కథా భారతి

పాకీ వాడు

-ఆర్ శర్మ దంతుర్తి

ఓహైయో, కేస్ వెస్టర్న్ యూనివర్సిటీ కేంపస్ నుంచి దాదాపు రాత్రి ఎనిమిదిన్నరకి చలిలో వెనక్కి నడుచుకుంటూ వచ్చి బూట్లు కూడా విప్పకుండా అపార్ట్ మెంట్ వంటింట్లోకి దూరిన మనోజ్ కి వంట వండుతోన్న అప్పారావు కనిపించేడు. “ఏంటి గురూ డిన్నర్, కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్, వంట చేయడం అయిపోయిందా?”
“ఇదిగో అవుతోంది, బట్టలు మార్చుకురండి, తినేద్దాం.” చెప్పేడు అప్పారావు.

అన్నం తింటూంటే కబుర్ల మధ్యలో మనోజ్ చెప్పేడు, “వచ్చే నెలలో నాకు థీసిస్ చేయాలా, లేకపోతే నాన్ థీసిస్ ఆప్షన్ చేయాలా అనేది తేల్చుకోమని చెప్పేడు ఇవాళ గురుడు.”
“ఏం చేద్దామనుకుంటున్నారు?”

“నాన్ థీసీస్ అయితే ఓ ఐదారుసార్లు రాసిందే రాసి దిద్దించుకోవచ్చు. తర్వాత అది ఎక్కడ పారేసినా ఎవడికీ పట్టదు. థీసిస్ అయితే దాన్ని సమర్ధించుకోవాలి, ముగ్గురు ప్రొఫెసర్లకి కాళ్ళు కడగాలి, ఆ తర్వాత ఎవడికి నచ్చకపోయినా మరోసారి దిద్దడం, మరోసారి కాళ్ళు కడగడం అంతా తంటా కాదా?”

“ఎమ్. ఎస్ చేయడానికే ఇంత ఇదైపోతున్నారు; నా గురించి ఆలోచించారా? నాన్ థీసీస్ ఆప్షన్ అనేది లేనే లేదు. నాకు డాక్టరేట్ రావాలంటే అయిదుగుర్ని పట్టాలి. అందులో మళ్ళీ ఒకడు వేరే ముక్కూ మొహం తెలియని డిపార్ట్ మెంట్ వాడు ఒకడు ఉండాలి. ఓ సారి ఈ అయిదుగుర్నీ పడితే ఇంక వాళ్ళని మార్చరాదు, అందులో ఒకడు పోతే తప్ప….”
“పాపం శమించుగాక” నవ్వేడు మనోజ్, అప్పారావుని మధ్యలో అడ్డుకుని.
“సరే మీరేం చేద్దామనుకుంటున్నారు”

“నాన్ థీసీస్” అని ప్రస్తుతానికి ఐడియా. మరో రోజు ఆలోచించి ఎల్లుండి చెప్పాలి.” డిన్నర్ ముగించి తన గదిలోకి వెళ్ళేడు మనోజ్.
ఆ రోజు వంట తనది కనక అప్పారావు తినడం ముగించాక మిగిలిన కూరా నారా ఫ్రిజ్ లో పెట్టడానికి లేచాడు.

* * * * * * * *

మూడో రోజున మనోజ్ చెప్పేడు అప్పారావుతో తాను నాన్ థీసీస్ ఆప్షన్ తీసుకుంటున్నట్టూ. మరో ఆరునెలలకి మనోజ్ డిగ్రీ తీసుకుని యూనివర్సిటీలోంచి బయటపడ్డాడు. గ్రాడ్యుయేషన్ నాడు సాయంత్రం ఇంటికొచ్చాక చిన్న పార్టీ మరో పది మందితో. వంట అప్పారావే చేసిపెట్టేడు.
పార్టీ మధ్యలో అందరి ముందూ మనోజ్ చెప్పేడు ఛాతీ విరుచుకుని, “నాకు టెక్సాస్ లో ఉద్యోగం వచ్చిందోచ్!”
వెంటవెంటనే అందరికీ షేక్ హేండ్ లు ఇచ్చేక చిన్నగా డిస్కషన్ మొదలైంది – అమెరికా రాగానే ఉద్యోగం వెతుక్కుంటూ, వస్తే అందులో చేరిపోవడం మంచిదా, లేకపోతే డిగ్రీ పూర్తి చేసే వరకూ ఆగడం మంచిదా?

రకరకాల అభిప్రాయాలు మొదలయ్యేయి. బీర్లు వంట్లోకి దిగుతూంటే ఇవన్నీ కాస్త వేడెక్కడం అప్పారావు గమనించేడు. నోరు మెదపకుండా కూర్చున్నప్పుడు ఓ ఎమ్.ఎస్ కుర్రాడు అడిగేడు అప్పారావుని, “గురూ గారూ మీరేమంటారు. ఎమ్ ఎస్ చేసినా, పీ.హెచ్.డి చేసినా మనందరం చేసే ఉద్యోగం ఒకటే – ప్రోగ్రామింగ్. ఎమ్. ఎస్ డిగ్రీ ఉంటే గ్రీన్ కార్డుకు సులభం అనుకోండి, కానీ ఉద్యోగం ఇచ్చి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ దొరికితే ఈ డిగ్రీ నాలిక గీసుకోవడానిక్కూడా పనికిరాదు కదా?”
అప్పారావు చెప్పేడు, “నేను అలా అనుకోవట్లేదండి. ముందు నేను ఇక్కడ కొచ్చింది నా డాక్టరేట్ సంపాదించుకోవడానికి. తర్వాత ఉద్యోగం అంటారా, వస్తే మంచిదే లేకపోతే ఇండియా వెళ్తే ఎక్కడో ఓ చోట పాఠాలు చెప్పుకుని బతికేయలేనా?”
“ఇంతకీ మీ బ్రాంచ్ ఏంటండి – కంప్యూటర్ సైన్సా, మేనేజ్ మెంటా?” అడిగేడు ఎమ్. ఎస్ కుర్రాడు.
“శానిటేషన్ ఇంజినీరింగ్”
“హేవిటీ? శానిటేషన్ ఇంజినీరింగా? అంటే ఏం చేస్తారు?”

అప్పారావు నవ్వి ఊరుకున్నాడు. ఎమ్.ఎస్ చప్పట్లు కొట్టి చెప్పేడు అందరితో, “వినండోయ్, మన గురూగారు ఇండియానుంచి శానిటేషన్ ఇంజినీరింగ్ చేయడానికి కొచ్చార్ట.” మళ్ళీ అప్పారావు కేసి తిరిగి చెప్పేడు ఎమ్. ఎస్. “మిమ్మల్ని ఎవరో బుట్టలో వేసారు గురూగారు. ఈ రోజుల్లో పనికొచ్చేది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఒక్కటే. ఎన్ని లాంగ్వేజ్ లు వచ్చు, ఎన్ని డాటాబేస్ లు వచ్చు అనేది కావాలి కానీ, శానిటేషన్ ఏవిటండీ?”
“శానిటేషన్ అంటే పాకీ పనేనా?” వెక్కిరింపుగా అన్నాడు మరో ఎమ్. బి. యే కుర్రాడు. నవ్వులు పూసాయి.
“అందులోనూ మన గురువుగారు పాకీపనిలో పీ. హెచ్. డీ!” మరింత వెక్కిరించేడు మనోజ్. ఒక్కసారి అవాక్కయ్యేడు అప్పారావు. తనతో ఆరునెలలు పైన రూమ్మేట్ గా ఉన్న మనోజ్ ఇలాంటివాడా? తనకి ఏదో మనిషిగా కూడా గౌరవం లేదా? శానిటేషన్ చదివితే ఏమిటి? తన స్వంత రూమ్మేట్ మనోజ్ ఏదో తనని సమర్ధిస్తాడేమో అని అప్పారావు అనుకున్నాడు కానీ మనోజ్ కూడా నవ్వుతూంటే కాస్త చిన్నతనంగా అనిపించింది. పార్టీ అయ్యేదాకా అప్పారావు మీదా ఆయన పాకీపని మీదా జోకులు పేల్తూనే ఉన్నాయి. ఏమీ చేయలేక అప్పారావు మాట్లాడకుండా ఊరుకున్నాడు.
మరో రెండువారాలకి మనోజ్ రూము ఖాళీ చేసి ఉద్యోగానికి వెళ్ళేసరికి అప్పారావుకి కొత్త రూమ్మేట్ దొరికేడు. మొదట్లో వారానికోసారి ఫోన్ చేసి తన గురించి చెప్పిన మనోజ్ మూడు నెలలు తిరిగేసరికి మెల్లిగా ఫోన్ చేయడం తగ్గించాడు. ఆ తర్వాత నెలనుంచీ అప్పారావు కి మనోజ్ గురించి ఏమీ తెలియలేదు.

* * * * * * *

ఆరేళ్ళు గడిచాయి. ఈ ఆరేళ్లలో అప్పారావు పీ హెచ్ డి పూర్తి చేయడం, ఉన్న ఊళ్ళోనే వచ్చిన వేస్ట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఉద్యోగంలో చేరడం, పెళ్ళీ, గ్రీన్ కార్డ్ రావడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయ్యేయి – న్యూటన్ మహాశయుడి మోడర్న్ రెండో సూత్రం “అమెరికా వచ్చిన ప్రతి మగ/ఆడ స్టూడెంటూ వారికి వ్యతిరేక ఆడ/మగ వారిని కూడా అమెరికా తీసుకొస్తాడు ఎప్పటికైనా” చెప్పినట్టూ. అప్పారావు తన స్వంతానికి ఇల్లు కొనడానికి ఏర్పాట్లు చేసుకుని గృహప్రవేశం అయిన నాలుగో నెలలో అమెరికా ఎకానమీ సంక్షోభంలో పడింది. హెచ్-1 బి లు, గ్రీన్ కార్డులూ, సిటిజన్ లూ అనేది చూడకుండా కంపెనీలన్నీ జనాలని పిట్టల్ని కాల్చినట్టూ తీసిపారేసాయి. అలా శానిటేషన్ ఇంజినీర్ అప్పారావు ఉద్యోగం పోయి రోడ్డుమీద పడ్డాడు.
ఇండియా వెళ్ళిపోదామంటే అక్కడా ఉద్యోగం దొరికే ఛాన్సు సున్నా లాగానే ఉంది. రోడ్డుకో ఇంజినీరింగ్ కాలేజ్ ఉన్న ఈ రోజుల్లో అందులో చేరే కుర్రాళ్ళు లేక అవి ఉంచాలా, ముంచాలా అనే పరిస్ఠితి. పోనీ ఎలాగోలా వెళ్ళిపోదామనుకున్నా నాలుగు నెలల క్రితమే కొన్న ఇంటి మీద మోర్గేజ్ తోక మీద నించుని పడగ విప్పిన కోడె తాచులా “ఎక్కడికి పోతావురా నన్ను వదిలేసి?” అంటూ వెక్కిరిస్తోంది.

కారు సేల్స్ మేన్ దగ్గిర్నుంచి హోటల్లో సర్వర్ దాకా ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాల్సిన ఆగత్యం. ఇటువంటి పరిస్థితుల్లో నే అప్పారావుకు దొరికిన అతి చిన్న ఉద్యోగం – మాల్ లో మాస్క్ డ్రెస్ వేసుకుని పిల్లల్తో ఫోటోలు దిగడం. ఎవరితోనూ మాట్లాడే పనిలేదు. అయితే రోజులో నాలుగ్గంటలు మాత్రమే ఉద్యోగం. సర్కారు వారు పెట్టిన రూల్స్ ప్రకారం గంటలకి ఏడు డాలర్ల పాతిక సెంట్లు లెక్కన ఇస్తారు. అప్పారావుకి మొదట్లో నచ్చలేదు కానీ ఇంట్లో ఉండి చేసేదేమీ లేదు కనక పీకి బేరం ఆడి ఎనిమిది డాలర్లకి కుదురుకున్నాడు. ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒకటి మంచిదే కదా? అన్నింటికన్నా సుఖం, మాస్క్ వేసుకుంటాడు కనక మిగతా ఊళ్ళో ఇండియన్స్ కి తాను చేసే ఉద్యోగం ఏమిటో తెలియదు. అప్పారావుకి నవ్వొచ్చింది ఈ ఆలోచనకి. తనకి ఇప్పటిదాకా ఉద్యోగమే లేదని ఏడుపు. ఇప్పుడు ఏదో ఒకటి దొరికితే గౌరవం ఉంటుందో లేదో అని ఏడుపు. బానే ఉంది సంబడం.

ఉద్యోగంలో చేరిన నాలుగురోజుల్లో అప్పారావు గమనించింది మాల్ బాత్రూములు అంత శుభ్రంగా లేకపోవడం. కడిగేవారు ఎవరో కంట్రాక్టర్ కాబోలు, వాళ్ళకి మాల్ వారు ఇంత అని ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అసలే ఆర్ధిక సంక్షోభం కదా, ఆ కంట్రాక్టర్ వారానికి మూడు రోజులు మాత్రమే ఈ బాత్రూములు కడుగుతున్నాడు. మామూలు రోజుల్లో జనం పెద్దగా లేక సర్దుకుంటున్నారు కానీ వారాంతంలో కంపు ఎక్కువగా ఉంది. ఓ రోజు మాల్ మేనేజర్ తో మాట్లాడేడు కాస్త ఇవి రోజూ కడిగిస్తారేమో అని.

“వారంలో రెండు మూడు సార్లు వచ్చి కడగడానికే ఎక్కువ డబ్బులౌతున్నాయి. రోజూ ఎలా ఏడుస్తాం? ఏదో బిజినెస్ బాగున్న రోజుల్లో ఇచ్చేవాళ్ళం కానీ చూసారు కదా, మాల్ లో ఒక్కో షాపూ మూతపడుతోంది. ఇంటర్నెట్ లో జోకులు చూస్తే తెలియట్లేదా?”
“ఈ మధ్యన అంత ఇంటర్నెట్ చూడట్లేదు, ఏమిటండి ఆ జోకులు?”
“బెస్ట్ బయ్ అనేదాన్ని ప్లీజ్ బయ్, ఫోర్డ్ ని ఫెయిల్, ఎల్.జి కంపెనీ లోగోలో లైఫ్ ఈజ్ గుడ్ అనేదాన్ని లైఫ్ ఈజ్ టఫ్ అనీ గుడ్ ఇయర్ ని బాడ్ ఇయర్ గానూ డౌ జోన్స్ ని డౌన్ జోన్స్ అంటూ రకరకాల జోకులు.”

నవ్వొచ్చింది అప్పారావుకి కూడా. “సరే మీరు తక్కువ ఖర్చుతో వేరే జానిటర్ ని చూస్కోవచ్చుకదా?”
“చూడండి సార్, ఎకానమీ సంక్షోభంలో ఉంది కదా అని మా ఇష్టం వచ్చిన రేట్ ఇస్తాం అంటే ఎవడొస్తాడు పనిచేయడానికి? పనిచేసే వాడికి జీతం ఎక్కువ కావాలి. పని మాత్రం రోజూ లేదు. ఇదంతా అంత మనం మాట్లాడుకుంటున్నంత సులభం కాదు. ఇప్పుడు మూడు, నాలుగు సార్లు వచ్చేవారే వారానికి వేయి డాలర్లు అడుగుతున్నారు. పీత కష్టాలు పీతవి అని తెలుస్తోంది కదా?”
“అవే డబ్బులకి రోజూ పనిచేసే మరొకరు దొరికితే?”

“మీరు చూపించండి, రెండువారాల్లో మారుస్తాం. అలా దొకేవారు, పనిచేసేవారూ అదంత ఈజీ వీజీ కాదు.”
అప్పారావు లేచాడు కబుర్లు చాలించి. రాత్రి ఇంటికెళుతూంటే తట్టింది ఆలోచన – తానే ఈ కాంట్రాక్ట్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు తనకి ఈ మాస్క్ ఉద్యోగంలో మహా వస్తే గిస్తే నెలకి అయుదారు వందలు వస్తాయి. ఈ కాంట్రాక్ట్ నెలకి నాలుగు వేలు. తనకి పని ఎలాగా లేదు కనక రోజూ వచ్చి చేయగలడు. ఒక్కడూ ఎలాగా చేయలేడు. తక్కువలో ఒకరో ఇద్దరో పనిచేసేవాళ్ళు దొరకరా?

ఇంటికొచ్చి వాళ్ళావిడతో చెప్పేడు కధంతా. మొదట్లో ఆవిడ ఛీ కొట్టినా నెలకి నాలుగువేల డాలర్ల అంకె ఆవిడ నోరు మూసేసింది. ఆవిడకి కావాల్సింది డబ్బులు కానీ మొగుడు ఏ ఉద్యోగం చేస్తే ఏమిటి? అప్పారావు వారాంతంలో ఇంటర్నెట్ మీద ఏమి చేయాలో వెదికేడు. అందులో తెలిసిన విషయాల ప్రకారం బిజినెస్ చేయాలంటే ఓ కంపెనీ రిజిష్టర్ చేయాలి. అయితే ఒక్కడే ఓనర్ అయితే ఏమీ అవసరం లేదు. ఎందుకొచ్చిన గోల, రేప్పొద్దున్న ఎవరైనా కేస్ వేయొచ్చు కదా అనే ఊహ రాగానే మొదట ఒక స్వంత కంపెనీ, ఆ తర్వాత మరో ఎల్.ఎల్.సి కంపెనీలకి రిజిష్టర్ చేయించేడు. జీతాలు, ఇన్స్యూరెన్సూ, ఇదీ అదీ కలిపి లెక్కలన్నీ కడితే అప్పారావుకు నెలకి రెండువేలు మిగుల్తాయి. బానే ఉంది. పడగ విప్పిన మోర్గేజ్ మిన్నాగుని కొంత కాలం జోకొట్టవచ్చు.

ఇది జరిగిన నెలకి పీ హెచ్ డీ శానిటరీ ఇంజినీర్ అప్పారావు జానిటర్ గా అవతారం ఎత్తి మరో ఇద్దరు మెక్సికన్ ల సాయంతో మాల్ లో బాత్రూములు క్లీన్ చేయడానికి కంట్రాక్ట్ సంపాదించి జీవితం మొదలు పెట్టేడు. మొదట్లో నోళ్ళు నొక్కుకున్న ఇండియన్స్ అందరూ కొన్నాళ్లకి నోళ్ళు మూసుకున్నారు; మోసుకోవడానికి ఎవరి క్రాస్ వాళ్లకుంది కనక. ఆ ఏడాది చివరికి అప్పారావు ఈ జానిటరీ బిజినెస్ లో పడి అసలు ఉద్యోగం చూసుకునే పని పూర్తిగా మర్చిపోయేడు.

* * * * * * *

జీవితం గడిచిపోతోంది అప్పారావుకి. జనాలకి డబ్బులున్నా లేకపోయినా తిండీ, తిప్పలూ, బాత్రూం కి వెళ్ళే పనీ తప్పవు కనక అప్పారావుకి పని బాగానే ఉంది. మొదట్లో కాస్త కష్టమే అనిపించినా మరో చోటా, మరో చోటా కంట్రాక్ట్ లు సంపాదించి ఇప్పుడు మరింత మందితో జానిటర్ ఉద్యోగం సాగుతోంది. ఇప్పుడు అప్పారావుకో ఆఫీసూ, అక్కడికి వచ్చే ఫోన్ కాల్స్ కి మన దేశం యాసలో మాట్లాడితే ఎవరికీ అర్ధం అవదు కనక అందరితో మాట్లాడ్డానికో తెల్లమ్మాయి, ఆఫీసు మేనేజర్ గా అప్పారావు వాళ్ళావిడ, సీ ఈ వో గా అప్పారావు అన్నీ చాపకింద నీళ్లలాగా ఒక్కొక్కటీ కుదురుకున్నాయి. డబ్బులొచ్చే కొద్దీ ఆఫీసు పెద్దదౌతోంది. టాక్స్ లు చూసిపెట్టడానికో లాయర్, తన పనులు రికార్డు చేసుకోవడానికో కంప్యూటరూ, అందులో సాఫ్ట్ వేరూ, కంపెనీ పనులకి రెండు మూడు ట్రక్కులూ వగైరాలు కలుపుకుంటూ అప్పారావు అంచెలంచెలుగా ఎదిగేడు. ముఫ్ఫై ఏళ్ల మోర్గేజీని పదేళ్లకి మార్పించి తర్వాత ఆ చిన్న ఇల్లు అమ్మేసి మరో పెద్ద ఇల్లు కొన్నాడు. బిజినెస్ లో వచ్చే డబ్బులనే బూరా తన ముందు సిస్టమేటిగ్గా ఊదబడుతూంటే, కాలనాగు లాంటి మోర్గేజ్ ఆ బూరాని అనుసరించి నాట్యం ఆడుతూ అప్పారావుని వెక్కిరించడం మానేసింది.

మొదట్లో జానిటర్ గా అవతారం ఎత్తి స్వంతంగా బాత్రూములు కడిగిన రోజునుంచి దాదాపు ఇరవై ఏళ్లకి తన బిజినెస్ మరో నాలుగు సిటీలకి విస్తరించి మిలియనీర్ల జాబితాలోకి జేరిపోయేడు అప్పారావు. ఈ ఇరవై ఏళ్ళలో కన్న, విన్న అనేకానేక దేశాల వారి కొత్త కొత్త పేర్లూ, ఫోను నెంబర్లూ, చర్మం రంగులూ, మొహాలూ గుర్తు పెట్టుకోవడం ఎవరి తరమూ కాదు కాబట్టి అప్పారావు ఒకానొకప్పుడు ఏడాది మాత్రం తనతో యూనివర్సిటీలో చదువుకున్న రూమ్ మేట్ల పేర్లూ, గ్రీన్ కార్డ్ ఇప్పించిన కంపెనీ తన కూడా పనిచేసిన జనాల మొహాలూ అవీ ఒక్కొక్కటీ మర్చిపోయేడు – అతి సహజంగా. సంసారం లో సాగరం ఎదురీత ఎటూ ఉండనే ఉంది రోజూ తల బొప్పి కట్టడానికి.

* * * * * * *

ఓ రోజు కొత్త కాంట్రాక్ట్ కి అప్లికేషన్ ఇవ్వడానికి డౌన్ టౌన్ లో ఓ బేంక్ బిల్డింగ్ కి బయల్దేరేడు అప్పారావు తన మేనేజర్ తో కూడా. మీటింగ్ లో తనతో మాట్లాడ్డానికో తెల్లాయనా, ఓ నల్లాయనా, మరో ఇండియన్ ఉండడం గమనించేడు. ఆ ఇండియన్ ఎవరో అప్పారావుకు గుర్తు రాలేదు. మీటింగ్ లో తానేమిటో తానెలా బిజినెస్ చేస్తాడో, ఎంత నిజాయితీగా ఎలా పైకొచ్చాడో అన్నీ చెప్పి అప్ప్లికేషన్ ఇచ్చాక బయటకొచ్చాడు. ఈ కాంట్రాక్ట్ తనకి వస్తే మంచిదే రాకపోయినా పోయిందేమీ లేదు.
బిల్డింగ్ లోంచి కిందకి దిగి బయటకి వస్తూంటే బయట సిగరెట్ కాల్చుకుంటూ తనని ఇంటర్వ్యూ చేసిన ఇండియన్ కనిపించేడు. మొహమాటం నవ్వు నవ్వి ముందుకెళ్ళబోతూంటే ఆయనే అడిగేడు, “మీరు కొన్నేళ్ళ క్రితం ఓహైయోలో కేస్ వెస్టరన్ యూనివర్సిటీలో శానిటరీ ఇంజినీరింగ్ లో చదివారు కదా?”
“అవునండి, ఏమిటి సంగతి?”
“నన్ను గుర్తుపట్టారా?”
పరీక్షగా చూసి మరో సారి చెప్పేడు అప్పారావు, “లేదండి. సారీ”
“మనోజ్ అనే రూమ్మేట్ ఉండేవాడా మీకు?”
“నలుగురైదుగురు ఉండేవారు కానీ వాళ్ల పేర్లు చెప్పమంటే చెప్పలేను లెండి. పాతికేళ్ళు పైన అయిపోయింది కదా?” నవ్వేడు అప్పారావు.
“మీతో ఉన్న మనోజ్ అనే కుర్రాణ్ణి నేనే. మీరు చదివే శానిటరీ ఇంజినీరింగ్ చదువుని వెక్కిరిస్తూ చాలా రోజులు మిమ్మల్ని ఏడిపించాం. మిమ్మల్ని చూస్తూ కేంపస్ లో మీ వెనక నవ్వుకునే వాళ్ళం మీకేం ఉద్యోగం వస్తుందా అనుకుంటూ. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూంటే మేము మీకన్నా పనికిరానివాళ్ళం అని అర్ధమౌతోంది. సారీ అప్పుడు అలా అన్నందుకు.”
“అవన్నీ ఇప్పుడు గుర్తు లేవండి. అయినా అలా అనుకోకండి. మీరు ఇప్పుడు ఈ బేంక్ లో ఉద్యోగం చేస్తూ బాగానే ఉన్నారు కదా?”
“మీకు చెప్పుకోలేకేం కానీ నా ఉద్యోగం కూడా నెలవారీ కాంట్రాక్టు. వచ్చే నెలనుంచీ పోతోంది ఇక్కడ. మా ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు వాన రాకడ ప్రాణం పోకడ టైపు. ఎంతకాలం పని ఉంటే అంతకాలం మా ఏజెన్సీ చూస్తారు. వాళ్ళు చూడలేకపోతే బెంచీ మీద కూర్చుని ఎదురు చూడ్డమే. మరో ఐదారు నెలల దాకా మరో ఉద్యోగం దొరక్కపోవచ్చు అని చెప్పారు లెండి. అదీకాక నేను పెద్దవాణ్ణి అవుతున్నాననీ కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు రావనీ కుర్రాళ్ళని తీసుకుంటూన్నారీ మధ్య.”
“మీరే ఓ కంపెనీ పెట్టొచ్చు కదా నాలాగా?”
“మీరు పెట్టినప్పుడు మీకు దొరికిన అవకాశం మీరు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఇలా కంప్యూటర్ పని చూసి పెట్టే కంపెనీలు రోడ్డుకొకటీ, పుట్టకొకటీ, చెట్టుకొకటీ ఉన్నాయి. ఎవరిస్తారు ఉద్యోగాలు?”
అప్పారావు తన విజిటింగ్ కార్డ్ ఇండియన్ చేతికిచ్చి చెప్పేడు “నేను మీకు కంప్యూటర్ ఉద్యోగం ఇవ్వలేను కానీ, ఏదైనా హెల్ప్ కావాలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి.”
“జీతం ఎంతవరకూ ఉండొచ్చు?” అప్పారావు విజిటింగ్ కార్డు చేత్తో పట్టుకుని అడిగేడు ఆశగా మనోజ్.
“చేసే పని బట్టి. నేను ఏడు డాలర్ల చిల్లరతో మొదలుపెట్టాను ఈ ఉద్యోగం. మా జానిటర్లకి గంటకి పదిహేను, ఇరవై డాలర్లు ఇస్తాం. ట్రక్ డ్రైవర్లకి కొంచెం ఎక్కువ. మేమందరం చేసేది పాకీపని. అలా అని మీరు చెప్పినదే. మీరు చేయగలరా?”

తిరస్కారంగా చూసేడు ఇండియన్. ఆ చూపు చూసిన అప్పారావు ముందుకి కదులుతూ చెప్పేడు, “నా మొదటి ఏడు డాలర్ల జీతం ఇప్పుడు ఏడాదికి ఎనిమిది మిలియన్లు. దాదాపు యాభై మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాను. నేను పాకీవాడిననీ, నాది పాకీపని, నేను చదువుకున్న చదువు పనికిరావట్లేదు అంటారా? కానీయండి, నేను ఎప్పుడు అలా అనుకోలేదు మరి, కారణం ఏదైతేనేం. మరి మీరో? మీకు ఏ పని చేయడానికైనా అహంకారం అడ్డు కాబోలు. ఖాళీగా ఉండడానికీ బెంచీమీద కూర్చోడానికీ మీకు ఇష్టమే కానీ ఏదో ఒకటి చేసి పైకి వెళ్దామనే కోరిక ఉన్నట్టులేదు. అదే కనక ఉండి ఉంటే ఈ పాటికి నా కన్నా మంచి స్థితిలో ఉండి ఉండేవారు కదా? మనం ఉన్న దేశం ‘లాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీ.’ కష్టపడి ఏది చేసినా పైకి రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అలా పైకి రావాలని ఉంటే ఆకాశమే హద్దు. అవసరం కోసమో మరోటో అహంకారం పక్కన పెట్టి నా స్వంత చేతులతో బాత్రూములు కడిగేను. మరి మీరో? ఎవరో ఏదో చేసిపెడ్తారని చూస్తూ కూర్చుంటునట్టున్నారు. అలా ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతూ ఉన్నారు కాబోలు. ఆర్ధిక సంక్షోభంలో నాకు అవకాశం వచినప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా అవకాశాలు ఉన్నాయి. వాటిని టాప్ చేయగలిగితే పైకి వెళ్ళడం కష్టమేమీ కాదు. మీ మొహం చూస్తే నేను చేసే పని అంటే మీకో తిరస్కారం ఉన్నట్టు కనబడుతోంది. అంటే దాదాపు ఈ పాతికేళ్ళలో మీరు ఏమీ మారలేదు. నన్ను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎలా వెక్కిరించారో ఇప్పుడు అలాగే ఉన్నట్టున్నారు. ఓ సారి ఆలోచించుకోండి.”

తన కూడా వచ్చే మేనేజర్ తో చక చకా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయే, శానిటరీ ఇంజినీరింగ్ డాక్టరేట్, పాకీ పని చేసే మిలియనీర్ అప్పారావుని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయేడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తప్ప మరొకటి ఏమీ తెలియని మనోజ్.

* * * * * * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

2 Comments on పాకీ వాడు

బిక్కి.వెంకటరమణయ్య said : Guest 7 years ago

మనోజ్ తన చదువుకు తగ్గ ఉథ్యోగం పోయినా దొరికిన పనిని ఇష్టంతో చేశాడు. ఏం చదువుకున్నాం ఏ పని చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు." దొరికిన అవకాశాన్ని ఏ విదంగా సద్వినియోగం చేసుకున్నాం అన్నదే ముఖ్యం". "కష్టే ఫలి"." కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు".

  • తిరుపతి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం.
తాడిగడన శ్యామల రావు said : Guest 7 years ago

బాగుంది.

  • Hyderabad