శీర్షికలు

పుస్తకసమీక్ష-అష్టవిధ నాయికలు

శ్రీ గాదిరాజు మధుసూదన రాజు గారు రచించిన

అష్టవిధ నాయికలు
(పద్యఖండిక)
పై
పూజ్యశ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య వారి సమగ్రసమీక్షా వ్యాసం

ఈరోజు గాదిరాజు మధుసూదన రాజుగారి కవిత్వానికొద్దాం. మధుసూదన రాజుగారు
సుక్షత్రియ వంశంలో జన్మించి వృత్తి రీత్యా ప్రభుత్వ
నేత్రవైద్యాధికారిగాఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. పూర్వీకులది భీమవరం.
బెంగుళూరులో స్థిరనివాసము. క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు పేరుతో
ఇటీవలబ్లాగొకటి పెట్టారు. శంకరాభరణం బ్లాగులో 2019లో అనుకుంటా వారి పద్యాన్ని
చూశాను. నాలాంటి వాడే ఎవరో తెలీక సార్! మీరు క్రొత్తా అని అడిగితే వారు
చమత్కారంగా “నా కలం చాలా పాతది – కవి రచయితల చరితలో పాతది – జర్నలిజంలో నలభై
ఏళ్ళ ముందున్నది. కవుల సమాఖ్యలో బూజుపట్టిన మాజీది – బ్లాగులోకంలో ఈమధ్యే
దూరినది” అని క్లుప్త పరిచయం చేసుకున్నారు. 1979 నుండి నేటి వరకు
అన్నిప్రముఖపత్రికలలో కవితలు కథలు ప్రచురింపబడ్డాయి. రాష్ట్రస్థాయిలో కవిత
,కథలకు బహుమతులందుకున్నారు. విద్యుత్సాహితి సాహిత్య పత్రికకు ఎడిటర్ గా,
విద్యుత్ప్రభ లిటరరీ కాన్ఫెడరేషన్ కు ఛీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వ్యథాగీతాలు
కవితా సంకలనం 1984 లో వెలువడినది. ఇంతకు మించి నాకూ వివరాలు తెలీదు.
పద్యాల్లోకి వస్తాను. తాడిపత్రి, అనంతపురం జిల్లకు చెందిన వీరికి పద్యరచనలో
మంచి పట్టున్నది వారికి. మత్తేభ వృత్తాల్లో నడిపించారు వారి అష్టవిధనాయికా
పరివారాన్ని. ఈ పద్యాలను చూస్తే మీరే అంటారు సెహబాస్! అని. వారి స్వాధీనపతిక
ఎలాఉన్నదంటే “పతినే దైవమటంచునెంచి వ్రతమున్ భక్తిన్ ఘటించున్
పతి-వ్రతగెల్వంగఁ వశీకృతంబగు సతీస్వాధీనుడౌ భర్తయున్ స్తుతిజేతు న్భవదీయ
కౌశలముఁ విధ్యుక్తంబులౌ నీహొయల్-ద్యుతిసౌందర్యవిలాసముల్ కళలు సత్యోత్కృష్ట
సౌభాగ్యముల్” అని గాఢ సమసాలను సమోసాల్లా దొర్లించేశారు. ఇంతకీ విషయమేమిటంటే
పతియె ప్రత్యక్ష దైవం అంటూ.. వ్రతాలు గట్రా చేస్తుందట. అతగాడి మనసు
గెలవడానికి. వ్రతాల సమయంలో (మాత్రమే!) పాద నమస్కారాలుంటాయిగదా! అందుకని
“హబ్బా!” అనుకొని ఆమె హొయలు చూసి విధ్యుక్తముగా అంటే ఎన్ని సేవలు చెయ్యాలో
అన్నీ తూ.చ. తప్పకుండా చేయడం. ద్యుతి అంటే వెలుగు కాంతివంటి సౌందర్య విలాసము
చూసి, కళలను గాంచి అవన్నీ సర్వోత్కృష్ట సౌభాగ్యముల్” అంటున్నాడు కవి.
వాసకసజ్జికను “పడకన్ పద్మదళమ్ములన్ బరచి పుష్పంబుంచి ద్వారంబులన్-పడకింటన్
రమణీలలామ కదిలెన్ప్రాణేశునిన్ దల్చివా-ల్జడకున్ పూవులగూర్చి వేచె హృదయోల్లా
సంబులన్ గూర్చగా-వడిచేరన్ జనుదెంచు ప్రేమికునికై స్వాలంకృతస్త్రీత్వమై” అని
రాశారు. ఎంత పదగుంబన? పదాల పోహళింపు గమనించారా? నాకేతై పూర్వకవుల పద్యంలాగా
ఉంది. పడకలో పద్మాల రేకలు పరించిందట. పూలు ద్వారంలో పడకటింట్లో అలంకరించిందట.
వాల్జడలో పుష్పాలు వయ్యారంగా ప్రియునికి హృదయోల్లాసం కలిగించే విధంగా
అలంకరించుకొన్నది ఎందుకంటే ఆ ప్రియుని వడిచేరడానికి.
ఇక విరహోత్కంఠితను “క్షణముల్ దీర్ఘములై గతింపగను కక్షంబూనెనేమో యనన్ –
గణుతింపన్ వ్యథలుండుకోటి విరహోత్కంఠీమనోగీతికన్ – తృణమే తానన విస్మరించుటన
సంతృప్తిన్ యథాతప్తతన్-వణకంగన్ మృదులాధరద్వయముతాన్ వాపోవుచాంచల్యయై!” అన్నారు.
విరహంతో బాధ పడుతూ క్ష్ణమొక యుగంగా గడుపుతోంది. గడ్డిపోచలాగా తనను
తీసిపారెయ్యడం సహించలేకపోతున్నది. అధరాలు వణుకుతున్నాయి అవి వాపోతున్నాయి
చపలత్వంతో ఎప్పుడు నాధుని చేరడమా అని.
విప్రలబ్ధ ఎలా ఉందీ అంటే “కినుకన్ జెందెను రాత్రివేచి యటుసంకేతస్థలిన్
వీడెఁగామిని వంచించె విటుండిసీ!రతిసుఖమ్మీయంగ నమ్మించియంచును సర్వాభరణమ్ములన్
విసరుచున్ శోకంబునన్ మున్గుచున్-కనిపించెన్ క్షతనాగమట్లు శయనాగారంబుఁ దాన్
జేరుచున్” అలా ఉంది. ఆమె అలిగింది రాత్రి సంకేత స్థలానికి రమ్మని, సర్వసుఖాలు
అనుభవించునని చెప్పి మోసం జేసి రాకపోవడం వలన. నగలను విసిరికొట్టి క్షతనాగమట్లు
అన్నారు. మనకు నంది తిమ్మన వ్రేటువడ్డ యురగాగన యుమోలె” అన్నట్టుగా దెబ్బతిన్న
సర్పంవలె అలకాగృహమునము వెళ్ళింది.
ఖండిత పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే “స్తన యోనీ జఘనోరు సంపదల సౌందర్యంబులన్
మిన్నయౌ-తనమాటెట్లు ప్రియుండు మీరెనని నిద్రన్ మాని యోచించుచున్-కనులన్
రక్తపుచారికల్ మెరయ రక్తావృత్తర మ్యాస్యయై-కననన్యాంగన సౌఖ్యలీనుడగుటన్ ఖండించి
క్రుంగెన్ మదిన్” అలా ఉంది. ఆమె మహా సౌందర్యవతి వరూధినిని మించి వర్ణించారు.
వక్షము, (?), కటిస్థలము, అరటి స్థంభములవంటి తొడలు మొదలైన సంపదలతో దేవతా
స్త్రీలను మించిఉన్న తనను కాదని ఎలా అన్యాంగన పొందుకై పాకులాడుతున్నాడా అని
నిద్ర మాని కళ్ళల్లో రక్తపు జీరలు కళ్ళ నిండా ఉన్నాయట. వచ్చేవిధంగా ఉంది.
చూడండి రక్తావృత్తరమాస్య అట. అద్భుత వర్ణన.
కలహాంతరితను “తలుపుల్ దీయక నిందలాడితిని నిర్దాక్షిణ్యభావంబుతో-
ననుమన్నించునొలేదొకో విసిగి సన్యాసంబుచేపట్టునో-మనసల్లాడగ మాయమోహినుల-కామంబంది
శుష్కించునో యనుచున్ వేదన నందునాయికను డాయన్ మేలు సత్ప్రేమికుల్” అన్నారు.
ఏపద్యం చూసిన ప్రబంధాలలో ఉన్నవిధంగా ఉంది. మొగుడొచ్చాడు. అనుమానంతో తలుపులు
తీకుండా నిందించింది దయదాక్షిణ్యం లేకుండా. కానీ కొంతసేపటికి తేరుకొని
అయ్యయ్యో! నను క్షమిస్తాడా? లేకపోతే ఎందుకొచ్చిన సంసారమని సన్యాసం
తీసుకుంటాడా? మనసలా అల్లాడిపోతోంది. ఎవరైనా భామినులు తగిలితే కొంపమునగదా!
అలాంటి నాయికను దగ్గరజేరి ఓదార్చాలి ప్రేమికులైనవారు నిజంగా అంటున్నాడు.
ప్రోషితభర్తృకను “చెలికాడింటికిఁ జేరలేదనుచువచ్చెన్ చైత్రమంచున్ గనన్-తలుపుల్
దీయుచుదాటుచున్ గడపఁ పాదధ్వాన మూహించుచున్-చెలికత్తెల్ మృదుభాషణం బొసగఁగించి
చ్ఛాంతి కల్పింపగాన్-విలపించున్ హృదివిచ్చునో యనగనుద్వేగంబుఁ దానందుచున్”
అన్నాడు. చైత్రమాసం వచ్చేసింది. కోకిలలు కూస్తున్నాయి. వసంతుడు
కిర్రెక్కిస్తున్నాడు. “లోలకలెట్టి? పోల్చుకోనేక పోయానా… ఎవ్వారం
“కిర్రు”గుందే!” అంటాడు రావిశాస్త్రిగారు ఒక కథలో. కిర్రు అంటే జోరు, హుషారు
అని అర్ధం. తలుపులు తీస్తున్నాది మూస్తున్నాది. పాదాల చప్పుడు వినపడగానే
తెరవడమూ, చెలికత్తెల మాటలు విని శాంతి కల్గి మూయడమూ! విలపిస్తూ హృదయం
విచ్చుకునే క్షణం ఎప్పుడని ఉద్విగ్నతతో ఎదురు చూస్తోంది.
చివరిగా అభిసారికను “కదలన్ బాములుఁ తేళ్ళు మార్గమున కుక్కల్
నక్కలుంగూసినన్-పొదలున్ దెయ్యములట్లు తోచిననుమబ్బుల్ క్రమ్మినన్ మ్రోగినన్-
మదిపొంగన్ప్రియ సంగమాతురతఁ కామాధీనతత్త్వంబునన్-కదలున్ తానభి సారికైవనిత
సాక్షాన్మన్మపొథార్ధాంగియైయన్నాడు. ప్రియుడిని రహస్యంగా కలవడానికి వెళ్తున్న
ప్రియురాలెలా ఉందయ్యా అంటే దారిలో పాములు, తేళ్ళు కుక్కలు నక్కలున్నాయి.
అవికూస్తుంటే గుండెలదురుతున్నాయి. పొదలను చూస్తుంటే దయ్యాలు చూస్తున్నట్టుంది.
మబ్బులు కమ్మి మెరుపులు ధ్వనిస్తున్నాయి ఫెళ ఫెళా.. అయితే కామాధీన తత్త్వయైన
ఆమె ప్రియ సంగమానికి సాక్షాత్తు మన్మధుని భార్యేమో అన్నట్టు ఉందట. చాలా
హృద్యంగా ఉంది. మతిపొయింది నాకు. మాటల్లేవ్. మాట్లాడుకోడాల్లేవ్. రేపటి వరకూ!
స్వస్తి.
—-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked