-ఆదూరి హైమావతి
నడకుదురు అనే గ్రామంలో నరసింహం అనే ఒక యువకుడు ఉండే వాడు. తల్లీ తండ్రీ ఎంత చెప్పినా చదువుకోక, ఏపనీ నేర్చుకోక తిని తిరుగుతూ సోంబేరిలా తయారయ్యాడు. తల్లీతండ్రీ మొత్తు కుని వాడికోసమే దిగులు పడి గతించారు.వాడికి ఆకలికి అన్నంపెట్టేవాళ్ళు లేక కడుపుమంటకు ఆగలేక చిన్న చితకా దొంగతనాలు చేయసాగా డు. తోటల్లోపడి దొరికిన కాయా పండూతింటూ ఆకలి తీర్చుకో సాగాడు. ఎవరైనా ఇదేమని అడిగితే వారిమీద తిరగబడి కొడుతూ ,అడ్డదిడ్డంగా తిరుగుతూ కడుపు నింపు కుంటూ చివరకు ఒక దుర్మార్గుడుగా తయారయ్యాడు. వాడితో మాట్లాడనే అంతా భయపడేవారు. ఎవరైనా డబ్బిచ్చి ఏం చేయమన్నాచేస్తూ ,చివరకు హంతకుడై ఎవ్వరికీ దొరక్కుండా తిరగ సాగాడు.
నడకుదురు గ్రామం చిట్టడవికి దగ్గరగా ఉండేది .ఆగ్రామం నుంచే అటూ ఇటూ నగరాలకు వెళ్ళాలి. చిట్టడవి దాటను కాలిబాటా, బండ్ల బాట తప్ప మరో మార్గంలేదు.అందువల్ల అంతా చిట్టడవిదాటను భయ పడేవారు.కొందరు స్వార్ధపరులు ప్రత్యర్ధులెవరినైనా మట్టు పెట్ట ను ఆ చిట్టడవిని ఎంచుకునేవారు . దానికి అందరికీ ఉన్న ఒకే ఒక వ్యక్తి నరసింహమే. సొమ్ము తీసుకుని ఎవరనైనా చూడక చిట్టడవి లో మలుపుదార్లో గుబురు చెట్లమీద మాటేసి వస్తున్న వారిమీద , పై నుంచీ ఉరితాడు విసిరి ఒడుపుగా పట్టి లాగి చంపేసేవాడు.
ఆసొమ్ముతో కొన్నాళ్ళు ఊర్లమీద తిరిగి సొమ్ము ఖర్చయ్యాక తిరిగి ఊరు వచ్చేవాడు. వాడికోసం మరికొందరు తమ ప్రత్యర్ధులను చంపించను ఎదురుచూసేవారు.
ఒకమారు నరసింహం ఒక పూజారిని చంపను నియమింపబడ్దాడు. నిజానికి ఆపూజారి చాలా ఉత్త ముడు.అతడు పూజచేసే ఆలయం చాలా పురాతన శివాలయం. గొప్ప మహిమగల దేవుడా శివుడు. బాగా ఒరుంబడి ఉండే ఆలయం. ఆపూజారి దేవుడి సొమ్ము ఆలయ ధర్మ కర్తలకు అందకుండా దేవునికే సమర్పించడం గిట్టక అతడ్ని చంపితే ఆ వృత్తిలో తమకు అనుకూలురకు నియమించుకోవచ్చని భావించి పొరుగూరు వారు నరసింహాన్ని నియమించారు. నరసింహం చిట్టడ వి ఇరుకుదార్లో ఒక పెద్ద మర్రి మాను మీద మాటేసి కూర్చున్నాడు.
ఇంతలో అతడికి తెలీకుండానే ఏదో ఆవేసించినట్లు అతడి మన స్సు మంచి ఆలోచనలవేపు వెళ్ళింది. ‘ నేనెందుకు ఇలా చంపుతు న్నాను.ఈ సొమ్ముతో పొట్టనింపు కోడమేగా చేసేది. ఉత్తపుణ్యానికి పూజార య్య ను చంపడం న్యాయమా! భగవంతుని రోజూ అర్చించి. ప్రజలందరిక్షేమంకోరే పూజారి తనకేం అన్యాయం చేశాడని ఆయ న్ను చంపబోతున్నాడు!ఎన్నోమార్లు ఆపూజారి తనకు కావలసినంత ప్రసాదం పెట్టి కడుపునింపాడు.తన ఆకలి తీర్చిన మంచిమనిషినే నేను చంపడమా!’అనిపించసాగింది.
ఇంతలో క్రింద పెద్దగా జంతువుల అరుపులు వినిపించాయి. చిత్రం గా అతడికి వాటిమాటలు అర్ధమవ సాగాయి. ఒక పులి ఒక మేకను నోటి తో పట్టుకుని పట్టితెచ్చి ఆచెట్టుక్రింద జాగ్రత్తగా పెట్టింది. జంతువు లన్నీ గబగబా వచ్చి చూసి, కొన్ని జంతువులు నోటితో పక్కనే ఉన్న నదీజలాన్ని తెచ్చి ఆ మేక మీద పోయసాగాయి. మరికొన్ని మృగాలు ఆకులతో ఆమేక కు విసరసాగాయి.కొద్దిసేపటికి ఆమేక మెల్లిగాకదిలి కళ్ళు తెరిచింది. ఆజంతువులన్నీ సంతోషంగా అరిచాయి.
పులి చెప్తున్నది ఇలా” ఓ మిత్రులారా! మానవులు ఎంత స్వార్ధపరులోకదా! తామే పెంచిన ఈ మేకను అడవి చివర్లో కోసి తినను కత్తితో వచ్చారు .మేక భయంతో అరవగా గొంతుకు ఉరితాడు బిగించారు. కత్తి ఎత్తి కొట్టబోగా నేను ఒకే అరుపు అరిచాను. అంతే పక్కాలేకుండా పరుగె త్తారు. వారి ప్రాణం వారికి అంత తీపే మరి తామే పెంచిన ఈ మేక ప్రాణం తీయను వెనుకాడని ద్రోహులు. స్వార్ధపరులు. మేమే మేలు వారికంటే .ఆకలైతే కానీ మా ఆహారాన్ని చంపము. ఈ మేక మనమధ్యే బతుకుతుంది.అంతా సహకరించండి.దీనికి సహకరించండి. ఎవ్వ రూ ఏ అపకారం చేయకండి.”అనే పులిమాటలు విని నరసింహం మనస్సు మారిపోయింది.
ఎవ్వరికీ ద్రోహం చేయని ఎంత మందిని తాను కడుపునింపుకోను చంపాడోకదా! ‘అనిబాధపడి , ‘ఈజంతువుల కున్న పాటి మంచిమనస్సు ,దయ , జాలి ,సానుభూతి , జాతిమైత్రీ, తనకు లేకపోయాయి కదా!’అనిచింతించి ఆజంతువులన్నీ వెళ్ళగానే , చాలాసేపు అక్కడేకూర్చుని , ఆ పూజారి వచ్చాక, ఆయనతో నిజం చెప్పి , క్షమాపణకోరాడు.
ఆయన ‘ ఓ నరసింహా! నీ అయ్యా అమ్మా నాతో నీగురించీ రోజూ చెప్పుకుని ఏడ్చేవారు.నిన్ను మార్చేలాగా ప్రార్ధన చేయమని నాకు చెప్పేవారు.చివరకు మరణీంచేరోజుకూడా కోరారు. వారికోరిక ప్రకారం రోజూ నిన్ను మార్చి మంచిగాచేయమని దేవుని ప్రార్ధించేవాడిని . ఈ రోజుకు స్వామికి నాప్రార్ధనా చెవినబడి, నీమీద దయ కలిగి స్వామివారు నిన్నుమార్చారు. నీవుమారావు. అంతే చాలు. నాతో పాటుగా ఆలయంలో సేవచేసుకుంటూ , హాయిగా నిజాయితీగా జీవించు.”అని తన వెంట పెట్టుకు వెళ్లాడు పూజారి. తన జీవితాన్ని మంచిగా మార్చుకుని ,మంచిగా జీవించాడు నరసింహం. వాడినలా మార్చిన వాడి తల్లీ తండ్రీ ఆత్మలు కూడా సంతోషంగా స్వర్గం చేరాయి.
నీతి– ఇతరులకోసం స్వార్ధ రహితంగా చేసే ప్రార్ధన తప్పక ఫలిస్తుంది.