్వివాదాంశం.
అటు ఎత్తయిన గిరి శిఖరాలలో వెలసిన స్వయంభు శివుని శ్రీశైలమందిరం,ఇటు ఆ పర్వత పాదపాలలో నిర్మించిన భవుని ఆధునిక దేవాలయం .
”శివుడివా! భవుడివా! ఏమని పిలుతును నిన్ను ..!”
శివం లేకపోతె శవం . శివుడే భవుడు ,భవుడే శివుడు .అందుకే చివరికి ‘శివోహం ‘అని తేల్చి చెప్పేసాయి వేద సారాలు.
ఆ రాత్రి అష్టాదశపీఠాలలో ఆరవదిగాచెప్పబడే భ్రమరాంబాదేవి చల్లని ఒడిలాటి శ్రీశైల గిరులలో , ప్రయాణ బడలిక అనేది లేశమాత్రం లేకుండా ,విశ్రాంతిగా ,శాంతిగా సేదతీరి ,తెల్లవారు ఝామున లేచి ,స్నాన పానాడులు ముగించి ,శ్రీశైల మల్లిఖార్జున స్వామివారి దివ్య మందిర ప్రాంగణానికి చేరుకున్నాము.కళ్యాణ మండపంలో ముందురోజే ప్రత్యేక అభిషేకం కోసం టికెట్ తీసుకొనడం తో శ్రీ మల్లిఖార్జున భ్రమరాంబికా అమ్మ వార్ల సన్నిధిలో గోత్రనామాలతో ,సాముహిక అర్చన ,అభిషేకాలు జరిపించి ,అనంతరం పుజాకలశం లోని జలంతో శ్రీ మల్లిఖార్జున స్వామివారి జ్యోతిర్లింగాన్ని అభిషేకించాలని బయలుదేరాము.చుట్టూ ఎత్తయిన నాలుగు ప్రాకారాల మధ్య ,శ్రీ మల్లిఖార్జున ,భ్రమారాంబికాదేవిల దివ్య గర్భగుడి గోపురం దర్సనమిచ్చింది .భానుడి లేత ఎండలో దేదీప్యమానంగా ప్రకాశించే ఆ సువర్ణ గోపురాన్ని ,గోపుర శిఖరాన్ని చూస్తుంటే, ‘ఓం నమశ్శివాయ ‘అనే శివ పంచాక్షరీ నామ జపంతో మారు మ్రోగుతున్నఆ దివ్య ప్రాంగణం లో సాక్షాత్తు ఉమామహేస్వరులే కళ్ళముందు సాక్షాత్కరించిన అనిర్వచనీయమయిన అనుభూతి కలిగింది
”శ్రీ శైలం శిఖరం దృష్ట్వా
పునర్జన్మ న విద్యతే .”
అన్నారు అంతటి మహిమాన్విత గోపుర దర్శనం ఇంతకాలానికి,పాశం వేసి లాగి మరీ చూపించాడు శివయ్య .”చిత్త శుద్ధి లేని శివ పూజలేలయా ! అన్నాడు యోగి వేమన..తనని తలచినా తలవకున్నా చిత్త శుద్ధి కలిగిన చోటికి తానుగా వస్తాడు, తన వెంట గొని పోతాడు మహాదేవుడుఅనిపించింది .
అయ్యవారి ,అమ్మ వారి దర్శనానంతరంఆత్మారాముడు నా సంగతేమిటని గగ్గోలు పెడుతుంటే,అతన్ని ఓదార్చడానికి అక్కడే వున్న చిన్న పాక హోటల్లో ప్రవేశించాము.తరువాత ఆ చుట్టుపక్కల చిన్న చిన్న దుకాణాలు చూసుకుంటూ,అవసరం వున్నా లేకున్నా ,తీర్థ స్థలికి వెళ్ళారు కదా ! ఏమి తెచ్చారు ,అని దగ్గరవాళ్ళు అడుగుతారేమో అనే ఫీలింగ్ తో చిన్నా ,చితకా వస్తువులేవో కొని బేగు లో వేసుకున్నాము.
తర్వాత పాతాళగంగమ్మ దర్శనం ,బోటు ప్రయాణం. అంతెత్తు శిఖరాగ్రాన వున్నఆ పరమ శివుని జటాజూటంలోని మరొక పాయ ఈ పాతాళగంగమ్మ అనిపిస్తుంది .అది చూసి ప్రేరితులై
ప్రముఖ సినీకవి ”శ్రీ శైలం మల్లన్న శిరసొంచేనా ,చేనంతా గంగమ్మ వ్రాల…”అనే పాటను రాసారట. చుట్టు విస్తరించి వున్న నల్లమల అడవులను చూసినపుడు విశ్వనాధవారు గుర్తురాకమానరు..వారు కూడా ఆ అడవులను ,ప్రకృతి సోయగాన్ని చూసి మురిసి ,మైమరచి
”ఆకులో ఆకునై ,పూవులో పూవునై ఈ అడవి దాటి పోనా ! ఎట్లయినా ఇచటనే ఆగిపోనా …”అనుకున్నారట.అవునుమరి .ఉత్తమ సాహిత్యం ఉపిరి పోసుకోవాలన్నా,ఉన్నత కవిత్వం ఉప్పొంగాలన్నా దానికి పరిసరాల ప్రభావం ,సహకారం ఎంతయినా అవసరం కదా ! ప్రశాంత ,పవిత్ర ప్రకృతి ఒడిలో ఒదిగి .హృదయ కవాటాలను తెరచి ఉంచిన వారి లో ఉప్పొంగే సాహితీ ఝరి ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది.
అంతకు వారం రోజుల ముందు మాంచెస్టర్ లో నేను సందర్శించిన ‘లేక్ డిస్ట్రిక్ట్ ‘చూసినపుడు నాకదే అనిపించింది .విలియం వర్డ్స్ వర్త్ అక్కడ వుండేవాడట.అతని కవితలకి అక్కడి ప్రకృతి ప్రేరణట.అందుకే అతను కూడా ప్రపంచ స్థాయిలో గొప్ప కవిగా నిలిచిపోయాడు.అసలు ప్రకృతివర్ణన అనేది మన( ఆధునిక ) కవులు పాశ్చ్యాత్యకవుల ద్వారా ప్రేరణ పొందారని కొందరు పెద్దల ఉవాచ ..ఏది ఏమయినా ప్రపంచ ప్రసిద్ది చెందిన కవులు ,గ్రంధకర్తలు పుట్టి పెరిగింది పచ్చని,పరిశుద్ద ప్రకృతి ఒడిలోనే.
కులగోత్రాలు లేనివాడుగా అభివర్ణింప బడే శివయ్య సన్నిధిలో అన్ని కులాల వారికీ వారి వారి కులాల పేరుతొ వేర్వేరు గెస్ట్ హౌసెస్ వున్నాయట.మాకై ముందుగా ఏర్పాటు చేయబడిన గెస్ట్ హౌస్ ఏకులానికి చెందినదో నాకయితే తెలియదు .భగవంతుని సన్నిధానంలో ఆశ్రయమిచ్చిన ఆ అతిధి గృహం నాకొక కైలాసమే అనిపించింది .వారు పెట్టిన ఉచిత భోజనం ,పరమాత్ముని కైంకర్యమే అనుకున్నాను . . పరిసరాలను ఎంతో పరిశుబ్రంగావుంచారు,అంద మైన పూతోట మద్యలో పెద్ద శివుని విగ్రహంతో పాటు ,అనేక భంగిమలలో ఎన్నో స్త్రీ మూర్తి రూపాలు ప్రతిష్టింపబడి కడు రమణీయంగా వుందా ప్రాంగణం .
మధ్యాహ్న భోజన ప్రసాదం మేమున్న అతిధి గృహంలో స్వీకరించి ,మధ్యాహ్నం మూడుగంటలకి తిరుగు ప్రయాణమయ్యాము.
అక్కడనుండి శ్రీశైల శిఖర దర్శనం చేసే కొండపైకి చేరాము.
”ఉదయం మందిర శిఖరగోపురం దగ్గర నుండి చూసి పునర్జన్మనుండి ముక్తి పొందేయ్యొచ్చని సంబరపడ్డారు .కానీ ఇక్కడ నుండి చూడ గలిగిన వారికే ఆ అదృష్టం .”అన్నారు మిత్రులు.
అంత తేలికగా ముక్తి మోక్షం లభిస్తే అందరూ పునర్జన్మ నుండి విముక్తి పొందేయ్యోచ్చు ..అందరూ జన్మ రాహిత్యం పొందితే ప్రపంచంలో మిగిలేది శూన్యమే కదా ! సృష్టి స్థితి లయలనే చక్రభ్రమణమే ఆగిపోతుంది అందుకే ప్రతీదాన్నీ అందీఅందకుండా చేసి ఆటాడిస్తాడు అంతర్యామి .బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడుకోవడం అతనికొక వేడుక కదా మరి .
”ప్రపంచం మిధ్య ,నువ్వు మిధ్య ,నేను మిధ్య .కనపడని పరమాత్మ సత్యం .కనుక ఎందుకీ పాడు బతుకు ,పాడు లోకంలో మళ్ళీ మళ్ళీ పుట్టడం కన్నా .అతనిలో కలిసిపోవడం మంచిదికదా ”అంటూ వైరాగ్యం వెళ్ళబోసాడు యాత్రికుడోకాయన శిఖర దర్శనం అవుతుందేమో అని ఆశతో తేరిపారిచూస్తూ .మిధ్యావాదం నా ఒంట పట్టదు. ప్రపంచం నుండి పలాయనం అవ్వాలనుకోవడం పిరికితనం అనిపిస్తుంది ..ఏదయినా సరే నిలిచి గెలవాలనే పట్టుదల గల స్వభావం కనుక నేను పునర్జన్మ రాహిత్యం కోరుకో పోయినా ,ఇక్కడనుండి శిఖర దర్శనం అవుతుందా ! లేదా !చూడాలనే ఆసక్తి .అది అసంభవం అని తెలుసు.ఎందుకంటే తనికెళ్ళ భరణి గారు వర్ణించిన ‘శంఖు చక్రాలు ‘చేతికి వచ్చాయి .దానివలన మసకబారిన దృష్టికి దగ్గర వస్తువులే ఒక్కోసారి కనిపించవు.ఇక కొన్ని యోజనాల దూరంలో వున్న మందిర శిఖరం ఏమి కనిపిస్తుంది ..అయినా అక్కడి దర్శనీయ స్థలాలలో అది ముఖ్యం అంటారు కనుక ఒక టిక్కు మార్కు .అక్కడితో ఆ ప్రహసనం ముగిసింది.
ఇవ్విధంబున మా శ్రీశైల పర్యటన ముగించి గృహోన్ముఖులమయ్యాము.మొత్తానికి మా శ్రీశైల పర్యటన ఒక విహారయాత్రలా ఆద్యంతం ఆనందంగా ,సాఫీ గా సాగిపోయింది
కన్యా కుమారి నుండి కాశ్మీరం వరకు సంపూర్ణ భారత యాత్ర చేసాను ఎప్పుడో ,కానీ శ్రీశైల దర్శనం మాత్రం ఎప్పటినుండో పెండింగ్ లో ఉండిపోయింది..బహుశా ఎప్పుడు ,ఎలా ,ఎవరిద్వారా ఎక్కడికి వెళ్ళాలి అనేది దైవనిర్ణయం ప్రకారం జరుగుతుందేమో .ఇన్నాళ్ళకి ఈ అవకాశాన్ని శ్రీమతి నాగమణి దంపతుల ద్వారా కలిగింది .అందుకు వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఇక ముక్తాయింపుగా చెప్పబోయేది ఏమిటంటే ,
ఇంటినుండి నా శారీరిక ఆరోగ్య పరిస్తితి ఏమాత్రం సహకరించే స్థాయిలో లేదనిపించి. అనాసక్తంగానే శ్రీశైలం ప్రయాణం అయ్యాను.తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతోనే హైదరాబాద్ లో మా అబ్బాయితో కొద్దిదూరం వెళ్లాను ఇక అడుగువేసే ఓపిక లేక హోటల్ రూమ్ కి వచ్చి విశ్రాంతిగా పడుకోవాలనుకున్నా,బడలిక అనిపించి నిద్ర పట్టలేదు .ఈ పరిస్టితిలో ఎలా నాలుగు గంటలు ప్రయాణం చేసి ,నల్లమల అడవుల్లో వున్న శ్రీశైలం కొండలు గుట్టలు ఎక్కగలను .? అనే బెంగ పట్టుకుంది .
కానీ ఉమామహేశ్వరంలో అడుగుపెట్టాక,అక్కడి స్థల మహత్యమో ,వాతావరణ మహత్యమో ఎత్తయిన కొండలు,జారిపడతామేమోఅనిపించే చిన్నచిన్న మెట్లు అవలీలగా ఎక్కగాలిగాను .అంతవరకు వున్న కాళ్ళ నొప్పులు ,అలసట అన్నీ మంత్రం వేసినట్టు మాయం అయిపోయాయి.ముందస్తు జాగ్రత్తగా మెట్లు దిగినపుడు కాలు స్లిప్ అవకుండా మా అబ్బాయి చెయ్యి ఆసరాగా తీసుకున్నా ,నాలో ఎదో కొత్త శక్తి ప్రవేశించి ,నూతనోత్సాహం నింపినట్టు అనిపించింది .అక్కడ నుండి రాత్రి గెస్ట్ హౌస్ చేరేవరకు మిట్టపల్లాలు ఎక్కుతూ ,దిగుతూనే వచ్చాను . రాత్రి గెస్ట్ హౌస్ వారు పెట్టిన అన్నప్రసాదం తిని ,గదికి వెళ్లి ,బట్టలు మార్చుకొని పక్కమీద వాలగానే అమ్మ వడిలో అలసిసొలసి ఆదమరచి నిడురపోయిన పసిపాపలా హాయిగా ,నిశ్చింతగా నిద్రపట్టేసింది.ఉదయం లేవగానే ఒళ్ళంతా ఎంతో తేలికగా దూది పిందెలా అనిపించింది .మూడున్నర కే లేచి హుషారుగా రెడీ అయిపోయాను..బయలుదేరినపుడు ‘అమ్మా ! వేళకి టాబ్లెట్స్ వేసుకోవడం మరచిపోకు ‘అని పిల్లలంతా హెచ్చరిక .నాతొ వున్న మా అబ్బాయి కూడా అనుక్షణం గుర్తుచేసినా ,అసలు ఆ రెండు మూడు రోజులు టాబ్లెట్స్ ఎక్కడున్నాయో మరచిపోయాను.
మరొక విశేషం .యూరప్ వెళ్ళిన తర్వాత అంతకు ముందు మూడు నెలలనుండి నా ఎడమచెయ్యి నా స్వాధీనంలో వుండేది కాదు.ఒకే చేత్తో పనిచేసేదాన్ని.దుస్తులు మార్చుకోవాలన్నా,తల దువ్వుకోవాలన్నా నరకయాతన అనుభవించేదాన్ని.ఎలాగూ అక్టోబర్ రెండవవారంలో అమెరికా వెళ్ళిపోతాను కనుక అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చని అశ్రద్ద చేసాను.కానీ ఉమామహేశ్వరంలో నా ఎడమచేతిని ఆనిస్తూ మెట్లు ఎక్కినపుడు నేను గమనించలేదు ,నా చెయ్యి ఎప్పటిలా పనిచేస్తోందని..శ్రీశైలంలో అభిషేకానికి గంటన్నర కూర్చొని పూజ చేసినపుడు కూడా నేను గుర్తించలేకపోయాను.పూజ కలశంలో జలాన్ని మల్లన్నని అభిషేకించి, దివ్య జ్యోతీర్లింగానికి శిరస్సునానించి,బయటకి వచ్చాక అప్పుడు గమనించాను నా చెయ్యి ఎప్పటిలా పనిచేస్తోందని.
ఈ విషయం ఎందుకు ప్రస్తావించానంటే ,ఆధునిక విజ్ఞానం ఉడలు తన్నుకున్న కొలది మనుషుల్లో నాస్తికత పెచ్చుపెరుగుతోంది.దేముడున్నాడా ! లేడా ! అనే మీమాంస అడుగడుగునా గుడులున్న మనదేశంలోనే ఎక్కువయిపోయింది.కంటికి కనిపించేది మిధ్య అని ఆస్తికులంటారు ,కంటికి కనపడని దైవం ఉన్నాడని ఎలా నమ్ముతాము అని నాస్తిక వాదన.నడుస్తున్నవాడు కంటికి కనిపిస్తాడు ,నడిపించేవాడు కంటికి కనపడదు.కంటికి కనిపించనిది ఉనికి ,కంటికి కనిపించేది అభివ్యక్తి. పూవు,తావి – సూర్యుడు కిరణము -దీపం ,కాంతి ఇవి అవిభాజ్యములు.అలాగే సృష్టి సృష్టి కర్త ..
దైవం ఎక్కడో ఆకాశంలో వున్నాడనుకుంటేఆ ఆకాశమే తానంటాడు శివుడు .ఎక్కడో జలధిలో అతను దాగొన్నాడనుకున్నా,ఆ జలమే తానంటాడు .పంచభూతములు ముఖ పంచకములయిన పరమశివుడు అందని దూరాలలో ఎక్కడున్నాడు .! తరచి చూస్తే పంచబౌమాత్మిక దేహంలో లేడా..! అది గ్రహించలేకపోవడమే మాయ.
పుణ్య తీర్థాలను దర్శించాలని మనవారు చెప్పడంలో అంతరార్ధం ,ఆయా ప్రదేశాల్లో వున్న మహిమాన్విత శక్తుల ప్రభావం ,అక్కడవీచే గాలి ,ప్రవహించే నీటి ద్వారా మనలో ప్రవేశించి ,మనలో నిద్రాణమై వున్న అలోకిక శక్తులను మేల్కొలుపుతుంది. అటు హిమాలయాలలో కానీ ,ఇటు నల్లమల అడవులలో కానీ గొప్ప శక్తిమంతమయిన ఔషధీ గుణాలు గల వృక్షాల నుండి వీచే గాలి పీల్చిన మాత్రానికే ఎంతో స్వస్టత చేకూరుతుంది .
అక్కడ హిమాలయోత్తుంగా శిఖరాలనుండిజాలువారిన గంగా భవాని అయినా ,ఇటు శ్రీశైలం మల్లన్న తలవంచగావ్రాలిన పాతాళ గంగమ్మ అయినా స్పర్శా మాత్రాన విద్యుత్ తరంగాలుగా వాటి ప్రభావాన్ని మనకి అందిస్తాయి.గంగలో మునిగితే పునీతులు అవుతారు అంటారు .దానర్ధం ఆ పవిత్ర జలాలలో దాగిన రోగనిరోధక శక్తి మనిషికి శారీరకంగానే కాక ,మానసిక స్వస్తతని కూడా చేకుర్చుతుందని నాటి ఋషుల వాక్కు.నాడు ,నేడు ఏనాడు ప్రకృతి ఒకే రీతిలో తానూ అందించేది అందిస్తునే వుంది .అందుకొని సక్రమంగా వినియోగించడం చేతకాని మనిషి తనకి జీవనాదారమయిన ప్రకృతిని సర్వనాశనం చేస్తూ ,తన వినాశాన్నితాను కొనితెచ్చుకుంటున్నాడు.
అద్భుత శక్తులు గల ఘనారణ్యాలను నాశనంచేసి,పవిత్ర జలాలను కలుషితం చేసి ,శుద్ధ వాయువును దోష భూయిష్టంచేసి ,భగవంతుని రూపంగా ఆరాదించే పంచభూతాలను ఆధునిక వసతులు ,ఆధునిక విజ్ఞానం పేరిట దుర్వినియోగం చేయడం మాని ,ప్రకృతి సంపదను కాపాడుకోగలగాలి ,దేముడు ఉన్నాడా ! లేడా! అన్న శుష్క నాస్తికవాదానికి స్వస్తి చెప్పి , పుణ్య క్షేత్రాలుగా మనవారు చెప్పిన దివ్యదామాలలో వున్న గొప్పతనాన్ని గుర్తించి ,అవకాశం వున్నంతలో కనీసం కొందరయినా కొంతకాలం అటువంటి ఆరోగ్య కరమైన వాతావరణంలోగడిపి మానసిక ,శారీరిక రుగ్మతలనుండి దూరం కాగలిగితే ,రోగానిరోధకాలు కాకపోగా మనుషులను మరింత రోగగ్రస్తులను చేసే కార్పోరేట్ హాస్పిటల్స్ ని పెంచి పోషించవలసిన దౌర్భాగ్య స్థితి నుండి బయట పదవోచ్చు.
ప్రకృతిని కాపాడండి .ప్రకృతి మనకందించే సహజవనరులను కలుషితం చెయ్యకండి.దైవాన్ని నమ్మకపోయినా పర్వాలేదు .ప్రకృతిని నమ్ముకోండి…ప్రకృతి దయతో అందించే సహజ ఔషదాల విలువ గ్రహించి ,వాటిల్లో నున్న అమృతత్వాన్ని ఆస్వాదించండి ..భవరోగాలనుండివిముక్తి పొందండి ..అని నేను సైతం పిచ్చిగొంతుకవిచ్చి చెప్పాలనుకుంటాను ..నా పిచ్చిగానీ ఎవరు వింటారు …ఏది ఏమయినా ,
సర్వేజనాః స్సుఖినో భవంతు!