– శ్రీమతి మోచర్ల రామలక్ష్మి
సద్గురువులు, సాధకులు, యోగులు, త్యాగులు, పండితులు, కవులు ఎందఱో మహానుభావులు. చతుర్వేదాల సారాన్ని ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, సుభాషితాలు, నీతి శతకాలు, సూక్తులు, చాటువులు, సామెతలతో నిబిడీకృతం చేసి మానవాళి అభ్యున్నతికి అందించారు.
దేవభాష అయిన సంస్కృత భాషలోని సూక్తులను, సుభాషితాలను, నేటితరం పిల్లలతో, గౌరవనీయులయిన పెద్దలతో, హితులతో, సన్నిహితులతో ముచ్చటించు కావాలనేది నా అభిలాష. సరస్వతీదేవి కృపతో కథావాటికలో సూక్తులు, సుభాషితాలు పొందుపరిచి, చిన్న కథలుగా రూపొందించి పుస్తక పాణి పద పల్లవములకు సమర్పిస్తున్నాను. సంస్కృత అధ్యాపకులు మా గురువర్యులు శ్రీమాన్ మోహనరావుగారి పాదాలకు నమస్కరిస్తూ కథ ఆరంభిస్తున్నాను.
సుందరం చక్కనివాడు. చురుకు, తెలివి కలవాడు, బాగా చదువుకుని ఉత్తమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. తను ఎంతో మేధావినని, ఉద్యోగం తనని వెదుక్కుంటూ వస్తుందని అతనిని కించిత్ గర్వం ఆవహించింది. దాంతో ఉద్యోగప్రయత్నం చేయలేదు. ఉద్యోగం ఎదురు రాలేదు. రెండు సంవత్సరాల కాలం పనీపాటా లేకుండా వృధాగా గడిపేశాడు.
చంద్రం, సుందరం మేనమామ. ఒకరోజు అతడు సుందరం వాళ్ళ ఇంటికి వచ్చాడు. మేనల్లుడు పనీపాటా లేకుండా సోమరిగా ఉండటం గమనించాడు. వీడు ఇలా తయారయ్యాడేమిటి అని అక్కాబావలని ప్రశ్నించాడు. “ఏం చెప్పమంటావ్ ‘ఆశ ఉంటే చాలదు, ఆచరణ ఉండాలి’ ఏదైనా సాధనతోనే సాధిస్తాం అని వాడికి మేం ఎంత చెప్పినా చెవి కెక్కలేదు. నువ్వు చెప్పి చూడు. నీ మాటతో వాడు మారితే మాకు అంతకుమించిన ఆనందమే లేదు” అంటూ సుందరం తల్లితండ్రులు వాపోయారు. ఆ మరునాడు చంద్ర “ఒరేయ్ సుందరం నువ్వేమీ అనుకోకపోతే నీకు మాట చెపుదాం అనుకుంటున్నాను” అన్నాడు. “సంశయం ఎందుకు మావయ్య? నువ్వు నా బాగు కోరే వాడివే, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను ఏమీ అనుకోను” అన్నాడు సుందరం.
“ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణిన మనోరథైః !
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖేమృగాః !!
“పనులు ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి. కోరికలతో కాదు, నిద్రిస్తున్న సింహం నోట్లోకి మృగాలు ప్రవేశించవు కదా!’’ అని సుభాషితం చెప్పి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అన్నాడు చంద్రం.
మేనమామ తనని ఉద్యోగ ప్రయత్నం చేయమని సున్నితంగా సుభాషితంతో హెచ్చరించినట్లు గ్రహించాడు సుందరం. యత్నించి సఫలీకృతుడయ్యాడు.